ఇతిహాసములు ఉత్తరరామాయణము దుర్వాసుఁడు క్షుత్పీడితుం డై రామునికడకు వచ్చుట
దుర్వాసుఁడు క్షుత్పీడితుం డై రామునికడకు వచ్చుట
సీ.అనసూయ గర్భశుక్తిని రూపుగని యేమ - హర్షి ముక్తాగ్ర గణ్యత వహించె
నత్రిసంయమి తపోధాత్రీరుహమున కే - యతివరేణ్యుఁడు ఫలాకృతి రహించె
నింద్రురాజ్యవిభూతి నేమౌనిశాపాక్ష - రావలి వాయు వై యబ్ధిఁ గలిపె
రుద్రుని యత్యుగ్రరోషాగ్ని యేమునీ - శ్వరునిచందమున గోచరతఁ జెందె
 
గీ.నట్టి దుర్వాసుఁ డవ్వేళ నరుగుదెంచి
మోసల వసించు రాముతమ్మునిఁ గనుఁగొని
యధిపుతోఁ దెల్పు మారాక యనిన నతఁడు
నెంతయు వినీతుఁ డై మ్రొక్కి యిట్టులనియె
207
మ.జటిలాగ్రేసర! వేళ గాదు రఘువంశస్వామి యేకాంతలం
పటచేతోగతి నున్నవాఁడు క్షమియింపన్‌ జెల్లు నొక్కింతసే
పటకున్‌ నాకును బోవరా దనిన రోషాగ్ని జ్వల జ్జ్వాలికా
చటులక్రూరకటాక్షుఁడై యతఁడనున్‌ సౌమిత్రితోఁ గ్రమ్మఱన్‌
208
చం.నను నిలుపన్‌ బితామహజనార్దనశంభుల కైన శక్తి లే
దనఁగ నొకండు శక్తుఁడె నృపాగ్రణి కీవు మదాగమంబు దె
ల్పనిపని నిక్క మేని హితబాంధవమంత్రులతోఁ ధనంబుతోఁ
దనయులతో మిమున్‌ గినిసి దగ్ధులుగా శపియింతు నావుడున్‌
209
తే.గీ.గడగడ వడంకి పెక్కండ్రు మడియుకంటె
నరయ నొక్కనిచావు మే లని తలంచి
రాఘవునిఁ జేరి మ్రొక్కి దుర్వాసుఁ డిపుడు
దేవ యరుదెంచినాఁ డంచుఁ దెల్పుటయును
210
ఉ.వాసరరాజవంశమణి వాసరరాట్సుతు వీడుకొల్పి దు
ర్వాసునిఁ జేరఁ బోయి యభివందనముల్‌ ఘటియించి యేల వి
చ్చేసితి రేమి పూజనలు సేయుదు నావుడు వేయియేండ్లు నేఁ
జేసిన బల్తపంబునఁ గృశించితి నాఁకలి దీర్పవే! యనన్‌
211
చం.వడియము లొల్పుఁబప్పుఁ గలవంటకముల్‌ వరుగుల్‌ ఫలాదులున్‌
బడిదము లప్పముల్‌ వడలు పాయసముల్‌ కలమాన్న మాజ్య మ
ప్పడములుఁ గూరలున్‌ బెరుఁగుఁ బచ్చడు లాదిగ నించి భోజనం
బిడిన నతండు మెచ్చుచు యథేష్టముగా భుజియించి పోయినన్‌.
212
కం.కీనాశునిసమ్ముఖమునఁ
దానూనిన ప్రతినఁ దలఁచి దశరథసూనుం
డాననము వంచి ధైర్యవి
హీనుం డై దీనవృత్తి నిట్లని వగచెన్‌
213
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju