| ఆ. |
ఒడలుఁ బెంచులంజ యుబ్బకంబుననైన
వేగ విటునిమీఁద విఱుఁగఁబడును
పందికొక్కుమీద బండికల్ పడ్డట్లు
విశ్వదాభిరామ వినర వేమ. |
101 |
|
| క. |
వెలయాలి వలనఁ గూరిమి
కలుగదు, మఱి కలిగెనేని కడతేరదురా
పలువురు నడిచెడి తెరువున
పులు మొలవదు, మొలిచెనేని పొదలదు వేమా. |
102 |
|
| ఆ. |
తొత్తుతోడి పొందు దోషంబు దోషంబు
లంజతోడిపొందు లజ్జ చెడును
జారతోటిపొందు చావుకుమూలమౌ
విశ్వదాభిరామ వినర వేమ. |
103 |
|
| ఆ. |
బ్రహ్మ మున్నచోటు పరగంగఁ దెలియక
యెందొవెదుక బ్రహ్మ మేల కలుగు
అంజనంబు లేక యా సొమ్ము దొరకదు
విశ్వదాభిరామ వినర వేమ. |
104 |
|
| ఆ. |
వెఱ్ఱిమొద్దు కేల వేదశాస్త్రంబులు
ముద్దులాడి కేల ముసలిమగఁడు
చద్ది మిగులనింట సంసార మేలరా
విశ్వదాభిరామ వినర వేమ. |
105 |
|
| ఆ. |
సాధుచరితయైన సతి సత్ప్రవర్తన
జార యే మెఱుంగు సాధువైన
బ్రహ్మనిష్ఠ నెఱుఁగుఁ బ్రాకృతుఁ డెఱుఁగునా
విశ్వదాభిరామ వినర వేమ. |
106 |
|
| ఆ. |
హీనుఁ డెన్నివిద్య లిల నభ్యసించిన
ఘనుఁడు గాఁడు హీనజనుఁడె కాని
పరిమళమ్ము గర్దభము మోయ ఘనమౌనె
విశ్వదాభిరామ వినర వేమ. |
107 |
|
| ఆ. |
చక్కఁదనము లేల సంపత్కరము లేల
విద్యలేల భూమివిరివి యేల
పుత్రపదవికన్న పుట్టునె పదవులు
విశ్వదాభిరామ వినర వేమ. |
108 |
|
| ఆ. |
భాగ్యవంతురాలు పరులయాఁకలి దప్పి
దెలిసి పెట్టనేర్చుఁ దీర్ప నేర్చు
తర దుష్టురాలు తన యాఁకలినె గాని
పరులయాఁక లెఱుంగ దరయ వేమ. |
109 |
|
| ఆ. |
మనసులోన నున్న మమత లన్నియుఁ గోసి
దృఢముఁ జేసి మనసు తేటఁబఱచి
ఘటము నిల్పువాఁడు ఘనతరయోగిరా
విశ్వదాభిరామ వినర వేమ. |
110 |
|
| ఆ. |
పచ్చవిల్తుచేత గ్రచ్చఱ జను లెల్ల
తచ్చవాడఁ బడిరి ధరణిలోన
కులజుఁ డెవ్వఁ డిందుఁ గులహీనుఁ డెవ్వడు
విశ్వదాభిరామ వినర వేమ. |
111 |
|
| ఆ. |
కాఁగల పను లెల్లగా కెట్లుపోవును
కాని పనులు భువిని కానె కావు
మహిమవేఱె యుండు మనతోడ నున్నదా
విశ్వదాభిరామ వినర వేమ. |
112 |
|
| ఆ. |
శత్రువులను ద్రుంచి శాంతంబు వహియించి
కృత్యములను నడుపు నిత్యు నెఱిగి
సత్యము చెడకుండ సాధించినటువంటి
పురుషుఁ డౌను పుణ్యపరుండు వేమ. |
113 |
|
| ఆ. |
తనదు దేహమందు తనకున్న పరివార
మందఱం బిగించి హర్ష మెసఁగ
నెల్లచావు లెఱిఁగి యిందందు నెఱిఁగియు
నడవ నేర్చుమేటి నరుఁడు వేమ. |
114 |
|
| ఆ. |
మొదట నాకుఁ బెట్టి తుది లేదు పొమ్మను
పరమలోభులైన పాపులకును
వారియుసురు దాకి వగచెడి పోవరా
విశ్వదాభిరామ వినర వేమ. |
115 |
|
| ఆ. |
బడుగు నెఱుఁగ లేని ప్రాభవం బది యేల
ప్రోదియిడని బంధు భూతి యేల
వ్యాధి దెలియలేని వైద్యుఁడు మఱియేల
విశ్వదాభిరామ వినర వేమ. |
116 |
|
| ఆ. |
తుంటవింటివాని తూపుల ఘాతకు
మింటి మంట నడుమ మిడుకఁ దరమె
యింటియాలి విడిచి యెట్లుండవచ్చురా
విశ్వదాభిరామ వినర వేమ. |
117 |
|
| ఆ. |
పాముకన్న లేదు పాపిష్టిజీవము
అట్టిపాము చెప్పినట్టు వినును
ఇలను మూర్ఖుఁ దెలుప నెవ్వరి వశమౌ
విశ్వదాభిరామ వినర వేమ. |
118 |
|
| ఆ. |
ఎవ్వ రెఱుఁగకుండ నెప్పుడు పోవునో
పోవు జీవ మకట బొంది విడిచి
అంతమాత్రమునకు నపకీర్తి నెఱుఁగక
విరుగఁబడును నరుఁడు వెఱ్ఱి వేమ. |
119 |
|
| ఆ. |
తనువు విడిచి తాను తరలిపోయెడివేళ
తనదు భార్య సుతులు దగినవార
లొక్కరైన నేగ రుసురు మాత్రమె కాని
తనదుమంచి తోడు తనకు వేమ. |
120 |
|
| ఆ. |
పూర్వ వాసనగల పుణ్యాత్ము లెప్పుడు
నూటచెలమరీతి నూరునెప్పు
డెందఱికి నొసంగ నెప్పటి యట్లుండు
విశ్వదాభిరామ వినర వేమ. |
121 |
|
| ఆ. |
ఆడితప్పువార లభిమానహీనులు
గో డెఱుఁగనివారు కొద్దివారు
కూడి కీడు సేయఁగ్రూరుండు తలపోయ
విశ్వదాభిరామ వినర వేమ. |
122 |
|
| ఆ. |
వానరాకడ మఱి ప్రాణంబు పోకడ
కానఁబడదు ఘనుని కైనఁగాని
కానఁబడిన మీఁద కలి యిట్లునడుచునా
విశ్వదాభిరామ వినర వేమ. |
123 |
|
| ఆ. |
తగినకులజుఁడైన తలయెత్తు ధనమైన
భాగ్యపురుషునేల పట్టనెంచు
పరమసాధ్వి చూడ పరులనంటదు సుమీ
విశ్వదాభిరామ వినర వేమ. |
124 |
|
| ఆ. |
పరులదత్త మిట్లు పాలనఁ జేసిన
నిల స్వదత్తమునకు నినుమడియగు
నవని పరులదత్త మపహరించిన స్వద
త్తంబు నిష్ఫలంబు ధరణి వేమ. |
125 |
|