| కవితలు | కాంచన విపంచి - శ్రీమతి చావలి బంగారమ్మ |
40. తుమ్మెదా! |
| 40. తుమ్మెదా! |
|
ఒక్క పువు తేనెతో - తుమ్మెదా! నీకొకపూట జరగదా - తుమ్మెదా! ముద్దరాళ్ళనుజేరి - తుమ్మెదా! నీవు - ముద్దెట్టుకొందువే - తుమ్మెదా! మోము విప్పిన పూలు - తుమ్మెదా! నీ మోమువంకే చూచు - తుమ్మెదా! ఒక్కచో నిలువవు - తుమ్మెదా! నీ - కొళ్లు తెలియదో యేమొ - తుమ్మెదా! ఎప్పుడూ తిరిగేవు - తుమ్మెదా! నీ - వెది తలచుచుందువే - తుమ్మెదా! అన్ని పువ్వుల తేనె - తుమ్మెదా! నీ వారగించిపోయి - తుమ్మెదా! అటు తిరిగి చూడవు - తుమ్మెదా! అది మంచిదని తోచెనా - తుమ్మెదా! నువు పోవు జాడలే - తుమ్మెదా! అవి నిలిచి చూచుచు నుండు - తుమ్మెదా! ఆకాశ యానంబు - తుమ్మెదా! నీ ఝుంకార నాదంబు - తుమ్మెదా! అదె వింటు ఆపూలు - తుమ్మెదా! నిన్నట్టె ధ్యానము సేయు - తుమ్మెదా! కళ్ళు విప్పని పూలు - తుమ్మెదా! నీ - కళ్ళకెట్లగపడునె - తుమ్మెదా! సుడి తిరిగి వస్తావు - తుమ్మెదా! అతిచురుకుగల దానవే - తుమ్మెదా! కంట బడితే నీవు - తుమ్మెదా! వాటివెంట నంటకపోవె - తుమ్మెదా! జుర్రున్న ఆతేనె - తుమ్మెదా! నువ్వు - జుర్రుకుంటావేమొ - తుమ్మెదా! తలకు తగిలిందంటె - తుమ్మెదా! అది - తెలుపెక్కుతుందంట - తుమ్మెదా! నల్లన్ని నీవొళ్ళు - తుమ్మెదా! అది తెల్లబడలేదేమి - తుమ్మెదా! కడపటి మాటవిను - తుమ్మెదా! నీ - కడుపెంత కలదమ్మ - తుమ్మెదా! పువ్వు రేకంతైన - తుమ్మెదా! నీ - పొట్టలేదాయెనే - తుమ్మెదా! పంతమ్ము గాకున్న - తుమ్మెదా! నీకెంత కావలెనమ్మ - తుమ్మెదా! నంగనాచీవలెను - తుమ్మెదా! నీ - వొంగి చూచేవేమొ - తుమ్మెదా! కంట బడినానమ్మ - తుమ్మెదా! న - న్నంటు చేయకుమమ్మ - తుమ్మెదా! ఇంగితం బెరుగవే - తుమ్మెదా! నే - నీశ్వరుని మెడనుందు - తుమ్మెదా! |