కవితలు దీపావళి - వేదుల సత్యనారాయణ శాస్త్రి 42. ప్రభూ
42. ప్రభూ
ఈ నవవేణుదండ మిటు లేటికిఁ జెక్కెద వేల చిల్లులై
పో నొగిలింతు వం చడలిపోయితి, వ్యర్థపు టూర్పు గాడ్పులన్‌
గానముగాగ మార్చుటకెగా యని యిప్పుడె నే గ్రహించితిం
గాని విశీర్ణ మీ హృదయనాళ మెటుల్‌ పలికింతువో ప్రభూ!
నీ వెడయూర్పుతావుల జనించిన కమ్మదనమ్ము వ్యర్థమై
పోవక మున్నె, యీ సుషిరముం గొని, తీయని స్వప్నవాసనా
జీవన గీతముల్‌ విపినసీమలనైన సరే ధ్వనింపు మీ
శ్రావణకృష్ణపక్షతిమిరమ్ములు పుల్కలతో వినన్‌ ప్రభూ!
AndhraBharati AMdhra bhArati - kavitalu - dIpAvaLi - 42. prabhU - gautamI kOkila vEdula satyanArAyaNa Sastri ( telugu andhra )