కవితలు దీపావళి - వేదుల సత్యనారాయణ శాస్త్రి 34. సంధ్యాన్వేషణము
34. సంధ్యాన్వేషణము
అంతరించెను బశ్చిమాశాంగణమునఁ
గుంకుమరంగవల్లీనికుంజశోభ
చిందువారెను దినశ్రీకాలకుంతల
చ్ఛాయలో విరహవిషాదరేఖ
శాంతించె ద్విజరాజసాంధ్యమాగధుల
కైవారమ్ములను గడసారిగీతి
తడవాయెఁ దలఁగి వాత్సకధేనుకాన్యోన్య
సమ్మేళనాహ్వాన సంభ్రమమ్ము
కలిగెఁ బ్రేయసీసల్లాపకాంక్ష యెడఁద
దోహనోత్సుకగోపసందోహమునకు
శ్యామికాగోకులమున నీ జాడ లేదు
స్రుక్కి యెట నుంటివోయి, కిశోరమూర్తి!
త్రోపుడులాడు కార్మొయిలుదొంతర గ్రమ్మి తమాలపాదప
వ్యాపృతమైన గోకులవనాంతరమంతయు శ్యామికాంజన
స్నాపిత మయ్యె, నీ యడుగుజాడలు గానఁగరావు నాకు, గో
గోపకులన్‌ దిగన్‌ విడిచి గోపకిశోరక! యెందుఁ బోతివో!
తీయని వాయుపూరణగతి న్నునుబుగ్గలు బూరటిల్ల, హ
ర్షాయితమై ప్రపంచము కరంగఁగ, మోహనవేణుగానముం
జేయుచు మౌళిపింఛరసనృత్యముఁ జూపమి నీపవాటికా
చ్ఛాయలు విన్నబాటు గొనసాగె నె టేగితో దివ్యగాయకా!
నీలి మొయిళ్ళనీడల వినీలములైన కళిందజాసరి
త్కూలతరంగమాలికలుగూడ, భవన్మురళీమనోజ్ఞ గీ
తాలలితానురాగ రసతత్పరతన్‌ సడి మాని మంత్రిత
వ్యాళము లట్టు లున్నయవి వైణవికాగ్రణి! యెందుఁ బోతివో!
పొదుగుల జేపు పాలు గొనఁ బోవక, పచ్చిక ముట్టరాక, యె
ల్లదెసల శూన్యవీక్షణముల న్నిగుడించుచు నే విషాదమో
యొదవినయట్లు ఱిచ్చవడియున్నవి మోములు వంచి లేఁతయాఁ
గదుపులు క్రోవినూదు పసికాపరి వీ వెట నుంటివోగదా!
తావులఁజిమ్ము మంజులలతాంతచయమ్ములనుండి జిమ్మునం
గ్రేవల జారు తేనియలరీతిని దీయఁగ హాయిగాఁ జవుల్‌
జీవకళల్‌ దొరంగు మురళీమృదుగానరవమ్ము లేమి బృం
దావని శూన్యమయ్యె యదునందన! నీ వెట కేఁగినాఁడవో!
కెందలిరాకు జొంపములఁ గృష్ణవియోగ విషాద ధూమముల్‌
చిందులువారె, ఖిన్నలవలీలతల\న్‌ చ్యుతసూనగంధముల్‌
కొందలపెట్టె, పూఁబొదలలోఁ బతితశ్లథపత్రమర్మరా
క్రందము సందడించెఁ గనరా వెట నుంటివి నీవు మాధవా!
బాలరసాలపాళి దిగఁబారిన యీ గురివెందతీవ యు
య్యాలల నూచు బాలమలయానిలుతో శ్రుతిఁగల్పి కోయిలల్‌
జాలిగఁ గూయుచున్నవి ప్రశాంత వసంత దినాంతవేళ గో
పాల! తమోవిలీనవనపాంథుఁడవై యెట కేఁగి యుంటివో!
కోమలవల్లికావృతనికుంజతలమ్ములయందు, శాద్వల
శ్యామలభూములందు, సువిశాలతమాలమహీజవాటికా
రామములందు, శీతల తరంగ నిషిక్త నదీతటోపల
స్తోమములందు నీయునికి దోఁప దెటేఁగితొ శ్యామసుందరా!
        కొఱకుదర్భల రాల్చుచుఁ గొదమలేళ్లు
        కడిమిబోదెల కొరగి బెగ్గడిలినట్లు
        దెసలఁ బరికించు బాష్పార్ద్రదృష్టి నిపుడు
        సాంధ్యవేణుగీత మ్మేల సాగ దనుచు
తీవనొ పూవనో వసుమతీజమనో, యమునాపగోర్మినో
గోవునొ మబ్బునో వెదురుక్రోవినొ చుక్కనొ యై జనించినం
దావక వేణుగానము సదా వినుచుందుఁగదా యటంచు చిం
తావివశాత్మ యౌ చరణదాసికిఁ గన్పడ వేమి పాపమో!
AndhraBharati AMdhra bhArati - kavitalu - dIpAvaLi - 34. saMdhyAnvEShaNamu - gautamI kOkila vEdula satyanArAyaNa Sastri ( telugu andhra )