ఇతిహాసములు ఉత్తరరామాయణము శత్రుఘ్నుఁడు తనకుమారులకుఁ బట్టముఁ గట్టి రామునికడకు వచ్చుట
శత్రుఘ్నుఁడు తనకుమారులకుఁ బట్టముఁ గట్టి రామునికడకు వచ్చుట
తే.గీ.అంతశత్రుఘ్నుఁ దోడి తెమ్మని నృపాలుఁ
డాప్తుఁ డగుదూత నొక్కని ననుప వేగి
రమునఁ జని వాఁడు మూఁడహోరాత్రములకు
నధిక సౌభాగ్యమధురయౌ మధురఁ జేరి
242
మ.అలశత్రుఘ్నునిఁ గాంచి లక్ష్మణుని నిర్యాణంబు పౌరాశ్రితా
దులు దామున్‌ బతిఁ గొల్చి పోవుటకు నుద్యోగించు టాత్మీయపు
త్త్రులకున్‌ గోసలభూము లిచ్చి జననాథుం డూర్ధ్వలోకోన్ముఖా
కలితప్రజ్ఞ వహించి యున్కి మొద లౌ కార్యస్థితుల్‌ దెల్పినన్‌
243
కం.విని కలఁగియుఁ గలఁగక య
జ్జననాథసుతుండు ధైర్యసంపన్నతఁ గాం
చనుఁ డనుపురోహితునిఁ బుర
జనములఁ బిలిపించి ప్రియమెసఁగ నిట్లనియెన్‌
244
తే.గీ.అన్న నెడఁబాసి లక్ష్మణుం డమరపురికి
నేఁగెనఁట యెల్ల ప్రజలతో నింక విభుఁడు
వెడల నున్నాఁడఁట యయోధ్య విజనమయ్యె
నఁట విలోకించితిరె కాల మెటుల వచ్చె!
245
ఉ.రామవిభుండు లేనియమరావతినైన క్షణంబు నిల్తునే
యీమధురాపురంబునకు నింక సుబాహు మదగ్రపుత్త్రునిన్‌
స్వామిగఁ జేసి యుంచి విదిశాపురరాజ్యము శత్రుఘాతికిన్‌
బ్రేమ నొసంగి పోయెదను మీర లనుజ్ఞ యొసంగుఁ డియ్యెడన్‌
246
కం.అని పలికి వారియనుమతిఁ
గొని యాయాపురములకును గొడుకుల నభిషే
చన మొనరించి చెఱిసగముగ
ఘనబలములఁ బంచి యొసఁగి గమనోన్ముఖుఁడై
247
కం.సుతదారాదుల వీడ్కొని
యతఁ డతిధైర్యమున నొంటియరదముతో క్ష్మా
పతి సంప్రేషితదూతా
న్వితుఁ డయి సాకేతమునకు నేతెంచి వెసన్‌
248
శా.నందర్శించె మహాసభాంతరమునన్‌ శత్రుఘ్నుఁడుద్యత్సదా
నందున్‌ భూరికుశాసనస్థితు మునీన్ద్రశ్రేణిసంభావితున్‌
సందీప్తానలతేజు శాంతినిరతున్‌ క్షౌమాంబరోద్ధారు స్వ
చ్ఛందున్‌ జంద్రనిభాననున్‌ ఘనసదృక్షశ్యామునిన్‌ రామునిన్‌
249
కం.సందర్శించి ప్రియంబున
వందనమొనరించి స్వామివారియనుజ్ఞన్‌
నందనులఁ దగినభూముల
యందుఁ నిలిపి వచ్చినాఁడ నకలంక మతిన్‌
250
చం.పలుకులు వేయునేల మిముఁ బాసి యిఁకన్‌ క్షణమైన నిట్టి భూ
స్థలమున నిల్వఁ జాల నిది సత్యము నేనును గొల్చి వచ్చెదన్‌
వలదని యానతీయకుఁడు త్వాదృశు లెయ్యెడ నమ్మియున్నవా
రల విడరంచు వేఁడుకొన రమ్మనె నాతని రాముఁ డాదృతిన్‌
251
వ.తత్కాలంబున252
చం.నరపతి యూర్ధ్వలోకగమనంబు చరుల్‌ వినిపింప ఋక్షవా
నరులు నిశాచరుల్‌ విని స్వనాథులఁ గూడి యయోధ్య కేఁగుదెం
చిరి వినయంబు మించ రఘు శేఖరుఁ గాంచి ప్రణామముల్‌ ఘటిం
చిరి కరముల్‌ మొగిడ్చిరి వచించిరి యిట్లని యందఱొక్కటన్‌
253
కం.ధరణీనాయక! మే మిం
దఱమున్‌ మిముఁ గొల్చి వచ్చుతలఁపున నిటకున్‌
బఱతెంచితి మెడపక మము
గురుకృప నిఁక వెంటఁబెట్టుకొని పోవఁదగున్‌
254
చం.అనునెడ భానుసూతి వినయంబున రామునిఁ జేరి మ్రొక్కి యో
మనుకులనాథ దేవవిభుమన్మని వానర రాజ్యపట్టభ
ద్రునిఁగ నొనర్చి మీచరణతోయరుహంబులు గొల్వ వచ్చితిన్‌
నను విడనాడి పోవకుఁ డనన్‌ బతి సమ్మత మొందె నెమ్మదిన్‌
255
కం.ఫాలన్యస్తాంజలి యై
యాలోన విభీషణుండు నండకు రాఁగా
నాలోకించి రఘూద్వహుఁ
డేలా యీతలఁపు రాక్షసేశ్వర! నీకున్‌
256
చం.ధరణి చరాచరావళులు దాలిచి యుండెడు నంతకాలమున్‌
పరమవినీతి లంక పరిపాలనసేయు మి దేల యంచు ను
త్తరములు పల్క రాకుము సదా చరియింపుము ధర్మపద్ధతిన్‌
నిరతిశయప్రభావమున నెయ్యము మర్వకు మంచుఁ బల్కినన్‌
257
కం.రామాజ్ఞకు వెఱచి యతం
డేమియు నన నేరకుండె నినకులుఁ డంతన్‌
సామీరి మోముఁ జూచి సు
ధామధురవచో నిరూఢి తగ నిట్లనియెన్‌
258
శా.ఏతన్మాత్రుఁడవే విభాకరకృపావీక్షా సమాసాదిత
శ్రౌతస్మార్తరహస్య రాశివి భవిష్యద్ధాత వధ్యాత్మవి
ద్యాతాత్పర్యనిరూఢ బుద్ధివి విశుద్ధబ్రహ్మచర్యవ్రతో
ద్ధూతాంభశ్చరకేతనుండ వఖిల స్తుత్యప్రభావోదయా!
259
కం.మత్కీర్తిచంద్రికలు యా
వత్కాలము కువలయమున వన్నియఁ గనుఁ దా
వత్కాలముఁ గపిచంద్ర భ
వత్కాయం బమృతగతి ధ్రువంబుగ నిల్చున్‌
260
కం.నామాటలు నిక్కువ మగుఁ
నీమదికోర్కియు ఫలించు నిత్యుఁడ వగు మిం
కేమియు బలుకకు మని రఘు
రాముఁడు సామీరినని కరం బనురక్తిన్‌
261
తే.గీ.బ్రహ్మసుతు ఋక్షకులసార్వభౌముఁ జూచి
నీవు చిరకాలజీవివి నిర్మలుఁడవు
కలఁగ కెప్పటివలె భూమి నిలువు మని వ
చించి మైందద్వివిధువీక్షించి విభుఁడు
262
చం.బలువగువేడ్క మీ రమృతపానముఁ జేసినవారు గావునన్‌
తలుగదు మీకు హాని చిరకాలము వర్తిలుఁ డుర్వి నంచుఁ బెం
పలరఁగఁ బల్కి తక్కిన వనాటుల నాబడి నేఁగుదెండు చిం
తిలక తలంచి నట్లయని తేటపడన్‌ వివరించె నయ్యెడన్‌
263
కం.ఆరఘురాముని మాటలఁ
బౌరులు బాంధవులుఁ గపులు బహుజానపదుల్‌
గోరికఁ బెండ్లికిఁ బోయెడు
వారి వలెన్‌ జెలఁగి రుత్సవంబులు వెలయన్‌
264
సీ.చూడవచ్చిన మహీసురులకుఁ దమయిండ్లు - వేడ్కతోఁ జూఱలు విడుచువారు
దిక్కులనుండి యేతెంచిన యర్థుల - కెల్ల పదార్థంబు లిచ్చువారు
ధరణి దాఁపుటయును ధర్మమంచు ధనంబు - చెలఁగి నిక్షేపముల్‌ సేయువారు
కళ్యాణ మిఁక నింతకంటె నెట్టిదియని - సకలోత్సవంబులు సలుపువార
 
తే.గీ.బంధములు దీటె మనతపఃఫలము లొదవె
నెప్పు డిఁక వేగుఁ బతివెంట నెపుడు వోదు
మంచు నలరేయి యుగముగా నెంచువారు
నైరి సాకేతముననున్న యఖిల జనులు
265
మ.మఱునాఁ డంత వసిష్ఠుఁ జూచి రఘురామస్వామి వల్కెన్‌ మునీ
శ్వర! నేఁడే పరమేష్ఠి వీడుఁ దిలకింపన్‌ వేడ్క వాటిల్లెడిన్‌
పరిపాటిన్‌ నెరవేర్పుఁ డంచితమహాప్రస్థాన కర్మంబు ముం
దర సాగింపుఁడు యాగవహ్ను లన నాతం డట్ల కావించినన్‌
266
సీ.పండు వెన్నెలడాలు బైటవేయగఁ జాలు - ప్రవిమల క్షౌమాంబరములు గట్టి
గరుడపచ్చలయేపు పరిహసింపఁగ నోపు - దర్భాంకురములు హస్తములఁ దాల్చి
హరినీలములరంగు నపహరింపఁ దొడంగు - ఘనకేశబంధంబు వెనుకఁ జేర్చి
తమ్మిఱేకులజోక తలఁగఁ జేయువిలోక - నములు స్వనాసికాగ్రమున నుంచి
 
గీ.శాంతలక్ష్మి వసించుకంజాత మనఁగ
మొగము దులకించఁ బటుమౌనముద్ర మించ
నేవికారంబు లేక యయ్యినకులేంద్రుఁ
డల్లనల్లన నాత్మగృహంబు వెడలె
267
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju