కవితలు రుధిరజ్యోతి
శ్రీరంగం నారాయణబాబు
ప్రవర

సంఘర్షణ అనే కావ్యాన్ని ఆమూలాగ్రం చదివేక ఆనందంతో హృదయం (పొంగి) జరిగిపోయిన గడిచిపోయిన ఇరవై సంవత్సరాల క్రితం నేనూ, శ్రీశ్రీ ఈ అతి నవ్య కవిత్వానికి నాంది పాడిన దినాలు తళుక్కుమన్నాయి. ఈ సుముహూర్తంలో రకరకాల అనుభూతులు అనుకోని కొత్త మార్గాలలో నవనవంగా ప్రజ్వలించి, నాట్యమాడి లోకాని కొక కొత్త పద్ధతి, ఒక కొత్త బాణీ సరికొత్త శ్రుతులలో మూర్ఛనలు పోయిన ముమ్మరపాటు ద్యోతకమవుతుంది.

సాహిత్య జగత్తుని గంగవెర్రులెత్తించు భావ కవిత్వపు రోజులవి. స్వర్ణయుగం అన్నారు వాళ్ళు. యథార్థయుగం అంటున్నాము మేము. భావకవిత్వపు పోకడలు జీర్ణం చేసుకుని కొంతవరకు మేమూ రచన సాగించాము. ఆ ఫణితిని రచన సాగించిన దినాలలో కూడా ససి లేకుండా నీరసంగా చేయవలసిన రచన ఇది కాదూ అని మాకు తెలిసికూడా గత్యంతరం లేక కనులకు పొరలు కమ్మితే కావ్యరచన సాగింది. అంతట హృదయంలో ఒక విభిన్నమైన సంచలనం, ఉద్వేగం, ఓజస్సు, బలం హఠాత్తుగా ఆరోగ్యాన్నిచ్చాయి. అంతవరకు భావ కవులతోపాటు మేము కూడా జీవిత గ్రీష్మాన్ని దర్శించేందుకు మనోనేత్రానికి తగిలించిన 'గాగుల్స్‌' నేల విసిరికొడుదుం కదా! హృదయంలో పొగలూ సెగలూ రేగి వీధి కాలువ నీటిలో బురదలో ఆపసోపాలు పడిపోతున్న శ్వనాథుడు, ఊరిబైట పొలంలో ఇనకిరణాలు, క్రౌర్యంతో కాయక్లేశ పడుతున్న సేద్యగాని శరీరం మీద పండిస్తున్న ఘర్మమౌక్తికాలతో ఒక తాజమహల్‌ కట్టాలని బుద్ధి పుట్టింది. మా కవిత్వంలో ఉండకూడని వస్తువు, వాడకూడని భాషా లేనేలేదు. చాకలాడు, సంతబయలు కుక్క, గాడిద, కుళ్ళు కాలువ, ఫేక్టరీ కూత, మర ఫిరంగి, మందుగుండు, బీదవాడు, భిక్షువర్షీయసి అన్నీ -, అవేమిటి -, ఇవేమిటి లోకంలో ఉన్న వన్నీ! పలాయనతత్వం పనికిరాదు, నల్లమందు నిషా పనికిరాదు. జీవితం ఎంత సహారా ఎడారి ఐనా మేము మాత్రం మరి ఉష్ట్రపక్షులమై సంచలించలేము. యథార్థంగా జీవితాన్ని దర్శిస్తాము. జీవితం మాలిన్య భూయిష్టం అని వప్పుకుంటాము, వేలెత్తి చూపిస్తాము. జీవితంలో మాలిన్యాన్ని గాలించి క్షాళితం చేస్తాము. వేదాంతులు జీవితాన్ని ప్రకృతిని అవగాహన చేసుకున్నారు. మేము లోకాన్ని, జీవితాన్ని, ప్రకృతిని కూడా మారుస్తాము. లోకం అంతా ఆ రోజుల్లో మా రచన అశ్లీలమని, అపశ్రుతుల మయమనీ ఇది ఏదైనా అవుతుంది కాని, కవిత్వం మాత్రం కాదనీ వెటకారాలు చేశారు, వెక్కిరించారు.

నాటినుండి నేటివరకూ నవ్యకవి కవిత్వం కోసం అనేక అవతారా లెత్తేడు, ఎన్నెన్నో మార్గాలు అన్వేషించాడు. ఎన్ని మార్గాలనుండి వెళ్ళినా కొసకి మానవాభ్యుదయం, విశ్వశ్రేయస్సే కవి కోరుతాడు. ఇప్పటికీ, ఎప్పటికీ జాతి పురోగమనానికి సాంఘిక చైతన్యం వాంఛనీయమని ఏకైక మానవ కుటుంబంగా వర్ధిల్లి ఈ కాశ్యపిని భూతల స్స్వర్గం చేసుకొందామని కవికీ, సాధారణ మానవునికీ కూడా ఏకైక లక్ష్యం.

నవ్యకవి పోయిన కొన్ని పంథాలు, కొన్ని నమ్మకాలు:

వైద్యుడు నాభీ, నల్లమందూ వాడొచ్చు. వైద్యుడు వాడాడు కదా అని వైద్యం తెలియని వాడు వాడితే మరణిస్తాడు. అంచేత ద్రష్ట అయిన వాడే దాన్ని గ్రహించ గలుగుతాడు. నేటి యువకు లందరికీ బహుపరాక్‌!

పదాన్ని కవి ఒక్కడే పటిష్ఠతతో వాడగలడు. ఇది కవికుండే ఒక ప్రత్యేక విశిష్టత, ప్రపత్తి. కవికి పదం సాక్షాత్కరించినట్లు మరెవ్వరికీ సాక్షాత్కరించదు. సాక్షాత్కరించినా మూలం తెలుసుకోలేరు.

పదాలు పలకలు తీరిన స్ఫటికపు రాళ్ళలా ఎన్నెన్నో ముఖాలతో ఎన్నెన్నో జీవితానుభవాలు సాక్షాత్కరింప జేసే గతి భేదపు గర్భగుళ్ళు - పదాలు.

ఒకే రకపు సాంప్రదాయాలూ సంస్కరణగల మానవుల దైనందిక జీవితంలో కేవల వాక్యార్థాన్నిచ్చేవి ఆత్మానుభవానికి అవగతమై వ్యక్తిగత అర్థగౌరవం స్ఫురింపజేసేవి.

కావ్య కలాపంలో ఛందోబంధ గజ్జల రవళితో, శ్రుతి తాళ ప్రమాణ శ్రవోపేతాలు. ఈరకంలో శ్రీశ్రీ ప్రతిభావంతుడు. (In SriSri 'the form is everything')

వర్ణక్రమమని పేరు పెట్టడంలోనే రంగుల స్ఫురణ తోస్తుంది. కొన్ని అక్షరాల సముదాయం ఒక పదం. ఒక పదాన్ని ఉచ్చరించి చూస్తే వింత రంగులు, జిలుగు వెలుగులూ ద్యోతకం అవాలి. నయనానందకరం కూడా అవాలి. శైశవావస్థలో మన కందరికీ పదాలు వింత రంగులతోనే కన్పిస్తాయి. ఇప్పుడిప్పుడే అంటే ఆరుద్ర కావ్య జగత్తులో కాలు పెట్టేక ఈ రంగుల స్ఫురణ ప్రాముఖ్యత కొస్తున్నది.

ఒక కొత్తరకపు మంత్రశక్తి కూడా ఉంటుంది పదాలకి. తిరిగి పోయిన యుగయుగాల కాలచక్ర చంక్రమణపు ఇరుసులలో అర్థంకాని అవ్యవస్థతో మంత్రించిన అక్షతల మాదిరి ఏదో శక్తి వచ్చి తాకుతుంది మనని. ఇది భూతాలను పారద్రోలి పంచ భూతాలను ప్రజ్వలింపజేయగల మంత్రయుత బీజాక్షర పటిష్ఠా పటిమ చూపించేది.

మాట వరసకి ఒక పదం తీసుకొని పఠిత హృదయాల మీదికి విసురుతామనుకోండి. అందరిలోనూ ఒకే రకపు బొమ్మకట్టి, ఒకే రకపు భావస్పందన కలగదు. ఎవరికుండే జీవితానుభవాలను బట్టి వారి వారి ఉపజ్ఞ, ఓజస్సు, రసగ్రహణ పారీణత, హృదయార్ద్రతను పట్టి అవగాహన అవుతుంది. ఉదాహరణకు 'తేజస్సు' అనే పదం తీసుకుందాం. ఇది కేవల బాహ్య నేత్రాలతో వీక్షించి చటుక్కున మరచి పోయే వారికీ, మనోనేత్రం మీద పొందుపరచుకున్న వారికీ వేరువేరుగా అవగాహన అవుతూంది - 'శ్యామల వర్ణం' అనే పదం తీసుకుందాం: బొగ్గుగనిలో పని చేసే వారికి, సంగీత కళానిధి నాయుడుగారికి వేరు వేరు అర్థ భావ సంచలనం కలిగిస్తుంది. ఒకరికి భుక్తి కోసం తన జీవితాన్ని అమ్ముకుంటే, రక్తాన్ని కూడా నల్లగా మార్చిన పెనుభూతంలా కనబడుతుంది. సంగీత కళానిధికి త్యజించిన మిత్రులు, మృతించిన బంధువులు అందుకోలేని ఆదర్శాలూ అన్నీ జాలి జాలిగా, నీలి నీలిగా నల్లటి ఆవిరులై శబ్దంగా మారి శార్వాణి రాగమై సాక్షాత్కరిస్తుంది.

అందుకే ఒక జీవితకాలమంతా జగత్తులో సమస్త విషయాలనూ వ్యక్తంగానూ (Conscious) వ్యక్తా వ్యక్తంగానూ (Sub-conscious) సేకరించుకొన్న అనుభూతి శకలాలు మెట్లు పేర్చి మేడ కట్టుకొన్నట్టు ఉంటాయి. ఈ అనుభుతులన్నింటికినీ కిన్నెర మీటినట్టు ఒకేమారు కదల్చగలిగే శక్తి స్వరూపిణి పదం!

కొన్ని కవిత్వపు రహదారులు:

కవిత్వమంటే? అతి మృదులమైనదీ, బహు సరళమైనదీ, మందు గుండులాంటిది. జాగ్రత్త! ఖబడ్దార్‌! సాంద్రతరమైన నిబిడమైన భాషావిపిన విటపీవీధుల గంభీరత కాదు; గుబురులు గుబురులుగా గుమిగూడిన పాదప శ్యామల పత్రాళిలో అలముకొంటున్న నీరవ నీరంధ్ర భయదాంధకార జీమూతాళి!

జీవితమొక ఆసుపత్రి. వ్యక్తావ్యక్తం అనే గవాక్షంలోంచి వీక్షిస్తే మనోజగత్తులోని పబ్లిక్‌ బయళ్లూ, వృక్షచ్ఛాయలూ సెలయేళ్ళ గానమూ ఇంకా మీదికి సముద్రపు కెరటాల హోరు - అంటే అవ్యక్తం వినిపించి కనిపిస్తాయి.

ప్రాకారాలమధ్య పెనుగోడలతో మేడలు రమణీయంగా కట్టిన పట్టణం సాహిత్యం. ఈ పట్టణంలో ప్రవేశిస్తే మరేం కనిపించదు. కులాసాగానే ఉంటుంది. ప్రాకారాలు బద్దలుకొడితే భిత్తిక కవతలనున్న పచ్చిక బయళ్లు, రమణీయ శ్యామల ప్రదేశాలు కనబడతాయి. అంటే వ్యక్తంలో అనుభవించిన అనుభూతుల్ని వ్యక్తావ్యక్తంగా మారే అవకాశం ఇవ్వాలి. పట్టణంకూడా ఎలాగా కనిపిస్తుందిగా! ఈ వ్యక్తావ్యక్తం అవగతం చేసుకునేందుకి అనాదినుంచీ వస్తున్న సాంప్రదాయాలు, నీతీ, తర్కం, హేతువాదం అన్నీ కూడా విసర్జించాలి. ఈ గోడలు పగల గొట్టిందికే, ప్రాకారాలు కూలదోసిందికే ప్రతి గీతం చేసే ప్రయత్నం. ఇదే విధ్వంసం. ఈ విధ్వంసంలో బలపపురాళ్ల శిల్పపు మేడలు ఎన్నో కూలిపోతాయి. తాజమహలుకే దెబ్బతగిలింది.

పునస్సృష్టి: ఈఅకాలంలో వాత్సాయనుడూ, మనువూ కారు మా ఋషులు; మార్క్సూ, ఫ్రాయిడ్‌. యధార్థజగత్తు, స్వాప్నిక జగత్తు తారుమారయాయి. యథార్థాన్ని గుర్తించము. కలలు మాకు యథార్థాలు. ఈ జగత్తుతో మాకు పనిలేదు. మాది స్వప్నజగత్తు. సంపన్నులూ, భాషాసంపన్నులూ మాకు విరోధులు. కావ్యలక్షణాలే అవలక్షణాలు. అందరం కవులమే. వ్యక్తాన్ని వదిలిపెడతాము. వ్యక్తావ్యక్తంలో ఈత కొడతాము. ఏదో విధమైన శక్తి మమ్మల్ని పూనుతుంది. అదేదో రాయిస్తుంది. అర్థ మనర్థం. అదేది రాయిస్తే అదే కవిత్వం. ఇది అధివాస్తవికుల మతం. సాహిత్య వృక్షంమీద, చిటారికొమ్మన కూర్చొని ఊగిసలాడడం. ఇది సాహిత్యానికి గొప్ప ప్రయోజనం, అనర్థం కూడా సమకూరుస్తుంది. కేవలం ప్రయోజనాన్నే వినియోగించుకొని, అనర్థాన్ని విసర్జించడం కొమ్ములు తిరిగిన కవి చెయ్యగలపని. అధివాస్తవికులు తీసుకువచ్చిన మార్పు రాజకీయమైందా? మనో ప్రవృత్తికి చెందినదా? జార్జ్‌ హ్యూజ్‌నెట్‌ (George Hugnet) 'Sonton Destru Cteur' అన్నమాట నిజం!

ఇంకా ఎన్నెన్నో రహదారులు ఉన్నాయి. కొన్ని దిఙ్మాత్రంగా సూచించాము.

ఈనాడు కవిత అభ్యుదయ పథాలనంటి మానవజాతి పురోగమనం కోసం ఒక మహనీయపథాన్ని పట్టింది. ఇది మానవజాతి అంతటికీ ముక్తినిస్తుంది. అతి నవ్యకవులంతమందీ కూడా ఈ ఋజుమార్గంలోనే తమతమ కలాల్ని నడిపిస్తున్నారు.

ఈ అతినవ్య కవుల్లో మూడో తరానికి చెందినవాడు 'సంఘర్షణ' రచించిన శ్రీ రెంటాల గోపాలకృష్ణగారు. శ్రీశ్రీ, నేనూ, శిష్ట్లా, రుక్మిణీనాథశాస్త్రి మేమంతా వంశ పురుషులం. మొదటితరం వాళ్ళం. శిష్ట్లా విషయంలో ఇక్కడ కొంత చెప్పవలసినది ఉంది. శిష్ట్లా అతినవీనుల్లో కడుప్రాచీనుడు. శిష్ట్లా చేసిన సాహితీసేవ ఏమిటీ అంటే వేలకొలది సంవత్సరాలనుంచి అందరి నోటాపడి అరిగిపోయి వాటంచెడిన నిస్సారమైన మాటలను పునస్సృష్టి చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాడు. (Re-Creation of Words)

రెండో తరానికి చెందినవారు అనిసెట్టి, రామదాసు, ఏల్చూరి. ఇంకా ఎంతోమంది. ఆరుద్ర కూడా రెండోతరానికి చెందినవాడే. మూడోతరంలో ఈనాటి యువకవులెంతోమంది ఉన్నారు.

మనదే అంతిమ విజయం: ఇది చారిత్రాత్మకమైన అవసరం. దాన్ని తుపాకిగుళ్ళు మరఫిరంగులు మసిచేసి నుసి చేయలేవు. ఏకొద్ది మందినో మినహాయిస్తే మానవజాతి మౌనంగా చేసుకొన్న మహా సంకల్పం. అనుల్లంఘనీయం! ప్రతి ఒక్కరూ నడుం కట్టండి! ... ... కాలం కన్నువిప్పిన నాటినుండి కవులు పఠితల్తో రకరకాల సంబంధం పెట్టుకొన్నారు. అతినవ్యకవి నీతో కల్పించుకున్న సన్నిహితత్వం ఎవ్వరూ కల్పించుకోలేరు. అతినవ్యకవిమాట అభిమానపుమూట. నీ రక్తంనుంచి ఉద్భవించాడు. - నువ్వే!

    "ఈ ప్రపంచ
    జీవన వైతరణి
    దాటేందుకు
    నీ కోసం
    నే చేసిన
    గోదానం
    నా గీతం"

శ్రీరంగం నారాయణబాబు
విజయనగరం
2 సెప్టెంబరు 1960

(రెంటాల గోపాలకృష్ణగారు రచించిన 'సంఘర్షణ' కావ్యానికి నారాయణబాబు వ్రాసిన 'పీఠిక'లోని భాగాలు ఇవి.)

AndhraBharati AMdhra bhArati - kavitalu - rudhirajyOti - pravara - SrIraMgaM nArAyaNabAbu Srirangam Narayana babu Sriramgam NarayaNababu rudhira jyothi rudhirajyothi - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )