| దేశి సాహిత్యము | జానపద గేయములు | సరాగాలు : ఎల్లోరా |
| (చందమామ పదాలు చాలా వున్నాయి - వెన్నెల పదాల లాగ. అలాటిదే ఈ పదం.) |
| 053. చందమామ |
|
కోటగుమ్మమున రెండు కోరి వెలగ పళ్ళు చందమామా. కోరిన మనవాళ్లు కొంగునుంటే చాలు రంగధామా. ఈ వీధి నెళతాడు ఆ వీధినొస్తాడు చందమామా వేయి గిరికన్నెలకు వేటకాడైనాడు రంగధామా. కలకల నవ్వాడు కన్నెత్తి చూడడు చందమామా. వాడికన్నె మొగముమీద కస్తూరి చల్లొచ్చు రంగధామా. ముసిముసి నవ్వాడు ముచ్చటలాడాడు చందమామా. వాని మునిపళ్ళ సందున ముత్యాలు తాపొచ్చు రంగధామా. ఉంగరాలజుట్టు ఊగీసలాడంగ చందమామా. ఊసైన ఆడడు ఉలకడు పలకడు రంగధామా. నూగు మీసాలె దువ్వి నను చూపు చూడడు చందమామా. నూగుమీసాలమీద నూరువేలు విరబోతు రంగధామా. |