| ఆ. |
కలియుగముననున్న కాపు కులానకు
వేమన దనకీర్తి విక్రయించె
నున్న ధర్మమెల్లనుర్విలో నరులకు
కోరుఁ బెట్టె పరముఁ గోరి వేమ. |
1 |
|
| ఆ. |
చెవిని నిలుగట్టి చెప్పెను వేమన
బట్టబయలనుండు బ్రహ్మమనుచు
బుద్ధిఁ గలిగి యందుఁ బొంది సుఖించుఁడీ
విశ్వదాభిరామ వినర వేమ. |
2 |
|
| ఆ. |
పొంకములకు మనసుఁ బోనీక సర్వేశు
వంక నిలుపువాఁడు వంశపరుఁడు
వంక నిల్పకున్న వచ్చునా పదవులు
విశ్వదాభిరామ వినర వేమ. |
3 |
|
| ఆ. |
ఉండియుండు జ్ఞాని యుగములు చనినను
బ్రాణహాని లేదు ప్రళయమునను
బ్రాణహానియైనఁ బరమాత్ము గలియునో
విశ్వదాభిరామ వినర వేమ. |
4 |
|
| ఆ. |
గురువు తానయైన హరిని తాఁ జూచును
బ్రహ్మలోక మతఁడు పాఱఁజూచు
శిష్యు నరసిపట్టి చీఁకటిఁ బాపురా
విశ్వదాభిరామ వినర వేమ. |
5 |
|
| క. |
ధనమే మూలము జగతికి
ధనమే మూలంబు సకలధర్మంబులకు\న్
గొనమే మూలము సిరులకు
మనమే మూలంబు ముక్తి మహిమకు వేమా. |
6 |
|
| ఆ. |
కడగిఁ గాలిలేని గగనంబుభంగిని
బలుతరఁగలు లేని జలధిమాడ్కి
నిర్వికారమునను నిశ్చలత్వమునఁ దా
నుండెనేని ముక్తి యొనరు వేమ. |
7 |
|
| ఆ. |
నీళ్ళఁబోసి కడిగి నిత్యంబు శోధించి
కూఁడుబెట్టి మీఁద కోకగట్టి
యేమి పాట్లఁబడుదు రీ దేహమున కిల
విశ్వదాభిరామ వినర వేమ. |
8 |
|
| ఆ. |
గద్దె గణము నిద్ర కలలు కోరికలును
ముద మొసంగ శకునములకుఁ జెలఁగు
ప్రశ్నలు పదివేలు పరికించి చూడంగ
నవును కాకపోవునగును వేమా. |
9 |
|
| ఆ. |
లేఁడు లేఁడనినను లేఁడు లేనేలేఁడు
కాఁడు కాఁడటన్న కానెకాఁడు
తోడు తోడనినను తోడనే తోడౌను
విశ్వదాభిరామ వినర వేమ. |
10 |
|
| ఆ. |
శివునిమీఁద మనసు స్థిరముగా నుంచిన
నౌను మోక్ష మరయ నైనదౌను
శివునిమీఁద మనసు చీమంత తప్పిన
కాదుకాదు ముక్తి గాదు వేమా. |
11 |
|
| ఆ. |
తల్లి కెదురుకొనుట తండ్రి కెదురుకొనుట
యన్న కెదురుకొనుట యనఁగ మూఁడు
పాతకముల నెఱిఁగి వర్తింపఁగావలె
విశ్వదాభిరామ వినర వేమ. |
12 |
|
| ఆ. |
లోభమోహములును ప్రాభవములుదప్పు
దలఁచిన పనులెల్లఁ దప్పిచనును
తా మొకటి దలంప దైవమొక్కటిఁదల్చు
విశ్వదాభిరామ వినర వేమ. |
13 |
|
| ఆ. |
వరలు రత్నసమితివలెఁ గూర్చుధాన్యంబుఁ
జక్కదంచి వండి మిక్కుటముగ
సుష్టుభోజనములఁ జూరగా నిడువాఁడు
చెప్పనేల వాఁడు శివుఁడు వేమ. |
14 |
|
| ఆ. |
ఒకటిక్రింద నొక్క డొనర లబ్ధముఁ బెట్టి
వలనుగ గుణియింప వరుసఁ బెరుఁగు
నట్టిరీతి నుండు నౌదార్యఫలములు
విశ్వదాభిరామ వినర వేమ. |
15 |
|
| ఆ. |
అన్న మడుగనతని కన్నంబుఁ బెట్టిన
బాఱవేయుదాన ఫలిత మేమి
ధనికునకు నొసంగు దానంబు నటువలె
విశ్వదాభిరామ వినర వేమ. |
16 |
|
| ఆ. |
ఇరుగుపొరుగువారి కెనయుసంపదఁ జూచి
తనకులే దటన్న ధర్మమేమి
ధర్మమన్నఁ దొల్లి తన్నుక చచ్చిరి
విశ్వదాభిరామ వినర వేమ. |
17 |
|
| ఆ. |
ఆఁకలన్నవాని కన్నంబు పెట్టిన
హరున కర్పితముగ నారగించు
ధరవిహీనునకును దానము నటువలె
విశ్వదాభిరామ వినర వేమ. |
18 |
|
| ఆ. |
కలిగి పెట్టలేని కర్మజీవులకెల్ల
తిరిపెమును దొరకదు దీనులార
తెలియఁ జూచుకొనుఁడు దృష్టాంత మిదిమీకు
విశ్వదాభిరామ వినర వేమ. |
19 |
|
| ఆ. |
తిరిపెగాఁ డయినను దిరిపెమెత్తిన యట్టి
తిరిపెమందుఁ దాను దిరిపె మిడినఁ
దిరిపెము తిరిపమున దిగఁబడిపోవురా
విశ్వదాభిరామ వినర వేమ. |
20 |
|
| ఆ. |
తాము బలిమిఁబెట్ట తమకు తామే కల్గు
నడుగనిడినఁ దాము నడుగఁగలుగు
విందునీనివాని కెందునులేదయా
విశ్వదాభిరామ వినర వేమ. |
21 |
|
| ఆ. |
తాము గడనసేయు ధనము తమదియని
నమ్మియుండ్రు వెఱ్ఱి నరులు భువిని
తాము నొకరి కిచ్చుధన మింతియేకాక
కడమది తనకేల గలుగు వేమ. |
22 |
|
| ఆ. |
తాను దినక యటుల ధర్మము సేయక
కొడుకుల కనిధనము కూడఁబెట్టి
తెలియఁజెప్పలేక తీఱిపోయినవెన్క
సొమ్ము పరులనందుఁ జూడు వేమ. |
23 |
|
| ఆ. |
రానిధనమునకును దానును కొడుకును
వాంఛఁబడుటె కాని వట్టి భ్రమలు
భాగ్యహీనునకును ఫలము లభించునా
విశ్వదాభిరామ వినర వేమ. |
24 |
|
| ఆ. |
భాగ్యహీనులకును వరుసవేది దొరుక
నదియు నిల్వదపుడు వదలుఁగాక
వానతోడ వచ్చువడగండ్లు నిలుచునా
విశ్వదాభిరామ వినర వేమ. |
25 |
|