| కన్యాశుల్కము - సప్తమాంకము. |
| ౧-వ స్థలము. విశాఖపట్ణంలో వీధి. |
| (బైరాగీ, వెనుక పదిమంది శూద్రులూ ప్రవేశింతురు.) |
| రామన్న |
యెక్కణ్ణించి యిజయం సేస్తున్నారు గురూ? |
| బైరాగి |
కాశీనుంచిరా. |
| రామ |
యెన్నాళ్లైంది గురూ? |
| బైరాగి |
ప్రాతఃకాలం గంగసేవించి బయల్దేరామురా. |
| రామ |
యింత యేగిరం యెలాగొచ్చినారు గురూ? |
| బైరాగి |
పవనంబంధించి, వాయువేగం మీదవచ్చామురా. |
| బుచ్చన్న |
యోగులికి సిద్దులుండవురా? యీయనేంరా, ఉప్పాకలోనూ సింవాచలంలోనూ మొన్న సివరాత్రికి వొక్కమారే అగుపడ్డారు. |
| లక్ష్మన్న |
తెల్లోడు తీగిటపా యేసినాడు కాడ్రా? నిమేటికి వుత్తరం దేశదేశాలికి యెల్లదా? |
| బైరాగి |
పామరులు! పామరులు! |
| రామ |
వూరుకొస్సి - నీకేటెరిక - యెఱ్ఱినాకొడక. |
| బైరాగి |
యీవూళ్లో తీర్థపురాళ్లరేవున రెండుమైళ్లులోసబురున ధర్మరాజువారు ప్రతిష్ఠచేసిన శివాలయం, కంచుదేవాలయం ఒకటి వున్నది. రాత్రి ఆదేవుణ్ణి శేవించుకుని, రేపు రామేశ్వరం వెళ్లిపోతాం. సదావృత్తి యక్కడ దొరుకుతుంది? |
| రామ |
యీ ఊళ్లో మఠంలేదు గురూ. మేవంతుండగ తమకిలోపవేఁటి గురూ? కాశీ కబుర్లేటి గురూ? |
| బైరాగి |
నాలుగురోజులు కిందట విశ్వేశ్వరుడి కోవిలలో ఒక బంగారపు రేకు ఆకాశంమీంచి పడ్డది. దానిమీద వ్రాసినలిపి బ్రాహ్మలికి యవరికీ బోధ అయిందికాదు. మేం చిత్తగించాం. సిద్ధులభాషని దానిమీద బంగారంచేసే యోగం వకటి కలకాలంబతికే యోగం వకటి వ్రాసివున్నాయి. |
| రామ |
యేవాఁచ్చఱ్ఱెం! గురూ భోజినం యేటారగిస్తారు? |
| బైరాగి |
పాలూ, పంచదారా, అరిటిఫలములూ, యీప్రకారం ఒకపక్షం ఫలహారం చేస్తాము. మరి పదిహేనురోజులు వాయుభక్షణ చేస్తాము. |
| రామ |
ఒక్క మిట్టకాయలో పలారం జాగర్త చేస్తాం గురూ. మా రాంమందిరానికి దయసెయ్యాలి. |
| బైరాగి |
పద - యీవూరి వింతలేవిఁటి? |
| లక్ష్మన్న |
యేటీలేవ్ - రావఁశంద్రపురం అగ్ఘురోరంలో ముసలిబాపనోడు ఆల్నిసంపేసినాట్ట. ఆడికీ దొంగసాచ్చీకం పలికినోళ్లకీ తాసీలుగోరికీ సిచ్చైపోతాదిట. |
| బైరాగి |
యీవూరు పాపంతో నిండి వున్నట్టు కనపడుతూంది. యీ వూళ్లో మేము నిలవము. |
| రామ |
లచ్చువుఁడు వెఱ్ఱోడు గురూ. ఆడిమాట నమ్మకండి. మీరెళ్లిపోతే మాలాటోళ్లు తరించడం యలాగ్గురూ? ఆళ్లీవూరోళ్లుకారు. |
| బుచ్చన్న |
ఆవూరి దుకాణదారుగారు అదుగో వొస్తున్నారు. |
| బైరాగి |
యీవూళ్లో తాగడం లావుగావున్నట్టు కనపడుతుంది. మేము తాగుబోతులతో మాట్లాడం - ఆదుకాణదారు వచ్చేలోగా యీ సందులోకి మళ్లిపోదాం; రండి. |
| (దుకాణదారు పరుగునవచ్చి కలిసి బైరాగిమొలలో చెయివేసి పట్టుకొనును.) |
| దుకా |
రూపాయలుకక్కి మరీ కదలాలి! |
| బైరాగి |
యేమిటీవాళకం! వీడు తప్పతాగి పేలుతున్నాడు - నేను మొదటే చెప్పలేదా యీవూరి సంగతి? అంతా పాపంతో నిండివుంది! వేమన్న యేమన్నాడు. "తాగుబోతుతోడ! తగదెందునేస్తంబు" |
| రామ |
(దుకాణదారుతో) భాయీ! మీకేటి, మతోయిందా? గురువుగోరికి దణ్ణవెఁట్టి లెంపలోయించుకొండి. |
| దుకా |
గురువూలేదు, గుట్రాలేదు వూరుకోస్సి - యీడెక్కడ గురువు? నాదుకాణంలో సారా అంతా చెడతాగి డబ్బియ్యకుండా యెగేసినాడు. |
| రామ |
మీకు మతోయిందా భాయి? ఆరేటి మీదుకాణంలో తాగడవేఁటి. కాశీనించి యిప్పుడే ఒచ్చినారుగదా? |
| దుకా |
ఆకాశం బొక్కచేసుకుని వొచ్చాడుకాడూ? (బైరాగితో) డబ్బిచ్చి మరీ కదులు. |
| బైరాగి |
మావంటి సాధులతో నీకు వాదెందుకు అబ్బీ? యవర్నిచూసి మేవఁనుకున్నావో! మమ్మల్ని పోలిన దాసరివాడొకడు, బైరాగి వేషంవేసుకుని యీ దేశంలో తిరుగుతున్నాడు. కిందటిమాటు మేం దేశసంచారం చేసినప్పుడు చూసి చివాట్లుపెట్టాం`. నీకు డబ్బుమీద అంత కాపీనంవుంటే తులం రాగి తెచ్చుకో బంగారం చేసియిస్తాం. సంగోరు ధర్మఖర్చుచేసి సంగోరుతిను. లేకుంటే తల పగిలిపోతుంది. |
| రామ |
యేం యెఱ్ఱిముండాపని చేసినారు భాయీ! బంగారం చేసేసిద్దులికి డబ్బులచ్చంటోయి? ఆరికాళ్లమీదపడి అలకతీరుసుకొండి. |
| దుకా |
వుండోస్సి - యేడిసినట్టేవుంది. నీ సొమ్మేం పోయింది? |
| (హెడ్కనిష్టీబు ప్రవేశించును.) |
| హెడ్ |
యేమండోయి గురోజీ! మీరు దొరకడం నాకు దేవుఁడు దొరికినట్టుంది. ఇక బతికా`ను. మీతో కొన్ని జరూరు సంగతులు మాట్లాడాలి, రండి. |
| బైరాగి |
భాయీ - మీరు వెనక్కుండండి. (దుకాణదారు తప్ప తక్కినవారు దూరముగా వెళ్లుదురు.) |
| దుకా |
నాడబ్బిచ్చి మరీ మాట్లాడండి. |
| బైరాగి |
నలుగురిలోనూ మర్యాదతియ్యడం ధర్మవేఁనా తమ్ముడా? యోగరహస్యాలు పామరుల దగ్గిరా వెల్లడిచెయ్యడం? |
| దుకా |
డబ్బు యెగెయ్డపుయోగం నాదగ్గిరపారదు. రహస్యవేఁటి? ఆవిద్యకి అంతా గురువులే! |
| బైరాగి |
వెఱ్ఱినరుడా! బైరాగివాళ్లకి మాకు డబ్బుమీద తనువుంటుందటోయి? ఒకళ్లకి యిచ్చేదీకానం - పుచ్చుకున్నదీకానం. |
| హెడ్డు |
భాయీ! నీరూపాయలు నేనిస్తాను. తెలివిమాలిన మాటలాడకు. గురువుగారికి కళ్లుమొయ్యా ఆగ్రహవొఁస్తే మనం మండిపోతాం. మీరటుండా, వెళ్లండి. (బైరాగితో) గురోజీ! కూనీకేసు పీకలమీదికొచ్చింది. కేసూ, యేబుగ్గీ లేనిదే, ఆరాత్రి నాలుగురాళ్లు తడువుఁకుందావఁని మనం ఆ ముసలాణ్ణి అల్లరి పెట్టా`వాఁ? ఆతరవాత, తాసిల్దారొచ్చి "హాత్ హూత్" అని బెదిరించి పదిరాళ్లు లాగా`డు. తన తాలూకుకంటె పెగిలిందికాదని రావఁప్పంతులుగాడు, యినస్పెక్టరికీ, పోలీసు సూపరెంటుకీ అర్జీలుకొట్టా`డు. నిజంగా కూనీకేసు జరిగి వుండగా, మేవుఁ కామాపు చేశావఁని తాసిల్దారుమీదా, నామీదా యిప్పుడు పితూరీ చేస్తున్నారు. |
| బైరాగి |
మేవుఁండగా మీకేం భయం, భాయి? |
| హెడ్డు |
అందునేగదా, నాపాలిటి దేవుఁళ్లా మీరు దొరికారన్నాను. |
| బైరాగి |
మీశత్రువులకు వాగ్బంధం చేస్తాను. వాళ్లపేర్లు వ్రాసియివ్వండి. యినస్పెక్టరుకి మీమీద యిష్టవఁని చెప్పేవారే? |
| హెడ్డు |
యీపెద్ద వుద్యోగస్థులకి దయలూ దాక్షిణ్యాలూ యేవిఁటి గురూ? వాళ్లకి యంత మేపినా, వాళ్లకి కా`రక్టు వొస్తుందనిగాని, ప్రమోషను వొస్తుందనిగాని, ఆశపుట్టినప్పుడు, తెగనికత్తితో పీకలు తెగగోస్తారు. మా యినస్పెక్టరికి సూపరేంటుపని కావాలని ఆశుంది. తాసీల్దారికీ వాడికి బలవద్విరోధం వుంది. ఆవిరోధం మధ్య నన్ను కొట్టేస్తూంది. |
| బైరాగి |
చూస్తూవుండండి రేపటినుంచి పతకం తిరిగిపోతుంది. |
| హెడ్డు |
మీదయ, గురూ - సౌజన్యారావు పంతులుగారని ఓ గొప్పవకీలుగారున్నారు. ఆయన నాకు చాలాసాయం చేస్తున్నారు. కేసు తేలిపోయేసాధనం ఆయన వొకటి చెప్పారుగాని, అది కుదరక తల్లడిల్లుతున్నాం. |
| బైరాగి |
యెమిటండి, ఆసాధనం? |
| హెడ్డు |
పరారీ అయిపోయిన ఆపిల్లదాన్ని తండ్రి గుంటూరు శాస్తుల్లని ఒకడు వున్నాడు. అతగాడు దొరికితే, కేసు పోతుంది. వాడు యక్కడా కనపడ్డు. |
| బైరాగి |
యిదెంతపని, రాత్రి అంజనంవేసి ఒక్కక్షణంలో కనుక్కుంటాను. |
| హెడ్డు |
అలారక్షించు గురూ. ఆ కుఱ్ఱాడు - అనగా ఆచిన్నది - యిప్పుడు యెక్కడుందో కనుక్కోగలరూ, గురూ? |
| బైరాగి |
అదీ అంజనంలోనే కనపడుతుంది. |
| హెడ్డు |
అది మొగాడయినా, ఆడదయినా కూడా కనపడుతుందా గురూ? |
| బైరాగి |
ఆడది మొగాడెలా అవుతుంది భాయీ? |
| హెడ్డు |
(తనలో) చెబితే యేం ప్ర`మాదవో? (పైకి) యీ చిక్కుల్నించి మతిపోతూంది గురూ. దయచేండి, యింటికెళదాం. |
| బైరాగి |
యీశిష్యులకి కొంచం జ్ఞానోపదేశం చేసి మరీవస్తాను. మీరు ముందు నడవండి. |
| హెడ్డు |
యీకార్యం అయిందాకా మీపాదాలు వొదలను - కార్యవైఁతే తమరు హరిద్వారంలో కట్టిస్తూన్న మఠానికి నూటపదహార్లు దాఖలుచేస్తాను. |
| (అందరూ నిష్క్రమింతురు.) |