ఇతిహాసములు ఉత్తరరామాయణము రాముండు కుశలవులకుఁ బట్టము గట్టుట
రాముండు కుశలవులకుఁ బట్టము గట్టుట
కం.కోసలకన్యాసుతుఁ డిటు
లాసించిన యట్టిప్రజల నలరించి కృపన్‌
గోసలదేశమునకుఁ బతిఁ
జేసెఁ గుశు విపక్షకరటిశిక్షాంకుశునిన్‌
236
కం.లవు నంఘ్రిద్యుతిజితప
ల్లవు నంగవిలాసవిభవలజ్జితరతిప
ల్లవు నుత్తరకోసలమున
కవనీశ్వరుఁ డధిపుఁ జేసె నార్యులు మెచ్చన్‌
237
ఆ.వె.ఇటుల దొరలఁ జేసి యిద్దఱుసుతులకుఁ
బ్రేమ నిచ్చినట్టిభూములందు
రావణాహితుఁడు కుశావతి యనుప్రోలు
శ్రావితాఖ్యపురము సంఘటించె
238
ఉత్సాహదేవతా సరిత్సరోజ వేదివ న్మరాళ సం
భావితాభ్ర విభ్రమభ్రమ స్ఫురత్‌ సురేశ్వర
గ్రావబద్ధ గోపుర ప్రకాశముల్‌ కుశావతీ
శ్రావితాభిధాన సత్పురంబు లొప్పె నెంతయున్‌
239
చం.పురయుగ మిట్లొనర్చి యటఁ బుత్త్రులఁ బంపెడువేళ రాఘవుం
డిరువురకున్‌ సమానముగ నిచ్చె రథేభభటాశ్వపంక్తులన్‌
గరుణఁ గనుంగొనెన్‌ జనకకన్యఁ దలంచి కవుంగిలించి త
చ్ఛిరములు మూర్కొనెన్‌ నయవిశేషము లెల్ల దలంచి ప్రేముడిన్‌
240
చం.ఇనకులభర్తచేఁ దనయు లిట్లుపలాలితులై తదంఘ్రియు
గ్మనఖవిభల్‌ స్వఫాలఫలకప్రలసద్ఘనసారరేఖలన్‌
జెనకఁగ మ్రొక్కి దీవనలు సేకొని వీడ్కొని బాష్పపూర్ణ లో
చను లయి పోయి రవ్విభుఁ డొసంగిన చోట్లకు సైన్యసంగతిన్‌
241
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju