కవితలు కాంచన విపంచి
- శ్రీమతి చావలి బంగారమ్మ
24. మా అన్న
24. మా అన్న
మనసిచ్చి మాయన్న మాటాడునపుడు
మల్లెపువ్వులతావి మనసెల్ల నిండు
కనులెత్తి మాయన్న ననుగాంచగానె
అతనిలోనే నేను ఐక్యమైపోదు
మాయన్నయన నెవ్వరని తలచగానె
ఆకాశమేయంచు అదినాకు తెలిసె
ఆకాశమైతాను అటనుండి చూచు
భూమినై నేనతని ఇటనుండి చూతు
నన్నుచూచుచు అన్న అక్కడే ఉండు
అన్నజూచుచు నేను ఇక్కడే ఉందు
సోదరీ! సోదరా! యని మేము పిలుచు
పిలుపులే యొరులకు పిడుగులై తోచు
మెరుపులౌ మాయన్న చురుకు చూపులను
మేనెల్లకంపింప నేనందుకొందు
పరితాపభారంబు తనకంపగానె
తన దుఃఖభారంబు తానంపుతాడు
ఆనందమున దాని నందుకొంటాను
అఖిలజీవులకు నేనది పంచుతాను
మాప్రేమలను దెల్పు మాటలేలేవు
మాయన్న బోలగా నేయన్న గలడు?
AndhraBharati AMdhra bhArati - kavitalu - 24. mA anna - kAMchana vipaMchi - Kanchana Vipanchi - chAvali baMgAramma - Chavali Bangaramma geeyamulu gEyAlu geeyaalu geeyAlu paatalu pATalu - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )