| నాటకములు | కన్యాశుల్కము | గురజాడ అప్పారావు |
| కన్యాశుల్కము - షష్ఠాంకము. | |
| ౧-వ స్థలము. రామచంద్రపురం అగ్రహారంలో. | |
| (చెఱువుగట్టునవున్న తోటలోనికి పెళ్లివారి బళ్లువచ్చును. గట్టుమీద ఒకవైపు అగ్నిహోత్రావధాన్లు, రెండవవైపు పళ్లుతోమికొనుచు రామప్పంతులును.) | |
| అగ్ని | బళ్లుదింపండి. బళ్లుదింపండి. సాయేబూ యేనుక్కి కావలసినంత రొడ్డ. చెఱువు స్నానానికి బహుబాగావుంది. యెవరయా చెఱువుగట్టుమీద? |
| రామప్పంతులు | (తనలో) అరే! మరిచితిని. యీవేళేకదా పెళ్లివారు రావలసిన రోజు? (పైకి) నా పేరు రామప్పంతులంటారు. |
| అగ్ని | లుబ్ధావధాన్లుగారు మిమ్మల్ని పంపించారా యేమిషి? |
| రామ | యెందుకండి? |
| అగ్ని | మేవొఁస్తున్నావఁని యెదురుగా యవర్నీ పంపలేదా? నాపేరు అగ్నిహోత్రావధాన్లు అంటారు. |
| రామ | మీరేనా అగ్నిహోత్రావధాన్లుగారు? యేంవచ్చారేఁవిటి? |
| అగ్ని | పెళ్లిమాట మీకుతెలియదా యేమిషి? |
| రామ | పెళ్లెవరికండి? |
| అగ్ని | మీదీవూరుకాదా యేమిషండి? మాపిల్లని లుబ్ధావధాన్లుగారి కిస్తావుఁ. |
| రామ | లుబ్ధావధాన్లుగారికి పెళ్లైపోయిందే? |
| అగ్ని | తమరు హాస్యాలాడుతున్నారు- హాస్యాలకేంగాని, ప్రయత్నాలుయలా జరుగుతున్నాయి యేమిషండి? |
| రామ | మీరే హాస్యాలాడుతున్నట్టుంది. పెళ్లిఅయి పదిరోజులైంది. లుబ్ధావధాన్లుగారి సంబంధం అక్కర్లేదని మీరు రాశారట. అందుపైని యవడో గుంటూరునుంచి వొచ్చిన ఓ శాస్తుల్లు కొమార్తెని పన్నెండువొందలిచ్చి పెళ్లా`డాడు. |
| అగ్ని | అన్నగారూ - హాస్యం ఆడుతున్నారు. న్యాయంకాదు. మనకి బావగారి వరసా యేమిషండి? |
| రామ | యేమిటి మీమాటలూ? నేను యెన్నడూ అబద్ధవాఁడి యెరుగను. నామాట నమ్మకపోవడం ధర్మవేఁనా? |
| అగ్ని | ప్రమా`ణం చెయ్యండీ! |
| రామ | గాయత్రీసాక్షి. |
| అగ్ని | అయ్యో! అయ్యో! యేవీఁదురంతం! రండీ, వెళ్లి గాడిద`కొడుకు యెవిఁకలు విరగ్గొడతాను. |
| రామ | నేనురానండి. ఆగుంటూరు సంబంధం చెయ్యవొద్దన్నానని నాతో మాట్లాడడం మానేశాడు. మీరు వెళ్లిరండి - మీరు తిరిగీ వొచ్చిందాకా యిక్కడే కూచుంటాను. |
| అగ్ని | ఆగాడిదెకొడుకు యింటికి నాకు తోవతెలియదే? |
| శిష్యుడు | (చెఱువుగట్టు యెక్కుతూపాడును.) "తా నెవ్వరో తనవారెవ్వరో? । మాయజీవికి తనువుకు తగులాయగాకా" ॥ |
| (రామప్పంతులు నిలబడి భయము కనపర్చును.) | |
| అగ్ని | యేవిఁ అలా చూస్తున్నారు? |
| రామ | శవాన్ని మోసుకుపోయే పాట! |
| శిష్యుడు | "దినమూ, మరణమని తెలియూడీ" |
| రామ | (శిష్యునితో) వూరుకో (అగ్నిహోత్రావధాన్లుతో) అన్నా ఓకానీ వుందా? |
| శిష్యుడు | మిమ్మల్ని తీసుకురమ్మంది. |
| రామ | చచ్చానే - వొస్తూందాయేవిఁటి? |
| శిష్యుడు | కంటెపోతేపోయింది, రమ్మంది. |
| రామ | బతికా`ను. |
| అగ్ని | చావడం యెందుకు, బతకడం యెందుకు? |
| రామ | అది వేరేకథ. |
| శిష్యు | చిట్టపులి పిల్లని తండ్రొచ్చి వండకి తీసుకుపోయినాడట. |
| అగ్ని | యీవూళ్లోకి పుల్లొస్తాయా యేమిషి? |
| రామ | విరగడైపోయింది. (శిష్యునితో) యింద రూపాయి. |
| శిష్యుడు | (తీసుకుని) దాసుణ్ణి బాబూ! (పాడును) "చిత్తాస్వాతివాన, జోడించికురియగ" |
| అగ్ని | యేవిఁటీ వెధవపాట? వూరుకుంటావా వూరుకోవా? నీకు రూపాయి చాలదురా గుంటకక్కగట్టా? |
| శిష్యుడు | తమరు దయచెయ్యరాబాబూ? |
| అగ్ని | నేనివ్వను - అన్నా, తోవ యవరు చూపిస్తారు. |
| రామ | (శిష్యుడితో) నీకు లుబ్ధావధాన్లు యిల్లు తెలుసునూ? |
| శిష్యుడు | తెలుసును - తండ్రీ. |
| రామ | అవధాన్లుగారు ఓకాని డబ్బిస్తారు. యిల్లు చూపించు. |
| శిష్యుడు | ముందిస్తేగాని చూపించను. |
| అగ్ని | యింద - యేడువు. |
| (శిష్యుడు ముందూ, అగ్నిహోత్రావధాన్లు వెనకా కొన్ని అడుగులు వెళ్లిన తరవాత, శిష్యుడుపాడును.) | |
| శిష్యుడు | "నీలాలకా యేల నీ యలుకా"? |
| అగ్ని | యలకేవిఁటి నీశ్రాద్ధం? |
| శిష్యుడు | యలక్కాదు, పిల్లి. (పాడును) "పిల్లన్న తెయితక్కలాడంగనూ । యలక లేరూగట్టి దున్నంగనూ" |
| అగ్ని | యేవిఁటీ? |
| శిష్యు | "మేకపిల్లల్రెండు మేళాంగట్టుకుని । మేరంగితీర్థాని కెళ్లంగనూ" ॥ |
| అగ్ని | యేవిఁటి నీశ్రాద్ధంపాట! |
| శిష్యు | "తొండాయనేస్తూడు. దొనిగఱ్ఱబట్టుకుని । తోటమల్లీ పువ్వులేరంగను" ॥ |
| అగ్ని | పాడావంటే తంతాను. |
| శిష్యు | అయితే నీకు మరి యిల్లు చూపించను. |
| అగ్ని | పాడగట్టా - (కొట్టబోవును.) |
| శిష్యుడు | (తప్పించుకు పారిపోతూ) "గట్టుకిందానున్న । పందా`యనేస్తూడు - మరిగబుకూ । మరిగుబుకూ" ॥ |
| (నిష్క్రమించును.) | |
| అగ్ని | వీడిశ్రాద్ధం చెట్టుకింద బెట్టా! తోవయిటా? అటా? |
| (తెరదించవలెను.) | |