కవితలు కాంచన విపంచి
- శ్రీమతి చావలి బంగారమ్మ
17. కప్పతల్లి పెళ్ళి
17. కప్పతల్లి పెళ్ళి
కప్పతల్లీపెళ్లి నేడూ - చూడరే
కావిళ్ళ నీళ్ళొంపినాడు!
వరుణదేవుడు వంపినాడూ - ఓచెలీ!
వాడలన్నీ నింపినాడు!

గగనతలమునుంచి నేడు - వీవనలు
చెట్లచే వేయించినాడు!
స్వర్గాధినాథుడు నేడూ - రథమెక్కి
పయనమై పోవుచున్నాడు!

భత్యాలు లేకనేవాడు - పెళ్ళికి
బాజాలు వేయించినాడు!
బండరాళ్ళపైనివాడు - చక్రములు
బడ బడా దొర్లించినాడు!

బాణసంచా వెలితిలేదే - పెళ్ళికీ
బహుబాగుగా జేసినారే!
కళ్ళుచెదిరే మెరుపులమ్మా - చూడగా
వొళ్ళు పరవశమౌను సుమ్మా!

కప్పమ్మ పెళ్ళికో యంచూ - మేళములు
గొప్పగా తెప్పించినారె!
చెప్పశక్యముకాదు వేరే - బోదురూ
కప్పలా మేళములురారె!

కప్పమ్మ గడపతొక్కినది - శుభమన్న
సూచనలు చూరు చెప్పినది!
కప్పలెగిరే వానలమ్మా - పొలములో
కనకాలె పండుతాయమ్మా! ...
AndhraBharati AMdhra bhArati - kavitalu - 17. kappatalli peLLi - kAMchana vipaMchi - Kanchana Vipanchi - chAvali baMgAramma - Chavali Bangaramma geeyamulu gEyAlu geeyaalu geeyAlu paatalu pATalu - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )