| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | భరతుఁడు రామాజ్ఞచే గంధర్వులమీఁదికి యుద్ధమునకుఁ బోవుట |
| ఉ. | ఇట్టుల దక్షపుష్కరుల కిర్వురకున్ రఘుభర్త పట్టముల్ గట్టి వినీతుఁడౌ భరతుఁ గన్గొని - గార్గ్యులఁగొల్చి రేపె పొ మ్మిట్టలమైన బల్మిఁ బొలియింపుము వైరులఁగట్టు మచ్చటన్ బట్టనయుగ్మ మందులఁ గుమారుల నిల్పుము రమ్ము నావుడున్. | 162 |
| చం. | సవినయబుద్ధి నాతఁడు హసా దని యమ్మఱునాఁటి వేకువన్ దివసముఖోచితక్రియలు దీర్చి కుమారుల తోడ వచ్చి, రా ఘవునకు మ్రొక్కి దీవనలఁ గైకొని వీడ్కొని యంగిరస్తనూ భవునిఁ బురస్కరించుకొని పౌరుష మొప్పఁ జనెన్ జయార్థియై | 163 |
| వ. | అప్పుడు | 164 |
| సీ. | అతిఘోర ఘీంకారకృత వైరి మదవార - ణములైన మదవారణములు గదలె ఘనఖురోత్థ రజో-ంధకారాంధ హరిసైంధ - వములైన బహుసైంధవములు నడిచెఁ జటుల కేతన కాండ చలిత తారామండ - లములైన రథమండలములు దరలె వీతిభాగభియాతి విదళనోద్ధత హేతి - కోటియైన పదాతికోటి వెడలె | |
| తే.గీ. | నందు భేరీధణందణల్ గ్రందుకొనియె శంఖ భుంభుం నినాదముల్ సందుకొనియె మురజ పణవాది ఘోషముల్ ముంచుకొనియె నమితకాహళరవము మిన్నందు కొనియె | 165 |
| శా. | ఈ లీలన్ బహుసేనఁగూడి భరతుండేఁగంగ నా త్రోవలోఁ “గాలగ్రీవుఁ డితండె సుమ్ము మనకున్ గంధర్వమాంసాదులన్ గీలాలంబులఁ దృప్తి సేయు” ననుచున్ గీర్తింపుచున్ భూతభే తాళక్రూరపిశాచకోటి నడిచెన్ దండుంబలెన్ వెంబడిన్ | 166 |
| కం. | ఆలాగె యనుసరించె సృ గాల వృక వ్యాఘ్ర ముఖ మృగంబులు ఖగముల్ నేలయు నింగియు నెఱసె వి శాలచమూ కలకలము పిశాచార్భటులున్ | 167 |
| వ. | ఇవ్విధంబునన్ | 168 |
| మ. | నెలమీఁదం బదియేనునాళ్ళకు మహానీకంబుతో నాత్మమా తులుప్రోల్ జేరి యతండు నిల్ప రహి నందున్ నాఁటికిన్ నిల్చి, పెం పలరంగా మఱునాఁడె కేకయులు సాహాయ్యంబురా శాత్రవుల్ గలఁగన్ రామసహోదరుండు సనియెన్ గంధర్వదేశంబుపైన్ | 169 |
| మ. | పటహధ్వానములున్ భటార్భటు లదభ్రక్రోధ యోధచ్ఛటా ఘటితేష్వాస గుణధ్వనుల్ నిజవధూ గర్భైక నిర్భేదనో ద్భటలీలన్ నిగుడన్ దదాగమనవార్తల్ విన్నవారౌట నొ క్కట గంధర్వులు వచ్చి తాఁకి రలుకన్ గాకుత్‌స్థ సేనావళిన్ | 170 |
| కం. | కడలిం గడలి యెదుర్కొను గడిమిన్ భరతేంద్రుసేన గంధర్వులపై వడి నిగుడ బెడిదముగఁ దల పడి పోరెడునపుడు పోరు భయదంబయ్యెన్ | 171 |
| కం. | నిలు నిలు నిలు మను నెలుఁగులుఁ దల తల మను నెలుఁగు లడరి తాఁకెడి యెలుఁగుల్ కిలకిల నార్చు నెలుంగులు బళి బళి యను నెలుగులును నభం బవియించెన్. | 172 |
| సీ. | నడుచు చప్పుడు డాసి పొడుచు చప్పుడుఁ గేక - వ్రేయు చప్పుడు దొమ్మి సేయు చప్పు డాఁగు చప్పుడు చెలరేఁగు చప్పుడుఁ గత్తు - లొరయు చప్పుడు మూఁక విరియు చప్పు డెదిరించు చప్పుడు బెదిరించు చప్పుడ - గ్గించు చప్పుడు హుంకరించు చప్పు డదలించు చప్పుడు విదళించు చప్పుడుఁ - బిలుచు చప్పుడుఁ బురికొలుపు చప్పు | |
| తే.గీ. | డుభయసేనల సమరీతి నుప్పతిల్లి మిక్కుటపుఁగిన్కఁ జదలాని పిక్కటిల్ల మనుజయోధులు శైలూషతనుజ యోధు లే డహోరాత్రములు పోరి రీరసమున | 173 |
| వ. | మఱియును | 174 |
| సీ. | చరణాహతుల భూమి జనియించు రజముచే - నిఖిలదిక్కుల నిర్లు నించి నించి జళిపించు విచ్చుకత్తులవల్లఁ దులకించు - మించులు దివియెల్ల ముంచి ముంచి జముఁడు బిట్టాడించు జంత్రంపు బొమ్మల - ట్లలఁతఁ జెందక క్రుమ్ములాడి యాడి కుసుమితాశోకాళి కొమరునఁ గ్రొత్త నె - త్తుటివాఁకలను దొప్పదోఁగి దోఁగి | |
| గీ. | చెయ్వు లులియంగ మూర్ఛలఁ జెంది చెంది యలవు కలిమి నొకింతలోఁ దెలిసి తెలిసి సింహముల లీల గర్జనల్ చేసి చేసి యుభయ యోధులు పోరాడి రొక్క మొగిని | 175 |
| వ. | అప్పుడు. | 176 |
| తే.గీ. | ఒరలు మదకరు లుర్విపైఁ బొరలు హరులు విఱుగు తేరులు బలమేది యొఱగు భటులు వ్రాలు పడగలు నెత్తుటఁ దేలు గొడుగు లలబలములందు రెంటను గలిగియుండె | 177 |
| సీ. | పొలసులే కాఱిప్రేగులు మాడియున్న ప్రే - తవ్రాతముల బీదతనమువాసెఁ బ్రమదల కస్థి హారము లియ్యఁ గోరిన - ఢాకినీతతి యభీష్టములు నిండెఁ కీలాలనదులలోఁ గేళి సల్పఁ దలంచు - శాకినీసమితి ముచ్చటలు దీఱెఁ బచ్చి పీనుఁగులకై బహుదేశ మరుదెంచి - నట్టి బేతాళులయాత్మ లలరెఁ | |
| గీ. | గ్రొవ్వు మజ్జయు మెదడును గూర్చి బ్రహ్మ రాక్షసశ్రేణులకు సమారాధనంబు సేయనెంచిన దయ్యంపుఁ జెలుల యెన్ని కలును ఫలియించె నమ్మహాకదనమునను | 178 |
| శా. | ఆలోనన్ బగవారిఁ గన్మొఱఁగి మాయాయుద్ధలీలారతిన్ శైలూషాత్మజు లంబరస్థు లయి మజ్జామాంసచర్మాస్థులున్ శైలాదుల్ గురియించి సేన నొగిలించం గాంచి కల్పక్షయ క్ష్వేలగ్రీవునికై వడిన్ భరతుఁ డక్షీణక్రుధాక్రాంతుఁడై | 179 |
| శా. | సంవర్తారుణమండలస్ఫురిత తీక్ష్ణజ్యోతి రుజ్జృంభియౌ సంవర్తాస్త్రము వింటఁ బూన్చి జగముల్ శంకింపఁగా నేసినన్ సంవర్తాశుగవేగ మొప్ప నదియున్ జ్వాలాస్ఫులింగోగ్రమై సంవర్తాగ్నివలెన్ దహించె నపుడా శైలూషజశ్రేణులన్ | 180 |
| కం. | ఈరీతి మూఁడుకోట్ల మ హారథికుల క్షణములోన నడఁగించిన యా ఘోరాస్త్రరాజ ముపసం హారము గావించె భరతుఁ డమరులు వొగడన్ | 181 |