కవితలు దీపావళి - వేదుల సత్యనారాయణ శాస్త్రి 32. సుధాకరా!
32. సుధాకరా!
ఓయి సుధాకరా! నిలువు మొక్క నిమేషము; నీ మహోదయ
చ్ఛాయలు సోకి నాయెడఁద సాగర మట్టులు పొంగుచున్న దే
వో యనుభూతజీవితసుఖోర్ము లపూర్వవిముగ్ధనాట్యముం
జేయుచుఁ బాడుచున్నవి వినిర్మలమోహనరాగగీతికల్‌
నా కిపు డీ ప్రపంచ మొక నందన మట్టులు నీ యనంతలో
కైకపవిత్రకాంతిసుధలందున విచ్చిన మూగసోయగం
బై కనుపట్టె! మానవులయాశలతో విధికిన్‌ నిరంతరా
నీకము సాగు నీ కటికినేల మనోజ్ఞత యింత నిల్చునే?
ఈయది మోదమో, యెడఁద నేర్చెడు ఖేదమొ, యంతలంతలై
పోయెడు మోహమో, తొలగిపోవని స్వప్నమొ, చెప్పలేని దే
దో యనుభూతి దివ్యపవనోర్మిపరీమళ మట్లు ముగ్ధునిం
జేయుచునుండె న న్నిపుడు నీ తెలికాంతులకౌగిలింతలన్‌
నీవొక యప్సరఃప్రణయనీ కబరీచ్యుత పారిజాతమా
లావిసరంబవో, మఱి యిలాతల మంట సుధాతుషార వ
ర్షావిమలావకుంఠనము జార్చుచుఁ బోవు శరద్విభావరీ
దేవి లలాటికామణివొ దీపికవో సురరాజ్యలక్ష్మికిన్‌
అలసటఁ జెందె దేమొ, యుదయాస్తమయమ్ములె జీవనమ్ముగా
దలచెడు మర్త్యపాళి కమృతప్రభల\న్‌ వెదఁజల్లి; యింత సొం
పు లొలుకు వెన్నెలం గనులుమూయనిపేదలకై కృపారసం
బొలికెడు నీ సుధామురళి నూదుదువో భువనాలు సోలగ\న్‌
చిరవిరహైకవాసనలఁ జిమ్ము సుఖస్మృతు లేవొ పై పయిం
బొరలుచు, దుఃఖపుం గసటు వోవని యాశల మేలుకొల్ప, సుం
దరతర చంద్రికా పులకిత మ్మగు నింతటి తీయనైన రా
తిరి తెలవారి పోవక యిదే గతి నాకయి నిల్వరాదొకో!
ఓ యమృతాశ్రుమూర్తి! యెటకో పరువెత్తెదు వాయు లీనమై
పోయెడు రాగరేఖవలె, మోయగరాని ప్రవాసదుఃఖమో
తీయని ప్రేమవేదనయొ, తీరని కోరికయో, యెదో యెదం
గోయునొ యేమొ రాల్చెద వనూనహిమాశ్రుకణాల నావలె\న్‌
విరిసిన పూలవెన్నెలల వెల్లువఁ జక్కదనాల హంసవై
యరిగెడు నిన్నుఁ జూచు నిశలందున నాకగు బాష్పశాంతి నీ
వెరుఁగుదు; దుఃఖతాపముల కిల్లగు పాడుప్రపంచమం దెరుం
గరు కరుణైకముగ్ధుల యగాధహృదంతరబాష్పమాధురి\న్‌
ప్రేమపిపాసచే నమృతవీథులఁ జేరిన యప్సరోంగనా
స్తోమసితావగుంఠనతతుల్‌ సుమి యీ తెలిమబ్బుదొంతరల్‌
నీ మృదుశయ్యలై సుధలు నిండిన నీ స్మితరోచిరూర్మికా
కోమలఫేనరాసులయి కూర్చెడు నాయెద కింతవేదనన్‌
నేను నిరంతరప్రళయనిష్ఠుర మీ బ్రదుకున్‌ భరింపఁగా
లేను, క్షుధాగ్ని నార్పుకొనలేక తపించెడు ప్రేమకాంక్ష యిం
తేని నశింప కుంట మరణింపఁగలే నిటు లే నిరోధముల్‌
లేని మహాప్రవాహము చలింపక నిల్చిన దొక్క నా యెడన్‌
ఆ మృదుచంద్రికా యవనికావృత నీలనభోనిశాంత శో
భామయసీమలం దమృతవాటుల స్వప్నపథాల నొక్క యీ
యామినిమాత్రమే తిరుగులాడెద నే జిఱుమబ్బువోలె, నీ
తో మనసార, నొక్కపరిఁ దోడ్కొనిపొ మ్మట కో సుధాకరా!
AndhraBharati AMdhra bhArati - kavitalu - dIpAvaLi - 32. sudhAkarA! - gautamI kOkila vEdula satyanArAyaNa Sastri ( telugu andhra )