వచన వ్యాసములు కూచిమంచి జగ్గకవి - పరిచయము

కూచిమంచి జగ్గకవి ((క్రీ॥ శ॥ 1700-1765)

- వేదము వేంకటకృష్ణశర్మ
(శతకవాఙ్మయసర్వస్వము, 1954)

ఈ మహాకవి కూచిమంచి తిమ్మకవి రెండవ తమ్ముఁడు. ఇతఁడు గాక, సింగన యను మొదటి తమ్ముఁడు, సూరన యను మూఁడన తమ్ముఁడుకూడ నతనికుండిన ట్లతని కృతులవలన స్పష్టమగుచున్నది. తక్కిన యిద్దఱి విషయమేమోకాని, యీ జగ్గనమాత్ర మన్నగారివలె సాహిత్య కవిత్వ ప్రచారములలో నిస్సముఁడుగాఁ గనిపించుచున్నాఁడు. తిమ్మకవిసార్వభౌముఁడే తన “సింహశైలమాహాత్మ్యము”లో తన తమ్ములనుగూర్చి చెప్పుచు, జగ్గకవి నీ క్రిందివిధముగా వర్ణించినాఁడు-

“అతని యనుజన్ముఁ డకులితమతియుతుఁడు రాజమాన్యుఁడు సుగుణా-
న్వితుఁడు సమంచితకవితాచతురుఁడు జగ్గప్రధానిచంద్రుఁడు దనరున్”
“... రాజన్యసభాఝాట నిరాఘాట నటచ్చాటుకవిత్వాంకుఁ డరయ జగ్గన ధరణిన్”
“ నిరతంబు నుడివోని సిరి నిరవొందియుఁ దవుటి నిప్పటి మెక్కఁ దలఁపఁడేని
సదమలాచారప్రశస్తి గాంచియు వర్ణములు సంకరములుగాఁ గలపఁడేని
ఖలజనసంశిక్ష గావింపుచుండియుఁ బతితుల నెప్డుఁ జేపట్టఁడేని
యురుపుణ్యవర్తియయ్యును బాడబాశ్రయసీమ నిల్లుగను వసింపఁడేని
యల జగన్నాయకుఁడు సాటియనఁగఁబోలు భోగమున నిర్మలాచారమున విశిష్ట-
రక్షణంబునఁ బుణ్యమార్గమున నరయ గంగనామాత్యు జగ్గయ్యఘనునితోడ"

దీనిని బట్టి (తిమ్మన, సింగన, జగ్గన, సూరనలలో) క్రీ.శ. 1690 ప్రాంతమున జన్మించినట్లు నిర్ణయింపఁబడిన తిమ్మనకు రెండవ తమ్ముఁడయిన జగ్గన యయిదాఱేండ్లయినను జిన్నవాఁడుగా నుండియుండును. అనఁగా జగ్గన క్రీ.శ. 1700 ప్రాంతములోఁ బుట్టియుండెననుట సహేతుకము.

ఇతఁడు దేశదేశములు సంచారము చేసి నానారాజాస్థానములలో “నిరాఘాటనటచ్చాటుకవిత్వము”ను బ్రదర్శించుచు వచ్చినాఁడని తిమ్మకవి పేర్కొనుటచేతఁ బ్రత్యర్థులైన విద్వత్కవులను వాదములలో గెలుచునంతటి ప్రతిభను జిన్నతనముననే గడించినాఁడని తెలియుచున్నది.

ఇతఁడు తన కృతులనుగూర్చి యిట్లు చెప్పుకొనినాఁడు-

“రచియించితివి మున్ను రసికులౌననునట్లు సురుచిర జానకీపరిణయంబు
వచియించితిని కవివ్రాతము ల్వొగడంగ ద్విపదరాధాకృష్ణ దివ్యచరిత
ముచ్చరించితిని విద్వచ్చయంబు నుతింపఁ జాటుప్రబంధముల్ శతకములును
వర్ణించితిని యిరువదిరెండు వర్ణనల్ రాణించగా సుభద్రావివాహ
మాంధ్రలక్షణలక్ష్యంబు లరసినావు భూరిరాజన్య సంపత్ప్రపూజితుఁడవు”
- (చంద్రరేఖావిలాపము)

జానకీపరిణయమును, ద్విపదరాధాకృష్ణ చరిత్రము, సుభద్రా వివాహము, కొన్ని శతకములు, చాటుప్రబంధములు, చంద్రరేఖావిలాపము ఇతఁడు రచించినాఁడని పై పద్యమువలనఁ దెలియుచున్నది. “సోమదేవరాజీయము” బహుశా “చంద్రరేఖావిలాపము”నకుఁ దరువాతి కృతియై యుండును. కనుకనే పై (చంద్ర రేఖావిలాప) పద్యములో దాని ప్రశంస లేదు. అయిన, నేయే గ్రంథము లెప్పుడెప్పుడు రచించినాఁడను విషయమును బై పద్యమందలి వరుసక్రమమును బట్టి యాంధ్రకవుల చరిత్రలో నిర్ణయింపఁబడినది. కాని యది నిర్బాధకమనుటకు వీలు లేదు. తిమ్మకవివలె నితఁడు తన కృతులలో రచనాకాలమును సూచింపనందున వరుసక్రమముగా, ఫలాని కృతి ఫలాని కాలములో రచింపబడినదని కాని, ఫలాని కృతికిఁ దరువాత వ్రాయఁబడినదని కాని నిశ్చయముగాఁ జెప్పలేము. తిమ్మకవిలాగున నితఁడుకూడఁ గొన్ని ‘శతకములను’ అనియే చెప్పుకొన్నాఁడు; కాని, ఫలాని శతకములని చెప్పనందున ‘భక్తమందార’ శతకమే కాకుండ మఱికొన్ని శతకములుకూడ రచించినాఁడని తెలియుచున్నది. అట్టివి యింకను బయలుపడకపోవుట మన దురదృష్టము.

