బాల సాహిత్యము బాలభాష - శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి కూనలమ్మ పదాలు

కూనలమ్మ పదాలు

('కూనరాగాలు తీస్తునా' డని మధ్యాంధ్రదేశమందున్నూ, 'కూనలమ్మ సంగీతాలు తీస్తున్నా' డని దత్తమండల మందున్నూ వాడుకలో నానుడి పలుకు ఉన్నది. అది ఈక్రింది పదాలనుబట్టి పుట్టినది. ఇట్టి పదము లెన్ని ఉన్నవో తెలియదు. అరవములో అవ్వయార్‌ పదా లెంత విలువగలవో తెలుగులో కూనలమ్మపదాలు కూడా అంత విలువ గలవే అనవచ్చును.)


జప తపంబులకన్న,
చదువు సాములకన్న,
ఉపకారమే మిన్న,
        ఓ కూనలమ్మా!

అన్న మిచ్చినవాని,
నాలి నిచ్చినవాని,
నపహసించుట హాని,
        ఓ కూనలమ్మా!

మగనిమాటకు మాటి,
కెదురు పల్కెడు బోటి,
మృత్యుదేవత సాటి,
        ఓ కూనలమ్మా!

కాపువాడే రెడ్డి,
గరికపోచే గడ్డి,
కానకుంటే గుడ్డి,
        ఓ కూనలమ్మా!

కవితారసపుజల్లు,
ఖడ్గాల గలుగల్లు,
కరణాలకే చెల్లు,
        ఓ కూనలమ్మా!

దుర్యోధనుడు భోగి,
ధర్మరాజొక జోగి,
అర్జునుండే యోగి,
        ఓ కూనలమ్మా!

భీష్ము డనుభవశాలి,
భీముడే బలశాలి,
కర్ణుడే గుణశాలి,
        ఓ కూనలమ్మా!

ఆడితప్పినవాని,
నాలినేలనివాని,
నాదరించుట హాని,
        ఓ కూనలమ్మా!
AndhraBharati AMdhra bhArati - kUnalamma padAlu - bAlabhASha - vETUri prabhAkara SAstri - Veturi Prabhakara Sastry - bAla sAhityamu bAlala gEyAlu lAli pATa jOla pATalu ( telugu andhra andhrabharati )