కవితలు కాంచన విపంచి
- శ్రీమతి చావలి బంగారమ్మ
శ్రోతవ్యము

శ్రోతవ్యము
దిగుమర్తి సీతారామస్వామి

సాహిత్యసహయాత్రికులు రాధాకృష్ణశాస్త్రిగారు ఛాత్రశిరోమణి గౌరీపతి 'కాంచనవిపంచి'ని నా చేతనుంచి శ్రుతికల్పనప్రసంగమునకు నన్నుద్బోధించినపుడు - ఎన్నో హేమంతముల వెనుకబడిన పురానుభూతి స్మృతిప్రణయిని యైనది. హేమంత మనుసరికి ఆంగలసాహితీవాసనావాసితులైన కొందరు ప్రాప్తరూపులు ఏవో - ఏవేవో నీడలు పారాడినట్లు భావించుట కలదు. కాని భారతీయుల హేమంతము అట్టిది కాదు. అది ప్రఫుల్లనీలోత్పలశోభితమును సోన్మాదకాదంబవిభూషితమును అగు ప్రకృతి నైపథ్యమున పుష్పాసవామోదఘూర్ణిత యువప్రపంచమున కెత్తినతెర.

యువహేమంతప్రచురణగా "వైతాళికులు" ప్రతి కంటబడుటే తడవుగా గుమిగూడిన నాటి విశ్వకళాపరిషత్‌ సారస్వత విద్యార్థులలో మొదట రేగిన తలపు - "ఇందు స్త్రీల రచనలెన్ని" యనునది. మువ్వుర కృతు లందు గోచరించినవి. వానిలో బంగారమ్మగారి రచనలు నాలుగు - మేలేర్చిన పస ముత్తెములు. నిండారిన గరువతనముతో ఆ గేయములు "తేనెసోక నోరు తియ్యన యగురీతి" తోన యర్థమెల్ల తోచునంత సరళముగా సరసముగా కోమలముగా కాంతముగా సంతరింపబడినవి. వైతాళిక సంపాదకు డన్నట్లు తెనుగు నుడికారము ఈ గీతములలో నంచు లురలి తొణికిస లాడుచున్నది. ఇట్లు వైతాళిక ప్రథమ శ్రేణియందే శ్రీ చావలి బంగారమ్మగారు పఠితలకు పరిచితలైరి.

ఐతే - ఆ ప్రథమసంకలన మందు తమకృతులు ప్రకటితము కాగనే అందలి రచయితలు చాలమంది - మన ప్రాచీనాంధ్రకవులకు సహజమైన నవీనకావ్యరచనోత్సాహమునకు సురటరాగము పాడుకొనిరి. నాటినుండియు వైతాళిక పంజరమే వారి కృతిశారికా ప్రదర్శనమునకు శ్రయణీయ మైనది. బంగారమ్మగారు మాత్రము అంతటితో తనివి సనక ఎడనెడ రచనలు సాగించుచునే వచ్చిరి. ఈ కాంచనవిపంచికి ఆ కూర్పులే తీగల చేర్పు లైనవి.

ఈ ఘోషవతిని తిరిగి సహృదయోదయనుల కర్పించిన సుకృతము సుహృత్‌పరిషత్తుది. వారికి రసికలోకము తీర్చరాని యప్పున బడినది.

ఈ గేయగుచ్ఛము నందు చదువరుల నావర్జించు మొదటి గుణము - చెప్పదలచుకొన్నది సూటిగా ఎద నదుముకొనునట్లు చెప్పుటయే. దానిచే భావస్ఫూర్తి విప్పారిన నల్లకలువల తావికైపుగా నన్నుకొన జేయుట - ఇం దవచాటముగ నెచ్చట నైనను పరికింపవచ్చును. ఇందలి నిర్మల ప్రవాహశైలియే గాక అందు పొదుగబడిన తలంపులును దేసిగానున్నవి. "కప్పతల్లి పెళ్ళి" చదువునది. "మనకేల"లో

కాకి కోవెల లొక్క కాంతి నున్నాయి
కంఠములు మాత్రమే కలియలే దమ్మా

అనుటలో అగ్రామ్యహాస్యము స్ఫురింపజేయుట మెచ్చదగినది. "నివేదన", "రాధ" అను శీర్షికల నలవరింపబడిన పాటలు క్రొత్తడుల యొత్తిడి యెరుగని మెత్తని చిత్తవృత్తి కెత్తిన దిబ్బెపుగుత్తులు.

