ఇతిహాసములు ఉత్తరరామాయణము రాముం డశ్వమేధయాగంబు పరిసమాప్తి నొందించుట
రాముం డశ్వమేధయాగంబు పరిసమాప్తి నొందించుట
ఉ.ఆ పలుకుల్‌ చెవిన్‌ బడినయంత నొకించుక ధైర్యమూని యా
క్ష్మాపతి వామలూరుభవుఁగన్గొని “మీ నుడువుల్‌ వినంగ ని
త్తాపసు లీ నృపాలకులుఁ దద్దయుఁ గోరుచునున్నవా రిఁకన్‌
రేపటినుండియున్‌ బ్రియము నివ్వటిలన్‌ జదివింపుఁ డవ్వలన్‌”
131
కం.అని పలికి సకల జనముల
ననిచిన నెయ్యమున ననిచి, నందనులను దో
డ్కొని మఖశాలకుఁ జనియెన్‌
మనుకులమణి యంత గగనమణియును గ్రుంకెన్‌
132
ఉ.ఆ నిశయెల్ల జానకి గుణాతిశయంబులె చింత సేయుచున్‌
మానవభర్త నిద్రయను మాట యెఱుంగకయుండి, వేగినన్‌
స్నానము సంధ్యయున్‌ జపము జన్మపు నేమములున్‌ ఘటించి యా
స్థానముఁ జేరి బ్రహ్మఋషి సంగములో వసియించి యచ్చటన్‌
133
తే.గీ.సుతులఁ గనుఁగొన్న వల్లకీ శ్రుతులు బెరయ
శ్రుతుల కింపని యతులు భూపతులు మెచ్చఁ
గతిపయ దినంబు లుత్తరకాండ కథలు
వారు తుదముట్టఁ జదివి రధ్వరము నయ్యె
134
ఉ.ఆ తఱి ఋత్విగావళికి సంచితదక్షిణ లిచ్చి యర్థిసం
ఘాతము కోరినట్ల కుతుకంబున నీవు లొసంగి ధారుణీ
నేతల దానవేంద్ర రజనీచరముఖ్యుల భూషణాదులన్‌
బ్రీతులఁ జేసి వీడుకొలిపెన్‌ బతి యందఱ నర్హరీతులన్‌.
135
తే.గీ.ఇటులఁ గృతకృత్యుడై రాఘ వేశ్వరుండు
ధరణికన్యా వియోగాగ్ని తప్త హృదయుఁ
డగుచుఁ దనుజులు దనుజులు నాప్తు లార్యు
లాశ్రితులు గొల్వఁగ నయోధ్య కరిగి యచట.
136
మ.నయమార్గంబున రాజ్యమేలె నవనీనాథుండు దేవద్విజ
ప్రియకార్యంబు లొనర్చుచున్‌ జగతిపైఁ బెక్కగ్రహారంబు లు
చ్ఛ్రయ సంపన్నతఁ గల్గఁజేయుచు దురాచారస్థులన్‌ బాపుచున్‌
దయ నర్థార్థుల కోర్కు లిచ్చుచు ననాథశ్రేణి రక్షింపుచున్‌.
137
సీ.అమితదక్షిణలతో నయుతాశ్వమేధముల్‌ - గొనకొని యొనరించెఁ గొన్నినాళ్లు
శిష్టు లౌ ననఁగ నగ్నిష్టోమయజ్ఞముల్‌ - గురునిష్ఠ నొనరించెఁ గొన్నినాళ్లు
భూరిదానముల విప్రుల తృప్తిగ ననేక - గోమేధము లొనర్చెఁ గొన్నినాళ్లు
జేజేలలరఁ బెక్కు వాజపేయములు మి - క్కుటపుఁగల్మి నొనర్చెఁ గొన్నినాళ్లు
 
గీ.లెడ తెగని యాహుతులను వహ్నికి నజీర్తి
యడర నతిరాత్ర పౌండరీకాది యాగ
కోటుల ఘటించెఁబటు బుద్ధి కొన్నినాళ్లు
హేమసీతాసమేతుఁడై యినకులుండు.
138
చం.పొలుపఱి సీతవంటి సతి పోయిన పిమ్మట నింక నొక్క తెన్‌
వలయునె పెండ్లియాడ? నన వారని నెంజెలి నెవ్వరెన్ని భం
గుల వివరించినన్‌ వినక క్షోణిజఁ బోలిన పైఁడి బొమ్మ ని
శ్చలమతిఁ జెంతనుంచుకొని క్ష్మాపతి సేసె ననేకయాగముల్‌.
139
వ.తత్కాలంబున140
సీ.అవని వసుంధరాఖ్యకుఁ దగ నెడలేని - హేమరాశుల కాంతి నెసక మెసఁగి
వనధి రత్నాకరత్వము యథార్థముఁ జేసె - బలు తరఁగల రత్నపంక్తులూని
యభ్ర నామము వ్యోమ మనురూపముగఁ దాల్చె - జనులు గోరిన వస్తు సమితిఁ గురిసి
ధర్మాభిధాన మంతకుఁడు నిక్క మొనర్చె - ముదుసళ్ళనైనను గదియఁబోక
 
తే.గీ.వలసి నపుడెల్ల వానలు గలిగి యుండెఁ
బ్రబలి రందఱుఁ బాఁడియుఁ బంట లెనసి
నెట్టుకొని కొల్చు పోకకుఁ బుట్టె డమ్మె
శ్రీరఘుస్వామి రాజ్యంబు సేయునపుడు.
141
కం.తరణికులాధీశ్వరునకు
భరియింపఁగ నపుడు రెండు భారము లొదవెన్‌
ధరణీభారము సీతా
తరుణీ చిర విరహ భూరితరభారంబున్‌
142
చం.మఱవఁగ నేర్చు లోకు లథమస్థితిఁ బల్కినయట్టి నిందలున్‌
మఱవఁగ నేర్చు నాశ్రితులు మాటికిఁ జేసిన యన్ని తప్పులున్‌
మఱచిన మర్వరాక మదినాటినసీతవియోగదుఃఖమున్‌
మఱవఁగ నేరఁడయ్యె గుణమండితుఁ డా రఘువీరుఁ డయ్యెడన్‌.
143
సీ.విద్యావయోరూప వినయ శౌర్యాదులఁ - బ్రబలులై కొడుకులు భక్తిసలుప
హృదయానుగుణముగా నేమఱ కేవేళ - ననుజన్ము లఖిలకార్యములు నడప
సకలదేశాధినాయకులుఁ గింకుర్వాణు - లై పదాబ్జము లెప్పు డనుసరింప
హితమంత్రిగురుపురోహితబంధు సామంత - ముఖులు మనఃపూర్వముగ నుతింప
 
తే.గీ.భూమిఁ జిరకాల మేలుము స్వామి యనుచుఁ
బ్రజలు జేవెట్టఁ గలిమియు బలిమి గలిగి
యొప్పి యుండియు సీత లేకున్న కతన
నన్నియుఁ గొఱంతలై తోఁచె నవని పతికి
144
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju