కవితలు రుధిరజ్యోతి
శ్రీరంగం నారాయణబాబు
ఫిడేలు నాయుడుగారి వ్రేళ్లు
ఫిడేలు నాయుడుగారి వ్రేళ్లు
(భారతి - జూన్‌ 1939)
నాయుడుగారూ!
మీ వ్రేళ్ళు
ఘనరాగ పంచకం!
మీ శరీర
మాకాశం!
మీ హస్తం
హరివిల్లు!
చిత్ర చిత్ర వర్ణాలు
శ్రీవారి వ్రేళ్ళు!
సృష్టి
శ్రుతిమయం
సగుణం నాదం
నిర్గుణ బ్రహ్మ
నిశ్శబ్దపు
నీలి నీలి
యంచులనే
మ్రోగించును
మీ వ్రేళ్ళు!
ఉక్కు తీగె[1]
నొక్కేరో
తారలనే
దాటించి
ధ్రువ నక్షత్రానికి
చలనం కలిగించి
పల్లెటూరి
శోభతోడ
పలుకరించు
సూర్య చంద్ర
లోకాలే!
సూచించు
బ్రహ్మ హృదయమే
వెన్నెల బయలయి
కనిపిస్తుంది.
పంచమమే పడితే[2]
గాయత్రి
ప్రత్యక్షం
ఉపనయన వేళ
చెవిలో
బ్రాహ్మణుడేదో
ఊదినట్లు!
ఆనందానికి
పరమావధి
మందరమే[3]
అందుకుంటే
సంధ్యకు పూర్వం
దిన సంధిలోన
తెల్లని వెలుగేదో తోచి
గళమై పాడును
పిష్‌కాట్‌[4]
వాయిస్తారు
బొందెకు
ఆత్మకు
ద్వంద్వ యుద్ధమే
పెడతారు
మానవత్వపు కుట్లు
చిటపట తెగిపోవగ
మీ చేతిని
జంత్రం కాదది
ఏదో మహామంత్రం
మీ వ్రేళ్ళు
బీజాక్షరాలు
కమానా? కాదు!
నరుని రధం
భారతయుద్ధం
శ్రీకృష్ణుని
చేతిని
కొరడా!
మీవ్రేళ్ళు
పలికే వేళల
విశ్వరూపమే
వినిపిస్తుంది
కనిపిస్తుంది.

"ఫిడేలు నాయుడుగారి వ్రేళ్ళు" గీతంలో కొన్ని మాటలకు వివరణలు:

1. ఉక్కుతీగె: ఫిడేలుమీదనుండే మొదటి తీగె. దీన్నే హెచ్చు పంచమ మంటారు.
2. పంచమము తీగె: ఫిడేలుమీద మూడవ తీగె.
3. మందరము: నాలుగవ తీగె.
4. పిష్‌కాట్‌ (Pizzicat): అంటే కమాను వదలి ఒక తీగెను మీటుతూ రెండవ చేతితో స్వరస్థానములు నొక్కుట.

1939 జూన్‌ నెల భారతి పత్రికలో మొదటిసారిగా ఈ గీతం ప్రచురితమై నప్పుడు ఈ క్రింది వివరణ ముందుగా పొందుపరిచారు:

శ్రీద్వారం వెంకటస్వామి నాయుడుగారికీమధ్య మైసూరు సంస్థానము నుండి ఆహ్వానము వచ్చినది. శ్రీ నాయుడుగారు మైసూరు దర్బారులో వారి గానాన్ని వినిపించారు. మైసూరు మహారాజావారు తమ ఆనందాన్ని వెలిబుచ్చుతూ అర్ధ వేయి నూటపదహార్లూ, జోడు శాలువలు యిచ్చారు. ఈనాటి ఆంధ్రులలో మైసూరు దర్బారులో యింత అధిక సన్మానము పొందిన ఆంధ్రులు వీ రొక్కరే అని చెప్పవచ్చు.

మైసూరు నుంచి వచ్చాక శ్రీనాయుడిగారి శిష్యకోటి వారి ఆనందమును వెలిబుచ్చేందుకు విందు చేశారు. ఆనాడు రచించిన దీగీతం. దీనికి స్వరం వీణా కోవిదుడు జనార్దనాచార్యులు రచించారు. దీనిని శ్రీనాయుడుగారి కొమాళ్ళు బాబూరావు, చిన్నా ఫిడేలుమీద వాయించారు. కిన్నెర గాత్రంతో చొప్పల్లి భాగవతారు పాడినారు.

AndhraBharati AMdhra bhArati - kavitalu - rudhirajyOti - phiDElu nAyuDugAri vrELlu - SrIraMgaM nArAyaNabAbu Srirangam Narayana babu Sriramgam NarayaNababu rudhira jyothi rudhirajyothi - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )