దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

072. ఓరందకాడ


జానపదులలో మామను పెండ్లాడుట కలదు. పలు అవతారములతో ప్రత్యక్షమయ్యే ఈ పాట 'దేశమెల్లిన' మామనుద్దేశించి అతని ప్రేయసి పాడిన పాట.

ఓరందకాడ బంగారు మామ
చంద్రగిరి చీరలంపరా    ॥
చంద్రగిరీ చీరలంపూ కాకినాడా గాజులంపు
రాజమంద్రీ రైకలంపుమురా    ॥ఓరంద॥
నీకునాకూ దూరమాయె నీలికొండ లడ్డమాయె
కొండకెక్కీ గొఱ్ఱె మేసిందోయి    ॥ఓరంద॥
నిమ్మచెట్టుకు నిచ్చెనేసీ నిమ్మపళ్ళూ కొయ్యబోతే
నిమ్మముళ్ళూ రొమ్ము నాటెనోయి    ॥ఓరంద॥
నీకునాకూ దూరమాయె నల్లకొండ లడ్డమాయె
సల్లగున్న సాలునంటినిరా    ॥ఓరంద॥
నందియాల సందుల్లోన ధర్మలారు దారుల్లోన
కాలుజారితే కదలనివ్వరురా    ॥ఓరంద॥
దచ్చినాన గాలితోనే వచ్చే నల్లమబ్బుతోను
వన్నె వన్నె వార్తలంపుమురా     ॥ఓరంద॥

ఇది ఏలపాట. తాళ్ళపాక చినతిరుమలాచార్యులు దీని లక్షణమును సంకీర్తన లక్షణములో వ్రాసెను గాని అది కేవలము దీని రూప వర్ణనమును మాత్రమే చేయుచున్నది. దీని గతి 'తకకిటతక' అని ఆరక్షరాల ఆవృతాలు నాలుగు చొప్పున కల రెండేసి పాదాలతో నడుస్తున్నది. రెండో పాదములో చివరి రెండావృతాలకున్నూ "రా, ఓ" అన్న రెండక్షరాలే వాహనాలు.

ఏలలు యక్షగానాల్లో గాని, వీధినాటకములలో గాని, స్త్రీలపాటలలో గాని ఉన్నప్పుడు వాటికి ఇదే లక్షణము. అప్పకవి తక్కిన దేశి ఛందములను వివరించునప్పుడు వలెనే ఏలల వివరించునప్పుడునూ పప్పులో అడుగు వైచినాడు. 'భాను వంశమూన బుట్టి' అన్న కందుకూరి రుద్రకవి ఏలను 'తకిట తకిట' అని త్రిశ్ర గతిలో పాడుకున్ననూ పాడుకోవచ్చును. ఏల యొక్క గతి, రెండూ నాలుగూ అక్షరాలుగా తెంపిననే నిర్దుష్టముగా స్ఫురించగలదు. ఈ ప్రత్యేకతను చెప్పకుంటే వేరేది చెప్పిననూ ఫలము లేదు.

ఏలపాటలు రాయలసీమ జానపద గేయములలో మిక్కుటము. అందువల్లనే కదిరీపతి 'వీధి బోయెడు ప్రౌఢవిటుడు పాడెడు వింత ఏలపదాలట్టె యాలకించు' నన్నాడు. వీటిలో పాటకు ప్రాధాన్యత హెచ్చు. తెలుగు జానపద గేయములలో సంగీతమాధుర్యము రాయలసీమ పాటలలోనే హెచ్చు.
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - OraMdakADa - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )