కవితలు దీపావళి - వేదుల సత్యనారాయణ శాస్త్రి 28. సముద్రతటాన
28. సముద్రతటాన
ఓ విరహవేషానుభావ మధురాకృతీ
యౌవనోన్మిషిత లజ్జావకుంఠనవతీ
        జాలి దొలుకాడు, నీ
        వాలు తెలిచూపులను
        నాలో వియోగ క
        ల్లోలమ్ము రేపుచును
ఈ సముద్రతటాన ఏ సఖుని కోసమై
గాసి జెందుచునుంటివో సఖీ! ప్రియసఖీ!
తూర్పువాకిటి గూట తొలిదివ్వె వెలిగించి
తొగరుపావడసంజ తొలగిపోయెడువేళ
        ఒంటిగా వేడి ని
        ట్టూర్పు లెగబోయుచును
        జంట దొరగిన పడుచు
        చక్రవాకి విధాన
ఈ సముద్రతటాన ఏ సఖుని కోసమై
గాసి జెందుచునుంటివో సఖీ! ప్రియసఖీ!
అలలపై నెఱసంజ యపరంజి మెఱుగులకు
నీ చరణపల్లవోన్నిద్రలాక్షారక్తి
        అనురాగ శృంగార
        మై వింత సుడు లీన
        అల వరుణశుద్ధాంత
        మవని కేతెంచినటులు
ఈ సముద్రతటాన ఏ సఖుని కోసమై
గాసి జెందుచునుంటివో సఖీ! ప్రియసఖీ!
పసిడి సరిగంచు మేల్ముసుగుతో నీటిదరి
యిసుకపై నడచు చెడనెడ నడుగు తడబడగ
        ఏనాటి యనుభవమొ
        ఏకఠినహృదయమో
        యెంచి, యున్నతవక్ష
        మెగయ నెగయూర్చుచును
ఈ సముద్రతటాన ఏ సఖుని కోసమై
గాసి జెందుచునుంటివో సఖీ! ప్రియసఖీ!
పాలిపోయిన నీ కపోలాలపై వ్రాలి
నీలాలకలు రహస్యా లెవోచెవి నూద
        రాలిపోయిన పూల
        తేలిపోయిన కలల
        కోలాహల మ్మెడద
        మూలమూలల మ్రోగ
ఈ సముద్రతటాన ఏ సఖుని కోసమై
గాసి జెందుచునుంటివో సఖీ! ప్రియసఖీ!
నీయెడద నుప్పొంగు నిర్మలప్రేమవా
ర్నిధికీ సముద్ర మొకనీటిబొట్టే యౌనొ
        వినరాని ఘోషతో
        విరిగిపడు తరగ లే
        విరహగీతము లాల
        పించి వేధించునో
ఈ సముద్రతటాన ఏ సఖుని కోసమై
గాసి జెందుచునుంటివో సఖీ! ప్రియసఖీ!
AndhraBharati AMdhra bhArati - kavitalu - dIpAvaLi - 28. samudrataTAna - gautamI kOkila vEdula satyanArAyaNa Sastri ( telugu andhra )