కవితలు దీపావళి - వేదుల సత్యనారాయణ శాస్త్రి 07. ఒకక్షణము
07. ఒకక్షణము
పండి వ్రాలిన వరిపైరు పైనిఁ బ్రాకి
వచ్చు చిరుగాలితరగల వరుసబోలె
ఈ మహానందపులకిత హృదయమందుఁ
బరుగులిడుచుండె వింతభావమ్ము లెన్నొ
ఇంత యానందమున కేది హేతు వనుచు
వెనుదిరిగి చూచుకొంటి - కెంబెదవులందుఁ
జిఱునగవు జీరుకాడ నీ చిగురుఁగేల
నా భుజమ్ము స్పృశించియున్నావు నీవు
ఎపుడు గుర్తించినదొ నీ యదృష్టపూర్వ
భవ్యరూపమ్ము నీ కరస్పర్శమాత్ర
నపుడె పులకించి పులకించి యవశమైన
నా యెద గ్రహించె నీ వాత్మనాథుఁడ వని
మరుపు దట్టిన కాలమ్ము మడతలందు
పాడువడనట్టి బహుజన్మపరిచయమ్ము
నా మలిన బాష్పగుంఫితప్రేమసూత్ర
కలితమై నీపదమ్ములఁ గౌఁగిలించె
ప్రకృతిసౌధపు దక్షిణద్వార మంతఁ
దెరచుకొని వచ్చి మనల నిర్వురనుగూడ
మృదులపవమాన పరిమళోర్మికలతోడ
బాధ లేకుండ బంధించివైచి రెవరొ
ఆ ధృఢాశ్లేషమున భేద మంతరించి
యొక హృదయ మొక్క ప్రాణమై యున్న యపుడు
ప్రేయసీ యని ప్రాణప్రియా యటంచు
పలుకరించుకొంటిమి బాష్పభాషణముల
అపుడు నిర్మేఘమార్గశీర్షాభ్రవీథి
వృద్ధసంధ్యాతపస్విని పెదవి విరిచె
విశ్వవీణాగళము నీరసించిపోవఁ
గ్రమ్ముకొనె మృత్యుకైశికకాళిమంబు
మనము దినసంధ్యలము, కూడుకొనుచునుందు
మొకక్షణమ్మె ఛాయారోచిరుదయవీథి
అయిన నే మాయె, మన వియోగైక్యములనె
యొదవుఁ బ్రేమదేవతకు రేయింబవళ్ళు
AndhraBharati AMdhra bhArati - kavitalu - dIpAvaLi - 07. okaxaNamu - gautamI kOkila vEdula satyanArAyaNa Sastri ( telugu andhra )