| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | శ్రీ సీతారాము లుద్యానంబు నుండి యయోధ్యఁ బ్రవేశించుట |
| సీ. | నలువంకలను నిండి నవనభోమణికాంతి - నెడ లేక దివ్వటీ లెసక మెసఁగఁ బటహగోముఖశంఖ పణవాది బహువాద్య - రవములు రోదోంతరముల నెఱయ సకియలు గొల్వఁ బచ్చల పల్లకీ నెక్కి - పంటతొయ్యలిపట్టి వెంట రాఁగ నెలవంకవలె వంక నొలసి వింజామరల్ - వేవేలగొడుగులు వేడ్క నెఱప | |
| గీ. | భద్రకరి నెక్కి శ్రీరామభద్రమూర్తి కోటిచంద్రుల కళలెల్లఁ గొల్లలాడి తమ్ము లార్యులు భటులు బాంధవులు హితులుఁ జేరి కొలువంగఁ బురిఁ బ్రవేశించి రపుడు | 144 |
| చం. | పలుమఱుఁ జూచుచుండియును భానుకులేంద్రుని రూపసంపదల్ తెలియఁగఁ జూచుచోఁ దనివిదీరక పౌరవధూటు లిండ్లలోఁ గల పను లన్నియున్ విడిచి, కాంచనసౌధము లెక్కి, తళ్కుఁ జె క్కులఁ జిఱుచెమ్మటల్ దొఱఁగఁ గోరిక మీఱఁగఁ జూచి రవ్విభున్ | 145 |
| ఉ. | కోమలియోర్తు మారువిరిగోలల నేలెడు వాలుఁజూపులన్ రామునిఁజూఁడఁగాఁ బరిసరంబున నున్న లతాంగి యయ్యయో! యేమె! వధూటి! నీవు నెనరించుక యెంచవు వాఁడిచూపులన్ గోమలదేహుఁడైన రఘుకుంజరుఁ జూతురఁటే? యనున్ రహిన్ | 146 |
| తే.గీ. | రాజసము మీఱఁ జనుదెంచు రాముఁజూచి సాత్త్వికము నీవు పూనిన చందమేమి? తామసము సేయ కిది దెల్పు భామ! యనుచుఁ బ్రౌఢసఖి యోర్తు దనచెలిఁ బరిహసించె | 147 |
| ఉ. | జాఱిన పువ్వుదండ జడఁ జక్కఁగఁ జుట్టక కొంత పాణిపం కేరుహసీమఁ బూనుకొని శ్రీరఘురామునిఁ జూచె ముత్తెపున్ సోరణగండ్ల నోర్తు నినుఁ జూచిన నన్ను మరుండు నొంచెఁ ద త్క్రూర సుమాంబకంబు లివిగో! నని చూపఁగఁ దెచ్చెనో యనన్ | 148 |
| చం. | ఒక రమణీశిరోమణి కుచోపరిసీమ వెలుంగు కెంపుఱా చికిలి మెఱుంగు తాళి రఘుశేఖరురూపము గానుపింప ను త్సుకమతి సారె గుబ్బచనుదోయిని జేర్చుచు నుండి యొద్ది బా లిక నునుఁ జెక్కులం బ్రతిఫలించినరామునిఁ జూచె జంకెనన్ | 149 |
| చం. | చెలువ యొకర్తు బోటి తన సిబ్బెపుగుబ్బలఁ బత్త్రభంగముల్ వలనుగ వ్రాయుచుండి, యిదె వచ్చె రఘూద్వహుఁ డన్న భ్రాంతిమైఁ బలుమఱు రామనామములె బంతులుగా లిఖియింప నగ్గతిన్ వెలువడెఁ బేరు నీదియని వీథిని భర్తకుఁ దెల్పనోయనన్ | 150 |
| తే.గీ. | అతివ యొక్కతె యుత్తుంగహర్మ్య మెక్కి రామచంద్రుని శృంగారరససుధా ప్ర వాహ మీక్షాపరంపర వలనఁ గ్రోలి ఱెప్పలార్పక యచ్చర యొప్పు దాల్చె | 151 |
| ఉ. | అందఱు లీలఁ జూడ నొకయంగన తానును వచ్చి రాజసం క్రందను నంద మంతయు నెగాదిగఁ గన్గొని చొక్కి యట్టి యా నందమె యింద ఱొందెదరు నావలెనే యని యీసుఁ జెందె భూ నందన కెట్టు లుండు? నిఁక నాథుని నందఱుఁ జూచి సొక్కినన్ | 152 |
| వ. | ఇవ్విధంబున | 153 |
| సీ. | రాకాసుధాకరశ్రీకి గీమగు మోము - కళలుట్టిపడ సారెఁ గాంచి కాంచి యాజానులంబిబాహార్గళంబులు ప్రేమ - నిగిడి తీఁగలు సాఁగఁ బొగడి పొగడి కర్ణాంతదీర్ఘ దృక్కంజాతయుగలౌల్య - మిచ్చ నిచ్చలుహెచ్చ మెచ్చి మెచ్చి బలుతల్పు నగు నురస్థలముపై విఱివియౌ - తమి నిల్పి యేమేమొ తలఁచి తలఁచి | |
| గీ. | మెఱుఁగు నీలంపుఁ జామన మేని చాయఁ గని విమోహతమంబులో మునిఁగి మునిఁగి కొమలు లాజాక్షతోత్ఫుల్లకుసుమరాజి సేస లొలుకంగ మొగసాలఁ జేరి విభుఁడు | 154 |
| కం. | వేదండము డిగ భరతుఁడు కైదండ యొసంగెఁ బాదకమలంబులకున్ బాదుకలు దొడిగె లక్ష్మణుఁ డాదట జలజాక్షు లిచ్చి రారతులు దగన్ | 155 |
| శా. | శత్రుఘ్నుం డతిభక్తిఁ బాద్య మొసఁగెన్ సౌమిత్రి పార్శ్వంబునన్ ఛత్రగ్రాహకుఁడై వసింప జగతీజామాత సంప్రీతుఁడై మిత్రామాత్య సుహృద్భటాదికుల నెమ్మిన్ వీళ్ళకుం బుచ్చి భూ పుత్త్రీరత్నవిచిత్ర సౌధమునకుం బోయెన్ సహాప్తంబుగన్ | 156 |
| తే.గీ. | పోయి, యట వింతయౌ నొక భూరిచంద్ర కాంతగృహమున సోదర్యగణము నర్మ సఖులుఁ గొలువఁగ నొకజాము సరసగోష్ఠి నెలమి వసియించి మఱివారి నిండ్ల కనిచి | 157 |
| వ. | అయ్యుదాత్తగుణోత్తరుండు జానకీమత్తహంసగమనారిరంసాపరాయత్త చిత్తంబునఁ దత్కాలోచితకృత్యంబులు నిర్వర్తించి, కిలికించితవతీసమంచిత కరాబ్జ రారజ్యల్లామజ్జకవ్యజనాబ్జాతశీతలవాతలహరీనివారితఘర్మవారియై, యవారిత కస్తూరికాసారకర్పూరశకలసముదయోదయభాస్కర ప్రముఖ ప్రశస్తవస్తువులన్ గ్రమ్ముగొని, ఘుమ్మను తమ్ములంపుఁగమ్మతావుల కనుంగు లగు నంగరాగ వాసనల డాసిన కైశిక ప్రసవమాలికాపరిమళంబులకు నిండుకొను గండుతేఁటుల దీటుల నీటుఁగను మేటినీలంపురాల నిగనిగల నిగడు చికిలిలోపలిక్రేవల వ్రేలు జాళువాపంజరంబుల చిలుకపలుకులకు మాఱు పలుకు గోరువంకలవంకఁ జెలరేఁగి, కవకవలు గొణఁగుచుఁ గెరలు బకదారుల యారజంపుటెలుంగుల నెఱుంగనీక, మఱుగ్రుచేయు మెఱుంగు కెంపు ఱాసోరణ గంటిచిరుత తెమ్మెర సోఁకునన్ దమంత మొరయు విపంచికల తానప్రపంచంబునన్ బ్రాణంబులు వచ్చెనో యన, మెచ్చుసు ప్పాణిముత్తియంపుఁ గ్రచ్చుటోవరులఁ గ్రచ్చుకొని మచ్చెకంటులు కీ లెఱింగి జంత్రంబులు గడలించినన్, దనకు వీచోపులు వీచు కుందనంపుఁ గీలుబొమ్మలయెమ్మెల కి మ్మగుచుఁ, జూడఁజూడ వేడుక యగుచు, నెగడుపైఁడిమేడ యెక్కి యక్కడ. | 158 |
| సీ. | రతిఁ జొక్కి కేళినీరమణి గుబ్బలమీఁద - వ్రాలిన వలరాచవాని సొగసుఁ గినిసి కీల్జడను గొట్టిన రోహిణికి మ్రొక్కి - మమతఁ జూపెడి చందమామ వలపుఁ బౌరుషంబున మించి పౌలోమినెదనుంచి - యలరెడు వేల్పురాయని విలాస మధరంబు గ్రోల నిమ్మని రంభ చుబుకంబుఁ - బట్టి వేఁడు ధనేంద్రుపట్టి హొయలు | |
| గీ. | కలయవ్రాసిన కళుకు గోడల మెఱుంగు మేలుముత్యంపుఁ దలుపులుఁ బూల చందు వా తెగలు ధూపధూమంబు వలపు లుదిరి గిండ్లు మొదలుగఁ గల కేళిగృహమునందు | 159 |
| సీ. | కడవన్నె బొమ్మ చెక్కడపుఁ జొక్కపుఁ గోళ్ళు - పగడంపు నికరంపుఁ బట్టియలును సరిలేని మంచి గుజ్జరినేఁత పట్టయుఁ - బఱపైన రాయంచగఱుల పఱుపు నరవిరి విరవాది విరులఁ బూన్చిన పాన్పు - పైఁ బఱచిన వలివంపు వలువ కొమరొందు నెల కరంగు మెఱుంగు తలగడల్ - బలితంపు బురుక కాల్పట్టె బటువు | |
| గీ. | లమరు మగరాల పని చప్పరము మెఱుంగు చాయ బురుసా తెరయు రహించంగ మించు పట్టెమంచంబుపై రామభద్రుఁడున్న యవసరంబున జనకకన్యాలలామ | 160 |
| చం. | తిలకపు రంగుతో నలకదీప్తులు నెన్నుదుటన్ నటింపఁగాఁ గలపపుఁదావి నల్గడల గమ్మనఁగన్ సరిగంచు చెల్వకు చ్చెల లపరంజి మెట్టియల జీరఁగ నందెలు మ్రోయ, సోయగం బొలుకఁగ వచ్చె నత్తఱి రఘూత్తముచిత్తము తత్తరింపఁగన్ | 161 |
| కం. | వచ్చి కపురంపు బాగా లిచ్చి పిదప మడుపు లొసఁగి యింపగుసేవల్ మచ్చిక నొనర్పఁ జెలువు డచ్చెలువన్ గలసి మెలసి యానందించెన్ | 162 |
| వ. | మఱియును | 163 |
| సీ. | బంధ చాతుర్యసంబంధముల్ పణముగా - ద్యూతకేళిప్రౌఢి దొరసిదొరసి కలరవాదులకల్మిఁ గనుటకు ఫలముఁగాఁ - గడలేని వేడ్కలఁ గలసి గలసి యలరు పుక్కిటి వీడియంబు లుంకువలుగా - నధరామృతరసంబు లానియాని పరిరంభ చుంబన స్ఫురణ లేకములుగా - సొలపుతోఁ గళ లంటి చొక్కి చొక్కి | |
| గీ. | సొగసుఁ జూపుల నొండొరుఁ జూచి చూచి మెలపు లొలయంగఁ జతురిమల్ మెచ్చి మెచ్చి పులక లెసఁగంగ మణిత మింపున వినివిని సతియుఁ బతియుఁ జెలంగిరి స్వైరగతుల | 164 |
| చం. | వలపు రాజు వేడబమొ? వారల యద్భుత మోహభారమో? తెలియదు నిచ్చలున్ దనివి దీరనిముచ్చట లోసరింత లే కలరెడి గౌఁగిలింత వెడలన్నది విన్నది లేని కూర్ములున్ గలఁకలు గానికూటములుఁ గల్గి రమించిరి మించిరిర్వురున్ | 165 |
| సీ. | మరుని సమ్మోహన మంత్రాక్షరము లొండొ - రుల నొండొరులు పల్కు పల్కు లెల్ల నించువిల్తుఁడు ప్రయోగించు వాల్తూపులు - సొలసి యొండొరుఁ జూచు చూపు లెల్ల నతనుకళారహస్యంబుల యిక్కలు - సొగసి యొండొరు లంటు చోటు లెల్ల రతిమనోహరు మనోరమఖేలనము లొండొ - రులు మేకొని తలంచు తలఁపు లెల్ల | |
| గీ. | వారి చొక్కులు టెక్కులు వారి వగలు వారి వన్నెలు చిన్నెలు వారి నటన వారి హరువులు మురువులు వారి కళలు వారి వలపులు సొలపులు వశమె పొగడ? | 166 |
| వ. | మఱియును | 167 |
| సీ. | నెరసిన నుదుటిముంగురులు చక్కఁగ దువ్వి - ప్రియముతోఁ గీల్కొప్పుఁ బెట్టు నేర్పు పన్నీట నెమ్మోముఁ బ్రక్షాళన మొనర్చి - తీరుగాఁ దిలకంబు దిద్దు సొగసు చిఱుచెమ్మటలు గ్రమ్మ మెఱుఁగు లేఁజెక్కుల - వలనుగా మకరికల్ వ్రాయు హొయలు సరులు చిక్కులు దీర్చి జవ్వాజికస్తూరి - కులుకు గుబ్బలఁబూయు కోడెతనము | |
| గీ. | హెచ్చి మగఁటిమిఁజూపుచో నొచ్చెనేమొ యొత్తుదునె యంచు నంఘ్రి కేలుంచు నెనరు; వెలఁది కొమ్మని పుక్కిట వీడె మిచ్చు బాళి-జవరాలిఁగరఁగింప భర్తయలరె | 168 |
| సీ. | గళరవంబులు నేర్చి కలరవంబులు వల్క - సిగ్గుతో నెద మోముఁ జేర్చుహొయలు చరణలాక్షాముఖాంబుజమునఁ గన్గొని నవ్వు - చును మించుటద్దంబుఁ జూపు సొగసు కొసరుమాటలను బైకొన్న చిన్నె గణింపఁ - గినుకతో నుదరి జంకించువగలు దొడనుంచి యంఘ్రు లొత్తుచుఁ జన్నుదోయిఁ గ - న్నులఁ జేర్చుకొని బాళి నలరుమమత | |
| గీ. | తమకమున మించి యేమేమి తప్పులాచ రించితినొ యన్నియును క్షమియించుఁ డనుచు వినయమునఁ జంద్రముఖి మ్రొక్కి వేఁడుభక్తి నృపతిచిత్తంబుఁ గరఁగించె నిమిషమునను | 169 |
| చం. | చతురత వింతబంధముల సారెకుఁ గల్పన సేయుచున్ బునా రతులఁ బెనంగుచున్ రతుల రాయిడి సోలి, నఖచ్చిదారద క్షతములఁ గ్రమ్మఱన్ మెలపుఁ గాంచుచుఁ గంతుఁడు పూను సూత్రపుం బ్రతిమల పోలికన్ దనర, రాత్రి క్షణంబయితోఁచె వారికిన్ | 170 |
| కం. | ఈ లీల రేలు భూమిజ నేలుచుఁ బగలెల్ల భూమి నేలుచు ధర్మ శ్రీలోలుండై యేక స్త్రీలోలుండనఁగ బతి ప్రసిద్ధి వహించెన్ | 171 |
| వ. | మఱియును | 172 |
| సీ. | ఘనలతాసుమధూళిఁ గదియు తేటులకేళిఁ - దనరు కేళాకూళి దరులయందు శారికాపికకీర సల్లాపములు మీఱ - వలనొప్పు శృంగార వనులయందుఁ దెఱగంటి చెలిమంది నెఱచిత్తరులఁ జెంది - రహిఁజెందు మణిమందిరములయందు దపనీయరుచి బాల తపనాంశువుల నేలఁ - జాలులీలాశైల సమితియందు | |
| గీ. | నందమగు చందుఱా తిన్నెలందుఁ జంద్ర శాలలందును దూఁగుటుయ్యాలలందు మహితనయహిత యగుమహీదుహితఁ గూడి యహరహంబును విహరించె మిహిరకులుఁడు | 173 |
| కం. | శ్వశ్రూజనగురుభూసుర శుశ్రూషాస్నిగ్ధగతుల శుద్ధవ్రతబ ద్ధశ్రద్ధలఁ బరిజనవృ ద్ధశ్రితరక్షణల సీత దగెఁ బతి యలరన్ | 174 |
| సీ. | స్నాన సంధ్యాహోమదానాదికృత్యంబు - లర్హకాలములందె యాచరించి యంబరాభరణమాల్యానులేపనములు - సమయోచిత స్ఫూర్తి సంగ్రహించి భోజనపాన తాంబూలాదికములు దే - హానుగుణంబుగా నవధరించి వ్యసనంబులందుఁ గేవలసక్తిఁ జెందక - నవియును దగురీతి ననుసరించి | |
| గీ. | జాతిచేష్టాగుణేంగిత రీతు లెఱిఁగి సీత నేలుచుఁ బ్రజల రక్షించుచును స హోదరులఁ బ్రోచుచును, దల్లు లుత్సహింప వసుధఁ బాలించె రఘువంశవల్లభుండు | 175 |
| కం. | పదివేలకోట్ల యేండులు వదలక ధర రాముఁడేలవలె నని ప్రజ లె ల్లఁదలంప సీతఁగూడుక పదివేలేఁడులు సుఖించె బహుసౌఖ్యములన్ | 176 |
| చం. | జనపతి యిట్లు సీత యెలజవ్వన మంతయుఁ గొల్లలాడుచున్ దినములు గొన్ని దాఁటఁగ రతిప్రియుఁ డస్త్రము తూణి మాటఁగా ననితరగర్భ చిహ్నమచలాత్మజ దాలిచె రాజమౌళితో ననిశముఁ గూడి తొల్లి యచలాత్మజ గర్భము దాల్చుఁ కైవడిన్ | 177 |