| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | శ్రీ సీతారాము లుద్యానవనమున మేడపై విహరించుట |
| సీ. | మొకమున వ్రాలు జానకి వాలుఁజూపులు - కస్తూరినామంబుఁ గడలుకొనఁగఁ బయికొన్న సీత నెమ్మెయిడాలు కటిబద్ధ - కనకాంశుకశ్రీలఁ గౌఁగిలింపఁ దులకించు కులకాంత తళుకుఁ జెక్కుల కాంతు - లురముగందపుఁ బూత నొరసికొనఁగఁ గెలన మించు ధరాజ కెంపురా బొగడల - జిగి చెవి జవ్వాది చెల్మి కలర | |
| గీ. | గదిసి నిలుచున్న సౌమిత్రివదినెగారి జిలుఁగు నవ్వులు మగరాల చిలుకతాళి ననఁగి పెనఁగఁ ద్రిలోక మోహనవిలాస ధాముఁడై మించె సీతాభిరాముఁ డపుడు | 119 |
| చం. | ఒఱపు వహించి జానకియు నున్నచెలుల్ గణికాశిరోమణుల్ పరిసరభూమిఁ గొల్వ నరపాలకుఁ డా సరసీతటంబునన్ గఱికొను గుజ్జుమామిడుల క్రేవ జగా కురువిందతీఁగ చ ప్పరముల నీడఁ జంద్రమణిబద్ధవితర్ది వసించియున్నెడన్ | 120 |
| తే.గీ. | అంబ కౌసల్య వనుప మహానసంబు జనులు, మానస మలరింపఁ జాలు భక్ష్య భోజ్య చోష్యాదికములు గవాజ్యదధులు మెచ్చఁ దగు మాంసశాకముల్ దెచ్చుటయును | 121 |
| సీ. | వగవగకూరలు వరుగు లప్పడములు - నొలుపుఁ బప్పును మించు టోగిరములు సద్యోఘృతంబులుఁ జక్కెర లుక్కెరల్ - పచ్చళ్ళు గిచ్చళ్ళు పాయసములుఁ గలవంటకము లిడ్డెనలు వడ లప్పమ్ము - లతిరసమ్ములు దేనియలు ఫలములు గారెలు బూరెలు చేరులు మోరులుఁ - గమ్మని మాంసముల్ ఘమ్ముమనుచు | |
| గీ. | వలచు పానీయములు చెలుల్ వరుసఁ బసిఁడి పాత్రల ధరించి వడ్డింపఁ బాత్రులైన సహచరుల బంతి నిడికొని జానకీల తాంగితోఁ గూడి రఘువీరుఁ డారగించె | 122 |
| కం. | మధురస గుంభనములు గల మధురపదార్థముల చవుల మరగి రసన త న్మధురిమ సారెకుఁ బొగడఁగ నధిపతి సుఖలీల నలరె నశనము వేళన్ | 123 |
| కం. | పౌలోమిఁ గూడి యమృతము గ్రోలెడి సురరాజుఁ బోలి క్షోణీసుతతోఁ గ్రోలె సుధారసధారలఁ బోలిన మాధ్వీకరసము భూవిభుఁ డెలమిన్ | 124 |
| మ. | అవనీకన్యకఁ గూడి యిట్లు చతురాహారంబులం దృప్తుఁడై యవనీశాగ్రణి కామినీకరమణీవ్యాసంగ భృంగారుకాం బువులన్ ధౌతకరాననారుణపదాబ్జుండైనచో భూమిపు త్త్రి వెసన్ బావడ యిచ్చి పైఁట దడియొత్తెన్ భర్తపాదాబ్జముల్ | 125 |
| ఉ. | అట్టియెడన్ నృపాలుఁడు వనాంతరకేళినగాగ్రసీమఁ జూ పట్టెడు కెంపుటుప్పరిగ బాళి గనుంగొని చందుచట్టులన్ గట్టినమెట్టు లింతిపదకంజరుచిన్ విడికెంపు గుంపులన్ గట్టినమెట్టులై వెలయఁ గామిని కేల్గొని యెక్కి యొక్కెడన్ | 126 |
| సీ. | నిలువుటద్దములతోఁ దళతళల్ వెలిఁ గ్రమ్ము - ముమ్మూల ఱామొత్తముల నెసంగు బలుగోడలఁ బొసంగు నులిపచ్చపగడంపు - బారు దూలంబుల వారమాను పులుదిండిఱాకంబముల డాలు గరిమంబు - లను మెఱుంగుల రంగు లునుచు పసిఁడి ప్రతిమల రూపమేర్పడఁ దోఁచు శశికాంత - జగతి పేరిటి గాంగఝరము దరికిఁ | |
| గీ. | బచ్చిక బెడంగు లిడుమేటి పచ్చఱాల చికిలి తిన్నెల ముంగిళ్ళఁ జెలఁగు చలువ చప్పరము క్రేవ జలయంత్రజలకణంబు లొలయ వింతలు దిలకించి యుత్సహించి | 127 |
| చం. | విరితొగచందువాతెగలవేడుకయౌ నడియంగణంబులోఁ బఱచిన రత్నకంబళిని బాగుగ సూరెపుటంపు గద్దియన్ వఱలు మెఱుంగు బంగరపు వన్నెజగా బురుసా తివాసిపై ధరణిజతో వసించెఁ బతి తళ్కుతలాడలఁజేతు లూనుచున్ | 128 |
| వ. | అప్పుడు | 129 |
| సీ. | నీలవేణి యొకర్తు నిలువుటద్దముఁ జూపెఁ - గమలాస్య యొకతె బాగా లొసంగెఁ గరియాన యొక్కతె కాళంజి ధరియించెఁ - గీరవాణి యొకర్తు గిండిఁ బూనెఁ గలువకంటి యొకర్తు చలువపావడ వైచె - సొగసులాఁడి యొకర్తు సురఁటి విసరెఁ గలకంఠి యొక్కతె గైవార మొనరించె - జవరా లొకర్తు హెచ్చరికఁ దెలిపె | |
| గీ. | నతివ యొక్కతె బిరుదు పద్యములు చదివె భామిని యొకర్తు వడి బరాబరు లొనర్చె సీత వామాంకమున నుంచి చెలువు మించి రవికులస్వామి కొలువున్న యవసరమున | 130 |
| సీ. | జంట ముత్తెపుఁ గుట్టు జంటఱైకలనంటి - బిగిగుబ్బచన్నులు పిక్కటిల్ల మగరాల చికిలి కమ్మలడాలు నిద్దంపుఁ - జెక్కుటద్దములతోఁ జెలిమిసేయ ముకుళత్కరాంభోజములు నిటాలములాని - కుంతలాళికులంబు కూడికొనఁగ దరహాసరుచి గాంగఝరి గీలుకొన వాలు - గల లీలఁ బెక్కువాల్ గన్ను లలరఁ | |
| గీ. | గొదమప్రాయంపు వెలయాండ్ర గుంపు రామ చంద్రునకుఁ గొల్వుమ్రొక్కులు సంఘటించి యఖిలవిద్యాధికులతోడ నధివసించి రధిపుననుమతి నర్హస్థలాంతరముల | 131 |
| కం. | మృదుపాకంబు రసస్థితి పదగుంభనగల స్వక్లప్తపద్యశతంబుల్ చదివి యుపశ్లోకించిరి మొదలఁ గవుల్ భానువంశముఖ్యుని గుణముల్ | 132 |
| మ. | అధికాహ్లాదకరప్రభాకలితరాకాబ్జోదయోద్యత్సుధాం బుధిజంఘాలతరంగ ఘుంఘుమరవోద్భూత ధ్వనిన్ వందిమా గధు లత్యుద్భటఘోష వర్ణబిరుదాంకశ్లాఘ్య పద్యావళుల్ బుధులౌరా! యని మెచ్చఁగాఁ జదివి రా భూమీశ్వరాగ్రంబునన్ | 133 |
| చం. | గవిసెన దీసి హొన్నుజిగికాయలు చన్నులు దాఁకఁ దంత్రులొ క్క వరుస దీటి మెటులొడికంబుగ నొత్తి స్వరంబు లన్నియున్ సవురు వహింపఁ దాళలయ సంగతి గీతములున్ బ్రబంధముల్ ప్రవణత నొక్కలేమ నరనాథునకున్ వినిపించె వీణియన్ | 134 |
| చం. | స్వరము లయారె! మేలు శ్రుతి! బాగురె మూర్చన! కంపితంబు బా పురె! బళిరయ్య డాల్! మెఱసెఁ బో నెరమీటు కులంబు ఠాయి! య ద్దిర స్ఫురితంబు! లమ్మ! యని తేనియ లొల్కెడి జిల్గు పాటతోఁ దరుణి విపంచి మీటె వసుధాపతి మెచ్చుకొనన్ రసజ్ఞతన్ | 135 |
| ఉ. | తంబుర మీటి వేఱొకతె తానము లెంతయు విస్తరించి రా గం బనురక్తి రాలు గరఁగన్ బలుమోడులు పల్లవింప న య్యంబుజినీమనోహరకులాగ్రణి మీఁది పదంబు పాడినన్ గ్రొంబులకల్ జనించె, సభకున్ దల వాంచిరి వైణికాగ్రణుల్ | 136 |
| చం. | దడముగ మర్దళధ్వనులుఁ దాళరవంబులుఁ బిక్కటిల్ల న య్యెడఁ దెలిముత్తియంపుఁ దెరయెత్త శరజ్జలదాళి పాసినన్ బడుబలుమించులో గవిసెనల్ దొలఁగించిన మించు మంచిపు త్తడి జిగిబొమ్మలో! యనఁగఁ దారొగి వెల్వడి రంబుజాననల్ | 137 |
| ఉ. | మంజుతరాంగభూషణ సమంచితకాంతులు రచ్చ నేల మిం చం జనుకట్టు లోబిగువు జక్కవగుబ్బల యుబ్బుఁ దెల్పఁ బ త్కంజయుగంబు లుర్వి సమతం దులకించి విలాస మెంచఁ బు ష్పాంజలు లిచ్చి యాడిరి మృగాయతనేత్రలు పెక్కుభంగులన్ | 138 |
| సీ. | అభినయంబులు కోపు లరుదైన తీరుపుల్ - వెలయఁగాఁ బదచాళివిధ మొకర్తు లాగు మైసిరియుఁ బల్లటియుఁ గత్రియు బెళ్కు - విలసిల్లు జక్కిణి విధ మొకర్తు బురకఁడు చంకబంగరుబుట్ట తగు జాతి - వినికిగాఁ గొరవంజి విధ మొకర్తు ఠీవిఁ దాళము లుగ్గడింపుచోఁ దీరుచో - వింతగాఁ బేరణివిధ మొకర్తు | |
| గీ. | నలరి వినిపింపఁ బతిమెచ్చ నంత నిర్వు రిరువు రెనమండ్రుఁ బదియాఱుగురును ముప్ప దిద్ద ఱఱువది నలువురు హెచ్చుగాఁగ బంతులై వంతులూని యయ్యింతులెల్ల | 139 |
| సీ. | అన్యోన్యహస్తదండావృత్తు లెసఁగ నొం - డొరుల సామ్ముఖ్యంబు లొంది యొంది యీవ లావల వచ్చి యితరేతరము దొల్త - నిలచిన నెలవుల నిలిచి నిలిచి కంకణమంజీరకాంచికల్ మ్రోయస - వ్యాపసవ్యస్ఫూర్తిఁ జూపి జూపి తాళవాద్యరవానుకూలంబుగా మంద - దృతమృదుగతులను దిరిగి తిరిగి | |
| గీ. | యనుపమరసోదయంబున నభినవాతి చిత్రవర్తనభంగులఁ జెలఁగి చెలఁగి విడివడిన మన్మథోన్మదద్విరదము లన సఖులు హల్లీసకము సల్ప సంతసిల్లి | 140 |
| తే.గీ. | వారివారి కళాగౌరవంబు లెల్ల ధరణిజకుఁ దెల్పుచును దారతమ్య మెఱిఁగి వలయు మణిభూషణాదులు వారి కొసఁగి కొలువు సాలించి రఘువీరకుంజరుండు | 141 |
| తే.గీ. | ఇతని యిరు పార్శ్వముల నింక నిరవుకొనెడి యమితకరదీపికాద్యుతుల్ తిమిర మడఁప నేల తా? నన్న పోలిక హేళి గ్రుంకఁ జరమసంధ్యాక్రియలు దీర్చి జనవిభుండు | 142 |
| సీ. | కుంభస్థలోజ్జృంభికుంకుమారుణదీప్తి - చరమసంధ్యారాగ సామ్య మూన నింగితో నొఱయు నుత్తుంగాంగకము డాలు - బలుచీఁకటుల జోకఁ బరిఢవిల్ల భూరిపుష్కరసముద్భూత శీకరపాళి - తారాగణశ్రీలఁ జేరఁ బిల్వ దంతద్వయాత్యంత ధవళకాంతి సమృద్ధి - వికచకైరవిణితో వియ్యమంద | |
| గీ. | సమయసముచిత మహిత చిహ్నములఁ బూని యమరు శత్రుంజయముతోడ ననుజమంత్రి బంధు సామంతు లుపవనప్రాంతములకు వచ్చుట యెఱింగి స్త్రీయుక్తి వనము వెడలి | 143 |