"ఆదర్శము"లోని భావన చాల నుదాత్తమైనది. "ద్వాసుపర్ణా సయుజా సఖాయా సమానం వృక్షం పరిషస్వజాతే ...." అను దీర్ఘతమర్షి ఋగర్థ మిందు లౌకికముద్ర వహించినది. రచయిత్రి యనూచానుల యిల్లు మెట్టినది; కవి కిశోరము కొంపెల్ల జనార్దనరావుగారి సోదరి.

"కార్తికపూర్ణిమ"లో ప్రకృతి శోభ యెంతో లలితముగ నుల్లేఖింప బడినది.

పెక్కు ప్రకరణముల నీయమ నిర్మాయిక బాలస్వభావముతో నాలపించును. "బొమ్మలపెండ్లి" యట్టివానిలో నొకటి. చేవగల వ్యావహారికభాషాప్రయోగము లిందు మణిప్రవాళముగా నున్నవి. "తమస్సు"లో

గుండె గుబగుబ లాడెను
    నాగొంతు
ఎండి గుటకడ దాయెను

వంటి వెంతో ముచ్చటైన పలుకుబడులు. పదసారస్వతమున తరచుగా గానవచ్చు విచిత్రభావనానిస్స్వత యిందు లేదు. "నీడ"యను కూర్పు పరికించునది. "పుంతలో ముసలమ్మ" కొంత నవ్యసంస్కారమును సూచించినను మొత్తముపై నిది యాచారపరాయణమైన యభిరుచికే విధేయమైనది.

ఈ సంపుటికెల్ల మణి యన దగిన ఖండిక "పాప". భావనయందును పలుకులయల్లిక యందును దీనికిదియే సాటి.

మాపాప చెంబులో
నీ ళ్లొలక బోసింది
చెందురుడు జారిపడి
చిందు లాడేడు
చేయెత్తి మాపాప
చెడ మొత్తినాది.

ఈ దృశ్యము ననుభవింపని సంసారులు వేళ్ళలెక్కపై నుందురు. ఐనను దీని నక్షరకవచితము చేయ గలిగిన కౌశలము ఈ రచయిత్రిది మాత్రమే. ఇందు పాప చేష్టలే గాక మనస్తత్త్వమును జక్కగా నీడగట్టినవి.

చూచినంతకు లోతుగా చూడగలిగిన చూపు శ్రీ బంగారమ్మగారిది. పరిమితత్వము ఆమెకు బాధాకరము గాదు. ప్రక్రియావైవిధ్యమునకై ఆధునికులలో అనుకరణకు లెంకలు కానివారు తక్కువ. ఆ మేలేర్చిన కొలదిమందిలో కబ్బపుకూర్పరి చెలువలలో నీయమదే ప్రథమస్థానము.

నవ్యాంధ్రసాహిత్యము సాధించినది గేయకావ్యగౌరవము, ప్రాచీనసాహిత్యమునందిట్టివి మిక్కిలిగా నున్నను రుచి తెలిసిన శ్రోతల కెక్కినవి తక్కువ. ఇట్టి వీనికి ఎంకి పాటలవంటి కూర్పులతో సభాతాంబూల మందినది. భాషాభావముల సంచారచారిమయందే గాక ఆత్మనాయక వస్తూత్పాదనము చేతను నవ్యు లీఘనతను సమకూర్చిరి. గేయప్రియులైన వారి కెల్లరకు నుపలాలింప దగిన దీకాంచనవిపంచి.

దిగుమర్తి సీతారామస్వామి
(ప్రాచ్యభాషా పీఠాధిపతి, భీమవరం కళాశాల.)

విలంబి - భాద్రపదము
శా. శ. ౧౮౮౦.

AndhraBharati AMdhra bhArati - kavitalu - kAMchana vipaMchi - Kanchana Vipanchi - chAvali baMgAramma - Chavali Bangaramma geeyamulu gEyAlu - SrOtavyamu - digumarti sItArAmasvAmi - Digumarti Sitaramaswamy - geeyaalu geeyAlu paatalu pATalu - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )