ఇతిహాసములు ఉత్తరరామాయణము బ్రహ్మాదిదేవతలు శ్రీరాముని స్తుతించుట
బ్రహ్మాదిదేవతలు శ్రీరాముని స్తుతించుట
చం.జయజయ! సాధురక్షణ! విచారవిచక్షణ! సారసేక్షణా!
జయజయ! సర్వకారణ! నిశాచరదారణకృన్మహారణా!
జయజయ! సత్యభావన! సుజన్యశుభానన లోకపాలనా!
జయజయ! మంజుభాషణ! లసత్కులభూషణ! వార్ధిశోషణా!
113
సీ.తనవిల్లు విఱిచినట్లన రథంబును ద్రుంచఁ - గడఁగెఁగా యనుచు శంకరుఁడు వగచెఁ
దనుమేఖలాలీలఁ దాల్చుభామారత్న - మడఁగుచున్నదె యంచుఁ నబ్ధి గలఁగె
నిజధరాధర సంజ్ఞ నేఁటితో నష్ట మ - య్యెడినొ యంచుఁ జలించెఁ బుడమి తాల్పు
లిఁక నేమి గావింతు మెందుఁ జొత్తు మటంచు - ఫణిఘోణికూర్మముల్‌ పరితపించె
 
తే.గీ.నొకధరాదేవితోఁ బోనె సకలలోక,
ములకుఁ జెడుకాలమొదవెనంచళుకుఁ జెంది
రెల్ల లోకులు నీచేత విల్లుఁ బూని,
ధాత్రిఁ గనుఁగొన్న మాత్ర సీతాకళత్ర!
114
ఉ.భూజల వాయు వహ్ని నభముల్‌ మహదాదులు సృష్టి జేసి నీ
వే జగదంతరాత్మవయి యింతకు నాఢ్యతఁ జెంది నాభి పం
కేజమునందు నన్నుఁ గలిగించితి వెంచితి వీ ప్రపంచమున్‌
రాజవె నీవు ? మమ్మరయు రాజవుగాక! త్రిలోకవందితా!
115
ఉ.కారణయుక్తి నీవలనఁ గల్గినలోకము లీవె త్రుంచ నె
వ్వారలు గా దటం చనెడువా? రిది యెవ్వరి? దిట్టి ధాత్రిపై
మేరయె యింతకోపము? శమించుము, గాంచుము యోగిమానసా
గార విభాసిదీపరుచి గాంచి వెలింగెడి నీస్వభావమున్‌.
116
శా.సత్తామాత్రుఁడవై ప్రపంచకలనాసాక్షిత్వధుర్యుండవై
చిత్తాదీంద్రియబోధరూపకుఁడవై చిచ్ఛక్తి యుక్తుండవై
తత్తాదృక్త్రిగుణాత్మకత్వమున నేతత్సృష్టిరక్షాత్యయా
యత్తానంత విలాసముల్‌ గనిన నిన్నాత్మన్‌ విలోకింపవే!
117
వ.అని పలికి మఱియు నిట్లనియె.118
సీ.కల్పక్షయమున నేకంబైన జలధిపైఁ - బవళించి జగదిచ్ఛ యవధరించి
హృదయాబ్జమున నన్ను సృజియించి నిర్గమిం - చుటకుఁ బొందమ్మి పొక్కిటి ఘటించి
బయలుదేఱినచోఁ దపంబు సేయు మటంచు - నాకాశమూర్తివై యపుడు వల్కి
తపము నిష్ఠకు మెచ్చి తగ నంచవై వచ్చి - తెలివినంతయు నుపదేశమిచ్చి
 
గీ.వెనుక వైకుంఠ మనుపేర వినుతికెక్కు
భువనరాజంబులో శేషభోగితల్ప
శాయివై తోఁచి నను జగత్సర్గమునకు
నియ్యకొలిపిన నా తండ్రి వీవె కావె ?
119
మ.శిఖివిద్యాబల శౌర్యపణ్య కృషి సంసేవాదులన్‌ గూడి నీ
ముఖ బాహూరు పదంబులన్‌ గ్రమమునన్‌ బుట్టెన్‌ జతుర్వర్ణముల్‌
నిఖిలాశల్‌ జనియించె నీచెవుల నీనేత్రంబులన్‌ గల్గి రిం
దుఖరాంశుల్‌ జగదంతరాత్ముఁడవు నిన్నున్‌ శక్యమే యెంచఁగన్‌.
120
మ.జనముల్‌ విభ్రమ మొందఁ బ్రాకృతుని యోజన్‌ దైన్యశోకక్రుధల్‌
చనునే యిట్లు వహింపఁ? జాలు విడు మిచ్చాపంబు భూదేవి చే
సిన తప్పేమి త్వదాజ్ఞఁగాదె తెరు విచ్చెన్‌ సీత నిత్యానపా
యిని నిన్నుం బెడఁబాసి యెందరిగెఁ? దండ్రీ! బుద్ధి నూహింపుమా!
121
ఉ.నీ కథ లాదినుండియును నేర్పలరన్‌ రచియించినాఁడు వా
ల్మీకిమహర్షి యక్కొదవ లెస్స వినం దగు నందునన్‌ మనో
వ్యాకులతాస్థితుల్‌ దొలఁగు నంతియకాదు భవిష్యదర్థమున్‌
నీకెఱుఁగంగ వచ్చు నది నేనును వింటి మునీంద్రకోటితోన్‌.
122
శా.సారప్రజ్ఞఘటించు శ్రోతల కభీష్టంబుల్‌ ప్రసాదించు భా
గీరథ్యాపగఁబోలి పంక మడఁచున్‌ గీర్భామినీపాదమం
జీరస్ఫారమృదుధ్వనిన్‌ జెవులకున్‌ జేకూర్చు నుల్లాస మీ
శ్రీరామాయణ మాదికావ్యము సుమీ! సీతామనోవల్లభా!
123
కం.తత్తఱ మొందక యిత్తఱి,
నుత్తరకాండంబు విన్న నుత్తల మడఁగున్‌
జిత్తము ప్రసన్న మగు నని
యత్తామరచూలి పలుక నౌఁగా కనుచున్‌.
124
తే.గీ.కోప ముపసంహరించి కాకుత్‌స్థమౌళి
యనుజు చేతికి శరశరాసనము లొసఁగె
నలరి యవ్విభు వీడ్కొని యజుఁడు సురలు
మునులుఁ గొలువంగఁదన లోకమునకుఁ జనియె
125
కం.ఆసమయంబునఁ గాంస్యము
గీసినగతి నతులవల్లకీ తతులొకటై
మ్రోసినగతి నెలుఁగడరన్‌
భూసతికడనుండి యొక్క నుడి వినఁబడియెన్‌.
126
శా.రామాధీశ్వర! చింతయేమిటికి? శ్రీరామా శిరోరత్నమీ
భూమిన్‌ సీతయనన్‌ జనించి హరివై పొల్పొందు నిన్‌ గూడి నీ
వైముఖ్యంబు తుదిన్‌ సహింపక బుధుల్‌ వర్ణింప నాత్మీయమౌ
ధామంబున్‌ దొరసెన్‌ ద్వదాగమన మాత్మన్‌ గోరుచున్‌ బ్రేముడిన్‌
127
చం.క్రియయును మేధయున్‌ ధృతియుఁ గీర్తియు శక్తియు హ్రీయు శాంతియున్‌
దయయును దుష్టి పుష్టియును దథ్యము సీతయె చుమ్ము తన్మనో
దయితుఁడవైన నీవె పరదైవము నిర్వురు మీరు తల్లి దం
డ్రియు నయి లోకరక్ష యొనరింపుచు నుండుదు రెల్ల కాలమున్‌.
128
శా.ఏ సీమంతిని పాదశోణరుచి దేవేంద్రాది దిక్పాల కాం
తాసీమంతములందుఁ జెందిరము చందంబొందు, నే దేవి వీ
క్షా సమ్యగ్ద్యుతిలేశ మర్థిజన దౌర్గత్యంబు మాయించు నా
శ్రీ సీతాసతి లీల నిన్ను భజియించెన్‌ రామ! కొన్నాళ్ళిలన్‌
129
ఉ.సీతఁ దలంచి యింక వెతఁ జెందకు శ్రీరఘు రామ! యామెపై
నాతతమైన నీకరుణయంతయు నిక్కవలందు నిల్పు మ
బ్జాతభవోపదిష్టమగు పద్ధతి నుత్తరకాండ మంతయున్‌
బ్రీతి దలిర్ప వీరు వినిపింప రహిన్‌ విను మంచుఁదెల్పినన్‌
130
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju