| నాటకములు | కన్యాశుల్కము | గురజాడ అప్పారావు |
| ౬-వ స్థలము. లుబ్ధావధాన్లు యింటినడవ. | |
| (తలుపు జారవేసివుండును.) | |
| (మీనాక్షి ప్రవిదతో దీపంతెచ్చి గూటిలోవుంచును. రామప్పంతులు వొత్తితగ్గించి, మీనాక్షిని ముద్దుబెట్టుకొనును.) | |
| మీనాక్షి | తోవతప్పొచ్చారో? |
| రామ | బుద్ధితక్కువచేత, గడ్డితిని యిన్నాళ్లూ తోవమరచాను. |
| మీనా | మధురవాణి యలా రానిచ్చింది? |
| రామ | మధురవాణి శిగ్గోశిరి, దాన్ని వొదిలేస్తాను. ఆకలి దహించుకుపోతూంది. ఫలారం యేవైఁనావుందీ? |
| మీనా | యేవుందీ?- వొడపప్పూ, కొబ్బిరిముక్కా కావాలా! |
| రామ | యేదో ఒహటితెస్తూ. |
| (మీనాక్షి మూకుడుతో వడపప్పూ, కొబ్బరిముక్కలూ తెచ్చును. రామప్పంతులు తినుచుండును.) | |
| మీనా | మధురవాణిని వొదిలేస్తారో? |
| రామ | వొదిలెయడం నిశ్చయవైఁపోయింది. |
| మీనా | కనిష్టీబుమాట తెలిసిందో? |
| రామ | తెలిసింది. |
| మీనా | యవరుచెప్పారు? |
| రామ | అసిరిగాడు. |
| మీనా | మా అసిరిగాడా? |
| రామ | మీ అసిరిగాడే. |
| (అసిరిగాడు వీధితలుపు కొంచంతీసి తొంగిచూసి.) | |
| అసిరి | దెయ్యానికెట్టింది తింతున్నావయ్యా? |
| రామ | దెయ్యానికా పెట్టా`రు? |
| మీనా | (అసిరిగాడితో) వూరుకో వెధవా. |
| రామ | నీకు న్యాయవేఁనా, దిగదుడుపు కూడుపెట్టడం? (వీధులోకివెళ్లి వమనము చేసికొనుటకు ప్రయత్నముచేసి తిరిగీ ప్రవేశించి) వమన వైఁందికాదు. యేం సాధనం? |
| మీనా | దిగదుడుపుకాదంటే నమ్మరుకదా? |
| రామ | మూకుళ్లో తగలేశావు? |
| మీనా | దెయ్యంతినిసచ్చిందా, యేవిఁటి? |
| రామ | ఆడవాళ్లు దారుణం మనుషులు! |
| మీనా | అసిరిగాడేంచెప్పా`డు మధురవాణిమాట? |
| అసిరిగాడు | (తిరిగీ తొంగిచూచి) ఆ పారేసిందట్టుకు పోదునాబాబు? |
| రామ | పట్టుకుపో. |
| (అసిరిగాడు పట్టుకుపోవును.) | |
| మీనా | వాడికి మీకంటె ధైర్యంవుంది. |
| రామ | అపవిత్రం ముండాకొడుకు యేవైఁనాతింటాడు. బ్రాహ్మలం పవిత్రవైఁన వాళ్లంగదా? |
| మీనా | పవిత్రం అంటే, మీదీ, నాదే! |
| రామ | అదేం అలా అంటున్నావు? |
| మీనా | నేను వెధవముండనీ, మీరు సరసులున్నూ. మనకంటే మరిపవిత్రం అయినవారు యవరుంటారు? |
| రామ | ఆకళంకం తీసెయ్యడానికే యీవేళొచ్చాను. |
| మీనా | యలా తీసేస్తారు? |
| రామ | మనయిద్దరం పెళ్లాడితే మరి అపవిత్రత యెక్కడుంటుంది? |
| మీనా | యేవిఁటీ! |
| రామ | మనం పెళ్లాడదాం! |
| మీనా | నిజంగాను? |
| రామ | యేంవొట్టు వేసుకొమ్మన్నావు? |
| మీనా | ఆదీపం ఆర్పెయ్యండీ. |
| రామ | యీకాగితం ముక్కలు చదివి మరీ ఆర్పేస్తాను. (కాగితంముక్కలు జేబులోంచితీసి చదివి) గాడిద కొడుకు తనబాకీ తాలూకు నోటులాగి, నన్ను దగా చేశాడు; వీడితాళం పడతాను. |
| మీనా | యవడు? |
| రామ | అది వేరేకథ. |
| మీనా | అసిరిగాడు కనిష్టీబుమాట యేం జెప్పా`డు? |
| రామ | మధురవాణి హెడ్డుమీద కుక్కని వుసిగలిపిందని చెప్పా`డు. |
| మీనా | యెందుకూ? |
| రామ | నేను లేనప్పుడు వాడు యింట్లో చొరబడబోతేను. |
| మీనా | అయ్యో తెలివా! అసిరిగా! |
| అసిరిగాడు | (ప్రవేశించి) యేటమ్మా? |
| మీనా | వెధవా, నిజంచెప్పూ. పంతులు యింట్లోలేనప్పుడల్లా కనిష్టీబు మధురవాణితో వుంటా`డని, నువ్వు నాతో చెప్పలేదూ? |
| అసిరి | (బుఱ్ఱగోకుకుంటూ) సెప్పినాను. |
| రామ | దొంగవెధవా! కుక్కని వుసిగలిపిందన్నావు? |
| అసిరి | బాబు - నౌకరోడు నోరుమూసుకోవొద్దా బాబు? సానమ్మడిగితే, మీమాట సెప్పుతాన బాబు? |
| మీనా | వెధవా, నువుచెబితే నాకు భయవఁనుకున్నావా యేవిఁటి? |
| రామ | ఓరి అబద్ధపు వెధవా! యెవరితోనూ మామాటమాత్రం చెప్పకు. రూపాయి యిచ్చానుకానూ? |
| మీనా | యందుకిచ్చారూ, రూపాయి? |
| అసిరి | పిల్లలోణ్ణిగందా? (పైకివెళ్లును.) |
| రామ | దొంగముండ ద్రోహంచేస్తూందేం? |
| మీనా | తెలుసునన్నారు? |
| రామ | యింతని యెరగను. |
| మీనా | ఆడది నీతితప్పినతరవాత అంతేవిఁటి? యింతేవిఁటి? తెగించినదానికి సగుడు మోకాలుబంటి - అందులో సాంది ఖాయిదాగా వుండాలనుకోవడం మీదీ బుద్ధితక్కువ. |
| రామ | బుద్ధితక్కువంటే బుద్ధితక్కువా? ముండనిబుఱ్ఱ చితకపొడిచెయ్యాలనివుంది. దీనికింద యంత సొమ్ము తగలెట్టా`నూ! |
| మీనా | యెప్పుడుతోలేస్తారు? |
| రామ | యెప్పుడోనా? రేపే. లంజ యంత పతివ్రతవేషం వేసిందీ? |
| మీనా | మనవెఁప్పుడు వెళ్లిపోవడం? |
| రామ | యక్కడికి? |
| మీనా | మతి పోతూందా యేవిఁటి? రాజమేంద్రం? |
| రామ | అవును. రేపు దాన్నితోలేస్తానా? యెల్లుండి మనం వుడాయిద్దాం. గాని నీసరుకులు తెచ్చుకుంటావా, ముసలాడికి వొదిలేస్తావా? |
| మీనా | నాకున్నదల్లా నాసరుకులే; యెలా వొదిలేస్తాను? నా సరుకులపెట్టె తాళం మానాన్నదగ్గిరుందిగదా యేవిఁగతి? |
| రామ | నాప్రయోజకత్వం నీకేం తెలుసును? యిదుగో యీ రింగునవున్న యినప ములికీతో నీచిత్తవొఁచ్చిన పెట్టెతాళం తీసేస్తాను. గాని నాకంటె యక్కడుంది? |
| మీనా | గుంటకిపెట్టిందా? రాత్రివేళ, నాబట్టల పెట్లోపెట్టేది. |
| రామ | నీపుణ్యవుంటుంది ఆ బట్టలపెట్టె వోమాటుతీసిచూతూ. రేపు దానికంటె మధురవాణికిచ్చి, ముండని తగిలేస్తాను. |
| మీనా | ఆగుంట బట్టలపెట్టె తాళం పారేశింది. |
| రామ | ములికితో తీసేస్తాను. |
| మీనా | నా సరుకులపెట్టె తాళంకూడా తీసేసిపెడతారూ? |
| రామ | అద్దే! |
| మీనా | నన్ను పెళ్లాడతానని ప్రెమాణం చేశారుకారే? |
| రామ | దీపం ఆర్పేస్తే పెట్టెతియ్యడం యలాగ? |
| మీనా | అగ్గిపుల్లవుంది. |
| రామ | ఐతే యిదిగో, నిన్ను తప్పకుండా పెళ్లా`డతానని యీ దీపం ఆర్పేస్తున్నాను. |
| (రామప్పంతులు దీపం ఆర్పి మీనాక్షిని కౌగలించుకొని యెత్తును.) | |
| రామ | యిలా యెత్తుకు తీసుకుపోతాను రాజమహేంద్రవరం. |
| (లుబ్ధావధాన్లు చీకటిలోవచ్చి కఱ్ఱతో రామప్పంతులు కాళ్లమీదకొట్టును. మీనాక్షి కిందపడును.) | |
| లుబ్ధా | బందిపోటు గాడిదెకొడకా! |
| రామ | సచ్చాన్రా (వీధిలోకి కుంటుకుంటూపోవును.) |
| లుబ్ధా | పో, ముండా నువుకూడా నాయింట్లోంచి. (మీనాక్షిని పైకితోసి తలుపు గడియవేయును.) |
| రామ | అసిరిగా. చంపేశాడ్రా - కాలెవిఁక విరిగిపోయిందిరా. |
| అసి | (నిమ్మళంగా) దెయ్యానికెట్టింది తింతే యేటౌతదిబాబూ? (గట్టిగా) కానేళయిల్లు జొరబడితే, బుగత తన్నడా? |
| రామ | (మీనాక్షితో) నువ్వు యింట్లోకి వెళ్లిపో. |
| మీనా | మరి యింట్లో అడుగుపెట్టను. నాసరుకులు లేకపోతే పాయను. రండి రాజమేంద్రంపోదాం. |
| రామ | తలిచినప్పుడేనా తాతకి పెళ్లి? |
| మీనా | మీయిష్ట వొఁచ్చినప్పుడు పెళ్లాడుదురుగాని, యింట్లోంచి లేవదీసుకొచ్చారుగదా? యిహ నేను మీతో వుండవలసినదాన్నే; పదండి. |
| రామ | వెఱ్ఱి కుదిరింది రోకలి తలకి చుట్టుకొమ్మన్నాట్ట! బతిమాలుకుంటాను యిప్పటికి యింట్లోకి వెళ్లిపో. |
| మీనా | మరి యీజన్మంలో యీ యింట్లో అడుగుపెట్టను. |
| రామ | అసిరిగా, మీనాక్షి వొక్కర్తావుంటుంది. కాపాడి, బుగత తలుపుతియ్యగానే లోపలికి తీసికెళ్లు - (పరిగెత్తును. మీనాక్షి వెంటపడును.) |
| (రామప్పంతులు యింటియదట.) | |
| రామ | (తలుపుతట్టి) వేగిరం, వేగిరంతియ్యి. |
| మధురవాణి | (తలుపు అవతలనించి) యేవిఁటాతొందర? |
| రామ | ఆకుచిట్టెడ వెంట తరువుఁతూంది. |
| మధు | చిట్టెడ కనపడగానే తలుపుతీస్తాను. |
| రామ | తలుపేసుకు కూచుంటే నీక్కనపడ్డం యలాగ? నువ్వు తలుపుతీసేలోగా నన్ను కాటేస్తుంది. |
| మధు | నాకంటేదీ? |
| రామ | కంటె, కంటె, అని తపిస్తున్నావేవిఁటి? నిలబడ్డపాటున నూరుకంటెలు కురిపిస్తాను. |
| మధు | మీనూరుకంటెలూ మీరు వుంచుకుని, నావొక్కకంటె నాకిచ్చి, మరీ యింట్లో అడుగుబెట్టండి. |
| రామ | రేపు పొగలుగాని కంటె యివ్వనన్నాడు లుబ్ధావధాన్లు. |
| మధు | రేపే యింట్లో కొత్తురుగాని, మించిపోయిందేవీఁలేదు. |
| రామ | యింతట్లో చిట్టెడ మీదపడితే? |
| మధు | సకేశా? అకేశా? |
| రామ | పిల్లికి చెలగాటం, యలక్కి ప్రాణపోకటా! |
| (మీనాక్షి ప్రవేశించి, రామప్పంతులు రెక్కపట్టుకొనును.) | |
| మీనా | దీపం ఆర్పి ప్రమాణం చేశావు - తప్పితే తలపగిలిపోతుంది. |
| రామ | పో ముండా! |
| మీనా | మీ కాగల పెళ్లాన్నిగదా యెక్కడికిపోతాను? |
| మధు | కాగల పెళ్లావేఁవిఁటి? |
| మీనా | నిన్ను వొదిలేసి, నన్ను రాజమేంద్రం తీసుకుపోయి పెళ్లాడతానన్నాడు - దీపవాఁర్పి ప్రమాణంచేశాడు - మరెలా తప్పుతాడు? |
| మధు | యీవిడేనా ఆకుచిట్ట`డ? |
| రామ | ముండా, నాచెయ్యొదిలెయ్ - నిన్ను నే పెళ్లాడతానన్నానే? కలగన్నావా యేవిఁటి? (మీనాక్షిని విడిపించుకొనగా మీనాక్షి కిందపడును.) |
| మధు | ఆడదానిమీదా చెయిజేసుకుంటారు? యేమి పౌరుషం! అబద్ధవాఁడక అన్నమాట నిలబెట్టుకోండి. యేం? కులంతక్కువా? రూపంతక్కువా? ఆమెబతుకు భ్రష్టుచెయ్యనే చేశారు; పెళ్లాడి తప్పుదిద్దుకోండి - ఆవిణ్ణి పెళ్లాడివొస్తేనే నేను తలుపు తీస్తాను. |
| మీనా | పంతులు నన్ను కౌగలించుకొని యెత్తుకుంటే మానాన్న చూసి, తన్ని, యిద్దర్నీ యింట్లోంచి తగిలేశాడు. నువ్వు హెడ్డు కనిష్టీబుతో పోతున్నావు, నిన్నొదిలేసి నన్ను పెళ్లాడతానని వొట్టేసుకున్నాడు. నన్ను లేవదీసుకొచ్చి, నన్ను పెళ్లాడక తప్పుతుందాయేమిటి? |
| మధు | అవస్యం పెళ్లాడవలిసిందే - పెళ్లాడకపోతే నువ్వుమాత్రం వూరుకుంటావూ? దావా తెస్తావు - పంతులుగారికి దావాలంటే సరదానే! |
| రామ | మధురవాణీ - నీకు మతిపోతూంది - నాయింటికి నువ్వా యజమానివి? తలుపు తియ్యి. |
| మధు | నిలబడండి. కర్పూరంవెలిగించి మంగళహారతి పళ్లెంతెస్తాను. (తలుపుదగ్గిరనుంచి లోనికివెళ్లును.) |
| రామ | (తలుపుసందులోనుంచి చూసి, తరవాత మీనాక్షిని ముద్దెట్టుకుని) యెంతపనిచేశావూ! దాంతో చెప్పేశావు! రహస్యంగా లేచిపోయి పెళ్లిచేసుకోవాలిగాని, అల్లరిచేసుకుంటే యలాగ? |
| మీనా | యెప్పుడైనా అందరికీ తెలిసేదేగదా? |
| రామ | నామాటవిని యిప్పుడు యింటికి వెళ్లిపో. |
| మీనా | యిహ మాయింటికి వెళ్లను. యిదేమాయిల్లు; మధురవాణి తలుపుతీస్తుంది; లోపలికి వెళదాం. |
| రామ | అయితే యిక్కడవుండు యిప్పుడే వొస్తాను (కొన్ని అడుగులు వీధంట నడచి, నిలచి) నిజంగా మంగళహార్తి తెస్తుంది కాబోలు పెంకెలంజ? అది తలుపు తియ్యకపోయెనా, మీనాక్షి నన్ను వెతకడానికి బయల్దేరుతుంది. తెల్లవారవచ్చింది - చెరువ్వేపుపోయి కాలకృత్యాలు తీర్చుకుని ఆపైచర్య ఆలోచిద్దాం. రెండ్రోజులు పైకి వుడాయించానంటే మళ్లీ వొచ్చేసరికి కొంత అల్లరి సద్దుకుంటుంది. తలుపుతీసినట్లు కానరాదు. యవడిల్లు? యవర్తె యిది నన్ను అడ్డడానికి? ఆశ్చర్యం! |
(కొంతదూరంగా వీధిలో నిలబడి, దాసరివేషంతో శిష్యుడు చితారుమీటి పాడును.) చరణం॥ | |
| రామ | యిది నాయిల్లుకాదా? |
| శిష్యుడు | "ఊరికిఉత్తరాన । సమాధిపురములో । కట్టెయిల్లున్నదే చిలుకా ॥" |
| రామ | వొల్లకాట్లోనా? |
| శిష్యుడు | పల్లవి॥ "యెన్నాళ్లుబ్రతికినా । యేమిసామ్రాజ్యమే । కొన్నాళ్లకోరామ చిలుకా?" । అనుపల్లవి॥ "మూణ్ణాళ్లబతుకునకు । మురిసేవు త్రుళ్లేవు । ముందుగతికానవే చిలుకా" |
| రామ | యేవిఁటీ అపశగునం పాటా! |
| శిష్యుడు | "కఱ్ఱలే చుట్టాలు । కట్టెలేబంధువులు । కన్నతల్లెవ్వరే చిలుకా?" |
| రామ | చుట్టాలా? వొక్క అప్పవుంది, అదియెప్పుడూ నాగుమ్మంలో అడుగుబెట్టలేదు. యిప్పుడు యింటికి యజమాని యెవరూ? తలుపవతల సానిలంజా! తలుపివతల సంసారి వెధవలంజానూ; యిద్దరూ కలిసి యిల్లుచేరకుండా నన్ను తగుల్తున్నారు. |
| శిష్యుడు | "నిన్నుమోసేరు నలుగురు । వెంబడిని పదిమంది ।" |
| రామ | వెఱ్ఱి ముండాపాటా! పోదాం. (గబగబ కొంతదూరము నడచి, నిలుచుని) యీతోవనే వొస్తున్నాడుకాబోలు - అదుగో పాట వినపడుతూంది. |
| శిష్యుడు | (పాట)"నువ్వుకాలిపోయేదాక । |
| రామ | వెఱ్ఱి ముండాపాటా! |
| శిష్యుడు | పంతులుగారూ! యక్కడున్నారు? |
| రామ | పరుగుచ్చుకోకపోతే పట్టుగుంటుంది. (పరిగెత్తును.) |