ఇతిహాసములు ఉత్తరరామాయణము యముడు మునివేషధారియై రామునికడకు వచ్చి రహస్యంబున బ్రహ్మవాక్యములు దెలుపుట
యముడు మునివేషధారియై రామునికడకు వచ్చి రహస్యంబున బ్రహ్మవాక్యములు దెలుపుట
సీ.తనశోణతారకాంతరకాంతిచంచల - చంచలాంచజ్జటాచ్ఛటల నించి
తనచతుర్దంష్ట్రికాధళధళల్‌ పరిశుద్ధ - భసితాంగరాగసంపదల నుంచి
తనకేళిదండంపుదండితనం బెల్ల - హస్తస్ఫురద్బ్రహ్మయష్టి నిలిపి
తననిండు మేనికందెనచాయ కటిబద్ధ - నవ్యకృష్ణమృగాజినమునఁ బూన్చి
 
గీ.శాంతభావంబు కరుణాప్రసన్నముఖము
నిర్మలోదకపూర్ణకుడికయుఁ దనర
జటిలవేషంబు ధరియించి జముఁడు వెలిహ
జారమున కేఁగుదెంచి లక్ష్మణుని కనియె
195
ఉ.ఇచ్చటి కొక్క తాపసకులేశ్వరుఁ డంపఁగ నేను దూతనై
వచ్చితిఁ బద్మబంధుకులవర్యునిఁ గన్గొని మాటలాడగా
నచ్చతురాత్ముతోఁ దెలుపుమయ్య! మదాగమనంబు నావుడున్‌
జెచ్చెర లక్ష్మణుండు నృపుఁజేరి కరంబులు మోడ్చి యిట్లనున్‌
196
చం.దినకరతీక్ష్ణతేజమున దృష్టికిఁ వ్రేఁ గొనరింపుచున్నవాఁ
డనితరధర్మమూర్తి యొక యార్యునిదూత తపస్వి దేవరన్‌
గనుఁగొనిఁ మాటలాడుటకుఁ గా మొగసాలకు వచ్చి నిల్చినాఁ
డన విని రాముఁ డాతని రయంబునఁ దోడ్కొని రమ్ము నావుడున్‌
197
చం.అతఁడును శ్రీఘ్ర యానమున నమ్మునిఁ దోకొని వచ్చునంతలోఁ
బతి యెదురేఁగి నమ్రుఁడయి పాద్యము మున్నుగఁ బూజలిచ్చి యు
న్నతకనకాసనస్థితు నొనర్చి ప్రసన్నత మించి పల్కె నో
యతులవివేక! యెవ్వరిట కంపఁగ వచ్చితి వానతియ్యవే!
198
చం.మిముఁ గనుఁగొన్న యంత నలమిత్త్రునిఁ జూచినయట్లు మానసా
బ్జ మలరె నామ మేమి తెలుపన్‌ గదె! యన్న నతండనున్‌ రహ
స్యముగ వచింతు నిజ్జనుల నందఱఁ బంపుము రామ! నీవె కా
కమఱి పరుల్‌ వినంగ నధికారులు గారు మదీయవాక్యముల్‌.
199
కం.అదిగాక యిర్వురమును స,
హృదయులమై మాటలాడునెడ నిచటికి నీ
తి దొఱంగి వచ్చి నాతని
విదళించెద వేనిఁ గార్యవిధ మెఱిఁగింతున్‌
200
చం.అన విని కొంతసేపు హృదయాబ్జమునన్‌ దలపోసి మంచిదే
యని సభ నున్నయందఱఁ బ్రియంబునఁ బంచి విభుండు లక్ష్మణున్‌
గనుఁగొని నీవు వాకిటనె కాచుక యుండు మి టెవ్వరైన వ
చ్చిన నిది వేళ గా దని వచింపుమ్ము పొమ్మని పల్కె నయ్యెడన్‌
201
కం.ఆ కుహనాముని శేఖరుఁ
డేకతమున నున్న రాఘవేశ్వరుఁ గని సీ
తాకాంత! బ్రహ్మ వనుపఁగ
నీకడ కేతెంచినాఁడ నే నంతకుఁడన్‌
202
ఉ.ఈవు నృపాలమాత్రుఁడవె యీసచరాచరభూతకోటికిన్‌
దేవుఁడ వైన విష్ణుఁడవు దేవకిరీటచిరత్న రత్న శో
భావృత పాదపద్ముఁడ వనాది వనంతుఁడ వబ్జగర్భుఁడ
య్యా! వినుపింపు మన్న విధ మంతయు నూఁకొను ముగ్గడించెదన్‌
203
సీ.ఆదికాలమున క్షీరాబ్ధిలోఁ జిలువమ - న్నీనిపై బవళించి నిదురఁ జెంది
కొన్ని కల్పము లరుగుటయు మేల్కని భవ - న్నాభిఁ బుట్టినతమ్మి నను సృజించి
నీవీనులందె జన్మించిన మధుకైట - భాఖ్యులన్‌ ద్రుంచి తదస్థితతుల
ధరములు మెదడున ధాత్రియుఁ గల్పించి - లోకాధిపత్యంబు నా కొసంగి
 
గీ.బాధలిడుదైత్యుల వధింపఁ బ్రతినఁబూని
వెనుక రావణుచేనొచ్చి వేఁడుకొన్న
సురల రక్షింపఁ దశరథసుతుఁడ వగుచు
నవతరించితి వని నొంచి తసురవరుని
204
తే.గీ.మొదటఁ బలికినచందానఁ బదునొకండు
వేలయేం డ్లుర్వి యేలితి వేలయింకఁ
దామసము సేయ రమ్మాత్మధామమునకు
నిలుము రాజ్యేచ్ఛ గలిగిన నేల నధిప!
205
చం.అని పరమేష్ఠిఁ దెల్పు మనె నంచుఁ బరేతవిభుండు వల్కినన్‌
విని చిఱునవ్వు నవ్వి రఘువీరుఁడు వారిజసంభవుండు ప
ల్కినదె హితోక్తి గావలయుఁ గృత్యము లన్నియు నయ్యె నియ్యెడన్‌
బను లిఁక లేవు వచ్చెదఁ బ్రభావనిధీ యని పల్కుచున్నెడన్‌
206
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju