| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | సీతాదేవి రసాతలంబున కరుగుటకు రాముఁడు చింతించుట |
| మ. | జనకక్ష్మావరకన్య యిట్లరుగ విశ్వంబంతయున్ శూన్యమై తనకున్‌దోఁచిన దీనభావ మడరన్ ధైర్యంబు పోనాడి లో చనపంకేజము లశ్రుధార మునఁగన్ క్ష్మాభర్త హా జానకీ యనుచున్ మూర్ఛిలి క్రమ్మఱన్ దెలిసి శోకాక్రాంతుఁడై యిట్లనున్. | 95 |
| మ. | జననిందం బడలేక నిన్నుఁ గఠినస్వాంతంబుతోఁ గాననం బునఁ ద్రోయించిన తప్పు చాలక జగంబుల్ చూచి శోకింపఁ గ్రిం చుని చందంబున రచ్చఁ బెట్టితి నటంచున్ డాఁగి పోనేల? సొం పున నేఁ డింకొకసారి నీ నగు మొగంబున్ జూపవే! జానకీ ! | 96 |
| మ. | అకటా! నీవు పతివ్రతామణివి నాయం దెంతయున్ గూర్మిఁ బా యక వర్తింతు వటంచు నమ్మితిఁ గదే యర్హంబె నీ వున్నచో టికి నన్నున్ గొనిపోక నిర్దయత నొంటిన్ డించి పోవన్? దలం పకె నానేరము లిందు వచ్చి నిలవే! మాటాడవే! కోమలీ! | 97 |
| మ. | సదనంబున్ బెడఁబాసి నీవు బహువర్షంబుల్ వనక్షోణిఁ జెం ది దురంతవ్యధ లొంద నిన్ను ననురక్తిన్ గూడి వర్తింపఁగా నిది మేలైన యుపాయ మంచు శపథం బేఁ గోరితిన్ గాక నీ హృదయం బించు కెఱింగినన్ దలఁతునే యీమాట ప్రాణేశ్వరీ! | 98 |
| చం. | అడరెడుచిచ్చుఁ జొచ్చుతఱి నాదట నూరక చూచునాఁటిని ల్కడయును గానఁ ద్రోచి చిరకాలము దాళినబెట్టిదంబు నా యెడఁ గని వంతలన్ విసివి యీతని కెక్కడిమోహ మంచు ని ప్పుడమి నడంగి మాయ మయి పోయితి వేమె పతివ్రతామణీ! | 99 |
| ఉ. | కన్నుల సారెకున్ దొరఁగు కజ్జలసమ్మిళితాశ్రుధారతో విన్నఁదనంబుతో మిగుల వెచ్చనియూర్పుల వాడుమోవితోఁ జిన్ని మొగంబు వంచి బలుసిగ్గునఁ గేల్గవ మోడ్చి యిందు ని ల్చున్ననినున్ దలంచుకొన నూహ గలంగెఁ గదే వధూమణీ! | 100 |
| చం. | అనితరవామలూరుజవనాంతరవాసముఁ జెందినావు నీ వెనసినప్రేమ నన్ గదిసె దెప్పటి కైనను గూడి యుందు వం చను నొకయాసఁ బట్టుకొని స్రుక్కక పెక్కుదినంబు లోర్చితిన్ నను దిగనాఁడి యిట్లు చనినన్ వెత నెట్టు భరింతుఁ బ్రాణముల్? | 101 |
| ఉ. | ఎక్కడి కిప్పు డేఁగితివొ యెక్కడ దీనతఁ బాసి నిల్చినా వెక్కడఁ బోయె నాఁటిమరు లెంత కృపారహితాత్మురాల వై తెక్కడఁ జొత్తు నేది తెరు వెక్కరణిన్ గ్రమియింతుఁ గాల మిం కెక్కడ నున్నదాన వని యే వెదకింపుదుఁ బంకజాననా! | 102 |
| సీ. | దర్పించి పరమేశుధన్వంబు విఱుచుట నీనిమిత్తమె కదే నీలవేణి! యెలమితోఁ గపిరాజు చెలిమి పాటించుట నీకోసమే కదే నీరజాక్షి! విబుధేంద్రసుతుఁ బొంచి వ్రేసి నిర్జించుట నీకొఱకే కదే నిర్మలాంగి! క్రోధించి సాగరక్షోభంబు సేయుట నీపనికే కదే యోపురంధ్రి! | |
| తే.గీ. | బ్రహ్మకులజునిఁ బౌలస్త్యపతి గెలుచుట నిన్నుఁ గైకొంటకే కదే వన్నెలాడి! యకట యివి యెల్ల నెంచక నొకటిరెండు తప్పులకు నన్ను నెడఁబాయఁ దగునె నీకు. | 103 |
| సీ. | పడఁతి! నీకటిసీమ యడుగుఁ బట్టుటఁ జేసి నేల గ్రుంగినయట్లు నేఁడు దోఁచెఁ జెలువ! నీ లేఁగౌను బిలము దూఱుటఁ జేసి నింగి గూలినభంగి నేఁడు దోఁచె నతివ! నీముఖచంద్రుఁ డస్తమించుటఁ జేసి నిఖిలంబు తిమిరమై నేఁడు దోఁచె సకియ! నీకాంచనాంగక మడంగుటఁ జేసి నిబిడదారిద్య్రంబు నేఁడు దోఁచె | |
| తే.గీ. | భామినీమణి! నీపొందు లేమిఁ జేసి యలఁతి మజ్జన్మ మిఁక వ్యర్థ మనుచుఁ దోఁచె జలజముఖి! నీవు వెడఁబాసి చనుటఁ జేసి యిదిగొ! యన్నియుఁ గొదవ లై యిపుడు దోఁచె. | 104 |
| కం. | నీగౌరవంబు నీయను, రాగము నీమైత్రి నీసరసభావంబున్ నీగరువతనము నీదయ, నీగుణముల్ మఱవవచ్చునే యెన్నఁటికిన్. | 105 |
| ఉ. | నామన సౌర! యెంతకఠినంబొ తలోదరి నీవు సత్యభా షామహిమోన్నతిన్ మహి యొసంగినత్రోవ నహీంద్ర కన్యకా చామరచంచలచ్చికురజాలక వై చనఁ జూచి వ్రస్సిపో దేమియుఁగాదు ఱాతివలెనే చెలువొందెడుఁ జూడు మియ్యెడన్. | 106 |
| మ. | అని సీతాసతి నాత్మనుంచి తొలిమోహం బెంచి శోకించి య య్యినవంశాగ్రణి భూమి వచ్చి విభవం బేపార నయ్యింతిఁ దో డ్కొని పాతాళబిలంబుఁ జొచ్చిన తెఱంగున్ బుద్ధి నూహించి మిం చిన క్రోధంబున సభ్యులన్ గని వచించెన్ వార్షి కాబ్దధ్వనిన్. | 107 |