ఇతిహాసములు ఉత్తరరామాయణము లక్ష్మణుండు రామపరిత్యక్తుండై సరయూనదిం గ్రుంకి దివంబున కరుగుట
లక్ష్మణుండు రామపరిత్యక్తుండై సరయూనదిం గ్రుంకి దివంబున కరుగుట
చం.కటకట యేల యిచ్చటికిఁ గాలుఁడు వచ్చె మహాప్రతిజ్ఞ యే
మిటికి నొనర్చితిన్‌ సుజనమిత్త్రుని నాసహజన్ముఁ బాసి నే
నెటువలె నిల్తు నెట్లు వచియింపుదు నివ్వెడమాట యెవ్వరున్‌
గటికిమనంబుతోడ నవకార్యము లిట్టివి యాచరింతురే
214
సీ.స్రక్చందనాంగ నాసౌఖ్యముల్‌ వర్జించి - నాతోడఁదొల్లి కానలకు వచ్చె
నెడపక పదునాలుగేండ్లు నిద్రాహార - ములు మాని నాకు సేవలు ఘటించె
సీతఁ బాసినవంతఁ జెందనీయక ధైర్య - మొదవ మాటాడి నన్నుపచరించె
రణరంగమున మదర్థమ్ముగా నతికాయ - శక్రజిత్ప్రముఖుల సంహరించె
 
గీ.హృదయ మెఱిఁగి ప్రవర్తించె నిన్నినాళ్ళు
నిట్టి హితునిట్టి విశ్వాసి నిట్టి యాప్తు
నిట్టి తమ్మునిఁ బ్రతినకై యెట్లు నొంతు
నేమి సేయుదుఁ దుది దైవమెంత సేసె
215
వ.అని శోకాబాష్పాకులితనేత్రుండై యద్దశరథపుత్త్రుండు పెక్కుభంగులన్‌ బనవి పనవి కన్నీరు కరతలంబునన్‌ దుడుచుకొని యెట్టకేలకు నెప్పటి యెలుంగు నూల్కొల్పి చెంగటనున్న యనుంగుఁదమ్మునిన్‌ గనుంగొని యిట్లనియె216
చం.అలుకవహించి యత్రి కొడుకాఁకటిపెల్లున రేఁగి యందఱున్‌
బొలియఁగఁ దిట్టిపోయినను బోదుము నెమ్మది నాత్మహానికిన్‌
దలఁకక యేల వచ్చితివి నాయెడకున్‌ సడికోర్చి నిన్ను ని
ర్మలు నెడఁబాసి నొంటి నిఁకఁ బ్రాణము లెట్లు భరింతుఁ దమ్ముఁడా
217
కం.ప్రతిన యొనర్చిననెపమున
మృతిఁ బొందన్‌ జేయు ననుచు నేమోయి ననున్‌
సతతంబు నమ్మి కొలిచితి
వతులగుణాభరణ లక్ష్మణా యని వగవన్‌
218
ఉ.ఆరఘువీరుఁ జూచి వినయంబున లక్ష్మణుఁ డిట్లనున్‌ ననున్‌
గూరిచి చింత సేయకుము కోవిదు లాపదలన్‌ గలంగ రె
వ్వారికిఁ గాలమున్‌ గడవవచ్చునె మీరు ప్రతిజ్ఞఁ దప్పినన్‌
ధారుణి గ్రుంగదే స్వకులధర్మము మానుదురే నరాధిపుల్‌
219
చం.ఎలమి వహించి నన్నుఁ ద్యజియింపక యుండితిరేనిఁ బల్కులన్‌
గలయు నసత్య మందులకుఁ గారణ మేఁ గన నన్నుఁ జెందుఁ ద
త్ఫల మటు గాక యుండ నరపాలక నన్నుఁ దొఱంగి సత్యమున్‌
విలసితకీర్తియున్‌ నిలుపవే యన రాముఁడు ఖేదమందుచున్‌
220
కం.కులగురుఁ డైన వసిష్ఠుని
నలఘుమతుల మంత్రివరుల నార్యుల హితులన్‌
బిలిపించి జమునిరాక మొ
దలుకొని సకలంబుఁ దెలిపెఁ దత్సభ్యులకున్‌
221
చం.తెలిసి వినీతు సోదరుఁ బ్రతిజ్ఞ యటంచుఁ ద్యజింపఁ గూడునే?
తలఁకెడిఁ జిత్త మెయ్యది హితం బెఱిఁగింపుఁడు మీర లిందఱున్‌
గలఫల మన్న నొండొరు మొగంబులు సూచుచుఁ దేర్చి యెద్దియున్‌
బలుకఁగ నేర కూరక సభాసదు లున్న వసిష్ఠుఁ డిట్లనున్‌
222
చం.ప్రతిన యటంచు లక్ష్మణునిఁ బాయుట యెట్లన నేల? రామ! నీ
ప్రతిన దొలంగినన్‌ బలు కబద్ధ మనంబడు నయ్యసత్యతన్‌
హత మగు ధర్మ మాసుకృత మంతముగా జగముల్‌ నశించు లో
కతతులు పెక్కునాశ మగుకంటె సహోదరుఁ డొక్కఁ డెక్కుఁడే
223
చం.సకల మనిత్య మెప్పటికి సత్యము నిత్యము సత్యసంధులై
ప్రకట యశోవిభూతి మనరా మనరాజు లసత్య మాడ నో
పక కద నిన్నుఁ గానలకుఁ బంచె భవజ్జనకుం డెఱుంగవే
యకుటిల సత్యసంపద జనాధిప! కీర్తి వహింపు నావుడున్‌
224
కం.ఆమాటలు విని సభ్య
స్తోమము విధి చెట్ట యనుచు దూఱఁగ రామ
స్వామి కడుఁ దెగువ చేకొని
సౌమిత్త్రిన్‌ జూచి ధైర్యసంపద ననియెన్‌
225
చం.ఎడపక యెంతతప్పు ఘటియించినచో నినువంటి తమ్మునిన్‌
గడఁగి వధింపఁ జాల నధిక ప్రతిభాన్వితు లైనవారికిన్‌
విడుచుట చంపు టొక్కగతి నిన్నుఁ ద్యజించితి నీకు నిచ్చ యౌ
నెడ కిఁక నేఁగుమన్న నతఁ డెంతయు శోకవిషాదమూర్తి యై
226
చం.అడలుచు నన్నపాదముల కప్పుడు సాఁగిలి మ్రొక్కి యార్యుల
క్కడిజనముల్‌ విభుండు దనుఁ గన్గొని యశ్రులు నించఁ గొల్వు వె
ల్వడి సరయూతరంగిణి కవార్యధృతిన్‌ జని క్రుంకి యోగ మ
య్యెడ ధరియించి యాత్మఁ దనయెప్పటిరూపుఁ దలంచునంతలోన్‌
227
చం.ఎలమిఁ బ్రసూనవృష్టిఁ గురియింపుచు నింద్రుఁడు వచ్చి శంఖకా
హళములు మ్రోయ రంభ మొదలైన చెలుల్‌ నటియింప నమ్మహో
జ్జ్వలనిధి మేనితోడఁ ద్రిదివంబునకున్‌ గొనిపోయె వేడ్క నం
దలిబుధు లౌర! వచ్చె హరినాలవ పాలని ప్రస్తుతింపఁగన్‌
228
తే.గీ.దివమునకు నిట్లు లక్ష్మణుదేవుఁ డరిగి
యచట దివిజులచేఁ బూజలంది కోటి
భానుబింబ ప్రభాభాసమానుఁ డగుచు
నిత్యముక్తాశ్రయంబైన నెలవుఁజేరె
229
ఉ.అంత వసిష్ఠ ముఖ్యులగు నార్యులఁ గన్గొని రాముఁడిట్లనున్‌
వింతగఁ దోఁచుచున్నయది విశ్వము లక్ష్మణుఁ బాసి నిల్వలే
నింతటనుండియున్‌ భరతు నిప్పుర మేలెడునట్లు సేసి లో
కాంతరగామి యైనభరతానుజునిన్‌ దిలకింప నేఁగెదన్‌
230
చం.అన విని భీతుఁ డై భరతుఁ డన్నకు జాగిలి మ్రొక్కి పల్కె నో
యినకులనాథ! యీ ధరణి యేటికి నింద్రపదాధిపత్య మి
చ్చిన మిముఁ బాసి నే క్షణముసేపయినన్‌ వసియింపఁ జాల మీ
కనిశము సేవఁ జేయుటయె యంచిత రాజ్యము వేయునేటికిన్‌
231
కం.నరవర కోసలదేశము
పరిపాలన సేయఁ గుశుని బట్టము గట్టుం
డురుకృప నుత్తరకోసల
ధరణికిఁ బతిఁ జేయుఁ డతనితమ్ముని ననఁగన్‌
232
చం.అనియె వసిష్ఠుఁడో రఘుకులాధిప! మీ పలుకాలకించి యీ
జను లెడఁబాయలేని వెత జాలివహించిరి వీరిఁదేర్పఁగా
జను నన రామచంద్రుఁడు ప్రసన్నత నాప్రజఁ జూచి మీరుకో
రినపనియేమి తెల్పుఁ డొనరించెద నెట్టిది యైన నావుడున్‌
233
ఉ.పౌరులు మంత్రులున్‌ భటులు బంధులుఁ బ్రాంజలు లూని నిల్చి యో
కారుణికాగ్రగణ్య కలకాలముఁ బ్రోచి మమున్‌ ద్యజించి పో
మేరయె పుత్త్రపౌత్త్రసఖిమిత్త్రసహోదర గేహినీ సుహృ
ద్వారముతో మిమున్‌ గొలిచి వచ్చెద మెక్కడఁ జన్న నావుడున్‌
234
కం.ఎల నగవొలయ రఘూద్వహుఁ
డలమనుజులమనవి విని కృతాంతునిపలుకుల్‌
దలఁచుకొని మంచి దనియెన్‌
గలవె సమర్థుల కసాధ్యకార్యము లెందున్‌
235
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju