ఇతిహాసములు ఉత్తరరామాయణము శ్రీరాముఁడు సీతాదేవితో నర్మోక్తు లాడుట
శ్రీరాముఁడు సీతాదేవితో నర్మోక్తు లాడుట
తే.గీ.అవి కటాక్షించి యుడిగంపుటలరుఁ బోండ్లు
చేకొనిన రాముఁ డావేళ సీతఁజూచి
వనిత! నీ యంగములఁ బోలు వస్తు సమితిఁ
జేకొనక మాకు నిల్చునే చిత్త మనిన
30
మ.దరహాసద్యుతి జిల్గు వెన్నెలల చందం బొంది నెమ్మోము చం
దురునందుం దులకింపఁగాఁ గలికి కాంతుం డాడు నర్మోక్తికిన్‌
శిర మొక్కించుక వంచి, క్రేవలఁ గటాక్షించెన్‌ దదీక్షాపరం
పరలే తూపులుగా మరుండు రఘురామస్వామి నేసెన్‌ వడిన్‌
31
చం.అలికులవేణి లేనగ వొయారపుఁజూపులు ముద్దుమోము క్రొం
దళుకు కడాని బంగరపు నక్కుల టెక్కులఁజెక్కు చెక్కులున్‌
బలుచని మోవి కెంజిగురుఁ బల్మఱుఁ జూడనె కాని తోఁటలోఁ
గలిగిన వింత లెవ్వియును గన్గొన నొల్లఁడు రాముఁ డయ్యెడన్‌
32
కం.తరుణీతరుణాంగుళములు
కరమునఁ దెమలించి యహిమకరకులజశిఖా
భరణము తనువునఁ బులకలు
దొరయఁగ వనవీథిఁ బ్రియముతో విహరించెన్‌
33
వ.ఇత్తెఱంగున విహరించుచు నత్తరణికులగ్రామణి జనకకన్యామణితో నిట్లనియె34
సీ.ముదిత! నీ పదపద్మములఁ బోలని ప్రవాళ - పాళిఁ బికశ్రేణి పాలు చేసి
బాల! నీయవయవశ్రీలతోఁ బ్రతిగాని - ప్రసవాళి యళిపంక్తి పాలు చేసి
పద్మాక్షి! నీ మోవిపంటతో సరిరాని - ఫలరాజి శుకకోటి పాలు చేసి
వనిత! నీ తావితో నెనగాని బహువిధ - పరిమళంబులు గాడ్పు పాలు చేసి
 
గీ.యుపవనవధూటి నీ యొప్పిదంబు
చిలుక పలుకుల నభినుతి సేయ సాగె
నవనిజవు గావునను సహజానురాగ
మవనిజావళి చూపుఁ బల్లవమిషమున
35
మ.జళుకుంగన్నులఁ డెక్కెమున్‌ మధురభాషన్‌ గీరతుక్ఖారమున్‌
గళితభ్రూయుగళీ విలాసమున సింగాణిన్‌ గచశ్రేణి కాం
తుల మౌర్వీవిభవంబుఁ జూఱగొనియున్‌ దోడ్తోడ నీ బోటు లిం
దులఁ గంటే? మరుతూపులం జిదుమ నుద్యోగించి రబ్జాననా!
36
చం.కనుఁగొని పల్కి యంటి నగి కౌఁగిటఁజేర్చి మొగంబుఁ జూపి మూ
ర్కొని పదముంచి పాడి ముఖగుంభితమౌ రస మొల్కి చెట్టు ల
న్నన లొదవించి నీ చెలు లొనర్చు ప్రసూన విరామ మివ్వనిం
గనఁబడనీక నించితివి కామిని! యెంత ప్రవీణురాలవే?
37
సీ.గోరంట నెదనుంచి కొమ్మ! యశోకంబు - తన్నితి విది యేమి తప్పొనర్చె?
సఖి! గోఁగుతోడ ముచ్చటలాడి, సురపొన్న - నవ్వితి విదియే గుణంబు దప్పెఁ
గలికి! ప్రేంఖణము చెంగటఁ బాడి, పొగడపై - నుమిసితి విదియే దురుక్తు లాడె?
జాన! మామిడినంటి సంపెంగకును మోము - చక్కఁ జూప వదేమి తక్కువయ్యె?
 
గీ.తిలకభూజంబుఁ గారుణ్యదృష్టిఁ జూచి
సింధువారంబుచెంగటఁ జేరి యుసురు
మంటి వదియేమి యపరాధ మాచరించె?
నువిద! యీ పక్షపాతహేతువు గదింపు?
38
సీ.ఈ ద్రాక్ష ఫలముల కెక్కుడో నీ మోవి - యీసారి చవిఁజూడ నీవె చెలియ!
యీ మంజరులకును నీడేమొ నీ చన్ను - లింకొక్కపరి పట్టనీవె సకియ!
యీ యనంటులకును హెచ్చౌనొ నీ తొడ - లీపారి పట్టనీవే లతాంగి!
యీ కప్పురపుఁజెల్వు కెనయొ మిక్కుటమొ నీ - పల్కు లింకొకసారి పల్కు మతివ!
 
గీ.ముదిత! యీ లవలీదళంబులకు జోడొ
పెద్దయో తళ్కు చెక్కులు ముద్దులాడ
నీయవే! యని సమవస్తు వీక్షణమున
రాముఁ డవనిజఁ బల్కు నారామమునను
39
చం.అఱవిరి తేనెపానకము లానెడి తేఁటుల దాఁటు రేఁపఁ జె
చ్చెఱ నలిరేఁగి ఝంకృతులు సేయుచు డాయుచు మీఁద మూఁగినన్‌
వెఱచి కవుంగలించు ధరణీసుర నక్కున నుంచి మోమునం
జిఱునగ వంకురింప రఘుశేఖరుఁ డిష్టఫలాప్తి రంజిలున్‌
40
ఉ.నాయక! తావకీనశుభనామము నచ్చెలి పల్కఁ గంటివే
కోయిల పల్కకున్నదని కోమలి పల్కినఁ జాన! దానఁగా
దీయెడ నీ యెలుంగు విని యీగతిఁ బల్కఁగ లేని లజ్జ న
క్కోయిల మూగవృత్తిఁగయికొన్న దనెన్‌ రఘురాముఁ డొప్పుగన్‌
41
మ.భ్రమరసమూహ మల్లపుఁడు పైకొనినన్‌ హృదయేశ! యే యుపా
యమునను బాఱఁదోలితి? రటంచు ధరాసుత పల్క, రాముఁ డో
రమణి! యుపాయమేటి కిఁక? రంగగు నీ నునుముక్కు చంపక
భ్రమ మొదవింపఁగా నవియ పాఱె నటంచును బల్కి వెండియున్‌
42
చం.పరిసరచంపకప్రసవ పంక్తులఁ బుట్టిన వెట్టవాసనల్‌
గరళములై పయిం బొరయ, గాసిలివచ్చు మదాళినీపరం
పరలు భవత్పదాబ్జములపై నొలసెన్‌, దమునొంచు చంపకో
త్కరముల నీ జిగిన్‌ గెలిచి కావఁగదే! యని మ్రొక్కుకైవడిన్‌
43
ఆ.వె.తేఁటు లాను పువ్వుతేనె వాఁగును, బక్వ
ఫలరసస్రవంతి, పైకగీతి
దొరయు శశిశిలాంబుధునియుఁ - ద్రివేణిగా
మగువ! యిచటనుండు మాధవుండు
44
తే.గీ.ఇట్టలపుఁ బువ్వుగుత్తుల నట్టనడుమఁ
గలికి! దులకించె దాడిమీఫలయుగంబు
కంటె? కెంబట్టు రవికఁ బిక్కటిలి యుబ్బు
నీ బటువు గబ్బిగుబ్బల నీటుఁ బూని
45
తే.గీ.తరుణి! కడువింత నీ ముఖదర్పణమునఁ
బ్రతిఫలించెను శుకదష్టపక్వబింబ
ఫల మనుచు భర్త భావగర్భముగఁ బల్క
ముదిత ముసిముసి నగవుతో మొగము వాంచె
46
చం.పొన పొన పొన్నగున్నపయిఁ బోటిరొ! మల్లిక ప్రాకి, మాటికిన్‌
నును విరితేనెఁ జిందుచు మనోహరభృంగరవం బెసంగ గా
లి నొరయుచున్‌ రతిన్‌ నినువలెం జెలువొందెడినన్న నల్గడల్‌
గనుచు లతాంగి నవ్వుచు మొగం బదిమెం బతి పేరురంబునన్‌
47
మ.ఎదపై వ్రాలిన బాల మైనదిమి పోనీకంగ ముప్పొంగఁగా
సుదతీ! చిక్కితి వెందుఁ బోయెద వటంచున్‌ గంచుకంబున్‌ వద
ల్పఁ దొడంగన్‌ నికటంబునన్‌ జిలువల్కన్‌ గల్కి పల్కంచు జ
ళ్కొదవన్‌ బోవఁ గడంగు సీత నదె రామోర్వీశ్వరుండయ్యెడన్‌
48
ఉ.కోమలులన్‌ మనోహరులఁగూర్చు మనోజుని తేజి యయ్యు నా
రామశుకంబు విఘ్నమడరన్‌ బలికెన్‌, కలకంఠి! దీని నిం
కీ మణిముద్రఁజూపి బ్రమయించెద నంచు స్వరత్నముద్ర శ్రీ
రాముఁడు సూప బింబమని వ్రాలె శుకం బవనీజ మెచ్చఁగన్‌
49
ఉ.శ్రీరఘువీరశేఖరుఁడు చిత్తము రంజిలఁ బల్కు చిల్క ముం
జే రహియింప సీతఁగని చెల్వరొ! నీ యధరంబు బింబికా
శ్రీరస మొల్క రాచిలుక చేరెడు నంచునొ జిల్గునవ్వులన్‌
వారక మాటు సేసెదవు? వంచన సేతురె యాశ్రయించినన్‌?
50
మ.హరినీలాలక! చిల్క నీ పలుకుఁదోడై యుండఁగా ముద్దు చ
క్కెరయైనన్‌ దయసేసి పంపఁగదె నీకెంగేలఁ గీలించి నీ
సరసాలాపసుధారసం బయినఁగాంక్షం గ్రోలఁగా నియ్యవే
తరితీపేల? యటంచు రాఘవుఁడు సీతన్‌ ముంచె రాగాంబుధిన్‌
51
మ.తన తేజిన్‌ గ్రహియించినారమని కందర్పప్రభుం డల్కతో
మనపై నేసిన తూపు చా లనఁగఁ గొమ్మా! యల్ల క్రొమ్మావి చా
యనె రాలెన్‌ విరిమోదుగుల్‌ పవనబాలాందోళనక్రీడలం
గనుగొంటే? యని తత్సమీపమునకుం గాకుత్‌స్థుఁ డేఁగెన్‌ రహిన్‌
52
వ.తత్ప్రదేశంబునన్‌53
చం.కరమున మెట్టదమ్మి విరిఁగైకొని రాఘవుఁడందుకోవె సుం
దరి! యని యానఁ జూపి వనితామణి యించుక నిక్కి పాణిపం
కరుహము సాఁచినన్‌ - బొడవుగా మఱియున్‌ గరమెత్తు బాహుమూ
లరుచులు జాఱుపయ్యెదఁ జెలంగుకుచంబులుఁ జూచువేడుకన్‌
54
సీ.నిగిడి నిక్కిన జాఱునీవిఁ గన్గొనునాస - వెలఁది కందని తీఁగవిరులఁ జూపు
వలువ యెత్తిన నూరువులు చూచుతమిఁ దలో - దరికిఁ బన్నీరేటి దారిఁజూపు
నళిపంక్తి కళికి కౌఁగిలి యిచ్చు ననుకోర్కిఁ - బొలఁతికి విరిపువ్వుఁ బొదలఁ జూపు
బడలి పైనొఱఁగునన్‌ బాళి నాతికిఁ గప్పు - రపుఁదిప్ప లొప్పునరంట్లు చూపు
 
గీ.నధరబింబంబుపైఁ గాంక్ష నడరు కలికి
చిలుక నదలింపఁ జక్కెరల్‌ చిలుకుపలుకు
విను ప్రియంబునఁ గల మావివనులఁజూపు
సీత కవ్వేళ రఘువీరశేఖరుండు
55
మ.ఎలదీఁగన్‌ సుమకాంక్షఁ జేరకు లతాంగీ! తీఁగకున్‌ మేనికిన్‌
దెలియన్‌ రాదు విభేద, మంచకొఱ కింతీ! పోకువే రాకపో
కల నీ కంచకు వేఱు లేదు, చిలుకన్‌ గై నుంచకే చిల్క ప
ల్కులొ నీ పల్కులొ కాంచలే మనుచుఁ బల్కున్‌ రాముఁ డాయాయెడన్‌
56
ఉ.అంటితి వేమె పుష్పవతియౌ లతకూన? నటైన నంటు న
న్నంటుకు మున్గుదాఁక నని యవ్వలి కేఁగిన సీత నవ్వుచున్‌
వెంటనె పూఁబొదల్‌ దిరిగి వేసరి చెమ్మటఁ దొప్పదోగినన్‌
బంటవలంతియల్లుఁడు కృపానిధి కౌఁగిట గ్రుచ్చె నంతటన్‌
57
తే.గీ.అలరు పుప్పొడిదుమ్ము కుచ్చెలల నెఱయఁ
జెంతఁ దనుడాసి నడయాడు సీతఁ జూచి
యధిపుఁ డౌనె రజస్వతి వైతి వనుచుఁ
బలికి విభ్రాంతిఁ గనునంతఁ బరిహసించె
58
వ.ఇవ్విధంబున వివిధవినోదంబులన్‌ దగిలి విహరించుచు విపులపరిమళ మిళిత లలిత ప్రసూనవల్లరులు హరించుచున్‌ గమ్మవిరి తేనియలు గ్రోలుచు రసానుభవో ల్లాసంబున సోలుచుఁ జిమ్మచీఁకటులు గ్రమ్ముపువ్వు టీరంబులలోఁ దూఱుచు గొజ్జంగిపువ్వు సెజ్జలన్‌ జేరుచు డోలికాకేళికలన్‌ జొక్కుచుఁ గేళికాశైలంబు లెక్కుచు నెలమావిక్రేవలనీడల నిలుచుచుఁ గల్కిచిల్కలన్‌ బిలుచుచుఁ గిసలయకుసుమలసితతరుశాఖ లూఁపుచు భ్రమరసముదయంబులన్‌ జోపుచు మత్తమయూరంబుల నదలించుచు మరాళదంపతుల బెదిరించుచుఁ బన్నీటి యేటికెలంకుల మెలంగుచుఁ గ్రొన్నెలఱాలతిన్నెలపైఁ జెలంగుచుఁ బ్రణయ కలహంబులు పూనుచుఁ బ్రణతికల్పనలచే మానుచుఁ దరులతాదులకుఁ బరిణయంబు లాచరించుచు విచ్చలవిడిఁ జరించుచు సీతారాము లారామకేళిన్‌ దేలి రయ్యవసరంబున.59
కం.తిలకించుచున్న పతి చూ
పుల కింపుగ మెలఁగు జనకపుత్త్రిక నెంతో
నలరించుచు నాయమతోఁ
జెలిగుంపు సుమాపచయము సేయుచు వేడ్కన్‌
60
రగడ(నర్మోక్తులు)
అతివ! మరుశరములకు నళిభటావళి కాపు
ప్రతి లేని వనసస్యపాళి కామని కాపు,
పోఁకముడి వీడఁ జెలి పొగడ కేటికి నిక్కఁ?
బోఁ కమ్రాఁకులయొద్ది పొద చీఁకటికి నిక్క,
గలిగొట్టుచుట్టుఁ బొడ గట్టి రదె చెలు లక్క!
నెలచట్టుఁ గెం పయ్యె నీ పాదముల లక్కఁ,
దళుకుబంగరు విరులు దాఁచినా వటె మూల?
నళు కేల బాలరుద్రాక్షతరువుల మూల,
నలివేణి! చెంగటనె యలరి కాచెను నిమ్మ
యలమొల్ల లడుగ నియ్యవె కాని కానిమ్మ,
ననలబదు లమ్మ! నీ నవ్వు లతలను ముంచెఁ,
బనిఁ బూని చేమంతిబంతి నది ప్రియ ముంచెఁ,
గలికి! కను తేనెవాకల మించు నియ్యలలు
తెలిగంటి! మన కిచట దీఁగలే యుయ్యెలలు,
తరుణి! యీ మల్లికకుఁ దగును సహకారంబు,
వఱలు మంకెనవిరులె వని కలంకారంబు,
కొమ్మ! యిక్కడ గుబు ల్కొనియె నేలా లతలు?
నెమ్మి విను, కలకంఠి నేర్చె వాచాలతలు,
మారేడుపంటికై మగువ! కడు గో రేల?
చేర రాదే? యిప్పచెంత, నదిగో రేల!
యింతి! దివితో నొరసె నిదిగొ హింతాళంబు,
ఇంత విరవాదివిరి కేల కాంతాళంబు?
మదవతుల తావిఁ గొనె మందవాతూలంబు
సుదతి! కంటివె? వృథా స్థూలంబు తూలంబు
మగువ! పరుగెత్తకువె మరువంపు తావులకు
ముగుద! పోద మశోకములు వెలయు తావులకు,
మెట్ట కెందొగవిరుల మెట్టకువె, లతకూన!
వట్టివే రన నేల వంచెదవె లతకూన?
పొలఁతి! యది చన సాగెఁ బొనపొన్న నీడలకుఁ
జిలుకపలుకులు తఱుచు చేరినవి నీడలకుఁ,
జెలియ! కెంజిగురు కేల్‌ జిగురు సరి గిల్లకుము,
తలఁప బలుమాఁకు గేదఁగికి రాగిల్లకుము
చెలిరొ! దీనికిని దయ సేయవే వదనంబు,
నెలఁత! కురువేరు వేణినిఁ గన్న దవనంబు,
పూచి మాదుగులీల బోటి దగె వారిజము
నీ చరణముల చాయ నెగడె స్థలవారిజము,
హరిణాక్షి! జాఱె నదె యవతంసకువలంబు,
పరీక్షించెదవ దేమె పలుమాఱు కువలంబు?
వలుఁద యూడల జడల వఱలె జటిజాలములు!
వలదు వెలఁగలకుఁ గా పనిత! యీ జాలములు,
లేమ! బలువిరులఁ బొదలెడి దేవకాంచనము!
నీ మేనికాంతి యింతిరొ! మించెఁ గాంచనము,
మావి మును చేరితిమి మగువ! మాది ఫలంబు,
కావలసె నేనిఁ గొను కాన్క మాదిఫలంబు,
కనకాంగి! కనుఁగొంటె కర్పూరకదళములు?
పెనుపొందెఁ గదలుచును బిప్పలైకదళములు
బెడఁగు కెంజాయఁ గనిపించెను గదంబములు!
నడలె సఖినడల కిటె హంసీకదంబములు,
తనుమధ్య! తగె నారదమున నీ నఖరములు,
ఘనకురంటకకంటకములు చాన! ఖరములు,
వెల్లి యై తొఱగెఁ గురివెందల మరందములు!
చెల్ల విరులనె గనిరి చెలులు తమ రందములు,
హేమాంగి! నీ కందు నేమొ యీ లకుచములు?
భూమిజకుఁ జెమరించెఁ బో కపోలకుచములు!
తఱ చైన విచట సుందరి! కందరాళములు,
కరవీరముల కేల గైకొనె దరాళములు?
పువుఁబోఁడి యేమిటికిఁ బోయె దుత్కళికలకు?
నవలా! యలరెఁ గేకినర్తనోత్కళికలకుఁ,
బాటీరతరు లొరసి పదగదవె గణికలకుఁ,
బోటి! మిక్కిలి యలఁత పుట్టెఁ గదె గణికులకు.
61
కం.అని సరసోక్తులఁ గమలా
ననలు ననల్‌ చిదిమి బడలి నగునెమ్మొగముల్‌
నునుఁజెక్కులుఁ జెమరింపఁగ
జనకజకడ నిల్చి రట్టి సమయమునందున్‌
62
సీ.చిగురులన్నియు హరించితిరింతె మీ కరఁ - శ్రీలచేనైనఁ బోషింపుఁ డనుచు
రతిఁ దేనెలెల్లఁగ్రోలితి రింతె మీ వచో - మధువైనఁ గరుణించి మనుపుఁ డనుచు
ఫలములన్నియుఁ గొల్లఁబట్టితి రింతె మీ - బింబోష్ఠముల నైనఁ బెనుపుఁడనుచుఁ
గమ్మక్రొవ్విరు లెల్లఁ గైకొంటి రింతె మీ - తావులైన నొసంగి ప్రోవుఁడనుచు
 
గీ.వేఁడుకొనవచ్చుగతిఁ బికవితతి తేంట్లు
చిలుకగుంపులు వలికరువలియుఁ గర ము
ఖాధరాంగసుగంధాప్తి కనుసరింప
బడలి యాడాడ నిలిచిరి పడఁతు లపుడు
63
చం.లలనలు బాహులన్‌ బదములన్‌ బిగిచన్నులఁ గప్పుకొప్పులన్‌
బలుకులఁ బాటలన్‌ లతలఁ బల్లవగుచ్ఛమిళిందకీరకో
కిలముల నెప్ప టట్ల కలిగింప వనేందిర మించెఁ బూర్వభం
గుల నవనీజయుక్తిమనుకొమ్మలచే వని సేగిఁ జెందునే?
64
చం.చెదరిన ముంగురుల్‌ దఱుచు చెమ్మటఁ దోఁగిన తళ్కుజెక్కులున్‌
వదలిన కప్పుఁగొప్పు వసివాడిన మే నొకయింత జాఱు ప
య్యెద యసియాడు లేగవును నిట్టటు తొట్రిలు పద్ద్వయంబుఁ బె
ల్లొదవెడి యూర్పులున్‌ గల తలోదరిఁ గన్గొని రాముఁ డిట్లనున్‌
65
చం.అలసితి విందుబింబముఖి! యక్కట! యంగము చెమ్మరించె గు
బ్బల రవికేల? మాన్పు కటిభార మిఁకం గయిదండ గొమ్ము నె
చ్చెలులును మేము నొక్కపరి సేసెద మే పనియైన నూడిగం
బులు గణియింపు మన్న సతి మో మరవంచిన బోటి యిట్లనున్‌
66
చం.ఘనరసగుంభనంబు లెసఁగన్‌ భువనాధికరాగ మొప్ప మీ
రనుపమితామృతస్ఫురణ నాడితి రందున వేడ్కఁ జెందె నై
న నురువనౌఘపుష్పహరణంబునఁ బుట్టిన శ్రాంతిబాయ నెం
చిన యది మేఘపుష్పములు సీత, రఘూత్తమ! యంచుఁదెల్పినన్‌
67
ఆ.వె.స్వామి నగుచుఁ జెలువ! సరసులు గాంక్షింపఁ
బలుక నీవె నేర్తు పద్మనయన!
గగనకుసుమమధ్య గామింప మేఘ
పుష్పము లరుదె? యనుచుఁ బలికికొనుచు
68
కం.వనితాసహస్రములు గొలు
వ నితాంతప్రేమ రామవసుధాపతి జ
వ్వనితో నవ్వని లోపలఁ
జనియెన్‌ వలిగాడ్పు చెలఁగు చల్లని త్రోవన్‌
69
కం.చని ముందరఁ గనె నిందిర
ఘనమందిరముల కమంద కలితమరందా
శనసంగులైన భృంగుల
స్వనభంగుల రం గెసంగు జలజాకరమున్‌
70
చం.కనుఁగొని రాఘవుండు వలిగాడ్పున రేఁగిన తేఁటిగుంపు స
ద్దునఁ దమి నిద్దురల్‌ విడిచి తోయజమండలి నంచలార్వఁ బ
ర్విన తెలిఱెక్కచాలు జిగి వెన్నెలలంచుఁ జలించు చక్రపం
క్తి నెగులు మాన్ప భానుఁ డరుదెంచె ననన్‌ దరి నిల్చెవేడుకన్‌
71
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju