| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | కుశలవులు వాల్మీకి యాజ్ఞచే శ్రీరాముని యజ్ఞమున రామాయణమును గానము సేయుట |
| చం. | ప్రశమనశీలుఁ డమ్మునియు భక్తిమెయిం దను వేడుకొన్న య ద్దశరథరాము మాట జవదాఁటక, తత్క్రతుదర్శన క్రియా వశుఁడయి యందు నిల్చి పటువైణికతాఢ్యుల నాత్మశిష్యులన్ గుశలవులన్ మనోజ నలకూబరతుల్యులఁ జూచి యిట్లనున్ | 45 |
| చం. | ప్రవణత మీఱ మీరు కవఁబాయక రామకథాప్రపంచ మీ యవనిపు కొల్వుకూటమున నధ్వరశాలల మౌనులున్నచో ట్ల విపణివీథులన్ వనములన్ బహురాజసభాంతరంబులన్ గవిజనసన్నిధిన్ జదువఁగావలయున్ జను లందఱున్ వినన్ | 46 |
| చం. | స్వరములుఁదాళముల్ లయలు సారపు మీటు కొలందు లేర్పడన్ జిరముగ మీకు నారదుఁడుసేసిన శిక్ష ఫలింప నింక మీ రిరువురు వీగెలూని దినమిర్వది సర్గల లెక్క రాఘవే శ్వరుసభఁబాడుఁ డవ్విభుని చారుచరిత్రము సభ్యులౌననన్ | 47 |
| మ. | ఫలమూలాశనులై ధనేచ్ఛ వహియింపంబోక రామాయణం బెలమిన్ రేపటినుండియున్ దొరకొనుండెవ్వారు మీ రంచుఁగే వలమైత్రిన్ రఘుభర్త మిమ్మడిగినన్ వాల్మీకి మౌనీంద్రు శి ష్యుల మంచున్ వచియింపుఁ డవ్విభుఁదలంపుండాత్మలన్ దండ్రిగన్ | 48 |
| ఆ.వె. | ఏల యంటిరేని నిలఱేనిఁ బ్రజలెల్లఁ దండ్రిగాఁదలంపఁ దగవుగానఁ దెలిపినాఁడ నటులఁ దలఁపుఁ డవ్విభు నంచు నానతిచ్చె నమ్మహర్షి విభుఁడు | 49 |
| ఉ. | ఆ యతి యానతిచ్చిన క్రియన్ జగతీసతి ముద్దుమన్మ లా రేయిఁగ్రమించి వేగుటయు రేపటికృత్యము లెల్లఁదీర్చి వీ ణాయుతపాణులై మునిగణంబుల సన్నిధి రాజులొద్ద దే వాయతనంబులన్ విపణు లందును గావ్యము పాడుచున్ రహిన్ | 50 |
| చం. | సమయముఁజూచి యొక్క దివసంబున రాముని యజ్ఞశాల క క్కొమరులు పోయి యందుఁ గవఁగూడి విపంచికలూని తానమా నములును రాగముల్ వినవినన్ జెలువై చవులాన నందఱున్ బ్రమదపయోధిలో మునుఁగఁ బాడిరి రామచరిత్ర మింపుగన్ | 51 |
| తే.గీ. | శ్రుతులు బెరయుట స్వరముల చొప్పు విడక చాలా శుద్ధతఁ గనుట దోషములఁబాసి ఘన విధము గాన షడ్జంబు గలసిమెలసి యక్కవల వారి గానంబు సొక్కొనర్చె | 52 |
| చం. | మదిఁగన వారి గానమహిమం బదియెట్టిదొ వార్ధులెల్ల నొ క్క దెసనె నిల్చినట్టులివుఁగాంచినయట్టి సభాస్థలంబునన్ బెదవిఁగదల్చి పల్కఁడొక పెద్దయుఁ దద్దయు సద్దుమాన్పుచున్ గదలక చిత్రరూపములకైవడినుండిరి పాట చొక్కునన్ | 53 |
| చం. | కొలువుననున్న రాజవరకోటుల దివ్యమణీవిభూషణా వళులుఁగఱంగి నీ రయి ప్రవాహగతిన్ బ్రవహించె నన్నచో సలలిత జానకీ తనయ సారసుధారస చారుగాన భం గులనుఁ గరంగు టెంత యతికోమల సభ్యజనాంతరంగముల్ | 54 |
| మ. | పద సందర్భము లర్థకల్పనలు శబ్దస్ఫూర్తు లుత్ప్రేక్ష లిం పుదలిర్పన్ ముని యాచరించిన జగత్పూజ్యాది కావ్యంబులో మొదటం జెప్పిన కొన్ని శ్లోకములు సమ్మోదంబుతో నాలకిం చి దినేంద్రాన్వయభర్త యక్కొమరులన్ జేసన్న వారింపుచున్ | 55 |
| మ. | సమయార్హంబగు హోమకృత్య మురునిష్ఠం దీర్చి రమ్యప్రదే శమునం గొల్వయి కూరుచుండి మును లాచార్యుల్ మహాశ్రోతలా గమతంత్రజ్ఞులు శాస్త్రవేత్తలు కవుల్ గాణల్ పురాణజ్ఞు లా ప్తమణుల్ మంత్రులుఁదమ్ము లాశ్రితులు భూపాలుర్ హితుల్ గొల్వఁగన్ | 56 |
| కం. | కొలువుండి యక్కుమారులఁ బిలిపించి సమీపభూమిఁ బ్రీతి వసింపన్ సెల విచ్చినఁ బ్రతిబింబయు గళమున్వలె నున్నవారిఁ గనుఁగొని సభ్యుల్ | 57 |
| ఉ. | ఈ ముఖకాంతు లీ నగవు లీ కనుదామర లీ యెలుంగు లీ చామనచాయ లీ యెగు బుజంబుల పొంకము లీ యురంబు లీ కోమలమూర్తు లీ వచనగుంభనలున్ గనుఁగొన్న గట్టిగా రాముని లీల మించి రభిరామశరీరులు వీర లెవ్వరో? | 58 |
| ఉ. | హారకిరీట కుండల భుజాంగదవస్త్ర సుగంధమాల్యముల్ వీరు ధరింప కీ జటిల వేషము లేటికిఁ దాల్చిరో? శుభా కారవిలాససంపదలఁ గంతు జయంతుల ధిక్కరించినా రే ఋషిపుత్రులో? ఋషుల కెక్కడి వీ మహనీయరూపముల్ ? | 59 |
| చం. | అని తమలోనఁ దాము ప్రజలాడెడి సుద్దుల సద్దు లొక్కపె ట్ట నెగసె నంత లక్ష్మణుఁడడంచెఁ గరాంబుజసంజ్ఞ నప్పుడ జ్జనకకుమారికాత్మజులు సారెలు చక్కఁగఁబెట్టి మేళవిం చిన కవవీణియల్ మొరయఁ జేయుచుఁబాడిరి రంగు రక్తులన్ | 60 |
| కం. | నారదనిగదిత సంక్షే పారూఢ ప్రథమ సర్గ యాదిగ నాఁడిం పారఁగ నిరువది సర్గలు వారలు వినిపించి రచటివారలు మెచ్చన్ | 61 |
| చం. | స్వరము లయారే! మేలు శ్రుతి! చాంగురె మూర్ఛన! కంపితంబు బా పురె! బళిరయ్య డాల్ నెరసెఁబో! నెఱమీటు కులంబుఠాయి య ద్దిర! స్ఫురితంబు లమ్మ! యని తేనియలొల్కెడి వారిపాటలా దరణము మీఱఁగా వినిముదంబొదవన్ బతిమెచ్చె నెమ్మదిన్ | 62 |
| కం. | ఈ లీల మెచ్చి పతి పది వేల వరాలిమ్ము భరత! వీరికి మఱియున్ లోలత నడిగిన వన్నియు వాలాయ మొసంగు మనిన వారలు నగుచున్ | 63 |
| చం. | కరములు మోడ్చి, యో నృపశిఖామణి! కానలఁ దాపసస్థితిం బరగుచుఁ గందమూలములు భక్షణ సేయుచునుండు మాకుదే వర!యిపు డానతిచ్చిన సువర్ణము లేమిటికేల యన్యవ స్తురతి? యటన్న లేనగవుతోఁ బతి వారలఁజూచి క్రమ్మఱన్ | 64 |
| చం. | అనియె గుణాఢ్యులార! నిజమౌనది! యీకృతి యెవ్వరాచరిం చినయది? యే ప్రమాణమునఁ జెల్వగు? నెవ్వని దీ చరిత్ర? మిం దునకభిధానమే? మెలమితో నిది యెవ్వరవంక నేర్చినా రనిన వినీతులై కుశలవాహ్వయు లిట్లని రమ్మహాత్ముతోన్ | 65 |
| సీ. | ఇనవంశశేఖర! యీ కావ్యమణి విని - ర్మించిన సుకవి వాల్మీకిమౌని రామాయణం బనునామంబు దీనికిఁ - గావించె నదిభవత్కథయ సుమ్ము విను మిరువది నాల్గువేల గ్రంథం బిది - యేనూఱు సర్గల నింపు గులుకుఁ బట్టాభిషేచన పర్యంతకథలాఱు - కాండంబుల రచించెఁ గడపటి కథ | |
| గీ. | నవల నుత్తరకాండంబునం దమర్చె నమ్మహామౌని యతని దయానిరూఢి నేము నేర్చితి మిది విననిచ్చ గలిగె నేని వినఁదగు దినమును నివ్విధమున | 66 |
| వ. | అని మఱియు నిట్లనిరి | 67 |
| కం. | ఇమ్మఖనిష్ఠలు దీర్చిన పిమ్మట నొకకొంతసేపు ప్రియమున నిక్కా వ్యమ్ము వినవలయు మా గీ తమ్ములు సాఫల్యమొంద ధరణీశ! యనన్ | 68 |
| ఆ.వె. | సమ్మతించి రామజనపతి బహుమతి వెలయ వారిఁబనిచి ద్విజపురోహి తార్యబంధు సహితుఁడై యాగమంటపా భ్యంతరమున నుండె నర్హ విధుల | 69 |
| చం. | దిన దిన మిట్లు వచ్చి జగతీసతి మన్మలు పువ్వుఁదేనె పం చిన గతిఁ గప్రపున్ రజము చిందినకైవడి జాజిపొట్లముల్ మునుకొని విప్పినట్టు లతిమోహనగానకళానిరూఢి న య్యినకులు మ్రోల నచ్చరిత మింపెసఁగన్ వినిపించుచున్నెడన్ | 70 |
| చం. | జనవరుఁడంత నొక్క దివసంబున వారి తనూవిలాసముల్ గనుఁగొని జానకీరమణికైవడి నున్నవి వీరి రూపుల వ్వనజదళాక్షికిన్ మును గవల్ జనియించి రటంచు వింటి న త్తనయులె యీ శుభాకృతులు! తక్కిన నీ చెలువంబులుండునే? | 71 |
| చం. | జడలు ధరించి కృష్ణమృగచర్మములన్ బలు నారచీరలున్ గొడుకులుఁదానుఁ గట్టుకొని కూరలఁ గాయల క్షుత్తు మాన్పుచున్ గుడికొనువంత రేవగలుఁగుందుచు నెంత నలంగియున్నదో యడవులలోన సీత యకటా! యిఁకఁజూడక యెట్టుతాళుదున్ | 72 |
| ఉ. | క్ష్మాసుతఁబాసి నేనుబహుకాలము తాళితి ధైర్యశాలినై యా సతిఁ బిల్వనంపి ప్రజలందఱు నమ్మికఁజెంద నీ సభన్ బాస యొనర్పఁబంచి యిఁకఁ బావనియౌ టెఱెఁగింపకుండినన్ నా సుతులంచు వీరిఁ బ్రజ నమ్మునె? యంచుఁదలంచి చెచ్చెఱన్ | 73 |
| తే.గీ. | చెంత నిలుచున్న శత్రుఘ్నుఁ జేరఁబిలిచి పలికె నిటులని యో వత్స! పవనసుత వి భీషణ సుషేణులను వెంటఁబెట్టుకొని య కల్మషుండైన వాల్మీకిఁగానఁబోయి | 74 |