ఇతిహాసములు ఉత్తరరామాయణము సీతారామచంద్రుల జలక్రీడావర్ణనము
సీతారామచంద్రుల జలక్రీడావర్ణనము
చం.జనకజఁ జూచి యా సరసి శైవలకేశిని పద్మకోరక
స్తన బిసబాహ కంబుగళ సైకతచారునితంబ మీనలో
చనయును గాన నీ సకియ చాడ్పున శ్రాంతి హరించె రాజహం
స నికర పక్షచామరజ చందన శైత్యమరుత్పరంపరన్‌
72
సీ.కలికి! జక్కవలు నీ వలిగుబ్బలకు నుబ్బి - పఱతెంచెఁ బారువ పట్టెనేమొ?
వెలఁది! తుమ్మెదలు నీ వేనలి వీక్షించి - యరుదెంచె గుఱు తెఱుకాయె నేమొ?
చెలువ! రాయంచ నీ చిన్ని నెన్నడలకై - మలసెఁ జుట్టఱికంబు దెలిసె నేమొ?
చెలి! జలేభములు నీ చికిలితొడల్గూర్చి - చెయ్యెత్తెఁ జెలిమిఁ గాంక్షించె నేమొ?
 
గీ.పొలఁతి నీ బెళ్కు వాలుచూపులకు మేని
తళుకులకు నోడి, నునుబేడిసలు నివాళి
యిచ్చెఁ దమజాతి పెద్దలం చెఱిఁగి యేమొ?
యువిద! సిరులున్న బాంధవ్య మొదవు టెంత!
73
సీ.ఈ యూర్ము లిఁకమీఁద నీవు వినోదింప - నామ్రేడితంబులై యడరకున్నె?
యీ కల్వ లిఁకమీఁద నీవు ద్రుంప గణింప - విగళితమధువులై నొగలకున్నై?
యీ యంచ లికమీఁద నీవు పట్టఁ దలంపఁ - దొలఁగి శైవలముల దూఱకున్నె?
యీ తేఁటు లిఁకమీఁద నీవు రాయిడి సేయ - సవిధకుంజములకు జరుగకున్నె?
 
గీ.యీ రథాంగంబు లిఁకమీఁద నీవు దఱుమ
నెగసి కమలవనంబుల నీఁగకున్నె?
యీ యిసుకతిప్ప లిఁక మీఁద నీవు కొలను
సొచ్చినప్పుడె పెందడి సోఁక కున్నె?
74
కం.శకులములకు దుమికెడు లకు
ముకుల గరుత్కులన నలినముల పుప్పొడి జా
నకి! యిచ్చట నెగసెఁ దటా
క కమల నీ మీఁదఁ జల్లు గందవొడి యనన్‌
75
చం.సకి! యకలంకతోయకణ సంగత పద్మపలాశమధ్య హ
ల్లకరుచు లొప్పెడిన్‌ - గొలఁకులచ్చి నినుంగని చెల్మి హెచ్చఁగా
మరకతపాత్రలో విమలమౌక్తికముల్‌ జతఁగూర్చి రత్న దీ
పకలన నిచ్చునారతుల భావమునన్‌ గనుఁగొంటె యిచ్చటన్‌
76
మ.చెలి! యబ్జంబు భవన్ముఖాకృతి రహించెం గానఁ జందబ్జుఁడై
యలరెన్‌, నీ ముఖవైఖరిం గువలయం బై తత్కళంకంబు నీ
తళుకుంగన్నుల పోల్కి రేఁ బగలు చెందన్‌ లేక విన్నందనం
బొలయంగా నపకీర్తి మించె మధుపవ్యూహాప్తిఁ గన్గొంటివే!
77
మ.అని వర్ణింపఁగనంత జానకివయస్యల్‌ రత్నపున్‌ సొమ్ములున్‌
మినుకుం బంగరు జిల్గువ్రాఁతపనులన్‌ మేలైన వల్వల్‌ సడ
ల్చి నును జందురుకావిపావడలు బాళింబూని కేల్దమ్ములన్‌
ఘనవక్షోరుహపాళి మాటుకొనుచున్‌ గాసారముం జొచ్చినన్‌
78
సీ.పద్మాయతాక్షుల ప్రపదసంపదలచేఁ - గూర్ముల కొకవింత కొమరు గలిగెఁ
బడఁతుల తళుకుఁ బెందొడలచే జలదంతి - కరముల కొకవింత గరిమ గలిగెఁ
దరుణీమణుల మేలితఱులచేఁ దఱుచైన - తరఁగల కొకవింత యొఱపు గలిగె
గిసలయాధరల పొక్కిళ్ళచే వర్తులా - ర్తాళి కొకవింత వన్నె గలిగెఁ
 
గీ.గొమలయారుల నళులొందెఁ గ్రొత్త సిరులు
సఖుల గుబ్బలఁ దులకించె జక్కవకవ
యతివలముఖ ద్యుతుల మించె నంబుజములు
సుదతులు క్రమంబునఁ గొలంకుఁ జొచ్చునపుడు
79
సీ.నీవు కొండొక యీఁద నేర్తువో నేరవో - పొలఁతి లోఁతటు మించి పోకు మనుచు
నీఁత నేర్తునటంచు నెఱుంగవా? నామీఁద - నోలఁ బెట్టిటు వోయె దుండు మనుచు
మన యుది మ్దుద్దుగుమ్మను గొమ్మ యదిముంచె - నెందుఁ బోయెడినొ? పోనీకు మనుచు
వలదు రాకుము మించి యలనాఁటి నా ధాటి - యెలనాఁగ! మఱచితి వేమె? యనుచుఁ
 
గీ.జెంతఁ జేరిన నీ వేమి సేయుదాన?
వాయె యీ వట్టిపగ్గె లేలమ్మ! యనుచు
సరససల్లాపములఁ గేళి సలిపి రంబు
జాకరంబునఁ బూర్ణచంద్రాస్య లపుడు
80
సీ.మొగములు గాన రా నిగిడి కామిను లీఁదఁ - గొలనెల్లఁ జంద్రమండలము లయ్యెఁ
గుచములు గాన రాఁ గొమ్మ లీఁద సరోవ - రం బెల్లఁ గమలకోరకము లయ్యెఁ
గ్రొమ్ముడుల్‌ గాన రాఁ గొమిరె లీఁదఁగఁ దటా - కం బెల్ల గాఢాంధకార మయ్యెఁ
బిఱుఁదులు గాన రాఁ బిసరుహానన లీఁద - దీర్ఘికాంతర మెల్ల దీవు లయ్యె
 
గీ.బాహువుల్‌ గాన రాఁ బద్మపాణు లీఁద
సరసియెల్ల మృణాలైక సదన మయ్యె
నంగములు గానరాఁ గాంచనాంగు లీఁద
సారసాకరమెల్ల బంగారమయ్యె
81
తే.గీ.కుచగిరులు నీటితో రాయఁ గొమ్మ యొకతె
మునిఁగి లేచిన నెమ్మోము మురువుసెందె
శైలమధనంబునను దొల్లి పాలవెల్లి
జనన మొందిన పరిపూర్ణచంద్రుఁ దెగడి
82
మ.జవరా లొక్కతె దొల్తఁ దన్ను సరసీజాతంబులన్‌ నొంచిన
ట్టి వధూటిన్‌ మరలం బయోజములఁ దాటింపంగ నుంకించి యం
బువులన్‌ దోఁచు నిజస్తనంబు లరుణాంభోజాతకోశంబులం
చు వెసన్‌ బాణులు జాఁపఁ జూచి నగి రచ్చోనున్న కన్యామణుల్‌
83
మ.సరసిం దోఁచిన ముద్దరాండ్ర మొగముల్‌ సత్యంబుగా మించు తా
మర లంచున్‌ బరువెత్తఁ బోయెడు మదోన్మత్త ద్విరేఫంబు, లా
సరసీజాక్షుల వాలుఁజూపులు సరోజాతాటవిన్‌ వాలినన్‌
బరరోలంబకదంబకంబు లనుచున్‌ బైనెత్తి పోకుండునే
84
మ.కరియానామణు లూను సంకుమదముల్‌ కాశ్మీరమున్‌ దావిక
స్తురియున్‌ గంధము సంగ్రహించి యరిసందోహారుణాంభోజ బం
భర హంసాదుల గాసి కోరిచె సరఃపద్మాఖ్యపద్మాక్షి - యి
ద్ధర నాత్మీయధనంబు లెంచరు వినూత్నద్రవ్యవాంఛాపరుల్‌
85
ఉ.ఆ వనజేక్షణల్‌ జలవిహార మొనర్చుచు దర్పమొంది యిం
దీవరపత్త్రభంగము లుదీర్ణతఁ జేయఁగ, లూటి యేల? యిం
దీవర పత్త్రభంగముల నేఁగొన నేరనె? యంచుఁ దత్సర
శ్శ్రీ విరుతిన్‌ వచించి యలచేఁ గొనె వారల పత్త్రభంగముల్‌
86
వ.తత్సమయంబున87
ఉ.వారి విహారముల్‌ గని యవారిత వారి విహారవాంఛ లోఁ
గూరిన సీత వేడ్క కనుకూలుఁడుగాన మెఱుంగుఁ బోలున
వ్వారిజగంధితో మొగులు వైఖరిఁ గేళికి నర్హమైన యా
కారముతో ధరావరశిఖామణి గద్దియ డిగ్గె నయ్యెడన్‌
88
సీ.ప్రతిలేని తన మోము పరిపూర్ణచంద్రబిం - బమొ? యంచుఁ జక్రదంపతులు గలఁగ
ఘనమైన తన కొప్పు కాదంబినియొ? యంచు - రాజహంసకుటుంబరాజి బెగడఁ
గనరాని తన కౌను కంఠీరవమొ? యంచు - జలకరేణుకరీంద్ర సమితి దెమలఁ
దులకించు తన తనుద్యుతి సంపెఁగయొ? యంచు - జంచరీక చయంబు చంచలింపఁ
 
గీ.జరణకాంతులు సంజకెంజాయ లనుచుఁ
బద్మవనలక్ష్మి తల్లడపాటుఁ జెంద
హేళికుల రాజమౌళి కెంగేలు వట్టి
కలికితలమిన్న కొలఁకులోపలికి డిగ్గె
89
కం.డిగ్గిన యగ్గజగామిని
నగ్గలికన్‌ సరసిలోని కధిపుఁడు దివియన్‌
బెగ్గడిలి కర యుగమ్మున
బిగ్గర మెడఁగౌఁగిలించి బెగడఁగ నగుచున్‌
90
ఉ.జానకిఁ జూచి “యొక్క కలశంబు భరించినవార లెంతలోఁ
తైనను జొచ్చి యీఁదఁగ మృగాక్షి! యురోరుహకుంభయుగ్మముం
బూనియు నీటికిన్‌ వెఱచిపోయెద” వంచు రఘూద్వహుం డనం
గా నగియెన్‌ లతాంగి పతికాయమునన్‌ లతయై పెనంగుచున్‌
91
చం.మొగము మిటారమున్‌ నుదుటి ముంగురులున్‌ దళుకొందు చూపులున్‌
జిగిచనుదోయి చెమ్మగిలు చెక్కుల తేటలు ముద్దుమాటలున్‌
బెగడును నవ్వుఁ దత్తఱము వేడుకలున్‌ గల సీత చెయ్వులన్‌
దగిలి, విభుండు లో మఱచెఁ దత్సరసిన్‌ విహరింప వచ్చుటల్‌
92
సీ.పతిదీర్ఘబాహువుల్‌ పరికించుఁ బరికించి - జలదంతిహస్తముల్‌ దెలియఁ జూచుఁ
విభుని కన్నులతెల్వి వీక్షించు, వీక్షించి - తెలిదమ్మిరేకుల తెలివిఁజూచుఁ
చెలువుని మైచాయఁ దిలకించుఁ దిలకించి - నీలోత్పలంబుల నీటుఁ జూచుఁ
బ్రాణేశు గళరేఖ భావించు, భావించి - శంఖసౌభాగ్యంబు సారెఁ జూచు
 
గీ.నధిపు దరహాస చంద్రిక లరయు నరసి
సరసిజమరాళ ఖగగరుచ్ఛాయఁజూచు
నతని యవయవములకు జోడౌనొ? కాదొ?
యను తలంపునఁ గొలనిలో నవనికన్య
93
సీ.తొడలబం టిటు రమ్ము జడియక యని యింత - యంతలోఁతున నడయాడ నేర్పెఁ
జెలు లీఁదులాడఁ జూచితె యంచుఁ జేయిచ్చి - యల్లనల్లన నీఁదులాడ నేర్పెఁ
నల యంచఁ బట్టి తెమ్మని కోర్కి రేఁచి ని - బ్బరపుటీఁతల నీటఁ దిరుగ నేర్పెఁ
బాణిఁ బూనినతమ్మి బల్మిఁ దాఁగొనివైచి - చనినఁ బోనీ కంటికొనఁగ నేర్పెఁ
 
గీ.దొలుత నెలనాఁగఁ దన కరతోయధార
ముంచి కరవారిధారల ముంచ నేర్పె
శ్రీరఘుస్వామి యంభోవిహారవేళ
ధరణికన్యక కన్నిచందములు నేర్పె
94
ఉ.అంచల నంచఁ బోలి కమలాటవి నిందిరఁబోలి నాఁచుమ
బ్బంచుల మించుఁ బోలి, తెరయన్‌ దెరలో మణిపుత్త్రిఁబోలి య
క్కాంచనగాత్రి రాఘవుని కన్నుల కింపొనరించుచున్‌ జలా
భ్యంతరకేళిఁదేలె సరసాళులు సమ్ముఖ మాశ్రయింపఁగన్‌
95
తే.గీ.దశరథాత్మజు కరవారిధార ధారు
ణీకుమారిక కురులపై నెరసి చెక్కు
లొరసి కణలీల మొగ మాని మెఱసె ముఖసు
ధాకరునిఁ గొల్వవచ్చిన తార లనఁగ
96
మ.అలివేణీమణి సీత యాత్మకరశోణాంభఃకణాసారపం
క్తులు కౌసుంభరసప్రవాహరుచి నెంతో మించెఁ గాంతల్‌ హళా
హళి నెంచన్‌ బతి మౌళి నించ, రఘువీరాంచత్కచశ్రీల న
జ్జలముల్‌ సేకొనెఁ బాకశాసనశిలాస్పర్థిద్యుతిస్నిగ్ధతల్‌
97
సీ.కొదమజక్కవ గోటఁ గ్రుచ్చిన పద్మకో - శమురేఖ కనుగొంటె సకియ! యనుచుఁ
బద్మినిపై నెక్కి భ్రమరంబు మధురసం - బానుచందముఁ గంటె చాన! యనుచుఁ
జలదంతి యావర్తసరణి హస్తాగ్రంబుఁ - జొనిపిన తమిఁ గంటె సుదతి! యనుచుఁ
నుత్పలిన్యుద్భాసితోర్మిడోలిక నంచ - నిదురించు వగఁ గంటె నెలఁత! యనుచుఁ
 
గీ.ధ్వను లెసఁగఁ బల్కుచును ఖగధ్వనులు వినుచు
సీతతోఁ గూడి రఘువీరశేఖరుండు
బాలలు స్వపక్షమున సీత పక్షమునను
జల్లుపోరాడఁ గనుఁగొంచు సరసిఁ దేలె
98
కం.తన తెగ మగువలు రఘురా
ముని తెగ కామినుల మించి ముంచిన నగు న
జ్జనకజ నగవుల దీర్ఘిక
యనిమిషదీర్ఘికవిలాస మయ్యెడఁ గాంచెన్‌
99
మ.తనకున్‌ దవ్వగు పద్మినిన్‌ వలచి సీతాదేవి ప్రార్థించినన్‌
మనువంశాగ్రణి యన్యకాంతను స్పృశింపన్‌ మాకనర్హంబు గై
కొను మీవే నినుఁ దెత్తు నాడ కనుచున్‌ క్షోణీజ బాహాంతరం
బునఁ బూనెన్‌ గమలావధూటి నెదపై మున్నుంచుకొన్నట్టుగన్‌
100
ఉ.కామినికేలుఁదమ్మికవ గమ్రపదాజ్జయుగంబు మోము కెం
దామర నేత్రపద్మము లుదగ్రకుచాంబుజకోరకంబులున్‌
రామనృపాలశేఖరు నురంబున మించెఁ బయోజమాలికా
శ్రీమహిమన్‌ గచద్యుతులు చెల్వెసఁగెన్‌ మధుపాళిపోలికన్‌
101
ఉ.ఓలలుపెట్టి గెల్చిన పయోరుహగంధిని బూనకుండినన్‌
బోలదటంచు నీతిగల భూపతి గావునఁ దానె పూనినాఁ
డీలలితాంగి మీ రఘుకులేశ్వరుఁ డంచును సీత నెచ్చెలుల్‌
గేలి యొనర్ప, రాముఁడు సఖీయుతుఁడై విహరించె నవ్వుచున్‌
102
చం.కమలమరందబిందు వుదకంబునఁ జింది యమందచంద్రికా
క్రమమున మించ నేమియిది? కాంతుఁడ! యంచు ధరాజవేడినన్‌
రమణి! సరోజలక్ష్మి మగఱాతెలికమ్మలు నీకొసంగె వే
గమ కొనుమంచు రాముఁ డని గైకొనఁ బోవఁగ నవ్వె బిట్టుగన్‌
103
చం.చెలియలలోన న న్నగడుసేసెదవే రఘురామ! యంచుఁ జెం
గలువ వధూటి భర్తయెదఁ గ్రమ్మఁగ వైచిన బోటులందఱున్‌
వలగొని తమ్మిపూవుల నవారణ ముంచిరి రాముఁ డందునన్‌
దలఁకినయట్ల చేరె వసుధాసుతమాటునకున్‌ సఖుల్‌ నగన్‌
104
ఉ.తప్పు గణించికా దొరలు దండన సేయుదు రొద్దివారి నా
తప్పున కల్గి మంది కలదాన నటంచును మారుతూపులం
గుప్పితి నీవు నీ చెలులఁగూడి బళా! యని మోము ద్రిప్పినన్‌
దప్పు సహింపుఁ డంచు సతి నవ్వుచుఁ గౌఁగిలి యిచ్చె భర్తకున్‌
105
ఉ.కోడె మిటారిగుబ్బకవ గుబ్బెత గ్రుమ్మిన మున్ను చల్లుపో
రాడిన శ్రాంతి దీఱఁ బులకాంకురముల్‌ చెలువారఁ గుంజరీ
క్రీడల నుబ్బు హస్తిపతికిం బ్రతియై జలకేళిఁదేలియున్‌
వేడుక వెల్లిఁదేలె రఘువీరుఁడు మారుఁడు కేక వేయఁగన్‌
106
వ.అప్పుడు107
సీ.అమృతనామము యథార్థముగను భరియించె - ననిమిషాలోకాప్తి నధిగమించి
వార్యభిధానంబు వన్నె కెక్కఁగఁ బూనెఁ - గరియానల విలాసగతు లడంచి
క్షీరాహ్వయము సార్థమై రహించ వహించెఁ - జెలుల మందస్మితశ్రీల దొరసి
వనసమాఖ్య ప్రశస్తవాచకంబుగఁ దాల్చెఁ - గొమ్మల చిల్కపల్కులఁ జెలంగి
 
గీ.కమలభావంబు నిక్కంబుగా ధరించె
లికుచకుచల కచాళి మేచకరుచిఁ గొని
శర మనెడి పేరు నిజమంద బెరసి మెఱసె
సఖుల తనువుల నొరసి తత్సరసి జలము
108
చం.అడరెడివేడ్క నొండొరుల నంటినయప్పుడు కౌఁగిలించిన
ప్పుడు, జనియించు సాత్త్వికపుఁ బొల్పు తనూపులకాంకురంబులున్‌
గడల మెలంగుబోటులకుఁ గానఁగ నీయక నోలలాడి యె
క్కుడుతమి భూమికన్యయు రఘుప్రభుఁడుం దనివొంది రయ్యెడన్‌
109
చం.అవనిజ చూపులున్‌ రవికులాగ్రణి మైజిగి నల్లకల్వలున్‌
గువలయనేత్ర నవ్వులు రఘుప్రభు చూపులుఁ దెల్లగల్వ లె
క్కువ యయి నిండె నీట మును గోసిన పువ్వులకంటె రెట్టిగా
నవుర! వధూవరుల్‌ సరసికర్పణ సేసిరనన్‌ జెలంగుచున్‌
110
చం.సకులు పయోదముం గడచు చంచలలో యన వెల్వడంగ మ
ద్వికచపయోజ హల్లకతతిం గొని కేళి యొనర్చి నీళ్ళలో
మకరులఁ జేర్చి పోయెదరు మానిను లంచు సరోవరేందిరా
ముకురముఖీలలామ వెసమ్రోసె సహోర్మిఖగస్వనంబునన్‌
111
వ.ఇవ్విధంబున112
కం.చెలువలు ముందుగ వెల్వడి
చలువలు చెలువలరఁ గట్టి సకలాభరణం
బులు వరుసఁ దొడిగి విరులిడి
బలువుగఁ గ్రొమ్ముడులు పూని బాగొందునెడన్‌
113
సీ.స్తనగుళుచ్ఛంబుల స్వస్తికాకృతి హస్త - కమ్రపల్లవములు గప్పికొనఁగ
వార్షికాంబుదలీల వహియించుకచపాళి - తటతరుస్థి కేకి పటలిఁ బిలువ
వాఁగు తేఁటులు రాఁగ డాఁగె నా నంసాగ్ర - భాగంబున నతాస్యపద్మ మొదుఁగఁ
దడిసిన జిలుగుతోఁ దళ్కు తళ్కనుమేని - మించు లక్కొల నెల్ల ముంచుకొనఁగఁ
 
గీ.గౌను గడగడ వడఁక వ్రేఁకపుఁ బిఱుందు
భారమున నెన్నడలు తొట్రువడఁ దటాక
మవనికన్యక వెలువడి యధిపుఁ గూడి
దరిని నిల్చిన సకియ లందఱును జేరి
114
కం.కొందఱు రఘుకుల భర్తకుఁ
గొందఱు మిథిలాధినాథుకూతున కత్యా
నందకరంబుగఁ గైసే
యం దగి రిర్వురఁ జతుర్విధాలంకృతులన్‌
115
వ.అప్పుడు116
చం.తొలకరిమించు కెందొగలతోఁ గలతోయజతారహారకాం
తులఁ దగు నవ్వుక్రొన్ననలతో నలతోరపు గుబ్బ చన్నులన్‌
దొలఁకెడి కౌను చంచలతతో లతతోఁ దగు మేని తావికిం
దుల యగు కొప్పు కేదఁగులతోఁ గులతోయదవేణి మించినన్‌
117
సీ.ఒప్పులొల్కెడి తళ్కుఁ గొప్పులోఁ దులకించు - కమ్మగేదఁగి ఱేకు లెమ్మె గుల్కె
వలిపపైఠాణి పావడమీఁదఁ దగు నిండు - జిగి బురుసాచీర సొగసు మీఱెఁ
బొసఁగు చంద్రపుబిళ్ళ బొట్టుపైఁ గనుపట్టు - తళుకుఁగస్తురిరేఖ సొలపుదెలిపె
ఱవికఁ బూన్చినలీల సవరొందు తెలిగంద - మలఁదిన చందంబు నందమయ్యె
 
గీ.రత్నతాటంకములు బివిరలును బావి
లీలు ముత్యాలసరములు కీలుకడెము
లాదియగు సొమ్ము లంగంబు లాని యలరె
నని విభుఁడు సీత సింగార మభినుతించె
118
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju