ఇతిహాసములు ఉత్తరరామాయణము రాముని కడకు గార్గ్యమహాముని వచ్చుట
రాముని కడకు గార్గ్యమహాముని వచ్చుట
చం.అలరుచుఁ గేకయాధిపతి యంపిన గార్గ్యునికిన్‌ వినీతి హె
చ్చిల నెదురేఁగి వందనముఁ జేసిన దీవన లిచ్చి యాతఁడున్‌
విలసిత లీల మించు పదివేల హయంబుల రత్నభూషణా
వళుల ధనంబులన్‌ వివిధవస్తుచయంబు లొసంగెఁ గాన్కగన్‌.
153
ఆ.వె.అవి పరిగ్రహించి యివి యేల దెచ్చితి
రింతవింత చేతురే యటంచు
నతనిఁ దోడితెచ్చి యర్ఘ్యాదు లిచ్చి య
ర్హాసనమున నుంచి యధిపుఁ డనియె
154
చం.లలితగుణాబ్ధి! మీకుఁ గుశలంబు గదా? ఘనుఁ డస్మదీయమా
తులుఁడు సుఖించునే? వినయదోహలుఁ డాయనతండ్రి వైభవో
జ్జ్వలుఁడయి యున్నవాఁడె ? శుభవంతులె పుత్రులు ? కూర్మి మా పయిన్‌
గలదె ? త్వదాగమనంబునకుఁ గారణమేమి గణింపవే? యనన్‌
155
మ.మృదువాక్కోవిదుఁ డమ్మునీంద్రుఁ డనియెన్‌ మీమాతులుం డయ్యుధా
జిదిలాధీశ్వరుఁ డార్యబంధుయుతుఁడై క్షేమాన నున్నాఁడు ప్రే
మ దలిర్పన్‌ శుభశీలురన్‌ మిముఁ బరామర్శింప నన్‌ బంపినాఁ
డది గా కింకొకవార్త దెల్పు మనినాఁ డాలింపు ముర్వీశ్వరా!
156
శా.గంధేభప్రతిమాన విగ్రహు లుదగ్ర స్యందనుల్‌ బాహుగ
ర్వాంధుల్‌ సింధుతటోభయాశ్రితులు మాయాయుద్ధబద్ధాశయుల్‌
గంధర్వుల్‌ శరచాపధారులు ప్రజన్‌ గాఱింపుచున్నారు దు
స్సంధుల్‌ వారలఁ బట్టి చంపి బుధులన్‌ సంరక్ష సేయన్‌ దగున్‌
157
ఉ.ధారుణికిన్‌ భరం బయిన దారుణచిత్తుల సంహరించినన్‌
భూరియశంబు పుణ్యమును బొందెడినే కద గల్గు రాజ్యముల్‌
శూరతమించు నీ సుతులలోపల నెవ్వరినైన నిర్వురన్‌
వారకయచ్చటన్‌ నిలుపవచ్చుఁ బ్రజావళి మెచ్చు నందునన్‌
158
తే.గీ.అనియు నీ మామ పనిచినాఁ డనిన రాముఁ
డెవ్వని కుమారు లవ్వీరు లెందఱు గల
రనిన వారెల్ల మూఁడుకో ట్లవనినాథ
ఖలులు శైలూషసుతు లంచు గార్గ్యుఁ డనిన
159
చం.విని కడు సమ్మతించి రఘువీరుఁడు గార్గ్యునిఁ జూచి పల్కె నో
మునివర! యద్దురాత్ముల నమోఘశరాహతి నుక్కడంచి శౌ
ర్యనిధుల దక్షపుష్కరుల నాత్మతనూజుల నందు నిల్ప నా
యనుజలలామునిన్‌ భరతు నంపెద రేపు బలాన్వితంబుగన్‌.
160
తే.గీ.విభవముల మించు గంధర్వవిషయములకుఁ
బట్టములు గట్టఁ బనిచెద భరతసుతుల
నీక్షణంబున నని వారి కిర్వురకును
జెలఁగి పట్టాభిషేకముల్‌ సేసె విభుఁడు.
161
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju