| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | శ్రీరామచంద్రుఁ డశ్వమేధయాగము సేయుట: |
| చం. | మనుకులరాజశేఖరుఁ డమందగుణాంబుధి రాముఁడెంతయున్ ఘనహయమేధయాగకుతుకంబు మనంబున మించ లక్ష్మణుం గనుఁగొని - వత్స! నీవు చని కశ్యపకుత్స వసిష్ఠ కణ్వము ఖ్య నిఖిల సంయమీశ్వరుల గ్రక్కునఁ దోడ్కొని రమ్ము నావుడున్ | 3 |
| ఉ. | ఆ లవణారియన్న, పతి యానతి యౌదలఁ దాల్చి చెచ్చెరన్ గాలవ కౌశికాత్రి భృగుకణ్వ పరాశర వామదేవ జా బాలి వసిష్ఠ కశ్యప విభాండకముఖ్యుల వేదశాస్త్రముల్ చాల నెఱుంగు బ్రహ్మమునులన్ దొడి తెచ్చె వినీతి హెచ్చఁగన్ | 4 |
| ఉ. | అంతకుమున్నె నిండుకొలువై భరతాదులు గొల్వనున్న భూ కాంతుఁడు వారి రాక విని కాంచనపీఠిక డిగ్గి నిర్మల స్వాంతముతో నెదుర్కొని సువర్ణకిరీటరుచుల్ తదీయపా దాంతికభూమి ముంచుకొన నందఱకుం బ్రణమిల్లి వేడుకన్ | 5 |
| తే.గీ. | వినయమును దోడి తెచ్చి వేఱ్వేఱ సముచి తాసనంబుల నునుచి హస్తాంబుజములు మొగిచి తన చూపు దేఁటు లమ్మునుల వదన పద్మములయందు నిగిడించి పలికె విభుఁడు | 6 |
| చం. | అనితరపుణ్యులార! భువనాంచితమౌ హయమేధమేను మీ యనుమతిఁజేయువాఁడనని యాత్మఁదలంచితి మీరలమ్మఖం బునకు ననుజ్ఞనిండనిన బోరన నమ్మును లెల్లఁబల్కిరో జనవర! ముజ్జగంబులకు సమ్మతమా క్రతు వాచరింపవే! | 7 |
| తే.గీ. | అన్యథాభావ మొందునే యధిప! నీయ మోఘసంకల్పమున కన్న ముదముఁ జెంది మ్రోల నిలుచున్న లక్ష్మణు మోముఁ జూచి పలికె నమ్మేటి గంభీరభాషణముల | 8 |
| చం. | హవనముఁజూఁడఁగా - రవిసుతాంగదవాయుజనీలజాంబవ ద్గవయ గవాక్ష ధూమ్ర నలతార సుషేణ సువేగ వేగద ర్శి వినత గంధమాదన దరీముఖమైంద సుబాహుకేసరి ద్వివిద గజప్రజంఘ ముఖవీర కపీంద్రులఁ బిల్వఁ బంపుమా! | 9 |
| మ. | అనలాద్యన్వితు నవ్విభీషణుని లంకాధ్యక్షు రప్పింపు, చ య్యనఁబిల్పింపుము కేకయాధిపవిదేహక్ష్మానాథ ప్రవ ర్ధనముఖ్యప్రియ బంధులన్, హితసుహృత్సందోహముంగూడి ర మ్మనుచున్ లేఖలు పంపుమీ యఖిలదేశాధీశరింఛోళికిన్ | 10 |
| శా. | నానాదేశనివాసులైన ద్విజులన్ నానానదీతీరవ న్యానిత్యాశ్రయులౌ మహర్షులను మింటన్ మించు సప్తర్షులన్ నానాదేవధరస్థలాంతరములన్ నల్వొందు దేవర్షులన్ నానాదిక్కుల నున్న బ్రహ్మఋషులన్ రప్పింపుమా గ్రక్కునన్ | 11 |
| తే.గీ. | బ్రహ్మనిష్ఠా గరిష్ఠులై బ్రహ్మఁబోలు బ్రహ్మవర్చస మింపొంద బ్రహ్మపరత బ్రహ్మలోకంబున వసించు బ్రహ్మమునుల ననఘ! ప్రార్థించి పిలిపింపు యాగమునకు | 12 |
| కం. | కవిగాయక పరిహాసక వివిధస్తుతి పాఠకులను వీణావాద్య ప్రవణుల నర్తకవాంశిక నివహము రప్పింపు యజ్ఞనిలయంబునకున్ | 13 |
