| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | భూమిదేవి సీతాదేవిం గైసేసి రసాతలంబునకుఁ గొనిపోవుట |
| ఉ. | ఆ రఘువీరు మాటలకు నద్భుతమందిరి తత్సభాసదుల్ వారిజసంభవాది సురవర్యులు మేలని మెచ్చి రచ్చటన్ సౌరసుమావళుల్ గురిసెఁ జల్లని వాసన లుల్లసిల్లఁగా సారెకు గంధసార గిరిసార సమీరము వీచెఁ బై పయిన్. | 91 |
| ఉ. | అప్పుడు సీత రాముని పదాంబుజముల్ హృదయాంబుజంబునం దప్పక నిల్పి ధీరతనుదఙ్ముఖియై తలవాంచి ధాత్రిపై నొప్పు నిజావలోకనము లుంచి కరాంబుజముల్ మొగిడ్చి తా నెప్ప టెలుంగుతో సభికు లెల్లను విస్మయ మంద నిట్లనున్. | 92 |
| శా. | రామస్వామిపదాంబుజంబు లెద నారాధింతునేనిన్ సదా రామాజ్ఞన్ జరియింతునేనిఁ దగుజాగ్రత్స్వప్నసుప్త్యాదులన్ రామున్ దప్పనిదాన నౌటయ యథార్థంబేని నాతల్లి యో భూమీ యీయెడఁ ద్రోవఁ జూపి ననుఁ గొంపోవమ్మ నీలోనికిన్. | 93 |
| వ. | అని శతానందపురందరాదిబృందారకసందోహంబునకు నానందంబును సనకసనందనాదికర్మందిబృందారకులకున్ బరమాద్భుతంబును నరవాన రనిశాచరప్రముఖనిఖిలజనంబులకు శోకదైన్యంబులు నుప్పతిలన్ బలికిన యచ్చిలుకలకొలికి పలుకులతోడనె శతకోటిశతకోటిఘోషంబు ననుకరించి సంవర్తసమయసముదితజలధరసంఘసంఘర్షణోజ్జాతనిర్ఘాతజాతస్ఫీత నినాదంబు ననుసరించి ప్రళయవేళాభయంకరఫణీశ్వరాభ్రంకష దంష్ట్రాంకుర ఘోరముఖసహస్రమోముచ్యమాన విస్ఫురత్కీలికాజాలక స్ఫులింగస్ఫటాభీల రవానుకూల విశాలఫూత్కారవిరావంబు నధిగమించి యనల్పకల్పాంతకాల కంఠేకాల దిక్కూలముద్రుజఢక్కాఢమఢమత్కారంబునకు సహకారం బై, బ్రహ్మాండకరండఖండనోద్దండ తాఖండతరావరణవరుణాలయోత్తుంగ జం ఘాలతరంగసంఘాత ఘుమఘుమార్భటిం బ్రతిఘటించి తత్సభామధ్య రత్నగర్భాగర్భంబున నుండి యొక్క దీర్ఘనిర్ఘోషం బావిర్భవించె నప్పు డంహస్సదనహిరణ్య రక్షస్సంహార రంహస్సమారంభ విజృంభమాణ వీరనృసింహసంభవావసర విస్ఫుటత్సభాస్తంభ గంభీరనిస్స్వనంబులకుఁ దోఁ బుట్టువు లగుపటపటార్భటులు సంఘటిల్ల నిలిచినతటిల్లతవలె నిలుచున్న పుడమిపట్టి కట్టెదుటఁ బుడమి బి ట్టవిసి ఫటిల్లునం బగిలిన యప్పట్టున మహాభీలం బగు నొక్క మహాబిలంబు గనుపట్టె నట్టి బిలంబులోనుండి కుండలి మండలేశ్వరకులదంష్ట్రాపటలచటులప్రభలకైవడి భోగవతీ సరిత్తరంగమాలికలవలెఁ దత్తటినీతటనికటస్థితహాటకేశ్వర కఠోరకంఠ కాలకూట కాంతులవలెఁ దత్సహచరపారిషదజటాచ్ఛ టారుణరుచులవలె, బహిర్గతాంతరపయోధిబాడబజ్వాలి కలవలెఁ గోమలశ్యామల దూర్వాదళాఖర్వరోచులవలె వజ్రమౌక్తికనీలప్రవాళ పద్మరాగ మరకత ప్రముఖనిఖిలమణిగణమసృణఘృణివిసరంబులు వెల్లివిరిసి యచ్చటివారి కన్నులకు మిఱుమిట్లు గావించె నంత ననంతవాసుకితక్షక కర్కోటక జనమేజయప్రముఖ మహాభుజంగపుంగవు లంగతరాభోగభోగ చిరత్నరత్నఖ చిత కిరీటకుండలహార కేయూరకంకణాది వివిధ భూషణభూషితులై, కాంచనవేత్రధారు లగు నపరిమిత నాగకుమారులతోఁ గానిపించి, యద్దేవికిం బ్రణమిల్లి యనేకరీతులం బూజించి రయ్యుదంచితాకృతులదివ్యవస్త్రమాల్యాను లేపనోల్లాసిత వాసనావిశేషంబు లాగుబ్బుగ నమ్మంటపం బెల్ల ఘుమ్మునం గ్రమ్ముకొనె, నయ్యెడ వినుకెంపు నును కెంపుసొంపులతో నెదురుపడఁగల విడికెంపులపడగలఁ జెలు వగు చిలువరాచకొడుకులచేత నొక్కరత్న సింహాసనంబుఁ బట్టించుకొని భూదేవి నాగకన్యకా కమ్రకరాంభోజరాజద్ధవళ చామర వింజామరలతో మరుచ్చలా చలనీలాలకజాలకంబు లలికఫలకస్థల నిస్తులకస్తూరికాతిలంకంబుతోఁ జెలికారంబు సలుపఁ జలువవెన్నెలలసొలపుఁ దెలుపుమవ్వంపుఁ జిఱునవ్వుల తెలుపు రదనకుందకోరకబృందంబులతోఁ బొం దొనర్ప రతిదర్పకమణి దర్పణ ప్రభల నెక్కసక్కెంబు లాడుచొక్కపుఁ జెక్కులపైఁ దళుకొత్తు క్రొత్తముత్యాల కమ్మలడాలు విద్దెంబు సూప విద్యాధరకుమారికాపఠిత గద్య పద్యాభికర్ణ నానురోధకర్ణోత్పలామోద సమ్మోద సంచరచ్చంచరీక చంచాత్తార ఝంకారంబులు మీఱ మేరుమందరశిఖరో పరిస్ఫురితతారకావారకంబు డంబున బొదలుచుఁ గుచోపరిదేశంబున హీరహారంబులు వెలుంగ, మెఱుఁగుతీఁగలతో నొప్పులు గులుకుకప్పు మొగులు తెఱంగునం దుఱంగలించు బంగరు విరులసరులసిరులతో గొప్పకీల్కొప్పు మిటారించ మించులజిగిం దులకించు మంచి బురుసాచీర సరిగంచుల కించుకించుక మించు నించుకళుకుహొంగిలుకుమెట్టి యలరవళి నవలంబించు పదకంజరంజత్కంజరాగ మణిపుంజ పింజరిత మంజీర సంజాత శింజాధ్వనులు నిజాగమనంబు సభ్యుల కెఱింగింపఁ గించిదవలగ్న లగ్న కాంచన కాంచికాసంకలిత మణిసంకీర్ణ కింకిణీరవంబులు పాణికంకణ క్రేంకారంబులకు లంకెపాటు పాటింప సాటి లేని శృంగార విలాసచాతురితోఁ గూతునకు సాక్షాత్కరించి చేరవచ్చి, మచ్చికహెచ్చ గ్రుచ్చి కౌఁగిలించి సేమంబడిగి కన్నీరు మున్నీరుగా వగచు చున్నయప్పుత్త్రి ననునయించుచుఁ దల్లీ! యేల చింతిల్లెద? వెవ్వారికి దైవగతిని దప్పింప వచ్చునే? యూఱడిల్లు మని, యనిమిషకన్యకాకరకలిత కనకకలశవిలసితభోగవతీసలిలంబుల ముఖప్రక్షాళనంబుఁ గావించి కస్తూరిబొట్టుపెట్టి కొప్పు చక్కఁగ సవరించి మందారకుసుమమాలికలు దుఱిమి దివ్యాంబరాభరణాదుల నలంకరించి ఘనసారగంధసార కాశ్మీరకస్తూరికాది పరిమళంబుల నలంది, సిద్ధభామినీ సమర్పితకర్పూరనీరాజనాదుల విరాజమాన యగునమ్మానవతి నసమానమణి పీఠంబుపై నుంచుకొని నలుగడల ముంచుకొని గంధర్వచారణ యక్ష కిన్నర పన్నగ బాలిక లడపంబు సురఁటి గిండి కాలాంజి మొదలయినవి ధరియించి యూడిగంబులు ఘటింప నచ్చరలునటింప నింద్రాదిదేవతలు మందారకుసు మంబులు గురియింప శంఖమర్దళపణవగోముఖ ఢక్కాహుడుక్కాది దివ్యవాద్యఘోషంబులు మించ భుజంగపుంగవులు రంగారు బంగరుబెత్తంబు లూని బరాబరు లొనరింప రసాతలంబునకుఁ గొంపోవఁగా, నమ్మహా ప్రభావంబునకు నద్భుతంబు నొందుచు బ్రహ్మాదిదేవత లందఱున్ దమలోఁ దమరు జగతీనందన పాతివ్రత్య సత్యధర్మంబుల నభినందించు నెలుంగులు నంతరంగంబు గలంగ సీతాంగనం గూర్చి విలపించుసభాసదుల యాక్రందన ధ్వనులును నేకీభవించి భూనభోంతరంబు లావరించె నిట్టులు చెలరేఁగిన యమ్మహాకలకలంబున నేలంబడి పొరలిపొరలి యేడ్చువారు నయ్యయో శ్రీరామభద్రుని యర్ధాంగలక్ష్మి! నేఁటితో మాస్వామి నెడఁబాసి పోయితే యని బిట్టుగాఁ బ్రలాపించువారును, నేమియు ననలేక శోకవ్యాకులితేంద్రియులై మూర్ఛల మునుఁగువారును నీలోకాపవాదం బింత చేసెఁగదా యనువారును, నిట్టిమహాత్మురాలి నెట్టు లాడిరి? యీలోకుల కొకసత్యం బున్నదే యను వారును నక్కటా! తల్లి లేనిబిడ్డ లైతిరే యన్నలారా! యని కుశలవులఁ జూచి వగచువారును నవనీకన్యక వచ్చి నిలిచినచోటుం గాంచి, పలికినపలుకులు వర్ణించి పోయిన పోకలందలంచి, పలికినదే పలుకుచుఁ బలుమాఱు బరితపించువారును, నిదిగో! కన్నులం గట్టినట్లున్నయది, యజ్జగన్మాత నేరీతి మఱవవచ్చు ననువారును, నందఱచేతి మాటలఁబడి విసివి వేసరి యీసరసిజాక్షి లోకనిందలం బాపికొని కారణజన్మురాలు గావున మహనీయ పదంబునకుఁ జనియెఁ దత్ ప్రభావం బెవ్వరికైనం దెలియశక్యంబే యను వారును, నింత యద్భుతం బెక్కడను గని విని యెఱుంగమనువారును నౌదలను వంచి యవిచ్ఛిన్నాశ్రుజలధారాపూరితనేత్రులై వెక్కసంబుగా వెక్కి వెక్కి యేడ్చు భరత లక్ష్మణశత్రుఘ్నసుగ్రీవాంగదహనుమత్సుషేణ నల నీలతారజాంబవ ద్విభీషణ విదేహకేకయరాజ ప్రముఖులం జూచి వగపులు క్రొత్తలై చిత్తంబు లుత్తలంబు లొంద నందంద దల్లడించువారును నధో ముఖుండై చేష్టలు దక్కి చేడ్పడి యున్న యన్నరేంద్ర చంద్రునిం జూచి పురపురం బొక్కువారును నంతస్తాపంబుల స్రుక్కువారును దాలిమి దక్కు వారును నై, పెక్కు-చందంబుల నిందఱునందఱునుం దురటిల్లనయ్యా స్థానంబు శోకదైన్య నిధానం బైయుండె నయ్యవసరంబున. | 94 |