ఇతని కవిత్వ మద్భుతమైన ధారాశుద్ధి కలిగి శబ్దాలంకారములతో గంగాస్రవంతివలె ధారాళముగా సాగిపోవుచుండును. ఆ సంగతిని జగ్గకవియే స్వయముగాఁ జాటుకొనినాడు-

“వింతల్గాఁ గడు మీకు సత్కృతులు గావింతున్, దుషారాద్రిజకాంతా-
కాంత జటాంతరాళ విలుఠద్గంగాతరంగచ్ఛటోత్క్రాంతాత్యంత ఝ-
ళంఝళం నినద రంగద్ధాటి మీఱంగ”
- (భక్తమందార)

ఇతని కవితామహత్వమునుగూర్చి కవిసార్వభౌముఁడైన యితని యన్న తిమ్మకవికూడ-

“రాజన్య సభాఝాట నిరాఘాట నటచ్చాటుకవిత్వాంక”

మని మెచ్చుకొన్నాడు.

‘అల్లిక జిగిబిగి’ యల్లసానివారిదని యాంధ్రలోకములోఁ బ్రతీతి. ఆ రెంటిని (జిగిబిగులను) క్రమముగా నీ కవిసోదరు లిరువురు పంచుకొనినట్లు కనిపించుచున్నది. ‘జిగి’ తిమ్మకవిదైన, ‘బిగి’ జగ్గకవిదని చెప్పఁదగును. ఉపాలంభ, నిరసన, దూషణములలో జగ్గకవి యావేశమున కడ్డమాఁకలు లేవు. ఆయా సందర్భములలోఁ దీవ్రపదజాలముల దూఁకుడు, పద్యపాదముల ప్రాఁకుడు శ్రోతల (పఠితల) హృదయతంత్రులకు తాఁకుడై స్పందింపఁ జేయును. ఈపట్ల నితఁడు తన యన్నకంటె నొకయా కెక్కువగఁ దిరుగవేసిన యుద్ధతుఁడు. తిట్టుకవితలో వేములవాడ భీమకవి తరువాతఁ బేర్కొనఁదగినవాఁడు జగ్గకవి. దమ్మనను దిట్టఁదలఁచుకొనిన పిండిప్రోలు లక్ష్మణకవి తన కావ్యమునకు ద్వ్యర్థి ‘బురఖా’ వేసినాఁడు. ఆ ప్రకారము చేయుటవలన సూటిగాఁ దానుద్దేశించిన వ్యక్తికిఁ జుఱికు కొరడా దెబ్బలు తగులుట కవకాశము లేదు. అది యొక విధముగా నన్యాపదేశ కావ్యమగును. “గుమ్మడికాయలదొంగ” వాటముగా నర్థము చేసికొనవలసిన పద్ధతి యేర్పడును. భీమకవిగాని, జగ్గకవిగాని చెప్పు తిట్టుకవితలో నీ చిక్కుండదు. దూషణకుఁ బాత్రుఁడైన వ్యక్తిని మన యెట్టయెదుటనే చూడఁగలము.

జగ్గకవి వ్రాసిన చంద్రరేఖావిలాప మీ తెగకుఁ జేరిన దూషణకావ్యము. ప్రాచ్యలిఖిత పుస్తకభాండాగారములోని ప్రతిని చాలవఱకు సంస్కరించి, కీ.శే. శ్రీ కాళ్లకూరి గోపాలరావుగారు ప్రచురించిన గ్రంథములోఁ గవిహృదయము గుర్తించుటకుఁగూడ వీలుకానంతగ మార్పులు, చేర్పులు కనఁబడుచున్నవి. ఇట్టి కావ్యములుకూడ సారస్వతములో నొకభాగమని గుర్తించిననేతప్ప, అసలు కవుల కాలదేశవర్తనలు మనకు దొరకుటకుఁ గాని, మన వాఙ్మయము పూర్తిగా నాకళించుకొనుటకుఁగాని, భాషాచరిత్రకారుల సమగ్రపరిశోధనకుఁగాని యవకాశముండదు.

చంద్రరేఖావిలాప కావ్యోదయమునకు నాంధ్రకవుల చరిత్రలో నీ క్రింది విధముగాఁ గారణము చెప్పఁబడినది :

“జగ్గకవి ధనసంపాదనము నిమిత్తమయి విజయనగరమునకు బోయి, రాజుగారి బావయయిన నీలాద్రిరాజు నాశ్రయింపఁగా నతఁడు తానుంచుకొన్న వేశ్యను నాయికఁగాఁ జేసి, తనమీఁదఁ బ్రబంధము సేయుమనెనఁట! ధనాశచేత నట్టి ప్రబంధరచన కొప్పుకొని కవి చంద్రరేఖావిలాసమును జేసెనఁట! అటుతరువాతఁ దాను సంస్కృతకావ్యమును రచియించి యిచ్చెదనని చెప్పి రాజు మతి మరలించిన యాడిమళ్ల వేంకటశాస్త్రి ప్రోత్సాహముచేత, నీలాద్రిరాజు జగ్గకవికి బహుమానము చేసి సత్కరింపక తిరస్కారమును జూపెనఁట! అందుపైని ముంగోపియైన యీ ధూర్తకవి “చంద్రరేఖావిలాసము’ను జింపివేసి, “చంద్రరేఖావిలాప”మను పేర నిప్పటి బూతుగ్రంథమును జేసెనఁట! ఇందు నిజమెంతయో!”

ఇతఁడు (జగ్గకవి) వ్రాసిన ‘భక్తమందారశతకము’ సాంఘిక శతకములలోఁ ‘గాళహస్తీశ్వర’, ‘భర్గశతకము’లతో దీటయినది. వానికంటెఁగూడ నొకరవ మించినదేమో! ఇతఁడు తన శతకములో-

“సరసప్రస్తుత కూచిమంచికులభాస్వద్వార్ధిరాకాసుధా-
కరునిన్, గంగనమంత్రి నందనుని, రంగత్తిమ్మభూమండలే-
శ్వరవర్యార్పిత ‘బేబదల్’ బిరుద విస్ఫాయజ్జగన్నాథనా-
మరసజ్ఞుండను, బ్రోవు మెప్పుడును, రామా, భక్తమందారమా”

అని వ్రాసికొనుటవలన నితనికి భూమండలేశ్వరునిచే ‘బేబదల్’ బిరుద మియ్యఁబడినట్లు తెలియుచున్నది.

క్రీ.శ. 1700 ప్రాంతములోఁ బుట్టిన జగ్గకవినిగూర్చి, యాంధ్రకవుల చరిత్ర మీ విధముగాఁ జెప్పుచున్నది-

“ఈ జగ్గకవి యిరువదిసంవత్సరముల ప్రాయము వచ్చువఱకును చదువెఱఁగక, యల్లరిమూఁకతోఁ దిరుగుచు, కాలము గడపెననియు, అప్పుడు వివాహమై యత్తవారింటికి, మనుగుడుపునకు పోయి, మామగారు తనకుఁ బరమశుంఠయైన యల్లుఁడు దొరికినందున కనుతాపపడఁగా రోషముచేత దేశాంతరమునకు లేచిపోయి పండ్రెండు సంవత్సరములు విద్యాభ్యాసము చేసి పండితుఁడై కవిత్వము చెప్పనారంభించెననియు, పుక్కిటిపురాణ మొకటి కలదు. ... ఈ కథనుబట్టి యీ కవి కవిత్వము చెప్పనారంభించునాఁటికి ముప్పదిమూఁడు సంవత్సరముల ప్రాయమై యుండవలయును.”

చంద్రరేఖావిలాపములో (నీ) కవిజీవితమును వ్రాసిన శ్రీ కొండ కోటయ్యపంతులుగారుకూడ, పై కథ నుటంకించుచు-

“జగ్గకవి (మామగారింట జరిగిన) యవమానంబు కతంబుగా దేశాంతరగతుండై మంగళగిరి కరిగి, వేంకటాచార్యులను సుప్రసిద్ధపండితుల నాశ్రయించి, విద్యాభ్యాసముఁ గావించి, పదిపండ్రెండేండ్లలో విద్వాంసుఁడై, అనర్గళముగా కవిత్వము చెప్పునంతటి వాఁడయ్యెను. ఈ గురుకులవాసమున నితనికి వైదుష్యముమాత్రమేకాక, వైష్ణవము గూడ సిద్ధించెను.”

అని చెప్పినారు. పై కథలోని సత్యాసత్యములను వివరించుట యవసరము.

విద్వద్వంశమయిన కూచిమంచివారి కుటుంబములో తిమ్మకవిసార్వభౌమునివంటివాని కనుజుండై న జగ్గన ఇరువదియేండ్లవఱకు “ఓనామాలు” కూడ రాని నిరక్షురకుక్షిగా నుండెననుట నమ్మరాని విషయము. కేవలము శ్రుతపాండిత్యమైన నంతోయింతో యలవడి యుండక తప్పదు. పైఁగా నట్టివానికి, తెలిసి తెలిసి (పెద్దాపురము సంస్థానములో ప్రఖ్యాతి పొందిన) మామగారు తన కూఁతునిచ్చి పెండ్లి చేసినాఁడనుటయును, తానయి యేరికోరి తెచ్చుకొనిన యల్లుని, శుంఠలక్రింద జమకట్టి దూషించినాఁడనుటయును, నవ్యక్తమే యగును.

అట్లిరువదియేండ్లకు వివాహము చేసికొనిన జగ్గన మామగారి దూషణభాషణములకు రోషము పొందినవాఁడయిన, భార్యతోఁగూడ నా మఱుక్షణమే స్వస్థలమునకుఁ బ్రయాణము కట్టవలయునుగాని, క్రొత్తగాఁ బెండ్లాడిన యిల్లాలిని వదలిపెట్టి, చదువుకొనవలయునను బుద్ధి పుట్టి యెవ్వరితోఁ జెప్పకుండ వెడలి యెక్కడనో మంగళగిరిలోని యాచార్యుల నాశ్రయించి, పండ్రెండేండ్లు అజ్ఞాతవాసము చేయుచు విద్య నేర్చుకొనినాఁడనుట సర్వధా యసంబద్ధముగా కనఁబడుచున్నది.

మఱియొక చిత్రమేమన- జగ్గన పెండ్లినాఁటి కిరువదియేండ్లవాఁడయిన, నతని వధువున కే పదియేండ్లయిన నుండును. అతఁడు విద్యాభ్యాసానంతరము వచ్చునప్పటి కతనికి ముప్పదిరెండేండ్లు సహజమే కావచ్చునేమో, కాని యతని గృహిణి యిరువదిరెండేండ్ల యువతి కదా! శారదాబిల్లు పుట్టని యా కాలములో నాఁడుబిడ్డల నడ్డుతీరుటయే తడవుగ నత్తవారింటికిఁ బంపఁజూచు తలిదండ్రులు, అన్ని సంవత్సరము లల్లుఁ డెక్కడ నున్నాఁడను నన్వేషణ మాని యూరక యుండియుందురనుట యసంభవము.

ఏ విధముగఁ జూచినను బరిణయమునాఁటికే జగ్గకవి గొప్ప విద్వత్కవియై నానారాజాస్థానములలోఁ దన పాండిత్యప్రకర్షను బ్రదర్శించుచు వచ్చెనని, యా కారణము చేతనే యతని యన్నయగు తిమ్మకవి, తన ముప్పదవయేట రచించిన “సింహశైలమహాత్మ్యము”లో నతనిని గూర్చి :

“భోటకలాటకిరాటవరాటమరాంటాంగవంగ రాజన్య సభా-
ఝాట నిరాఘాట నటచ్చాటుకవిత్వాంకుఁ డరయ జగ్గన ధరణి”

అని వర్ణించినాఁడు. తిమ్మనకే యప్పటికి ముప్పదేండ్ల వయస్సున్నప్పు డతని రెండవ తమ్ముఁడైన జగ్గన్న యతనికంటె నయిదాఱేం డ్లయినను జిన్నవాఁడయి యుండును. ఈ కారణములనుబట్టి వివాహమాడునాఁటికి జగ్నన్నకు 20-25 సంవత్సరముల మధ్యవయస్సనియు, పెండ్లికిఁ దరువాత నతఁడు విద్యార్జన చేసినాఁడనుట సత్యదూరమనియుఁ దేలుచున్నది.

ఇతఁడు మంగళగిరి నివాసియైన వేంకటాచార్యుల నాశ్రయించి, వైదుష్యమును, వైష్ణవమును గడించినాఁడనుటకూడ సంశయాస్పదముగా దోఁచుచున్నది. జగ్గన తన గ్రంథములలో నెక్కడగాని “వేంకటాచార్యుల”ను తన గురువని (తిమ్మకవి తన కృతులలో దెందులూరి లింగనను గురువని పేర్కొన్నట్లు) పేర్కొనలేదు.

తిమ్మన తన కృతులను గుక్కుటేశ్వరునికే యంకితము చేసినను, నతఁడు వీరశైవుఁడని యనిపించుకొననట్లే, జగ్గన తన గ్రంథములను కొన్నింటిని విష్ణువునకే (జగన్నాథునకు) యంకితము చేసినను వీరవైష్ణవుఁ డనిపించుకొనలేదు. తిమ్మకవిగాని, జగ్గకవిగాని శివకేశవ భేదములేని శుద్ధాద్వైతులే. కావున వేంకటాచార్యులవలన వైష్ణవమును జగ్గన యవలంబించినాఁడనుటకూడఁ బొరపాటు.

ఇక నితనికి (జగ్గనకు) తిమ్మభూమండలేంద్రదత్త “బేబదల్” బిరుదమునుగూర్చి యించుక పరిశీలింతము. తిమ్మకవిసార్వభౌముఁడు పీఠికాపురాధీశుల గౌరవమునకుఁ బాత్రుఁడై కందరాడలోఁ గాలక్షేపము చేయు దినములలో ధనమును, యశస్సు నార్జించు నిమిత్త మాయా సంస్థానములకు సంచారము చేయుచు, రాజసభలలో నిరాఘాటముగాఁ దన కవితాప్రాభవమును జగ్గకవి చూపుచుండువాఁడు. ఆ సందర్భమున నప్పుడప్పుడు స్వస్థలమైన కందరాడకును, శ్వశురుగృహమయిన పెద్దాపురమునకును రాకపోకలు జరుపువాఁడు. అప్పటిలో జగ్గనకు పెద్దాపురాస్థానకవులతో (తన మామగారి ప్రాపకమువలన) పరిచయము కలిగినది. అట్టి కవులలో ముఖ్యుఁడయిన యేనుఁగు లక్ష్మణకవి యదివఱకే కూచిమంచివారి విద్వత్కవితాప్రజ్ఞలు చక్కగా నాకళించినవాఁడైనందున మన జగ్గనకు రాజాస్థానప్రవేశమునకు సహకరించుటయును, నా రాజసన్నిహితులందఱు జగ్గకవిని సన్మానించుటయును జరిగియుండుననుట సమంజసము.

ఆ కాలములోఁ బెద్దాపురమును బాలించుచుండిన “తిమ్మజగపతి” మహారాజే మన జగ్గకవికిఁ “బేబదల్” బిరుదము నిచ్చినట్లు తెలియుచున్నది. ఆ ప్రభువు క్రీ.శ. 1759 సం॥న సింహాసన మధిష్ఠించినాఁడు. అప్పటి కతని ప్రాయ మెనిమిదియేండ్లే. అందుచేత రాజ్యతంత్రమును విశ్వాసపాత్రులయిన మంత్రిసేనానాయకులే నడుపుచుండినట్లు పెద్దాపుర సంస్థాన చరిత్రము చెప్పుచున్నది. జగ్గన కీ తిమ్మభూమండలేశ్వరుఁడే బిరుదమిచ్చినవాఁడు (అనఁగా నా ప్రభుని యాజ్ఞ ననుసరించి నడచుకొనుచు వచ్చిన యధికారులు). ఈ తిమ్మజగపతి వయస్సులో పసివాఁడయినను, చిన్నప్పటినుండి విద్యాపరిశ్రమ చేసి విద్వత్కవితాసామర్థ్యముల నలవఱచుకొనినట్లు చరిత్రాధారములు విశేషముగా కనిపించుచున్నవి. క్రీ.శ. 1700 ప్రాంతమున జన్మించిన జగ్గకవి యీ బిరుదమును పొందునాటికి 55, 60 సంవత్సరాల మధ్యవయస్సునకు దరిదాఁపుగా నుండవలెను. ఈ యూహనే యాంధ్రకవుల చరిత్రములో- “జగ్గకవియు నించుమించుగా నన్న (తిమ్మకవి) జీవించినంత కాలము జీవించినట్లు కనఁబడుచున్నది. అందుచేత నితఁడు 1700వ సంవత్సర ప్రాంతము మొదలుకొని, 1760వ సంవత్సర ప్రాంతము వఱకు జీవించి యుండినవాఁడని చెప్పవచ్చును.” అని శ్రీ కం॥ వీ॥ పంతులుగారు బలపఱచున్నారు. అనఁగా జగ్గన ‘బేబదల్’ బిరుదమును పొందిన తరువాత కూడ కొన్నియేండ్లు, తుద కైదాఱేండ్లయినను జీవించియుండవలయును. పంతులుగారి “ప్రాంత”మను పదము దీనిని దృఢపఱచుచున్నది. ఈ బిరుదధారణము తరువాతనే ‘భక్తమందారశతక’ రచనము, అందలి కడపటి పద్యములో నీ బిరుదప్రసక్తి కనఁబడుచుండుటచేత జగ్గన 1760 సం॥న బిరుదము పొందినపిదప 1765 వఱకు సజీవుఁడై యుండుట నిస్సందేహము.

‘చంద్రరేఖావిలాపము’లో నీ జగ్గనకవి జీవితమును వ్రాసిన శ్రీ కొండ కోటయ్యపంతులు బి. ఏ. గారు (జగ్గ) కవి సుగుణసంపన్నత కుపబలకముగా నీ క్రిందికథను వివరించియున్నారు.

“(జగ్గకవికి) అగ్రజుఁడగు తిమ్మకవిసార్వభౌముఁడు ముప్పదియేండ్ల వయస్సుననే భార్యావియోగము నంది సంసారసౌఖ్యపరాఙ్ముఖుఁడయి, దాయభాగేచ్ఛ వదలుకొని, గ్రంథకాలక్షేపము చేయుచు, తమ్ములచేఁ బోషింపఁబడుచుండెను. ఒకనాఁడు తన పెదతమ్ముఁడగు సింగకవి భార్య “పెండ్లాము లేనివారి కనుదినము సేవసేయుట మిక్కిలి కష్ట”మని విసిగికొన, తిమ్మకవి కోపగించి, పీఠికాపురమునకు దారి పట్టెను. అప్పుడు జగ్గకవి భార్యాసమేతుఁడై, వెడలి కవిసార్వభౌముని తోడి తెచ్చి మిక్కిలి భక్తితాత్పర్యములతో తన బిడ్డలకంటె నెక్కువగా యావజ్జీవము పోషించెను. జగ్గకవి పెద్దవాఁడైన వెనుక విద్యాభ్యాసము చేయుటచే, మంచి లేకరి కాకపోయెను. ఇతని గ్రంథములను దిమ్మకవియే వ్రాయుచుండెడివాఁడు.”

పై కథ కేవలము పుక్కిటిపురాణముగాఁ గనఁబడుచున్నది. పై కథలోఁ జెప్పినట్లు తిమ్మకవి భార్య యతని ముప్పదిసంవత్సరముల ప్రాయమునఁ గాక యతని వార్ధకదశలోనే మరణించినదని కుక్కుటేశ్వరశతకములోని 89వ పద్యమువలన స్పష్టముగాఁ దెలియుచున్నది. అందలి విధురుని యవస్థలను దిమ్మకవి తన పూర్వగ్రంథములలో దేనిలోను సూచింపలేదు. కాన సంసారపరాఙ్ముఖుఁడైనాఁడను వాదమున కాధారమే లేదు. అతఁడట్టి పరాఙ్ముఖత్వము కలవాఁడయిన తన 56-60 సం॥రముల మధ్యవయస్సున “రసికజనమనోభిరామము” వంటి శృంగారరసము తొణికిసలాడుచుండు కావ్యమును సృష్టింపఁ గలుగువాఁడు కాలేఁడు. ఈ హేతువులను బట్టి, యతని యకాలభార్యావియోగముగాని, సంసారపరాఙ్ముఖతగాని, తమ్ములమీఁదఁ దానాధారపడుట గాని, జరిగినదనుట సర్వాబద్ధము. అతని పెదతమ్ముఁడు ‘సింగన’యే గాని శ్రీ కోటయ్యగారు వ్రాసినట్లు ‘సింగనకవి’ కాఁడు. అట్లతఁడు తాను కవినని చెప్పుకొని వ్రాసిన గ్రంథమేదియుఁ గానరాదు; తిమ్మన జగ్గన కవులును నతనిని తమ కృతులలో నెక్కడను కవిగాఁ బేర్కొనలేదు. పైఁగా జగ్గకవి, తన పెద్దన్ననుగూర్చి తన గ్రంథములలో నంతదూరము మహాకవిగాఁ గొనియాడినప్పుడు, చిన్నన్నయయిన సింగన్నను (కవిగా నుండిన యెడల) పొగడక విడుచునా?

విచిత్రమయిన, కోటయ్యగారు రచించిన జీవిత చరిత్రములోఁ దిమ్మకవి, జగ్గకవి గ్రంథములకు లేఖకుఁడుగా నుండినాఁడనియు, నందులకుఁ గారణము, జగ్గకవి పెద్దవాఁడై న వెనుక విద్యాభ్యాసము మాత్రము చేసినాఁడే కాని, వ్రాయసకాఁడు కాలేకపోయినాఁడని చెప్పిరి. ఇదికూడ నెంతమాత్రము విశ్వాసార్హము కాదు. తిమ్మకవి తాను తన 60వ సం॥ ప్రాంతములో వ్రాసిన రసికజనమనోభిరామమున-

“నిఖిలవిద్యాభ్యాసనిపుణుఁడు మత్సహోదరుఁడగు జగ్గసత్కవితనయులు ఘనులు తిమ్మనయు సింగనయును లేఖకపాఠకులై కృతుల్ ప్రబలఁ జేయ”

అని తన కృతులకే, జగ్గకవిపుత్రులను లేఖకపాఠకులుగా నిర్ణయించుకొనినట్లు స్పష్టమగుచుండగా, ముసలితనములోఁ దాను తమ్ముని గ్రంథములకు లేకరిగా నుండినాఁడనుట ఎట్లు పొసఁగును?

ఇఁక జగ్గకవి శతకమునుగూర్చి కొంతవఱకు చర్చించుట యవసరము. జగ్గకవీంద్రుని గ్రంథములలో సుభద్రాపరిణయము, సోమదేవరాజీయము, చంద్రరేఖావిలాపము, భక్తమందారశతకము మాత్రమే ప్రచారములో నున్నవి. చంద్రరేఖావిలాపమును సంపాదించి వెలువఱచిన శ్రీ కాళ్లకూరి గోపాలరావుగారు అందలి బూతుపద్యములను జాలవఱకుఁ బఠనయోగ్యములుగా సంస్కరించినందున నవి యథాతథములుగా కవిహృదయమును బయటపెట్టుట లేదు. భక్తమందార శతకమును శ్రీ చెలికాని లచ్చారావుగారు తమ శ్రీరామవిలాసగ్రంథమాలా మూలముగా ప్రచురించిరి.

జగ్గకవి కవిత్వ మత్యంతప్రౌఢమయినది. సముచితశబ్దప్రయోగ చాకచక్యములో నితఁడు తన యన్న యయిన తిమ్మకవిసార్వభౌముని కెంతమాత్రము తీసిపోయినవాడు కాడు. సరికదా! అతనికంటె నొక రవ మించినవాఁడుగనే కనిపించును. పేరులు చెప్పక, తిమ్మన, జగ్గనల పద్యములను జదివిన నీ యిరువురలో నెవరా పద్యరచయితయో కనిపెట్టుట కష్టము.

ఇతని భక్తమందారశతకము మంచిపాకములోఁ బడినది. దాదాపు అఱువదియేండ్ల ప్రాయములోఁ దనకు ‘బేబదల్’ బిరుదము లభించిన తరువాతనే యితఁడీశతకమును వ్రాసినాఁడని కడపటి పద్యము తెలుపుచున్నది. అందుచేతనే, యీ శతకములోని పద్యములన్నియు నతని ప్రపంచానుభవమును బురస్కరించుకొని వ్రాయఁబడిన విషయములతో జాలువాఱుచున్నవి. ఆ కాలమందలి సాంఘికాచారములను నిరసించుచు, నీతి నుద్ఘాటించుటలో నీ శతకము కొంతవఱకు సుమతీ, వేమన, కాళహస్తీశ్వర, కవిచౌడప్ప శతకములకు సాటివచ్చును. అద్భుతశబ్దౌచిత్యమునకుఁ దో డలంకారములుకూడ నీ శతక పద్యములలో గోచరించుచున్నవి. ఇందలి యొక్కొక్క పద్య మొక్కక్క రసగుళిక యని చెప్పఁదగును.

తన కవితాసామర్థ్యమునుగూర్చి, కవియే యేమనినాఁడో చూడుఁడు-

“వింతల్గాఁ గడు మీకు సత్కృతులు గావింతుం, దుషారాద్రిజా-
కాంతాకాంత జటాంతరాళ విలుఠద్గంగాతరంగచ్ఛటో-
త్క్రాంతాత్యంత ఝుళంఝళంనినద రంగద్ధాటి మీఱంగ, సా-
మంతా సంతతశాంతిమంత జయరామా, భక్తమందారమా!”
-(భక్తమందార శతకము)

చంద్రరేఖావిలాపములోని సింగనృపాలుని ద్వారా తన ప్రజ్ఞను గూర్చి యీవిధముగా చెప్పించుకొన్నాఁడు-

“అర్ణవమేఖలంగల మహాకవికోటులలోన నెంతయుం
బూర్ణుఁడ వీవు సత్కవిత, బూతులరీతుల గోరు కొండగా
వర్ణన సేయ నేరుతువు, వాలెముఁ జుల్కఁగఁ బల్కు మూర్ఖులం
దూర్ణమె తిట్టి చంపుదువు, దుర్దమపౌరుషశాలి వెంతయున్,
నిర్ణయ మిత్తెఱం గెఱిఁగి నేర్పున నిన్ను బహూకరించినన్
స్వర్ణవిభూషణాంబర గజధ్వజచామర గోధనాశ్వదు-
ర్వర్ణ విచిత్రపాత్ర బహురాజ్యరమారమణీయపుత్రసం-
కీర్ణ సమస్తవస్తువరగేహ సమంచిత భోగభాగ్యమున్,
కర్ణసమాన దానము, నఖండపరాక్రమశక్తి, నిత్యదృ-
క్కర్ణకులీన వాగ్విభవగౌరవ, మాశ్రితబంధురక్షణో-
దీర్ణకృపారసంబును, నతిస్థిరబుద్ధి, చిరాయువున్, సుధా-
వర్ణయశంబును న్గలిగి వర్ధిలఁజేతువు, జగ్గ సత్కవీ!”

అంత్యప్రాసాలంకారము లనిన నితనికిఁ గడు ప్రీతి. అట్టిపద్యము లీశతకములో నాఱున్నవి. మచ్చునకొకటి-

“అతసీపుష్పసమానకోమల వినీలాంగున్, సముద్యన్మహో-
న్నత కోదండనిషంగగంగు, బలవన్నక్తంచరాఖగ్వప-
ర్వతజీమూతతురంగుఁ, గింకరజనవ్రాతావనాత్యంతర-
మ్యతరాపాంగుని, నిన్ భజింతు మది, రామా! భక్తమందారమా!”

శేషాలంకారముతోఁ బ్రభుదూషణము గల పద్య మీక్రిందిది-

“పలుమాఱుం ద్విజరాజు లొక్కట దముం బాధింతురంచు న్విషా-
నలఘోరాననము ల్ముడుంచుకొని కానన్ రాక దుర్గస్థలం-
బుల వర్తింపుచు భుస్సురిందు రిల నాభోగీశు లెందై ననున్
మలకల్ మాని చరింపఁగాఁ గలరె? రామా! భక్తమందారమా!”

జటిలదీర్ఘసమాసము లితనికి నల్లేరుపై బండివలె సాగిపోవుచుండును-

 1. “దోర్దండాగ్రజాగ్రన్మహోద్దండోత్తాలవిశాల దివ్యతరకోదండోగ్రనిర్ముక్తసత్కాండవ్రాత విఖండితాహిత శిరఃకాండా”
 2. “మదనాగాశ్వశతాంగకాంచనకనన్మాణిక్యభూషా మృగీమదదివ్యాంబరచామరధ్వజ లసన్మంజూషికాందోళికామృదుతల్పార్థసమృద్ధి”
 3. “మకరోగ్రక్రకచాగ్రజాగ్రదురుసమ్యక్ఛాతదంష్ట్రాక్షత ప్రకటాంఘిద్వయనిర్గళద్రుధిరధారాపూర ఘోరవ్యధాచకితుండు”
 4. “అమరేంద్రాది సమస్తదేవభయదాహంకారహుంకార దుర్దమబాహాబలసింహనాద పటుకోదండోగ్రబాణచ్ఛటా సమజాగ్రత్ఖరదూషణాసురులు”

అనువాదప్రాయములు-

 1. “ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష శుకశౌనక భీష్మదాల్భ్యాన్” అనుటకు
  “కరిరాజార్జున పుండరీక శుక గంగానందనవ్యాసులు -(భ. మ. శతకము)
 2. “వహ్ని స్తస్య జలాయ తే, జలనిధిః కుల్యాయ తే తత్క్షణాత్
  మేరు స్వల్పశిలాయ తే, మృగపతి స్సద్యఃకురంగాయ తే
  వ్యాలో మాల్యగుణాయ తే విషరసః పీయూషవర్షాయ తే
  యస్యాఙ్గేఽఖిలలోకవల్లభతమం శీలం సమున్మీలతి॥ (అను భర్తృహరి శ్లోకమునకు)
  “ఇనుఁ డద్దంబగు, నగ్ని నీరగు, భుజంగేంద్రుండు పూదండయౌ,
  వనధుల్ పల్వల పంక్తులౌ, జలధరాధ్వం బెల్లియౌ, రాజయో-
  గనిరూఢస్థితి తావకీన పదయుగ్మంబెల్ల కాలంబు, ప్రే-
  మ నెదంబూని భజించు ధన్యులకు, రామా! భక్తమందారమా!!”

అనుకరణాలు-

 1. “మదమాతంగతురంగ కాంచనలసన్మాణిక్య గాణిక్య సంపదలు” -(మహాభారతము)
  “మదనాగాశ్వశతాంగ కాంచనలసన్మాణిక్యభూషామృగీమద” -(భక్తమందార)
 2. “ఆదిన్ శ్రీసతికొప్పుపైఁ, దనువుపై, నంసోత్తరీయంబుపై” -(భాగవతము)
  “సుదతీపీనపయోధరద్వయముపై, సొంపొందు నెమ్మోముపై మదనాగారముపై” -(భక్తమందార)
 3. “చేతులకుఁ దొడవు దానము, భూతలనాథులకుఁ దొడవు బొంకమి ధరలోన్” -(సుమతి శతకము)
  “దానం బాభరణంబు హస్తమునకున్, దద్ జ్ఞానికి న్నీ పదధ్యానం బాభరణంబె” -(భక్తమందార)

ఇందలి జాతీయశబ్దప్రయోగములు కమ్మనివి:

కొంటెతొత్తుకొడుకులు, కోనారులు, తకతేతత్తలవారు, మోటకొయ్యదొరలు, బవనీలు, దరిబేసులు, కోమటిమేనర్కెము, మాటేబం గరు, హొందిలావు, క్రిందున్మీఁదుగానక, మోటకాఁపుదొరలు, పల్గాకి, దీమస, గోరంత, కాసంతసేపు, ఎడపొద్దు, సరిపిణీలు, మసియైపోవు, విడిదిల్లు.

నానుడులు, ఉపమానాలు:

నీ చిత్తము నాదు భాగ్యము; నీ మనసు న్నామనసు న్నెఱుంగు; నే నీ బంటను, నీవు నా దొరవు; మీసం బేటికిన్ లోభికిన్, మకుటం బేటికి మర్కటంబునకు; మన్నుంబిల్లి మృగేంద్రమౌనె?; ఒత్తుల్ దిను దాసరింబలె; దోమలు వేయైన మదద్విపంబగునె?; ఈప్సితము దీర్పన్ లేని జేజేకు నైవేద్యంబేల?; పారిజాతసుమనోమత్త ద్విరేఫంబు దా మదనోర్వీజము చెంతకుం జనునె?; బర్బూరము గాలివానఁ బడుఁగా కింతైనఁ గంపించునే మలయోర్వీధర మారుతంబునకు; జెఱ్ఱి(ని) చీమలు చీకాకుగఁ జేయు చందమున.

మతాచారసంస్కృతి కీకవియుఁ దన యగ్రజునివలె సుముఖుఁడుగ నున్నట్లు క్రిందివాక్యములు వివరించుచున్నవి-

 1. “నిన్నారాధించి సుఖించలేక శిలలం బ్రార్థింతు రెంతే యపస్మారభ్రాంతిమదాత్మ మూఢులు.”
 2. “దుర్మదవృత్తిం బశుమాంస మగ్నిఁ దనరారన్ వేల్చుగా దేవతామదిరాక్షీసురతేచ్ఛ భూసురుఁడు.”

ఆ కాలములో నమ్మరాని జాతుల నీ క్రిందిపద్యములో జగ్గకవి నిర్భయముగాఁ బేర్కొన్న విధము గమనింపఁదగినది-

“అగసాలిన్ దిలఘాతకున్ యవనునిన్ వ్యాపారి, దాసి, న్విటున్
జగతీనాథుని, వేటగాని, గణికన్, జండాలునిన్, జోరునిన్
బ్రెగడం, గోమటి, జూదరిన్ బుధజనుల్ పెన్రొక్క మర్పింప, న-
మ్మఁగరాదెంతయుఁ దథ్య మిద్ధరణి, రామా! భక్తమందారమా!”

పంక్తిబాహ్యులు-

“వృషలీభర్తయు, దేవలుఁడు, నటుఁడు, న్వేదాభిశస్తుండు, మా-
హిషికుం, డగ్నిదకుండగోళగులున్, హింసాపరిస్వాంతుఁడున్,
విషదుఁడుం గొఱగాఁడు పంక్తికెపుడుర్విన్ ... మందారమా!”

ఆ కాలపు వైద్యులనుగూర్చి యీ కవి నిరసించిన విధము కడు తీవ్రమైనది-

“కలికాలంబున వైద్యలక్షణపరీక్షాశూన్యమూఢావనీ-
తలనాథుల్ బలుమోటకాఁపుదొరలున్ దట్టంబుగాఁ బిల్చి, మం-
దులు సేయించ, భుజించి క్రొవ్వి కడువైద్యుల్గారె, సిగ్గేది త-
మ్మళులున్, నంబులు, క్షౌరకాంత్యజులు, రామా! భక్తమందారమా!”

ఇంక నీ శతకములోఁ దిమ్మకవి భర్గశతకములోవలె నా కాలపుఁ ప్రభువులను దూషించు పద్యములు కొన్ని యున్నవి. అంతియ కాక, నీతిబోధక పద్యములలోఁ గూడ, కొన్నింటి భావములు భర్గశతకమునుండి పుడికి పుచ్చుకొనినట్లు కనఁబడుచున్నవి. సత్కవులను రాజు లేరీతిగా నా కాలములో నాదరించుచుండిరను విషయమును దెలుపుటకు భక్తమందారశతకమునుండి రెండు పద్యము లుటంకించుటతో నీ శతక పరామర్శను బూర్తిచేయుదును.

“ధాటీపాటవచాటుకావ్యరచనోద్యద్ధోరణీ సారణీ-
వ్యాటీకోద్గతి సత్కవీశ్వరుఁడు నిత్యంబుం దమున్ వేడగా
వీటీ ఘోటకహాటకాదు లిడరుర్విన్ నిర్దయబుద్ధిచే
మాటే బంగరు ... నేఁటి రాజులకు రామా! భక్తమందారమా!”
“గడియల్ రెండిఁక సైఁచి రా, వెనుక రా, కాసంతసేపుండి రా,
విడిదింటం గడె సేద దీర్చుకొని రా, వేగంబె భోంచేసి రా,
యెడపొద్దప్పుడు రమ్మటంచు సుకవిన్ హీనప్రభుండీగతిన్
మడతల్ పల్కుచుఁ ద్రిప్పుఁ గాసిడక రామా! భక్తమందారమా”

భక్తమందారశతకము

కూచిమంచి తిమ్మకవి శతకములు:
భర్గశతకము
కుక్కుటేశ్వరశతకము
చిరవిభవశతకము

భర్గశతకము - పీఠిక - కె. గోపాలకృష్ణరావు (అధిక్షేపశతకములు - ఆంధ్రప్రదేశ్‌ సాహిత్యఅకాడమీ, 1982)
కుక్కుటేశ్వరశతకము - పీఠిక - స్వామీ శివశంకరస్వామీ (శతకసంపుటము ద్వితీయభాగము - ఆంధ్రప్రదేశ్‌ సాహిత్యఅకాడమీ, 1968)

AndhraBharati AMdhra bhArati - కూచిమంచి జగ్గకవి - వేదము వేంకటకృష్ణశర్మ - ఆంధ్రభారతి - (శతకవాఙ్మయసర్వస్వమునుండి) ( తెలుగు కావ్యములు ఆంధ్ర కావ్యములు) Kuchimanchi Jaggakavi - Vedamu Venkata Krihsna Sarma - AndhraBharati AMdhra bhArati ( telugu kAvyamulu andhra kAvyamulu)