కవితలు రుధిరజ్యోతి
శ్రీరంగం నారాయణబాబు
చల్లని గీతి
చల్లని గీతి
(భారతి - సెప్టెంబరు 1940)
ఇసుక ఎడారుల
పసిరిక నేలై
కుసుమించిన దీ బ్రతుకు!
కర్షక హర్షోదయ
వర్షాగమ వేలావేళల
తూనీగ
ఎడద ఎగిరె హాయిగాను!
గ్రీష్మపు టెండల
మండిన భూముల
తొలకరి వేళల
మాతృమృత్తికా
మధుర వాసనలు
సుధాగళమ్మున!
ఉన్మిషతమ్ములు
జీవితాధ్వములు
శరన్మేఘములు
పరుగులెత్తినవి
విద్యున్మాలలు
వెంట తరిమినవి.
తల్లిచేతి చల్లందనము
పిల్లల మాటల తీపి
కొల్లగొన్నదేమో బ్రతుకు!
మాతృవక్షమున
పాలపోటుతో
తల్లికడుపులో
పిల్లడు కదిలాడు?
చల్లని గీతి
రేకెత్తినది.

(సెప్టెంబరు 1940 భారతిలో ఇది 'ఒకక్షణం' అనే పేరుతో అచ్చుపడింది.)

AndhraBharati AMdhra bhArati - kavitalu - rudhirajyOti - challani gIti - SrIraMgaM nArAyaNabAbu Srirangam Narayana babu Sriramgam NarayaNababu rudhira jyothi rudhirajyothi - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )