కవితలు కాంచన విపంచి
- శ్రీమతి చావలి బంగారమ్మ
15. మెరుగుడు
15. మెరుగుడు
మావూరు చుక్కలకి
రెక్క లున్నాయి
మీవూరు బంపనా,
మింటున్న చుక్కా?

మీవూరు చుక్కల
మెరపు కాసింత
రెక్కల్ల చాటునే
నక్కిపోయింది

మింటనున్నామన్న
బంటు తనమేమొ
మబ్బులో మీమెరుపు
మణిగిపోలేద?

మాచురుకు మామెరుపు
మానడతలన్నీ
మాకె తగు, మీకేల
మమ్మెత్తి పొడువ?

యెత్తిపొడిచిన యంత
పొత్తు చెడిపోన?
పెత్తనాలకుయైన
వత్తురా మీరు!

మీలోక వాసనలు
మాకేలనమ్మా
మింటనుంటే మీకు
కంటి కగబడమా?

పుణ్యరాసులు జారి
పుడమి బడితేను
కంట బడుటేల మా
వెంట బడరటవే!

ఎంత వారలకైన
ఇంతియే తుదకు
పంతమేలను మీకు
పరమేశ్వరాజ్ఞ!
AndhraBharati AMdhra bhArati - kavitalu - 15. meruguDu - kAMchana vipaMchi - Kanchana Vipanchi - chAvali baMgAramma - Chavali Bangaramma geeyamulu gEyAlu geeyaalu geeyAlu paatalu pATalu - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )