| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | రాముఁడు భూమిపై బాణము ప్రయోగింపఁ బూనుట |
| ఉ. | కంటిరె సభ్యులార! జనక ప్రభుకన్యక వేఁడుకొన్నచో బంటవలంతి వచ్చి ప్రియభావముతో వెత దీర్చి పోక తా గంటున న న్నొకింతయును గైకొన కల్పునిఁ గాఁ దలంచి వా ల్గంటి నలంకరించుకొని గ్రక్కునఁ దోకొని చన్నచందముల్. | 108 |
| ఉ. | బాలిశులీల నేను వెతపాలయి దీనత గాసిలంగ నా పాలిటిభాగ్యలక్ష్మి ననుఁ బాయని జానకిఁ గొంచుఁ బోయె ని న్నేలపడంతి దుండగ మనీతియుఁ జూచితిరే కదా! యిఁకన్ దాళిమిఁ బూని యత్త యని దండన సేయక తాళ వచ్చునే. | 109 |
| చం. | లవణపయోధిఖేయమగు లంకకుఁ బోయి దశాస్యముఖ్యులన్ బవరములో జయించి మును భామను దెచ్చిననా కసాధ్యమే తివిరి ధరిత్రి గొన్నసుదతిన్ మరలించుట చూడుఁ డిందఱున్ భువనము లెల్ల భీతిలఁగ భూరిశరాహతి భూమి వ్రచ్చెదన్. | 110 |
| చం. | దురుసున నామదిన్ గినుక దోఁపక ముందర సీతఁ దెచ్చి యి ద్ధరణి యొసంగినన్ బ్రతుకుఁ దక్కిన మామకచాపముక్తని ష్ఠురవిశిఖప్రతానములఁ జూర్ణముఁ జేసి యజాండమెల్ల నా వరణపయోధిలోఁ గలిపి వైచెద నొక్క క్షణంబులోపలన్. | 111 |
| వ. | అని హిరణ్యగర్భస్వర్భువనాధినాథప్రముఖహవిర్భుజులకు గర్భనిర్భేదంబుగా బలికిన తన పలుకుల కళుకులేక నిరాకులస్థితిన్ బ్రవర్తిల్లు ధాత్రిమీఁదన్ బుట్టిన బెట్టిదంపురోషంబునఁ బెదవు లదర నిడుదకన్నుఁ గ్రేవల బెడిదంపు మిడుఁగుఱులు చెదరఁ దటతటన్ గటతటంబులు చలింప ముక్కుపుటంబులఁ బ్రకటతరోచ్ఛ్వసనంబు విజృంభింప నిటలతటంబున నతివికటభ్రుకుటి ఘటిల్ల రదనపటలంబునన్ బటపటార్భటు లుప్పతిల్లఁ బరుషరుషారసోన్ముఖం బై ముఖంబు జేవురింప నెమ్మేనన్ జిఱుచెమ్మటలతెమ్మ లావరింపఁ బంచభూత విలయసమయసముద్దండ తాండవక్రీడాప్రచండ చండీశ్వర విశ్వభయంకర కరణ పారదృశ్వశశ్వద్వీరరసోల్లాసంబునకు నావాసంబొసంగి వాసవాదిపుర ప్రాసాద విలాసనిరాసక్రియాసముల్ల సత్పురత్రయహరణకారణరణారంభ శుంభచ్ఛంభుశరశరాసనవినిర్ముక్త ముక్తాశ్రయవిశిఖానివార్యక్రౌర్యంబుతో సాహచర్యంబువాటించియవార్యధైర్యధుర్యతాదక్షదక్షమఖవిఘాత ప్రభూత సముద్రేకతాక్షుద్రరౌద్రనిర్ణిద్ర వీరభద్రప్రభావంబావహించి భావభవాఖర్వగర్వ సర్వస్వోన్మూలనఖేలనఫాలనయన విశాలఫాలస్థల కీలికీలికాభీలప్రళయకాల ప్రద్యోతమానద్వాదశ ద్వాదశాత్మమండలా ప్రతీపప్రతాపరీతిఁబ్రదీపించి యపారపారావారవారి పూరాపహారక్రీడాఢౌకమానబడబానలశిఖాప్రకరతీవ్రత రౌష్ణ్యంబు నధిగమించి యనవధికసకలభువనాక్రమణ ప్రవర్తనాతివర్తులా వర్తసంవర్తసమయాంభోనిధాన గాంభీర్యంబునన్ బొలుపుమీఱి భూరివిశ్వంభ రాభారభరణప్రవణఫణికులేశ్వరముఖసాహస్రజంజన్యమానపవమానసఖ సముజ్జాత సంకర్షణమూర్తిబింకంబున భయంకరుండై సకలప్రపంచంబు నొక్కట నుక్కడంచి దిగమ్రింగ నప్పళించువిలయకాలమృత్యువు మహౌ ద్ధత్యంబునన్ బొంపిరివోవుచు నఖిలజగమ్ములన్ గ్రమ్ముకొని దుమ్ముసేయ నుద్యోగించు ప్రళయకాలఝంఝాసమీరంబుతీరున బలిమిన్ జెలువారి యెవ్వారికిఁ దేఱి చూడరాక కోపంబు రూపంబు గైకొన్న కోపున నహంకరించి హుంకారంబు నివ్వటిల్ల నవ్వీరాధివీరుండు క్రూరనిరీక్షణంబుల నిప్పులు కుప్పలువడ నప్పుడమి నట్టె యవలోకించి కించిజ్ఞ వై జడమతి నన్నున్ గొంచెగానిం గాఁదలంచి సీతన్ జూడఁ బోవఁ దెరువైన నొసంగ వైతివిగదా మంచిది యీక్షణంబున నిన్ను నిర్భేదించి నీగర్భంబున నున్న యతలవితలా దిసప్త పాతాళలోకంబులు చీకాకు గావించి నీవు ధరించిన సరిత్సముద్ర గిరిపురగ్రామవనకాననాదులతోడ నీయందుఁ గలనిఖిలజంతువుల నిర్మూలించి నిన్ను భరించిన కులపర్వత దిగ్గజభుజగవరాహకూర్మాదుల నింతలింతలు తునుకలుగా నొనరించి నొనరించి నేఁటితో నీయేడులోకంబులు నీఱు గావించెదన్ దాళు మని చెంత నున్న లక్ష్మణుచేతి శరాసనంబు నొడిసి పుచ్చుకొని మచ్చరంబు హెచ్చ నచ్చాపంబు మిక్కుటంపు టుక్కున నెక్కు వెట్టి బెట్టుగా నారి సారించిన సైరించరాని తద్దీర్ఘనిర్ఘోషంబున బీఁటలువాఱి దిక్కులు వ్రక్కలయ్యెఁ జుక్కలు నేలపాలయ్యె సముద్రంబులు పంకిలంబు లయ్యెఁ బర్వతంబు లొడ్డగెడవు లయ్యె నాదిశేషుం డవశుఁ డయ్యె నజాండభాండంబు పగిలిన ట్లయ్యె దిక్పాలురు దిగులుఁ జెందిరి దేవతలు నెగులు బొందిరి కిన్నరులు ఖిన్నతవహించిరి కింపురుషులు కంపించిరి సిద్ధులు చేడ్పాటు నొందిరి విద్యాధరులు వికలతన్ గుందిరి గరుడులు కాందిశీకత వహించిరి గంధర్వులు కళవళించిరి తుషితులు దుఃఖించిరి భాస్వరులు పరితపించిరి యక్షులు దొలంగిరి రాక్షసులు కలగిరి నరులు మూర్ఛిల్లిరి వానరులు తల్లడిల్లిరి వసువు లడలిరి మహారాజికులు బడలి రనిలులు చెదరి రాదిత్యులు బెదరి రూర్ధ్వలోకంబుల నుగ్రాంధకారంబులు నిండుకొనియె నట్టి సమయంబునఁ బ్రత్యాలీఢపాదుం డై కాకుత్‌స్థుండు చండకోదండంబునఁ గాండప్రకాండంబులు దొడిగి భూమండలంబున నేయం దొడఁగుకడంక యెఱింగి యుత్సాహంబు దొఱంగి గడగడ వడంకుచు వెడవెడంగొంకుచుఁ బంకజాసనుం డరుగు దెంచి యయ్యురుగుణాఢ్యుని హస్తంబులు పట్టుకొని యఖిలదేవర్షి బ్రహ్మర్షి గణ సమన్వితుం డై యిట్లని యభినుతింపఁ దొడంగె. | 112 |