| ౭-వ స్థలము. సౌజన్యారావు పంతులుగారియింట్లో కచేరీగది. |
| (సౌజన్యారావు పంతులుగారు, అగ్నిహోత్రావధాన్లు ప్రవేశింతురు.) |
| సౌజన్యా |
ఇక మిమ్ములను జయించినవాడులేడు. పిల్లల్ని అమ్ముకోవడం శిష్టాచారం అంటారండీ? |
| అగ్ని |
అహా. మా మేనత్తల్ని అందరినీ కూడా అమ్మా`రండి. వాళ్లంతా పునిస్త్రీ చావే చచ్చారు. మాతండ్రి మేనత్తల్నికూడా అమ్మడవేఁ జరిగిందష. యిప్పుడు యీ వెధవ యింగీలీషు చదువునుంచి ఆ పకీరువెధవ దాన్ని లేవదీసుకుపోయినాడుగాని, వైధవ్యం అనుభవించినవాళ్లంతా పూర్వకాలంలో యెంతప్రతిష్ఠగా బతికా`రు కారు? |
| సౌజ |
పసిపిల్లల్ని కాలంగడిచినవాళ్లకి పెళ్లిచేస్తే వైధవ్యంరాక తప్పుతుందా? నింపాదిచేసి కొంచం యోచించండీ. |
| అగ్ని |
ప్రాలుబ్ధం చాలకపోతే ప్రతివాళ్లకీ వస్తుందండి - చిన్నవాళ్లకిచ్చినా, పెద్దవాళ్లకిచ్చినా, రాసినరాత యెవడైనా తప్పించగలడా? |
| సౌజ |
మీరు చదువుకున్నవారుగదా, ప్రారబ్ధమని పురుషప్రయత్నం యే వ్యవహారంలో మానేశారు? కేసు, "విధికృతం; యలావుంటే అలా అవుతుందని" వకీల్ని పెట్టడం మానేశారా? కన్యలని అమ్ముకోవడం శాస్త్రదూష్యంకాదా? డబ్బుకిలోభించి పిల్లల్ని ముసలివాళ్లకి కట్టబెట్టి విధికృతం అనడం న్యాయవేఁనా? శలవియ్యండి. |
| అగ్ని |
యిప్పుడు మీ లౌక్యుల్లో వెయ్యేసి, రెండేసివేలు, వరకట్నాలు పుచ్చుకుంచున్నారుకారండీ? గిరీశంగారు చెప్పినట్లు - వాడిపిండం పిల్లులికిపెట్టా! - మీలో ఆడపిల్లలికి యిన్నితులాలు బంగారం పెట్టాలి యిన్నితులాలు వెండిబెట్టాలి అని నిర్నయించుకోవడంలేదా? అదిమాత్రం కాదేం కన్యాశుల్కం? |
| సౌజ |
అలాచెయ్యడం నేను మంచిదన్నానా యేమిటండి? "గిరీశంగారు చెప్పినట్టు" అని అన్నారేవిఁటి? |
| అగ్ని |
ఆ వెధవపేరు నాయదట చెప్పకండి. |
| సౌజ |
కానీండిగాని - మీ రెండోపిల్లకి తగినవరుణ్ణిచూసి పెళ్లిచెయ్యండి. యేం సుఖపడుతుందని ముసలివాళ్లకి యివ్వడం? శలవియ్యండీ. |
| అగ్ని |
అదంతా మీకెందుకయ్యా? ఓహో యిందుకా నన్ను పిలిపించారు? మీగృహకృత్యాల వూసుకి నేవొచ్చానా యేవిఁటి? నాగృహకృత్యాల వూసు మీకెందుకూ? |
| సౌజ |
తొందరపడకండి అవుధాన్లుగారూ. దూరం ఆలోచించండి - మీకడుపున బుట్టిన పిల్లయొక్క సౌఖ్యం ఆలోచించి సలహాచెప్పానుగాని, నా స్వలాభం ఆలోచించి చెప్పలేదుగదా - పెద్దపిల్లకి సంభవించిన అవస్థ మీకళ్లతో చూడనేచూశారు. యికనైనా వృద్ధులకు పిల్లని కట్టబెట్టడపు ప్రయత్నము చాలించండి. |
| అగ్ని |
నా పిల్లభారం అంతా మీదైనట్టు మాట్లాడుతున్నారేమిటి? ఆసంత మీకెందుకూ? |
| సౌజ |
నన్ను తమస్నేహవర్గంలో చేర్చుకోండి - పరాయివాణ్ణిగా భావించకండి - దయచేసి నాసలహావినండి - మర్యాదగలయింట పుట్టిన బుద్ధిమంతుడగు కుఱ్ఱవాణ్ణి చూసి మీ చిన్నపిల్లని పెళ్లిచెయ్యండి. యిక పెద్దపిల్లమాట - ఆమెకు వితంతువుల మఠంలో, సంఘసంస్కారసభవారు విద్యాబుద్ధులు చెప్పించుతారు. మీకడుపున పుట్టినందుకు యెక్కడనయినా ఆమె సుఖంగావుండడంగదా తండ్రైనవారు కోరవలసినది. ఆమె తాలూకు కొంతఆస్తి తమవద్దవున్నది. మా స్నేహితులున్నూ, స్త్రీ పునర్వివాహసభ కార్యాధ్యక్షులున్నూ అయిన రామయ్యపంతులుగారు నాపేరవ్రాసినారు. ఆ ఆస్తి, చిక్కులుపెట్టక, తాము ఆపిల్లకి పంపించి వెయ్యడం మంచిది. |
| అగ్ని |
యేవిఁటీ ముండా యేడుపుసంత! వాడెవడు? వీడెవడు? మీరెవరు? అదెవర్త`? నాపిల్లేవిఁటి, పకీరుముండ! రేపు యింటికి వెళుతూనే ఘటాశ్రాద్ధం పెట్టేస్తాను. |
| సౌజ |
యిప్పటి ఆగ్రహంమీద మీరు అలా శలవిచ్చినా, నిడివిమీద మీకే కనికరం పుడుతుంది. యిప్పట్లోనే మీరు కనికరిస్తే కొంత మీకు నేను ఉపకారం చెయ్యగలను. |
| అగ్ని |
కనికరం గాకేం. కడుపులో యేడుస్తున్నానుకానూ? ఆస్తీగీస్తీ యిమ్మంటేమాత్రం యిచ్చేవాణ్ణికాను. ఆవెధవని పెళ్లిచేసుకోకుండా యిల్లుజేరితే, యింట్లో బెట్టుకుంటాను. అంతే. |
| సౌజ |
అది మరిజరగదు. |
| అగ్ని |
యిది అంతకన్న జరగదు. |
| సౌజ |
ఆమె ఆస్తి మీరు యిచ్చివెయ్యకపోతే దావాపడుతుంది. నిష్కారణం ఖర్చులు తగులుతవి. |
| అగ్ని |
నేను అగ్రహారపుచెయ్యిని - దావాగీవా అని బెదిరించితే భయపడేవాణ్ణి కాను. |
| సౌజ |
నామాటవిని ఆస్తియిచ్చివేసి, గిరీశంగారిమీద గ్రంధంచెయ్యడపు ప్రయత్నము మానుకుంటే, లుబ్ధావధాన్లుగారు మీమీద తెచ్చినకేసు తీయించివేస్తాను - మీ పిల్లమీద దయాదాక్షిణ్యాలు లేకపోతే, స్వలాభవైఁనా ఆలోచించుకోండి. |
| అగ్ని |
వెధవముండని లేవదీసుకుపోయిన పకీరువెధవపక్షం మాట్లాడుతావు; యేవిఁపెద్దమనిషివయ్యా? నేనా కేసు వొదులుకుంఛాను? ఆవెధవగానీ కంటికి కనపడితే, కూనీచేస్తాను. పెద్దప్లీడరు ప్రత్యుద్ధానంచేసి పిలిచాడంటే, కేసుల్లో యేవిఁసలహా చెబుతాడో అని భ్రమపడ్డాను. వెధవముండలకి పెళ్లిచెయ్యడపు పోయీ కాలంపట్టుకుందేవిఁ, పెద్దపెద్దవాళ్లకి కూడాను? |
| సౌజ |
లుబ్ధావధాన్లుగారి తరఫున మీమీద గ్రంధం నేనే నడిపించవలసివుంటుంది. మీకు వృధాగా డబ్బుతట్టుబడీ, సిక్షా, క్షూణతాకూడా సంభవిస్తాయిగదా అని యింతదూరం చెప్పా`ను. మంచికి మీరు మనుషులైనట్టు కనపడదు. గనక నా చాయశక్తులా పనిచేసి మీకు గట్టి సిక్ష అయేటట్టు గ్రంధంనడిపిస్తాను. పిల్లదాని ఆస్తి విషయమయి దావాకూడా నేనే పడేస్తాను. |
| అగ్ని |
నీయింట కోడికాల్చా! |
| సౌజ |
మీరు యేమన్నా, నాకు కోపంలేదు. యింటికివెళ్లి ఆలోచించుకొని, నా సహాయం కావలసివుంటే తిరిగీరండి. |
| అగ్నిహోత్రావధాన్లు |
(నిష్క్రమించుతూ తనలో) వీడికి వెఱ్ఱిగాబోలు! |
| (తెరదించవలెను.) |