| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | శ్రీరాముఁడు తమ్ములతోడను బౌరులతోడను సరయూనదిం బ్రవేశించుట |
| వ. | అప్పు డప్పరమకృపాళునిడాపలిభాగంబునం గరపద్మంబులు ముకుళించుకొని పురలక్ష్మి యనుసరించె దక్షిణభాగంబున హ్రీ యనుతోయజాక్షి యాకారంబు ధరియించి దాక్షిణ్యకారుణ్యధైర్యగాంభీర్యస్థైర్య చాతుర్యాది వివిధగుణంబులతో ననుగమించె ముందర విజయవినయధర్మ సత్యక్షమాశమదమౌదార్య వివేకవిశేషంబులతో నుద్యోగంబు గనునించె వెనుక ననేకశస్త్రాస్త్రనివహంబులు పురుషవిగ్రహంబులు ధరియించి తనున్ గొలువఁ బురుషాకారంబు తోడఁ గార్ముకం బనుసరించె ఋగ్యజురాదివేదంబులు బ్రాహ్మణరూపంబులతో నగ్రభాగంబున నరుగుచుండెఁ దన్మధ్యంబున సావిత్రీమహాదేవి స్త్రీరూప ధారిణియై సప్తవ్యాహృతులతోఁ బ్రణవంబుతో ఛందోఋషిన్యాసదేవతా బీజశక్తికీలక ప్రముఖమంత్రాంగంబులతో నమితమంత్రతంత్రయంత్ర సమూహంబుతో ద్వాత్రింశదుపనిషత్సమేత యై నడిచె నద్దేవిపిఱుంద స్మృతిశాస్త్రపురాణేతిహాసంబులు పౌరుషవిలాసంబులు వహించి యనుగమించె సమంచితస్థేమంబునన్ జనురఘురాము నవలోకింపుచు దేవర్షి బ్రహ్మర్షి రాజర్షి శేఖరు లప్సరస్సిద్ధసాధ్య విద్యాధరప్రముఖనిఖిల దేవవర్యులు నలుదిక్కులన్ గ్రిక్కిఱిసి సమ్మర్దంబుగాఁ బఱతెంచిరి దాసదాసీజనంబులతోఁ బుత్త్రమిత్త్రకళత్త్రంబులతో నాప్తసఖీబంధు సోదర ముఖ్యులతో నయోధ్యలోఁ గలసకలజనంబులు చుట్టుపట్లపల్లెపట్టులఁ గలప్రజలు జానపదులు మొదలుగా నొక్కండునున్ జిక్కక యొక్క మొత్తంబై నడతెంచిరి యంతఃపుర స్త్రీజనంబులు వృద్ధులు పశ్వాదులు పరివేష్టింప భరతశత్రుఘ్నులు సదారబాంధవులైన సుమంత్రాదిమంత్రులతో సామంతులతో సుభటపుంగవు లతో హితసహితులై యహితభీకరుం డగ్గుణాకరు ననుసరించి సాగ్నిహోత్రులై నానాగ్రహారవిశిష్టాగ్రవర్ణులు కుటుంబసమన్వితంబుగా సవత్సకంబులగు గోధనంబులు మున్నిడుకొని వెంబడిన్ జనిరి సుగ్రీవసుషేణ గంధమాదన పనసగజగవయ గవాక్షశతబలినలనీలవినత కేసరి గ్రథనదధిముఖ ధూమ్ర వేగసువేగ తారకుముదప్రజంఘప్రముఖ మహావలీముఖులు ఋక్ష వానరసమేతులై పరమహర్షంబునన్ గదలిరి వాంశికవైణికమార్దళిక మౌరజికఢాక్కిక వైతాళికవందిమాగధప్రముఖులు కవినటగాయకులు భద్రమధుమత్తకాశ్యప ప్రముఖనర్మసఖులు గణికాబ్జముఖులు నిఖిలకర్మంబులు దిగంద్రోచి నిష్కల్మషభావంబున రామగుణకీర్తనంబులు సేయుచు నతనివెనుకొనిరి విద్వత్పురోహితవేదాంతిక తార్కికవైయాకరణ ప్రముఖులు జన్మబంధంబులుదీఱెనని సంబంధులై సింధుబంధనస్నేహానుబంధనంబున వెంబడిన్ గొలిచి పోయిరి యదృశ్యభూతంబులు నదృశ్యనగరవాసులు నతిసూక్ష్మశరీరులు నతిస్థూలశరీరులు నరుదెంచిరి పశుపక్షి మృగక్రిమికీట కాదులు శైలవృక్షలతాగుల్మాదు లుపాధిరహిత సదాభిలాషంబున నయ్యగ శోషణునాశ్రయించె నివ్విధంబున నఖిలచరాచరంబు లొక్కదిక్కై నడచునవ్వీటిమహాఘోషంబు ప్రళయసముద్రఘోషంబు ననుసరించె భేరీపణవ శంఖాదివాద్యఘోషంబు లజాండ గర్భ నిర్భేదనం బాచరించె నించుకయుఁ జలింపక కొంచక యిహసుఖంబులు దలంచక దుఃఖించక యేకచిత్తులై యజ్జనులందఱుఁ బెండ్లికిన్ బోవుచందంబున రఘునందనుపదార విందంబులు సేవించుచున్ బోయి రవ్వింతఁ జూడవచ్చిన వివిధరాష్ట్ర ని వాసులు తమకు నిదియే త్రోవగాక యింతకంటె నేమి విశేషంబు లున్నవి యని కృతనిశ్చయులై వెంబడించి రిట్లు రఘువీరుం డామడదూరంబు మందగమనంబున నతిక్రమించి పశ్చిమవాహిని యైన సరయూనదీతీరంబు చేరన్‌బోయె నయ్యవసరంబున | 268 |
| ఉ. | అన్నదికిన్ ముహూర్తమున నంబుజగర్భుఁడు లోకపాలకుల్ కింనరయక్షకింపురుషఖేచరులున్ వసురుద్రసంఘముల్ పన్నగు లాదితేయులును బ్రహ్మఋషుల్ గొలువన్ మణిప్రభా చ్ఛన్న విమానకోటులు దిశల్ వెలుఁగన్ జనుదెంచి వేఁడుకన్ | 269 |
| శా. | ధింధింధిమ్మని మ్రోయుమద్దెళలతో దేవాధిరాడ్భేరికా ధంధం ధ్వానము లాకసం బొరసె నంతన్ దాళసంరావసం బంధంబుల్ దగ నాడి రచ్చరలు సమ్యగ్గీతముల్ పాడి ర గ్గంధర్వుల్ జడి వట్టి బెట్టు గురిసెన్ గల్పప్రసూనచ్చటల్. | 270 |
| కం. | సరసీజాక్షుఁడు రాముఁడు సరయూనదిఁ జొచ్చె నపుడు సహజన్ములతోఁ జరణాంభోజము లచ్చటి యరుణాంభోజములు వియ్యమందుచు నలరన్ | 271 |
| ఉ. | ఆ రఘువీరశేఖరుముఖాబ్జమునందు నిజావలోకనో దారమిళిందబృందములు దార్కొనఁ జేసి విధాత భారతీ చారుముఖీ పదాంబురుహసంగతహంసరవానుసారిమం జీరఝళంఝళధ్వని విశేషముతోదివినుండి యిట్లనున్ | 272 |
| కం. | శ్రీరామచంద్ర జగదా ధారా దివ్యావతార దాసశరణ్యా! కారుణ్యసార రవికుల హారా! భవ్యప్రచార యఖిలస్తవ్యా! | 273 |
| ఉ. | ఈ యఖిల ప్రపంచమున కీవు విభుండవు నీయవాచ్య మౌ మాయ నెఱుంగ మాతరమె మానుషవేషము మాని యాదినా రాయణమూర్తి వై యనుచరావలి గొల్వ ఖగేంద్రునెక్కి వి చ్చేయుము కాలయాపనము సేయఁగ నేల మహాత్మ యిచ్చటన్ | 274 |
| ఉ. | అవ్యయమప్రతర్క్య మఖిలాశ్రయ మక్షయ మాద్య మార్యసం స్తవ్య మనన్ దనర్చుపరతత్త్వము నీవయి సృష్టిసాధన ద్రవ్యగుణాత్మకత్వమునఁ దాలుతు వేతను వైనఁ జూపు మ ద్దివ్యశరీర మందఱకు దేవ కనుంగొన వేడ్క యయ్యెడిన్ | 275 |
| కం. | శ్రీరామ సీత యనఁ జను శ్రీరామ భవత్పదంబుఁ జేరి మునుపుగా నీరాకఁ గోరుచున్నది కోరికయును గూర్పవయ్య గొబ్బునననుచున్ | 276 |
| కం. | వనజాసనుండు దెలిపిన విని రాముఁడు సంతసించి విశ్వజగన్మో హనలీలావిలసిత మగు తనదివ్యశరీర మాత్మఁ దలఁచిన యంతన్ | 277 |
| సీ. | శతకోటిభాస్కరద్యుతుల మిటారించు - ఘనకిరీటము మౌళిఁ గానిపించె శేషభోగీశ్వరశ్రీలరాజిల్లు నా - జానులంబిచతుర్భుజములు దోఁచె నసురులకు సురత్వ మొసఁగించు - శంఖచ క్రగదాసిశారఙ్గముల్ కడు రహించెఁ గౌస్తుభ శ్రీవత్స కమనీయవైజయం - తికలతో వక్షంబు తేజరిల్లె | |
| గీ. | ధాతఁ గాంచినపొక్కిటితమ్మి వెలసెఁ గటితటంబునఁ దులకించెఁ గనకపటము పొలిచె నఖిలాంగములదివ్యభూషణంబు లఖిలలోకంబు లవ్వేళ నరుదుఁ జెందె | 278 |
| సీ. | మకరకుండలవజ్రమహనీయధళధళల్ - చికిలిలేనగవుతోఁ జెలిమి సలుప మకుటపంకజరాగమణిరుచుల్ వినువీథిఁ - గపటసంధ్యారాగకాంతిఁ బెనుప శారీరగారుడాశ్మచ్ఛాయ లెదవ్రేలు - వైజయంతికతోడ వాదులాడఁ గరలగ్న శంఖచక్రశ్రీలు శతకోటి - చంద్రసూర్యులజోకఁ జౌక సేయఁ | |
| గీ. | గటితటాబద్ధకనకాంశుకముమెఱుంగు లసమయతటిల్ల తలసొంపు దెసల నింప గరుడవాహనమెక్కి లోకములు పొగడ రాముఁడవ్వేళవైకుంఠధాముఁడయ్యె | 279 |
| సీ. | మొసలివాయొంట్ల కెంపులకెంపు దృక్కోణ - సంరక్తరుచులతో సంధి చేయ లలితాలకస్థలాకలితాలకశ్రీలు - ముకుటనీలములతో ముచ్చటాడఁ గీర్తితేజములఁ జిక్కినచంద్రరవులట్ల - శంఖచక్రములు హస్తముల వెలయ వక్షస్థ్సితేందిరావక్షోజకస్తూరి - చెలువున శ్రీవత్స చిహ్న మమరఁ | |
| గీ. | గోటి దశకోటి శతకోటి కోటికోటి భానుబింబము లాకార మూనినట్లు దుర్నిరీక్ష్యప్రకాశుఁడై దోఁచె నిదిగొ విష్ణుఁడని యెంచిరచ్చోటివిబుధవరులు | 280 |
| మ. | అపు డబ్జాసనలోకపాలవసురుద్రాదిత్యు లయ్యిందిరా ధిపులోకైక మనోహరాంచితమహాదివ్యాంగసౌభాగ్య మ చ్చపుభక్తిం దిలకింపుచున్ బహునమస్కారంబు లర్పించి ఫా లపరీతాంజలు లై నుతించి రనరాళప్రౌఢవాగ్వైఖరిన్ | 281 |
| తే.గీ. | ఎడతెగకమ్రోసెసురభేరులేకధార గాఁ గురిసెదివ్యసుమములొక్క మొగిఁ బాడి రఖిలగంధర్వు లుడుగక యాడి రప్స రోజనము లాఖగేంద్రాధిరూఢునెదుట | 282 |
| తే.గీ. | భరతశత్రుఘ్ను లవ్వేళ బ్రహ్మమొదలు గాఁ గలసమస్తదేవతల్ గనుఁగొనంగ నద్భుతాఖండతేజోమయాత్ము లగుచుఁ గలసి రద్దేవుదివ్యవిగ్రహమునందు | 283 |
| తే.గీ. | అమలసరయూజలముల దేహంబు విడిచి భానునందనుఁ డర్క బింబమునఁ గలసెఁ ననలుఁ బ్రాపించె నీలుండు నవ్విధమున నమరవరశిల్పిలో నలుఁ డైక్య మొందె | 284 |
| కం. | ఏయేవేల్పులయంశము లేయేకపు లూని పుట్టి రిలలోపల ము న్నాయావేల్పులఁ గలిసిరి యాయాకపియోధనాథు లాహరియాజ్ఞన్ | 285 |
| తే.గీ. | యక్షకిన్నరగరుడగుహ్యకవియచ్చ రాదిదేవాంశములఁ బుట్టినట్టిఋక్ష వానరనిశాచరాదు లవ్వారి నంగ కములు వర్జించి వారిలోఁ గలిసి రపుడు | 286 |
| మ. | గరుడారోహకుఁ డైనవిష్ణు నెదుటన్ గన్గొంచు నానాజనుల్ సరయూతోయములన్ విముక్తతనులై సాక్షాద్రవిజ్యోతి రు ద్ధురు లై దివ్యవిమానరాజములయందున్ ఋత్త్రపౌత్రాప్తసో దరకాంతాదులతో వసించి తగి రంతన్ దేవతామూర్తులై. | 287 |
| కం. | పక్షిపశుక్రిమికీటక వృక్షలతాగుల్మశైలవితతులు సరయూ నిక్షిప్తమూర్తులై యపు డక్షయదేవత్వ మెనసి యలరె హరికృపన్ | 288 |
| మ. | సరసీజోదరుఁ డంత బ్రహ్మఁ గని భాషానాథ యీప్రాణు లం దఱు భూలోకముఁ బాసి నిత్యపదచింతన్‌ఁ జేసి నావెంట వ చ్చిరి వీరెల్లను మాకు బ్రాణములు గాఁ జింతించి సౌఖ్యప్రదో పరిలోకంబుల నిల్పు మంచుఁ గరుణాపారీణుఁ డై పల్కినన్ | 289 |
| మ. | అమరజ్యేష్ఠుఁడు తత్పశుప్రముఖతిర్యగ్జంతుసంఘంబుతో నమరత్వంబు వహించి యున్న జనులన్ హర్షంబునన్ సత్యలో కము చెంతన్ బహుభోగభాగ్యములచేఁ గన్పట్టుసంతానలో కములన్ నిల్పె ముకుందుకూర్మికి శిరఃకంపంబు గావింపుచున్ | 290 |
| కం. | పవనసుతాంగదమైంద ద్వివిదవిభీషణులు ఋక్షవిభుఁడున్ భువిలో నివసించిరి తక్కినవా రవనీశ్వరుఁ గొలిచి చనిరి హర్షముతోడన్ | 291 |
| తే.గీ. | నృపుఁడు సరయువునకు వచ్చునపుఁడు ఋక్ష వానరులలీల వచ్చినవార లెల్ల నవ్విభుఁడు విష్ణుమూర్తియై యాత్మపురికి నరుగునెడ వేల్పులై పోయి రద్భుతముగ | 292 |
| చం. | ఇటువలె నమ్మియున్న ప్రజ కెల్లను సద్గతు లిచ్చి బ్రహ్మధూ ర్జటిబలభిత్కృశానుయమరాక్షసపాశిమరుద్ధనేశు లొ క్కట నిరువంకలన్ గొలువ గారుడపర్ణసువర్ణదీధితి చ్ఛట లఖిలాశలన్ దొరయఁ జక్రి స్వధామపథానువర్తియై. | 293 |