| కవితలు | దీపావళి - వేదుల సత్యనారాయణ శాస్త్రి | 06. యాత్ర |
| 06. యాత్ర | |
| పైరగాలి తరంగాలపై నపూర్వ పరిమళవిలాసములు వెల్లివిరియసాగె ఓ సఖీ! చూడు మిరుగట్ల నొరసికొనుచు పొంగుచున్న దానందప్రపూర మిపుడు | |
| ముంగురులు పైని పూవులు ముడువ వలదు వలదు తిలకమ్ము; కైసేఁత వలదు మేన విడిన కబరీభరము ముడివేయ వలదు కాల మిది కాదు మన యలంకారములకు | |
| తరతరమ్ముల ప్రేమస్వతంత్రు లరుగు దారిఁ బోయెడు నూతనాధ్వగుల మనలఁ బరిహసించెడు పాడు ప్రపంచమునకె పారవేయుము నీ యలంకారభరము | |
| మూఢవిశ్వాసశృంఖలమ్ముల విదల్చి వలపుకౌఁగిటిముడిఁ బట్టువడితిమేని మన శరీరసుఖస్పర్శమునకు నేఁటి యణువణువుకూడ నవజీవ మనుభవించు | |
| కోరికలనెల్ల మరచి, నాకొరకు నీవు నీకొరకు నేను తొలివేఁగుబోఁక రాలు పూలజతవోలె నీ సుధాపూరమందు తేలిపోదము జన్మజన్మాలయాత్ర | |