| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | భూపుత్రి నిష్కల్మషయని వాల్మీకి సభాసదులు విన రామునితోఁ జెప్పుట |
| మ. | దిననాథాన్వయ! యీధరాతనయ పాతివ్రత్యమున్ సత్యముం గనియున్ నీవు జనాపవాదగతశంకన్ నిండు చూలాలిఁ గా ననసీమన్ దిగఁ ద్రోయఁ బంచుటయు దైన్యంబొంది యస్మద్వనం బునకున్ వచ్చి కుశున్ లవున్ గనియె నీపుణ్యుల్ భవత్పుత్త్రకుల్. | 82 |
| చం. | విలసితధర్మచారిణి వివేకవతీమణి సీత సుస్వభా వులు యమలార్భకుల్ కుశలవుల్ గ్రహియింపుము వీరి మువ్వురన్ వల దనుమాన మొంద నిటువంటి మహాసభఁ జేరి కల్ల లేఁ బలుకుదునయ్య బొంకినఁ దపంబు ఫలించునటయ్య మౌనికిన్. | 83 |
| చం. | బుధనుతుఁ డౌ ప్రచేతసుని పుత్త్రుఁడనై శ్రుతులెల్ల నేర్చి నే నధికతపోవిభూతిఁ జెలువంది యసత్యము లాడ నేర్తు నే ? యధిప! మనోవచఃక్రియల నన్య మెఱుంగదు సీత క్షీరవా రిధిసుతకున్ హిమాచలవరేణ్యజకున్ బ్రతి సద్గుణోన్నతిన్. | 84 |
| ఉ. | చారుపతివ్రతాత్వమున జానకి పెద్ద, క్షమాసమున్నతిన్ ధారుణి పెద్ద ధైర్యసముదగ్రత మేరువు పెద్ద తప్పులే దారసినాఁడ సీతహృదయంబు వియన్మరుదగ్నితోయముల్ సారసవైరి భాస్కరులు సర్వసుపర్వులు సాక్షిగా నృపా!. | 85 |
| ఉ. | భూసుతకోస మేఁ గనుక బొంకితినేనియుఁ బెద్దకాలమున్ జేసిన నాతపంబు రహిఁ జెందక నిష్ఫలమౌ జనంబు వి శ్వాసము నొందఁ జేయుటకు స్వాంతము గల్గిన మీరు కోరిన ట్టీ సభవార లెల్ల విన నియ్యమయున్ శపథంబు వల్కెడిన్. | 86 |
| మ. | అని వాల్మీకిమహామునీంద్రుఁ డపు డయ్యాస్థాన మెల్లన్ గలం గ నితాంతస్థిరబుద్ధి నిట్లు వలుకన్ గాకుత్‌స్థరాణ్మౌళి చ య్యన బద్ధాంజలియై వచించె ననఘాత్మా సీత లోకైక పా వనియంచున్ మును లంకలోనఁ దెలిసెన్ వహ్నిప్రవేశంబునన్. | 87 |
| చం. | తెలిసియు లోకులాడు సడి దీర్పఁగఁ గూడక యింత సేసితిన్ గల దపరాధ మోర్వుఁ డలుగన్ వల దిక్కవ లస్మదీయపు త్త్రులగుదు రీపె సాధ్వి యగు రూఢిగ నింకొకసారి సీత యిం దలిప్రజ లౌ ననంగ శపథంబొనరించినఁ జాల మేలగున్. | 88 |
| వ. | అని మఱియు నిట్లనియె | 89 |
| ఆ.వె. | అనఘ మీరు పలుకు నంతకంటెను సీత యాడుశపథ మెంత ? యైన నిచటి ప్రజల కాపె పలుకుపలుకునఁ గాని ప్ర, త్యయము పుట్టదనుచు నధిపుఁ డనిన | 90 |