| సీ. | నైమిశారణ్యపుణ్యక్షేత్రమున మించు - గోమతీనది తీరభూమియందుఁ జాల్పు వెడల్పును శాస్త్రరీతి నెఱుంగు - చతురశిల్పాచార్య జనులచేత ముఖమండపంబు నిర్మాణంబు సేయింపు - మమ్మఖశాలకు నన్నియెడల బ్రాహ్మణక్షత్రియోరవ్య శూద్రప్రము - ఖులు నిల్వఁదగు రచ్చకొట్టములును | |
| గీ. | బొక్కసపు టిండ్లు నుగ్రాణముల నెలవులుఁ బాకశాలలు మఠము లనేకభోజ నార్హశాలలు పటశాల లాపణములు గరి రథతురంగశాలలుఁ గట్టఁబనుపు | 14 |
| ఆ.వె. | చలువచప్పరములుఁ జలివిందరులు నెడ నెడలఁగలుగఁజేయు మెప్పటికిని విపణివీథులందు వివిధవస్తువు లమ్మి కొనుఁడటంచు వైశ్యజనుల కనుము | 15 |
| సీ. | సెనగలు గోదుమల్ మినుములు దిలలు ము - ద్గములు మున్నుగఁగల కాయధాన్య ములు పర్వతాకారములు గాఁగఁ బోయింపు - తండులరాశులు దఱచుగూర్పు దధిఘృతతైలముల్ మధుగుడశర్కరల్ - కదళీఫలాదులు కందమూల ముల తెగల్ దెప్పింపు పలు కాయగూరలు - చాలనిప్పటినుండి సంగ్రహింపు | |
| గీ. | మనఘ! మఖసాధనములైన యఖిలవస్తు సమితి మునుగల్గ ఘటియింపు శతసహస్త్ర సంఖ్యల రహించు గోవులు స్వర్ణరత్న భారకోటులు జతగూర్చి పనుపు మటకు | 16 |
| కం. | వివిధోక్తుల నేఁదెలిపిన యవియును నేఁదెలుప మఱచినవియును జతగూ ర్పవలయు నని లక్ష్మణుతో రవికులపతి తెలిపి మఱి భరతుతో ననియెన్ | 17 |
| ఉ. | పౌరుల నిష్టబాంధవులఁ బ్రాజ్ఞుల నంతిపురంబు కాంతలన్ దారకులన్ భటాదికులఁ దల్లుల నాశ్రితులన్ ధరాసుతా కారసువర్ణపుత్రికను గ్రక్కున నధ్వరశాలఁ జేర్పుమీ చేరిన వస్తువాహన విశేషములేమఱకుండు మచ్చటన్ | 18 |
| కం. | యాగమునకు శత్రుఘ్నుని వేగంబునఁ బిల్వఁబంపు విసువక మఖశా లాగతులగు యతులకు న భ్యాగతులకుఁ బూజసేయు మన్వహ మచటన్ | 19 |
| కం. | అని నిర్దేశించినఁదన యనుమతి నేకాగ్రచిత్తులై విసువక య ప్పనులెల్ల సంఘటించిన యనుజన్ముల మెచ్చె రాముఁడనురాగమునన్ | 20 |
| కం. | సంపూర్ణాంగము లక్షణ సంపన్న ముదీర్ణకృష్ణసారం బగుచున్ బెంపొందు హయము వెంబడిఁ బంపెన్ లక్ష్మణు ననేకబలసహితముగన్ | 21 |
| చం. | అతఁడు ననేకసైనికసమన్వితుఁడై బహుఋత్విగావళీ యుతుఁడయి శత్రుభీకరబలోద్ధతుఁడై చతురంతధారుణిన్ గ్రతుతురగంబుఁద్రిప్పె భుజగర్వము దక్కి సమస్తధారుణీ పతులును భీతులై తన కుపాయనముల్ దగ నిచ్చి కొల్వఁగన్ | 22 |
| ఉ. | రాజకులాభిరాముఁడగు రాముని తమ్ముఁడు లక్ష్మణుండు ని త్తేజికి రక్షకుండు ధర ధీరులుగల్గినఁ బట్టుఁడంచు న వ్వాజిలలాట పట్టమున వ్రాసిన వ్రాల్‌గని దానిఁజేర రే రాజులు భీతులై తమ పురంబుల చెంతల సంచరింపఁగన్ | 23 |
| సీ. | దక్షిణక్షితివరోద్యద్గోపురద్వార - మరకతాంశుకఘాసనికరమొలసి పశ్చిమక్ష్మానాథపట్టణ ప్రాకార - నిర్మల స్ఫటికాభనీడఁజూచి యుత్తరోర్వీశ బాహ్యోద్యాన భూరుహ - చ్ఛాయాంతరముల విశ్రాంతిఁజెంది ప్రాగ్ధరాధీశ్వర ప్రత్యగ్రకేళికా - నీరజాకరముల నీరుఁద్రావి | |
| గీ. | మఱియుఁ దక్కిన ధారుణీమండలముల స్వైరవృత్తి నటింపుచు జానకీమ నోహరాధ్వర ముఖముక్తవాహ మలరె శక్రజిద్వైరి రక్ష నే జడుపు లేక | 24 |
| ఉ. | అంతకుమున్నె రామవసుధాధిపుఁ డాశ్రితబంధుమంత్రి సా మంత నృపాప్త మిత్రభటమండలి గొల్వఁగ గోమతీనదీ ప్రాంతముఁజేరి యందు భరతాదుల నధ్వరసాధకక్రియా వంతులఁ గూర్మిఁజూచి తగువైఖరి నందఱ నాదరింపుచున్ | 25 |
| శా. | నానాభూములనుండి వచ్చిన నరేంద్రశ్రేణులన్ బంధులన్ భానుప్రోద్భవునిన్ విభీషణునిఁ దత్పార్శ్వస్థులన్ బ్రాంచిత స్థానాభ్యంతర సీమలందు విడియింపం బంచె శత్రుఘ్నునిన్ శ్రీనిండార నృపాలుఁ, డట్లు విడియించెన్ వారి నమ్మేటియున్ | 26 |
| వ. | మఱియును | 27 |
| సీ. | బ్రాహ్మణక్షత్రియప్రముఖులఁ బూజించు - పట్ల నేమఱకుండు భరత! యనుచుఁ గెలఁకులనుండి కావలయు యాగార్హ వ - స్తువు లందియిమ్ము శత్రుఘ్న! యనుచు నడుగువారలకు లేదనక యిష్టపదార్థ - రాశులిమ్మా కపిరాజ! యనుచుఁ గ్రతువిఘ్నకరుల శిక్షయొనర్చి క్రతువు ర - క్షణమొనర్పుము విభీషణ! యటంచుఁ | |
| గీ. | గొదువపడినవి వేవేగఁగొంచు వచ్చి నియతి నెరవేర్చు భారమ్ము నీదె సుమ్ము వాయునందన! యనుచు భూవరుఁడు వారి వారి నియమించె నుచితప్రవర్తనముల | 28 |
| ఉ. | మించినవేడ్క నట్లు నియమించి నృపాలుఁడు కాంచనేష్టికో దంచితభూస్థలంబు ఖధిరాదిక యూపయుతంబు రుక్మప క్షాంచల పక్షిరాజ చయనాఢ్యమునౌ మఖవాటమున్ బ్రవే శించెఁ బులస్త్యకశ్యపవసిష్ఠ భృగుప్రముఖార్యసమ్మతిన్ | 29 |
| తే.గీ. | ఇవ్విధమునఁ బ్రవేశించి యెల్ల జగము లెల్ల రక్షింప దీక్ష వహించినట్టి యాగదీక్షా విచక్షణుఁడపుడు యజ్ఞ దీక్ష వహియించె సకలదిదృక్షు లలర | 30 |
| సీ. | స్థండిలస్థితయూప సమ్యక్పశుప్రోక్ష - ణాక్షీణతంత్రయుగ్యాజకంబు హోతృహస్త ధవిత్ర జాత వాతప్రజ్వ - లితకీలి కీలికావృతనభంబుఁ బరమాన్న పృషదాజ్యచరువపామిక్షాది - హోమజస్వాహారవోల్లసితముఁ దత్తత్క్రియా హృష్టతర సభాస్తారలో - కముహుర్ముహుశ్శిరఃకంపనంబుఁ | |
| గీ. | జంచదుద్గాతృ సామగానాంచితంబు విశ్రుతాధ్వర్యు ఋగ్యజుర్వేదమంత్ర నికర మకలుష హవిరర్థ నిర్జరప్ర సారిత కరాబ్జ మగుచు నా జన్న మమరె | 31 |
| చం. | భరతునిచే ధరామరులుఁ బార్థివముఖ్యులు నన్నపానవి స్ఫురణలఁ దృప్తులై ముదముఁబొందిరి బ్రహ్మఋషుల్ విభీషణా చరితసపర్యలం గడుఁబ్రసన్నతఁ జెందిరి యాచకుల్ విభా కరసుతుఁడిచ్చు నర్థములఁ గాంక్షలు దీర సుఖించి రయ్యెడన్ | 32 |
| చం. | ఎడపకయేఁడుగాల మిటులేఁగఁగ లక్ష్మణుఁడంతలోనఁద త్తడిఁగొని తెచ్చినన్ నృపతి తద్దయు వేడుక యాగకృత్యముల్ నడుపుచునుండె విప్రులు దినంబును భోజనదక్షిణాదులన్ గడుముదమంది రందఱును గాంక్షితముల్ గని రమ్మఖంబునన్ | 33 |
| చం. | వలసినవారికిన్ వలయు వస్తువు లన్నియు నిత్తురేకదా! నలినహితాత్మ జాదికపినాయకు లొల్లకయున్న వారికిన్ బలిమినిఁబిల్చి భోజ్యములు భక్ష్యములున్ ధనరత్నభూషణా వళులును గంధమాల్యము లవారిగనిత్తురు సర్వకాలమున్ | 34 |
| చం. | వలసిన భోజనాభరణ వస్త్రధనాదులఁ జెంది తృప్తులై పలుమఱుఁజాలుఁజాలు నని పల్కెడు వారలె కాని, మాకుఁగా వలయు నొసంగుఁడంచనెడువారల మందునకైనఁగాన మా స్థలమున జానకీవిభుని జన్నము వైభవ మెంచశక్యమే? | 35 |
| తే.గీ. | అర్థు లెల్లఁ గృతార్థులై రందువలన వ్యర్థులై రున్న దాతలు వసుధలోన లేమి కెచ్చోట వసియింప గీము లేక తజ్జనుల నామములయందె తావుకొనియె | 36 |
| చం. | మలినులు లేరు లేరు కృశమానశరీరులు లేరు పేదల న్నెలవున నున్న యందఱు మణీమయ భూషణభూషితుల్ సము జ్జ్వల కనకాంబరుల్ మలయజస్రగవారిత గంధ గంధిలా ఖిలదిశు లంచితార్థజితకిన్నరనాయకు లెంచి చూడఁగన్ | 37 |
| ఉ. | ఆ మఖవైభవంబునకు నద్భుతమంది మహర్షులెంచి రౌ రా! మును బ్రహ్మచేసిన మహాధ్వరమున్ మఘవంతు యజ్ఞమున్ సోముని యాగమున్ దపనసూనుహవంబు దధీచిహోమ మీ రాముని యశ్వమేధ మఖరాజముతోఁ బ్రతిసేయవచ్చునే? | 38 |
| సీ. | ఖర్వమహాఖర్వ కైలాసములు కుప్ప - వ్రేసినచో నింత వెండి యగునె? శతకోటి కాంచనాచలముల బంగారుఁ - గూడఁబెట్టిన నింతపైఁడి యగునె? యర్బుదాయుత రౌహిణాద్రిమణుల్ ప్రోవొ - నర్చిన నిన్ని రత్నంబులగునె? యమితకల్పమహీరుహము లొక్క దిక్కున - నిలిచియిచ్చిన నిన్ని వలువ లగునె? | |
| గీ. | నూఱు లక్షలు కామధేనువులు గూడి యన్నియును పోటికొసఁగిన నిన్ని సముచి తాంచితపదార్థ నిచయంబు లవునె? సవన మిట్టు లొనరించిరే తొల్లి యెవ్వరైన ? | 39 |
| తే.గీ. | అవని - జామాతృతాప్రేమ నర్కకులుని కాత్మగతబీజ నిచయంబు లన్నియును మ ఖార్థ మర్పింపఁ దొడఁగెనో యనఁగ నక్ష యంబులైనవి వివిధధాన్యంబు లచట | 40 |
| కం. | ధనసామగ్రియు నానా జనసామగ్రియును రామజనవిభునకుఁగ ల్గిన కతన నీ మహోత్సవ మొనరించెన్ గాక లేక యొరులకు వశమే? | 41 |
| మ. | అని సభ్యుల్ గొనియాడఁగా రఘుకులాధ్యక్షుండు సంవత్సరం బును బూర్ణంబుగ సాంగదక్షిణలచేఁ బొల్పొందు యాగంబుసే యునెడన్ దన్మఖవైభవంబు గనఁగానూహించి వాల్మీకి శి ష్యనికాయంబుఁ బ్రశిష్యసంఘము భజించన్వచ్చె నచ్చోటికిన్ | 42 |
| కం. | వచ్చిన యమ్ముని చంద్రుని హెచ్చిన రహి నెదురుకొని సర్వేశ్వరుఁడర్ఘ్యం బిచ్చి సపర్యల నాతని యిచ్చ యలరఁ గుశలమడిగి యిట్లని పలికెన్ | 43 |
| చం. | వరమునిచంద్ర! మీ రిటకు వచ్చుట నా మఖమున్ ఫలించె మీ చరణయుగంబు సోఁకి క్రతుశాల పవిత్రతఁజెందె మామకా ధ్వరవిధి పూర్ణమౌ దనుక వచ్చిన యీమును లట్ల మీరు నిం దిరవుగ నిల్వుఁడంచు విడియించెఁ దదర్హగృహాంతరంబునన్ | 44 |