| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | భరతుండు గంధర్వులం బరిమార్చి దనకుమారులగు తక్షపుష్కరులఁ దద్రాజ్యంబున నిలిపి యయోధ్యకు వచ్చుట |
| మ. | భరతుం డీగతి నుగ్రశాత్రవతతిన్ భంజించి తద్దేశముల్ సరసప్రౌఢిమనాక్రమించి, ప్రజ లెంచన్ సింధుభూమిన్ సమ గ్రరమావైఖరి మించ నొక్కపురమున్ గాంధారధాత్రిన్ శుభా కరశిల్పోన్నతిఁ గాంచునొక్కపురమున్ గల్పించె నారెంటికిన్ | 182 |
| ఆ.వె. | పొసఁగఁ దక్షశిలయుఁ బుష్కరావతియు నా సంజ్ఞ లాచరించి స్వర్గభంగిఁ దనరుతక్షశిలను దక్షునిఁ బుష్కరా వతిని బుష్కరాఖ్యసుతుని నిలిపె | 183 |
| చం. | పురముల రెంట నిక్కరణిఁ బుత్రకులన్ సిరులొంద నిల్పి యా భరతుఁడు నాఁడునాఁటి కలపట్టణముల్ ధనధాన్యవస్తు భా స్వరములుగా ద్విజాతినృపవైశ్య భటాదికవర్ణవైభవా కరములుగా రథేభతురగస్ఫురితంబులుగా నొనర్చినన్ | 184 |
| సీ. | రాజితజ్యోతిఃపరాజితర్‌క్షాగార - రాజితప్రాకారరాజిఁ దనరి చంద్రమండలతుంగ చంద్రమండితశృంగ - చంద్రశాలాభంగ శాలలఁ దగి రమణీయతరవాసరమణిప్రఘర్షి సా - రమణిస్ఫురితగోపురముల వెలసి రాజరాజధనోత్క రాజస్రసంవాస - రాజమార్గములచే రహివహించి | |
| గీ. | కేళికాసారవాపికాఖేయకూప కృతకకుధరోపవనదేవగేహమంది రాధ్వజవిచిత్రకుడ్యతోరణవిశేష భాసురశ్రీల నొప్పె నప్పట్టణములు | 185 |
| కం. | అలకామరావతులక్రియ నలరెడు నప్పట్టణముల నైదేండ్లెలమిన్ నిలిచి కుమారుల వీడ్కొని బలువేడుక రాముకడకు భరతుఁడు వచ్చెన్ | 186 |
| తే.గీ. | వచ్చి పరమేష్ఠి నర్చించు వాసవుండ పోలె నతఁ డన్న పాదాబ్జములకు మ్రొక్కి యతులమణిపూజ లొనరించి యరివధంబు మున్నుగాఁ గలకార్యముల్ విన్నవించె | 187 |
| తే.గీ. | విన్నవించిన రఘురామవిభుఁడు సంత సించి తమ్ముల నిరువురఁ గాంచి యనఘు లార మన యౌర్మిళేయుల కైనపురము లెవ్వియనఁ గైకయీపుత్త్రుఁ డిట్టులనియె | 188 |
| ఉ. | అంగధరాంగనామణికి నంగద మై తగు నంగదీయ మి య్యంగదుఁ డేలు నుత్తరదిశాభరణం బనఁ జంద్రకాంతసం జ్ఞం గర మొప్పుప్రోల్ తదనుజన్ముఁడు గైకొనునట్ల సేయుఁడ న్నంగడు సంతసిల్లి రఘునాయకుఁ డంచిత వాసరంబునన్ | 189 |
| తే.గీ. | అట్టి వారికిఁ బట్టముల్ గట్టి పశ్చి మమున నంగదు నిలుప లక్ష్మణునిఁ బనిచెఁ జంద్రకేతుని మల్ల దేశమున నునుపఁ బనిచె భరతునిసమముగా బలము లొసఁగి | 190 |
| చం. | పనిచిన వారు నవ్విభుఁడు పంచినకైవడి నందునందు న త్తనయుల నుంచి వారికి హితం బుపదేశ మొసంగి రాజ్యముల్ పనుపడ నొక్కవత్సరము పాయక తాము వసించి తత్తదా ర్యనుతుల వారి వీడ్కొని నిజాగ్రజుఁగొల్వఁగ వచ్చి రయ్యెడన్ | 191 |
| ఆ.వె. | వచ్చికొలుచు ననుజవరులతో రఘుభర్త దనరు గార్హపత్యదక్షిణాగ్ను లనుసరింప వెలయు నాహవనీయాగ్ని వలె విభూషణాంశువులు వెలుంగ | 192 |
| ఆ.వె. | ఇవ్విధమున రాముఁడేకాదశ సహస్ర వత్సరములు పరమవై భవమున నేల నాల్గు చెఱఁగు లేలెఁ ద్రేతాయుగం బాదియుగములీల నతిశయిల్ల | 193 |
| కం. | ఘనమతులు భరతలక్ష్మణు లనవరతము రామసేవ నాసక్తమతిన్ దనరుచుఁ గాలము చేరువ యని యెఱిఁగియుఁ గలఁగకుండి రాసమయమునన్ | 194 |