ఇతిహాసములు ఉత్తరరామాయణము కౌసల్యా కైకేయీ సుమిత్రలు దివంబున కరుగుట
కౌసల్యా కైకేయీ సుమిత్రలు దివంబున కరుగుట
తే.గీ.ఏకతంబున నున్నచో నినకులుండు
భామినీమణి నూహించి పరితపించుఁ
గొలువులో నున్నయప్పుడు కొడుకులఁ గని
సీతరూపంబు భావించి చింత నొందు
145
సీ.రాజ్యంబుఁ జేయు శ్రీరాముని విభవంబు - కన్నులు చల్లగాఁ గాంచి యలరి
యమితదక్షిణలతో నాతఁ డొనర్చిన - యాగకోటులు కని హర్షమొంది
యవ్వ! యంచు సపర్య నాచరించు కుశాది - పౌత్త్రులఁ గనుఁగొని బాళిఁజెంది
సీత వోయినచింతఁ జెందనీక భజించు - నూర్మిమళాదులఁ జూచి యూఱడిల్లి
 
గీ.యెల్ల బంధులఁ బోషించి యిహసుఖంబు
లెల్లఁగని యెల్ల సవతుల యుల్ల మలర
నడిచి సడిసన్న కౌసల్యనాథుఁ డున్న
లోకమున కేఁగె సుతులెల్ల శోకమొంద.
146
వ.అప్పుడు147
కం.తల్లీ! సాధ్వీలోకమ
తల్లీ! మముఁబాసి పోవఁదగునే యనుచున్‌
దల్లడమందుచు రఘుపతి
తల్లికిఁ బరలోక విధులు తగ నొనరించెన్‌
148
చం.పతికడ కామె చన్న యొక పక్షములోపల నేఁగెఁ గేకయ
క్షితిపతి పుత్త్రియున్‌ విభుని చెల్మికి నంతటిలోఁ గ్రమంబునన్‌
గతిపయవాసరంబులకుఁ గాంతునిఁ జేరె సుమిత్రయున్‌ నయ
వ్రత లయినన్‌ సపత్నులు పరస్పరసౌఖ్యము లోర్వ రెయ్యెడన్‌
149
కం.ఆ మాతల గూర్చి రఘు
గ్రామణి మహిసురుల కొసఁగె రత్నాభరణ
స్తోమంబులు హేమంబులు
గ్రామంబులుఁ బారలౌకికక్రియలయెడన్‌
150
చం.అతులవిభూతి మీఱఁ బితృయజ్ఞము లిట్టు లొనర్చి రామభూ
పతి యశుచిత్వమున్‌ దొరఁగి బంధుపురోహిత మంత్రి సోదరా
న్వితుఁడయి యొక్కనాఁడు మహనీయసభన్‌ గొలువున్నఁ గేకయ
క్షితివరు దూత వచ్చి నుతిఁజేసి కరంబులు మోడ్చి యిట్లనెన్‌
151
ఆ.వె.స్వామివారికడకు మీమామ తమపురో
హితునిఁ బంపె నాతఁ డిదిగొ వచ్చు
చున్నవాఁడు నేను మున్నుగాఁ దెలుప వ
చ్చితి నటన్న నృపతిశేఖరుండు
152
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju