ఇతిహాసములు ఉత్తరరామాయణము రఘు పుంగవుండు వాల్మీక్యాశ్రమంబున నున్న సీతం బిలిపించుట
రఘు పుంగవుండు వాల్మీక్యాశ్రమంబున నున్న సీతం బిలిపించుట
చం.జనకజ ధర్మచారిణియు సాధ్వియునౌట యెఱింగియుండియున్‌
జను లొనరించు నిందఁబడఁజాలక వీడినమాత్ర మింతె య
జ్జనులకుఁ బ్రత్యయంబొదవ సభ్యులలో శపథంబువల్క న
వ్వనజదళాక్షిఁ దోడుకొని వచ్చుట మే లను మమ్మునీంద్రుతో
75
కం.ఈ మాట కమ్మహాముని
యేమని ప్రతిభాష లానతిచ్చునొ? సీతా
భామిని హృదయస్థితిఁగని
యేమనునో యదియుఁదెలిసి యేతెండనినన్‌
76
ఉ.స్వామి! మహాప్రసాదమని వారలు నల్వురు నమ్మహాముని
గ్రామణియున్న చోట కధికత్వరనేఁగి నమస్కరించి శ్రీ
రామనృపాలు మాటల తెఱంగెఱిఁగింప నతండు వల్కెఁదా
నేమి దలంచు నట్ల ఘటియించు ధరాసుత శంకయేటికిన్‌?
77
కం.పతిదేవత శిరోమణి
క్షితిసుత శపథంబుసేయు సిద్ధమురే పా
క్షితిపతికిఁ దెల్పుఁడిదియని
యతఁడనిచిన వారు వచ్చి యధిపతితోడన్‌
78
ఉ.అమ్మునిమాటలెల్ల వినయమ్మునఁదెల్పిన రాముఁడెంతయున్‌
సమ్ముదమంది యందుఁగల సభ్యుల నందఱఁజూచి యెల్లలో
కమ్ములు మెచ్చ రేపె జనకప్రభు కన్యక యీ సభన్‌ యథా
ర్థమ్ముగఁబూని పల్కు శపథంబు వినందగు మీరలిందఱున్‌
79
చం.శపథము సేయుచో నయిన జానకి సత్యమెఱుంగుఁడీ యనన్‌
దపసులు ధారుణీపతులుఁ దక్కినజాతులవారు బాంధవుల్‌
గపులు నిశాచరుల్‌ హితులుఁగౌతుకవిస్మయ భీతిమగ్నులై
రపుడు నృపాలుఁడా జనులనందఱ నిండ్లకుఁబంచె నాఁటికిన్‌
80
వ.ఇవ్విధంబున సభాసదుల నందఱ విడిదులకుం బనిచి, ననిచినముదంబున నత్తపనవిభావరిష్ఠుం డవ్విభావరిన్‌ గ్రమియించి మఱునాఁ డరుణోదయ కాలంబున గోమతీజలంబులఁ బ్రాతఃకరణీయంబు లొనర్చి యర్చిష్మదాది దేవతార్చనంబు లాచరించి సమంచితప్రకారంబున బహిర్మండపంబుఁబ్రవేశించి భరతాదిసోదరులును సుగ్రీవాదివానరులును విభీషణాదిరాక్షసులును, విదేహరాజకేకయరాజప్రముఖబాంధవులును, బ్రవర్ధనాదిమిత్త్రులును, సుమంత్రాదిమంత్రిజనంబులును మధుమద్వి జయభద్రాదినర్మసఖులునుఁ, బరివేష్టించి కొలువ నిండుకొలు వుండి పృథివీసుతాకథితావితథశపథవచోవిధా శ్రవణకుతూహలంబునకుం బఱతెంచిన వసిష్ఠవామదేవ దేవలపులహపులస్త్య కశ్యపాగస్త్య విశ్వామిత్ర ఋచికాగ్నిమిత్ర మైత్రేయ భృగు చ్యవన పరాశ రాత్రేయ కాత్యాయన గౌతమ శ్వేత శాతాతప సుతపో వరతంతుభరద్వాజ వాలఖిల్యమౌద్గల్య మాండవ్య విభాండక మార్కండేయ కౌండిన్య కణ్వప్రస్కణ్వ ప్రదేవశ్రవసఋశ్యశృంగ మతంగ మంక ణాంగిరస శతానంద మందపాల జాబాలి గాలవ పైల పౌలస్త్యదుర్వాసః పర్వత నారద దళాదపిప్పలాదప్రముఖ మహర్షులకుఁ బ్రత్యుత్థానాదు లొనరించి యుచితాసనంబుల నుండ నియమించి, పాంచాల మాళవ గౌళచోళ మళయాళ మగధ మత్స్య మంద్రద్రవిడ విదర్భశక సింధుగాంధార సౌవీర కేరళ కాశ్మీరచేది (పుళింద కర్ణాటలాటభోటవిదర్భ) ప్రముఖనిఖిలదేశాధినాథుల సపరివారంబుగాఁ దగుచోట్లం గూర్చుండ నియోగించి బ్రహ్మక్షత్త్రియ వైశ్యశూద్రులుఁ దక్కినపౌరజానపదాది ప్రకృతిజనంబులు నానాదిగంతరాగతవిద్వత్కవినట గాయక పరిహాసకముఖ యాచకనివహంబులు నలుదిక్కులన్‌ గ్రిక్కిఱిసి నివసింప నిలింపవిభు వైభవంబునం బొంపిరిపోవుచుఁ బ్రాచేతసాగ మనంబునుం బ్రతీక్షింపుచున్న యెడ నక్కడ వాల్మీకిమౌనీంద్రుండు దొలినాఁడె నిజాశ్రమంబుననున్న జనకనందననుం దాను విడిసినగోమతీతటాశ్రమంబు నకుఁ బిలిపించిన వాఁడు గావున, నద్దేవి నవలోకించి- తల్లీ! భవద్వల్లభుఁ డగు రఘువంశవల్లభుండు నీయుల్లంబు తెల్లంబుగాఁ దెలిసియుఁ, బ్రల్లదంబులు వలికినక్షుల్లకజనంబులు విశ్వసింప, విశ్వవర్ణిత బ్రహ్మర్షీశ్వర సభామధ్యంబున నీచేత శపథంబు లాడింపందలంచి, నిన్ను వెంటఁబెట్టుకొని రమ్మని నన్నుం బనిచినవాఁ డతని వచనం బలంఘనీయం బదియుఁగాక నినువంటిపతివ్రతలకుఁ బతియనుమతిం బ్రవర్తించుట స్వభావసిద్ధంబు గదా- యని తెలిపిన నప్పల్లవపాణి ప్రాణేశ్వర సందర్శనంబు నేఁటి కయిన నీనెంపబునం గలిగెంగదా యనుమోదంబును దనపట్టంపు దేవిపై నిట్టి వట్టిసంశయంబులు పుట్టిన నప్పట్టభద్రుండు రచ్చం బెట్ట నెట్టు దలంచెనో యనుఖేదంబును, మనంబునం బెనంగొనఁ గనుఁగొనలం బాటిల్లు కాటుకకన్నీరు ఱెప్పలతుదల నప్పళింపుచు నప్పరమతపస్విదిక్కుఁ జూడ్కులు నిగిడించి మహాత్మా! యెట్టిపుట్టువునఁ బుట్టినను నెంతవాని జేపట్టినను నెట్టియిల్లు మెట్టినను నాఱడినోములు నోచిన ననువంటి మచ్చెకంటికిఁ దత్ఫలం బనుభవింపక పోవచ్చునే? రచ్చలోనికి వచ్చి బాస యిచ్చి పొమ్మని పుడమిఱేఁడు నొడివినమాట జవదాఁటఁ గూడునే? మంచిది తామసింస నేల విజయంబు చేయుం డని తెగువ దోఁపం బలికి కమలసంభవుని వెనుకొను కమలామహాదేవిచందంబున డెందంబునన్‌ బాయని శోకాంధకారంబు వెనుక వేసికొనె నన నపరభాగంబునఁ గనుపట్టు కీలుగంటుతో భుజపత్త్రవల్కలోత్తరీయంబున నాచ్ఛాదించినఘన స్తనకనక కలశ యుగళంబుతోఁ బ్రపదంబులపయి దిగజాఱం గట్టిన వలిపెంపునారచీర లతో, బహుకాలపరీగతరఘువల్లభాయల్లకభరంబునం గృశియించిన మోహనాంగంబుతో నిటలతటంబున నెఱసినచికురనికరంబుతోఁ గపోలముకురంబులపై దిగజాఱునయనఖంజనాంజనసమంజనాశ్రు జలధారాప్రవాహంబుతో నప్పటప్పటికి నిగిడించునిట్టూర్పుసెగలన్‌ బొగిలినచిగురుమోవితోఁ జిన్నఁబోయినచిన్నారిముద్దుమొగంబుతో నాద్యంతంబులఁ దాను బడిన యలజడితలంపునఁ బుట్టునివ్వెఱపాటునన్‌ జేడ్పడుచిత్తంబుతో మహాసభామధ్యంబున నెట్టుకొని నిర్లజ్జనై నిలిచి యెటు మాటలాడుదు ననుభయంబునన్‌ బొడము స్వేద కంపంబులతో, నిన్నియగచాట్లకు లోనయ్యుఁ దనవలెఁ బ్రాణంబుపై నాసలన్‌ బూనిన మానవతులు గలరే? యని తలంపునం బాదుకొను దీనభావంబుతో, గడగడ వడంకు నెన్నడుముతో నెడనెడన్‌ దడఁబడునడుగుఁదామరలతోఁ దల్లీ నీకడుపునన్‌ బుట్టి యిట్టిఱట్టున కొడిగట్టితిని గదా యనునిట్టలఁపునగవునన్‌ బుడమిపై నెలకొల్పుచూడ్కులతో దైవంబు నలువురిలోఁ దన్ను దలవంచికొనం జేసెఁగదా యనువిన్నఁదనంబున వంచినశిరంబుతోఁ గరకమలంబులు ముకుళించుకొని యవ్వాలుఁగంటి మిన్న పంటవలంతి యల్లుఁడు కొలువున్న బహిర్మండపంబునకు వాల్మీకివెంట నరుగుదెంచునప్పు దయ్యొప్పులకుప్పం దప్పక చూచి కన్నులం జిప్పిలుశోకబాష్పధారలతో-నయ్యయో తల్లీ! రామభద్రునంతటి పట్టభద్రునిం జెట్టపట్టిన నిన్నువంటి సౌభాగ్యవతికి నట్టడవుల నెట్టుకొని నారచీరలుగట్టుకొని యిట్టియగచాట్ల బడవలసెఁ గదా యనువారును నీయుత్తమురాలి గుణవిశేషంబు లెఱింగియుఁం బతంగకులపుంగవుం డంతరంగంబునఁ గరుణదొఱంగి యడవులం ద్రోచి యెంత సాహసంబుచేసెఁ జూచితిరే యనువారును నవనివిభుండు లోకాపవాదభయంబునఁ గళ త్రాభిగమనంబు విడుచుట దొడ్డగా దతనిమాట జవదాఁటక యిప్పరమపావని తపోవనంబులు డాసి వలిగాడ్పుటుష్ణంబుల గాసి కోర్చి ప్రాణంబులు భరించుట దొడ్డనువారును నసువు లుడిగి వసుమతీపతిఁ బ్రజాపరంపరలచేత మాటలం బెట్టుట పాటి గాదని కాక లేకున్న నీ లోకమాత కాకుత్‌స్థు నెడఁబాసి ప్రాణంబు లాసించునే యనువారును నేకపత్నీవ్రతుండగు రఘునాథుని ధైర్యస్థైర్యంబులు సీతాసతి పాతివ్రత్య సత్యంబులును నింతయొప్పునే యను వారునునై బహువిధంబులన్‌ బలుకు నానాజనంబుల కోలాహలంబులు నలుదిక్కులం బిక్కటిల్లి చతుస్సముద్రఘోషంబు లొక్కదిక్కునఁ గ్రిక్కిరిసినట్లు (పెక్కుసంత లొక్కటియైన తెఱంగున) బహుళ కోలాహలంబు లక్కొలువునఁ గలిగి యుండె; నప్పుడు సీతాశపథ సంశ్రవణతత్పరత్వంబునఁ బితామహుండు మహేంద్రశమనవరుణ కుబేరాది లోకపాలక వసురుద్రాదిత్య మరుత్తుషితామర గరుడగంధర్వ సిద్ధసాధ్య యక్షకిన్నరకింపురుష నభశ్చరభాస్వర మహారాజిక ప్రముఖ నిఖిలబర్హిర్ముఖసమన్వితుం డై వచ్చి దివ్యమణీరమణీయ విమానకోటులతోఁ జదలెల్ల నలంకరింప, నయ్యెడ బృందారక బృందమందార మాలికాగంధ సంబంధమంథర గంధవహుం డప్పరిషత్తుపై నొలసె నీలాగున భూలోకంబునన్‌ గలిగినసకల జనసమూహంబులు దిగువనుండి కనుంగొన దేవలోకంబునన్‌ గలిగినసకల దేవతాగణంబులు దివినుండి కనుంగొన సీతాంగనా సహితంబుగా నమ్మహాసభామండపంబు దఱియం జొచ్చి రఘువీరుని పురో భాగంబున నిలిచి వాల్మీకిమహర్షి శేఖరుం డచ్చటిప్రజల కలకలంబులు చేసన్నన నివారించి యాసన్నులై దివి నున్న దేవతలును సభ నున్న సమస్తజనంబులును నాకర్ణింపఁ బ్రావృడంభోధరగంభీర ఘోషంబున నిట్లనియె.81
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju