దేశి సాహిత్యము జానపద గేయములు పల్లెపదాలు : కృష్ణశ్రీ

074. నీటి చెలమ వద్ద


తమలపాకుల మీద వడ్లెండబోసి
నేబోతు కృష్ణమ్మ నీళ్ళు చెలమలకి
ఊరగదె ఉదకంబు తేరగదె వూట
చేదగదె నాచేతి ముత్యాల బిందె
అటుచూచి ఇటుచూచి కట్టొంక చూచి
కట్టమీద బోయేటి పొట్టికోమటి
ఆవులు గలవారి ఆడమనిషిని
కోడెలు గలవారి కోడల్ని నేను
మేకలు గలవారి మేనకోడల్ని
మా అత్త కొట్తాది బిందెత్తి పొమ్ము
మీ అత్త కొట్టనేల బిందెత్తనేల

అటు చూచి ఇటు చూచి బాటొంక చూచి
బాటమ్మట వెళ్ళేవు ఓ బాపనయ్య
ఆవులు గలవారి ఆడమనిషిని
కోడెలు గలవారి కోడల్ని నేను
మేకలు గలవారి మేనకోడల్ని
మా అత్త కొట్తాది బిందెత్తి పొమ్ము
మీ అత్త కొట్టనేల బిందెత్తనేల

అటు చూచి ఇటు చూచి గట్టొంక చూచి
గట్టు మీద పోయేటి పూజారి మాయన్న
ఆవులు గలవారి ఆడమనిషిని
కోడెలు గలవారి కోడల్ని నేను
మేకలు గలవారి మేనకోడల్ని
మా అత్త కొట్తాది బిందెత్తి పొమ్ము
మీ అత్త కొట్టనేల బిందెత్తనేల

అల్లదిగొ మా అత్త తానె వస్తున్నాది
ఎత్తొద్దు ఎత్తొద్దు వెళ్ళండి బాబు

అత్త వచ్చినచో బిందె తనంతట తానే నెత్తి పైకి లేచును. బిందెకు కూడ అత్తగారన్న భయమే. నిండు బిందె నెత్తిపై మోయు అలవాటు పూర్వాంధ్ర సీమ పాటకపు జనములకు కలదు.
AndhraBharati AMdhra bhArati - pallepadAlu - nITi chelama vadda - kR^iShNaSrI - kRshNaSrI - kRiShNaSrI - SrIpAda gOpAlakR^iShNa mUrti - Sripada Gopalakrishna Murthy - SrIpAda gOpAlakRshNa mUrti- pallepadamulu palle padamulu pallepa padalu dEshi dESi sAhityamu ( telugu andhra andhrabharati )