కవితలు కాంచన విపంచి
- శ్రీమతి చావలి బంగారమ్మ
ప్రకాశకుల మాట

ప్రకాశకులు

(ప్రకాశముగా) ఎన్నడో జరిగి యుండవలసినదీ గ్రంథ ప్రకటనము. ఐనను ఇది యీనాడు మాచే చేయింప నెంచిన భగవత్‌ సంకల్పమే ప్రచురణ విలంబమునకు కారణము కావచ్చునని విలంబి యనుచున్నది.

గేయకావ్య తల్లజమైన దీనిని ముద్రించుటకు వాత్సల్యముతో మా సుహృత్‌పరిషత్తున కొసంగిన కవయిత్రి శ్రీమతి బంగారమ్మగారికి మా కృతజ్ఞతాంజలి.

అడిగినదే తడవుగా రచయిత్రిని గూర్చి, రచనలను గూర్చి ప్రస్తావనా సూత్రధారులైన శ్రీయుతులు మల్లంపల్లి సోమశేఖరశర్మగారికి, దిగుమర్తి సీతారామస్వామిగారికి మా నమ ఉక్తులు.

ఈ ప్రచురణ భారమును వహించి - మమ్మావలి యొడ్డునకు జేర్చిన యాశ్వినులు మిత్రశ్రీ చోడవరపు రాధాకృష్ణశాస్త్రిగారు, చిరంజీవి కందర్ప గౌరీపతి - వీరికి భగవతి వాగీశ్వరి ఆయురారోగ్య విశ్రాంతుల నొసగి ఇంకను ఇట్టి కృతిరత్నముల ప్రకటన కుత్సుకుల జేయుత!

చరమముగా చెప్పినను అచరమముగా గణింప దగినది ముద్రాపకుల సహకారము. గ్రంథము నింత సుందరముగా, ఆకర్షకముగా, సకాలమున ముద్రించి యిచ్చిన ఉదయినీ నిర్వాహకులకును మేము సౌహార్ద బద్ధులము.

అన్నియు నిట్లు సమకూర్చిన మా భాగ్యము నభినందించు కొనుచున్నాము.

చెఱకువాడ వెంకట సుబ్బారావు,
సుహృత్‌ పరిషత్‌ ప్రధాని.

విస్సాకోడేరు,
అక్టోబరు '58.

AndhraBharati AMdhra bhArati - kavitalu - kAMchana vipaMchi - Kanchana Vipanchi - chAvali baMgAramma - Chavali Bangaramma geeyamulu gEyAlu prASakula mATa - Cherakuvada Venkata Subba Rao - Suhrit Parishat - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )