| కవితలు | దీపావళి - వేదుల సత్యనారాయణ శాస్త్రి | 09. నిష్కృతి |
| 09. నిష్కృతి | |
| ఆ మహోన్నత ధవళశైలాగ్రమందు ఆ యనంతపథమ్మున ఆ మనోజ్ఞ జలదవాటికఁ గేళీప్రసన్న వగుచు నన్నుఁ గని నీవు చిరునవ్వు నవ్వినావు | |
| పశ్చిమాకాశనికషసువర్ణరేఖ లొక టొకటి చెరపుచుఁ బోవుచుండెఁ బ్రొద్దు గగనదుర్గపుఁ దూర్పుబంగారుతలుపు తెరవఁబడియె రేరా జరుదెంచు నంచు | |
| వసుమతీగర్భ కారాకవాటములను దెరచుకొన్న సరస్వతీఝరులు వోలె మోహినీసాట్టహాసకోలాహలములు పండువెన్నెల లలమె బ్రహ్మాండమెల్ల | |
| ఆ మధుర కార్తికిక చంద్రికామనోజ్ఞ శారద వివిక్తయామినీ సమయమందు ఇరువురముగూడ, బహుకాలపరిచితులము పోలెఁ దొలిదృష్టి నేకమై పోయినాము | |
| వలచి విరిసిన పూవైన వాడిపోని నవనవప్రేమపులకితానందపథము నందు, జీవనమంగళయాత్ర బయలు దేరితిమి తెలిమబ్బుపైఁ దార లట్లు | |
| బంధములఁ ద్రెంచుకొని రెప్పపాటులోన యుగయుగమ్ముల ప్రేమవియోగభార మూర్చివైచుచు, శరదుదయోత్సవముల మైమరచినాము లోకము మాటె మరచి | |
| నీ భుజాబంధనముఁ గరుణించి యెపుడు ననుఁ గరంచితి, వపుడె సిగ్గును భయమ్ము పొదవికొని యిట్టె నా గుండెఁ జెదరఁగొట్టి నీ పదాంతికమందు బంధించివైచె | |
| లలితయౌవన హృదయదళాల నెల్ల మిగిలిపోకుండఁ దునిమి చిర్నగవుతోడ నీ కఠిన పాదముల ధూళి సోకకుండఁ బరచితిని నీవు నడచినబాటలందు | |
| పులకితహృదంతరమున నుప్పొంగిపోవు నిండుప్రాయంపుఁ దలఁపు లన్నిటిని గోసి దండలుగ గ్రుచ్చి నీమెడ నిండ వైచి మ్రోడునై నిల్చినాను నీమ్రోల నేను | |
| అన్య సుఖములకై యడియాస పడక నీ కృపాదృష్టియే నాకు నిఖిల మనుచు జీవితసుధాకలశము చేసేత నీకు నేనె త్రావు మటంచు నందించినాను | |
| నీ పవిత్ర పదాబ్జసన్నిధిని నిలుచు చనువు నొసఁగితి వంతియే చాలు ననుచు నెంత యుప్పొంగిపోయితి, నంతకంతఁ గూలితి నధోమహాంధపాతాళమందు | |
| ప్రేమకై జీవితమ్ము లర్పించుకొనిన వారిదుఃఖమ్మునే కడుపార మెక్కి వారి కన్నీటనే దప్పి నారుచుకొను కఠినవిధి కంటఁ బడియె నా గడియబ్రదుకు | |
| అంతమేలేని యీ యగాధాంధకార ఘోరపాతాళకుహరాన దారిలేక దారుణార్తారవప్రతిధ్వనుల వినుచుఁ గొట్టుకొనుచుంటి బలియగు కురరి వోలె | |
| దేనికై దుఃఖజీవి నైనానొ నేను అదియె నిష్కృతిగా గాయమయ్యె నెడఁద మానునా యిది, కంట నీరైన రాదు రాలిపడ దా పదాబ్జపరాగలవము | |